‘మంచి చెడు కర్మలలో ఎవరేది చేసుకుంటారో!’ అన్నది వాళ్ల మనస్సుని బట్టే ఉంటుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ మితృవు, నీ మనస్సే నీ శతృవు’ అంటుంది.

ఇక ఈ తత్త్వ చింతన [లేదా కొంతమంది భాషలో వేదాంతం] వదిలేసి… తిరిగి ఆర్ధికరంగం దగ్గరికి వస్తే…
ముందే చెప్పినట్లు, ఒక మోసం జరిగితే… మోసగించే వాడి కపటానికి ఎంత బాధ్యతో, మోసగింపబడిన వాడి అజ్ఞానానిదీ అంతే బాధ్యత! అయితే దీనికీ పరిమితులున్నాయి. వ్యక్తి మీద వ్యవస్థ పనిచేస్తున్న నేపధ్యంలో… వ్యక్తిగతంగా మోసపు తీరుతెన్నులు తెలిసినా, మోసగించబడటం, దోపిడికి గురవ్వటం అనివార్యం అవుతోంది.

ఉదాహరణకి నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ నడుస్తోందని ప్రజలకి తెలుసు. కానీ నియంత్రణ ప్రజల చేతుల్లో లేదు. సిమెంట్ సిండికేట్ వంటివి తమ జేబుల్ని కొల్లగొడుతున్నాయని తెలుసు. నిస్సహాయంగా చూడటం తప్ప చేయగలిగింది పెద్దగా లేదు. అలాగన్న మాట.

ఎందుకంటే – ఇక్కడ వ్యక్తుల మీద వ్యవస్థ పనిచేస్తోంది. అది గూఢచర్యంతోనూ, అధికారపు అండదండలతోనూ, వ్యాపార దోపిడితోనూ మిళితమై ఉంది.

సదరు వ్యవస్థనే నేను నకిలీ కణిక వ్యవస్థగా ఉటంకించాను. అది సృష్టించిన పరుగు… జీవితంలో ఓ భాగమై పోయి, దోపిడిని అనివార్యంగా అంగీకరిస్తూ, ‘అవినీతి అంతటా ఉంటుంది, అది సహజం’ అని నిట్టూరుస్తూ లేదా ఆ ప్రభావంలో, ప్రవాహంలో, తామూ పడి ఉరకలేస్తూ… ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలోనూ సామాన్యుల జీవన చిత్రం ఇదే!

అందరూ ఒక్కసారిగా పరుగు ఆపితే తప్ప, ఒక్కరుగా ఎవరు పరుగు ఆప ప్రయత్నించినా అది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం వంటిదే!

ఇంత లోతుగా… పరుగు, దోపిడిల మాటున దాగిన గూఢచర్యం… జీవితంలోకి చొచ్చుకొని వచ్చాక… అది గుర్తించే నేర్పు, వివేకం కూడా చాలామందిలో కనుమరుగయ్యాయి. ‘ఇది ఇప్పటి రోజులకి తగిన జీవన విధానం’ అనే ధోరణి ప్రబలింది. ‘ప్రజాదృక్పధాన్ని ఆ విధంగా ప్రభావ పరచటమే’ నకిలీ కణిక వ్యవస్థకి ప్రధాన దన్ను అయిన మీడియా నిర్వహించింది. అందునా సుదీర్ఘ కాలంగా నిర్వహించింది.

ఇక్కడ మీకు కొన్ని చిన్న సంఘటనలు చెబుతాను.

ఓ సారి… అప్పటికి మేం శ్రీశైలంలో ఉండేవాళ్ళం. పనులన్నీ అయ్యాక, రాత్రి భోజనం చేసుకుని, రాత్రి తొమ్మిదిన్నరకి మల్లయ్య స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఉచిత దర్శనం ఉండేది.

ఓ రోజు… అయ్యవారి ఆలయంలో దర్శనం క్యూలో ఉన్నాం. పెద్దగా భక్తులు లేరు. గుడి ఖాళీగానే ఉంది. పంచాక్షరి జపిస్తూ దర్శనానికి వెళ్తుండగా… హడావుడిగా ఓ గుంపు లోనికొచ్చింది. అంతా గ్రామీణులు… ఓ అయిదారుగురు ఆడవాళ్ళు, పదిమంది మగవాళ్ళు ఉన్నారు. బహుశః ఏ వ్యానో వేసుకుని వచ్చినట్లున్నారు.

క్యూలో మా వెనుక ఉన్న వాళ్ళంతా దర్శనం కోసం ఆతృత పడుతూ తొయ్యసాగారు. వాళ్ళ హైరానాకి, గలభా గలభాగా మాట్లాడుతున్న వాళ్ళ గోలకీ, నేనూ మా వారూ ప్రక్కకు తప్పుకొని వాళ్ళనే ముందుకు వెళ్ళనిచ్చాం. నిజానికి వాళ్ళని చూస్తే అంతగా అలిసిపోయి ఉన్నట్లు కూడా కన్పించలేదు.

సరే, వాళ్ళ వెనకాల మేం ప్రశాంతంగా మల్లయ్య దర్శనం చేసుకుని భ్రమరాంబ అమ్మవారి ఆలయపు మెట్ల దగ్గరికి వెళ్ళే సరికే, వాళ్ళు తల్లి దర్శనం పూర్తి చేసుకుని మాకు ఎదురు వచ్చారు. మేం దర్శనం చేసుకుని, గుళ్ళో కాస్సేపు కూర్చొని బయటికి వచ్చేసరికి… ఆ గుంపులోని వాళ్ళు గుడి ముందర దుప్పట్లు పరుచుకొని పడుకొని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పటికే గుర్రు కొడుతుంటే, మిగిలిన వాళ్ళు పడుకొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

నాకూ, మా వారికి అది చూసి నవ్వొచ్చింది. ‘అంత ఉరుకులూ పరుగులూ పెట్టి, పక్క వాళ్ళని తోసి మరీ దర్శనం చేసుకుని వచ్చింది ఇందుకా?’ అన్పించింది. ఎంతో దూరం నుండి స్వామి దర్శనానికి వచ్చి ఆలయ ప్రశాంతతని అనుభవించకుండా, దర్శనానుభూతి ఆస్వాదించకుండా ఉరుకులు పెట్టారు.

అమ్మవారి కోవెలలో స్తంభాల మీద శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. కనీసం దాన్ని కన్నెత్తి చూసేంత సమయం కూడా వాళ్ళు గుడిలో ఉండలేదు. ‘అసలెందుకు క్షేత్ర దర్శనానికి వచ్చారా?’ అన్పించింది. తిరిగి తమ ఊరి కెళ్ళాక ‘మీమిన్ని ఊళ్ళూ చూసి వచ్చాం’ అని చెప్పుకోవడానికి తప్ప, మరెందుకూ పనికిరాని క్షేత్ర దర్శనం అది!

మరోసారి… అప్పటికి నేను గుంటూరులో బ్యాటరీ ఫ్యాక్టరీ నడుపుతున్నాను. ఓ రోజు మనస్సు ప్రశాంతంగా లేదని అమరావతి వెళ్ళాను. అక్కడి గుడి, కృష్ణవేణి నది చాలా మనోహరంగా ఉంటాయి. దైవదర్శనం చేసుకుని, విశ్రాంతింగా నది ఒడ్డున గట్టు మీద, కాళ్ళు నీళ్ళల్లోకి వేలాడేసి కూర్చున్నాను. పారుతున్న నదిని చూస్తూ చల్ల గాలికి అలా కూర్చుండి పోయాను.

అంతలో ఓ టూరిస్టు బస్సు వచ్చి కొద్ది దూరంలో ఆగింది. బిలబిలమంటూ ఓ యాభైమంది స్త్రీ పురుషులు దిగారు. వీళ్ళూ గ్రామీణులే! రఁయ్యిన గుడిలోకి అరుపులూ కేకలతో ఉరుకులు పెట్టారు. పదే నిముషాల్లో బయటికొచ్చారు. మగవాళ్ళల్లో కొందరు చుట్టలూ, బీడీలు, సిగరెట్లు వెలిగించి దమ్ములాగుతూ, పచార్లు కొడితే, ఆడవాళ్ళల్లో కొందరు హడావుడిగా నది నీళ్ళల్లో బట్టలుతకడం మొదలు పెట్టారు. నాకు పగలబడేంత నవ్వొచ్చింది. బాగోదని ఊరుకున్నాను.

నిజానికి అమరావతి పెద్ద గుడి. అంతస్థులుగా ఉంటుంది. గుడి ఆవరణలో పొన్న పొగడ చెట్లుంటాయి. చిన్న చిన్న గుడులు మరికొన్ని ఉంటాయి. నింపాదిగా ఓసారి చుట్టి రావాలన్నా గంట పడుతుంది. అలాంటిది పది నిముషాల్లో పరిగెత్తు కొచ్చి వీళ్ళు చేస్తోంది ‘దమ్ముకొట్టటం, బట్టలుతకడమునా?’ అనిపించింది.

పోనీ అది కర్మాసక్తి లేదా కర్తవ్యనిర్వహణ అందామన్నా… ఆ బట్టలుతకడంలో వాళ్ళ ‘పని రంధి’, దమ్ముకొట్టడంలో ‘బావుకునే రంధి’ తప్ప మరేం కనబడలేదు.

మరోసారి… అప్పటికి మేం శ్రీశైలంలో బడి నడుపుతున్నాం. ఓ సెలవు రోజు ఉదయాన్నే పాతాళ గంగ దగ్గరి కెళ్ళి కాస్సేపు జలాశయపు అందాలు ఆస్వాదించి, చేపలు కొనుక్కొని ఇంటికి వెళుతున్నాం! మా పాప, నేనూ, మా వారూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాం.

చలికాలపు ఉదయం! కొండల మీద మబ్బుల గుంపులు దిగాయి. చుట్టూ అందంగా పచ్చగా కొండలూ లోయలూ, వీస్తోన్న పచ్చిగాలి… హృద్యంగా ఉంది వాతావరణం.

అప్పుడే కంభం సత్రం రెండో అంతస్థులో ఓ యాభైమంది దాకా స్త్రీ పురుషులు నింపాదిగా కూర్చొని దిక్కులు చూస్తున్నారు. చల్లగాలినీ, కొండలపై మబ్బుల నీడలినీ, చూస్తూ… మెల్లిగా… రికామీగా… గుడిపాటి వెంకట చలం పరిభాషలో చెప్పాలంటే ‘సోమరి గాలి’ని ఆస్వాదిస్తూ… అలా గడుపుతున్నారు. వీళ్ళూ గ్రామీణులే! టూరిస్టు బస్సులో వచ్చినట్లున్నారు.

వాళ్ళని చూసి ముచ్చటేసింది. ‘ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో కదా!’ అనుకున్నాం. అప్పుడనిపించింది ‘పరుగులు పెట్టడంలో గ్రామీణులనీ, నగర వాసులనీ తేడా లేదు. అది వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది’ అని! నగర జీవనం మనిషిని పరుగులు పెట్టించగలిగినా, పల్లె జీవనం కొంత స్థిమిత పడనిచ్చినా అది కొంత భాగమే! నియంత్రణ కోసం ప్రయత్నించడం వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుంది కదా!

గమనించి చూడండి. ఒకప్పుడు ‘వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడు’ అంటూ, భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం ప్రారంభమై,… ‘ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే గానీ అవసరాలు తీరడం లేదు’ అనే వరకూ ప్రయాణించాం.

ఒక్కోసారి… ప్రశాంతంగా కూర్చొని… కాగితం కలం తీసుకొని ‘అసలు సంపాదిస్తోంది ఎంత? ఖర్చు పెడుతోంది ఎంత? పొందుతోంది ఎంత? పోగొట్టుకుంటోంది ఎంత?’ …అని లెక్కలు వేసుకుంటే…?

నగరాల్లో మహా అయితే ఉద్యోగస్తులైన భార్యాభర్తలిద్దరికీ చెరో పాతిక ముఫ్ఫైవేలు వస్తున్నాయనుకొండి. పట్టణాల్లో అది చెరో పది పన్నెండు వేలుంటే ఎక్కువ. ఇంకా చిన్న పట్టణాల్లో అయితే చెరో అయిదారువేలుంటుంది, అంతే!

ముందు నగరాల సంగతే చూద్దాం! భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైన చోట… గృహ నిర్వహణ ఇద్దరికీ భారమే! అనివార్యమై కొంతా, అత్యవసరమై మరికొంతా… ఖర్చులు తప్పవు.

తగిన సమయానికి అందుకునేందుకు హడావుడి ప్రయాణాలూ తప్పవు. ప్రయాణ ఖర్చులు, (స్వంత వాహనం ఉన్నా ఇంధనం+రిపేర్+కొన్నాళ్ళకి రీప్లేస్ ఖర్చులు కలుపుకు చూడాల్సిందే) ప్రతీ రోజూ బయటికెళ్ళడంతో…ఇస్త్రీ బట్టలు, పాదరక్షలూ, ఇతర యాక్సెసరీస్ ఇంకా మెయింటెన్స్ ఖర్చులు చాలానే ఉంటాయి.

ఒక్కసారి లెక్కవేసుకు చూస్తే… కర్చీఫుల దగ్గర నుండి సెంటు బుడ్డీల (అదేలెండి బాడీ స్ప్రేలు లేదా పెర్ ప్యూములు) దాకా… కనబడని ఖర్చు కౌంటబుల్ గానే ఉంటుంది. నలుగురిలో తక్కువగా కనిపించకుండా ఉండటానికి, ఖరీదైన లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు తప్పవు.

ఆపైన పిల్లల బాగోగుల మీద, చదువు సంధ్యల మీదా పెద్దగా శ్రద్ధ పెట్టలేమనిపిస్తుంది. అదో వెలితిగా బాధిస్తుంది. ‘ఇంత కష్టపడుతోంది పిల్లల భవిష్యత్తు కోసమే కదా’ అనిపిస్తుంది. దాంతో ఖరీదైన కార్పోరేట్ విద్యాసంస్థల కోసం వెదుకుతాం. ‘డబ్బెంతైనా ఫర్వాలేదు, వాళ్ళ చేతుల్లో పిల్లల బాధ్యత పెడితే నిశ్చింత!’ అనిపిస్తుంది – ఆ ఖర్చు ఎంత భారమో అనుభవంతో తెలుస్తుంది.

ఆపైన ట్యూషన్ల అవసరం పడుతుంది. పర్యవసానంగా వారమంతా పిల్లల ముఖం మనమూ, మన ముఖం పిల్లలూ చూడలేదనిపిస్తుంది. దాంతో వారానికోసారో, నెలకోసారో వాళ్ళని ఏ ధీమ్ పార్కుకో,గండిపేటకో, శిల్పారామానికో తీసి కెళ్తే గానీ మనశ్శాంతిగా అనిపించదు. అధమపక్షం బయటికి తీసికెళ్ళి రెస్టారెంట్ లో తినిపించాలనన్నా అనిపిస్తుంది.

వీటన్నిటికీ పైసలు సమకూర్చుకొని, ఇంకొన్ని దాచుకోవాలంటే ఒళ్ళిరగ కష్టపడక తప్పదు. దాంతో నిజంగానే ఒళ్ళు, విరిగో అరిగో కూర్చోంటుంది. ‘ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి’ అనే అందమైన పేరు దానికి పెట్టబడుతుంది.

దేవుడిచ్చింది ఒకటే దేహం. అరిగితేనో, విరిగితేనో దెబ్బకి మటాష్! ‘ప్రాణం కంటే ఎక్కువా?’ అనుకొని కార్పోరేట్ ఆసుపత్రిల్లోనో, మామూలు ఆసుపత్రుల్లోనో చికిత్సకి వెళతాం. ఆ టెస్టులనీ, ఈ టెస్టులనీ, మందులనీ, ఆపరేషన్లనీ… ఎంత హైరానా అయినా తప్పదు. రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరవలేరు గదా!? ఏడాదికి మెడికల్ బిల్లు చూసుకుంటే… సంపాదించిన దానిలో దాని వాటా తక్కువేం ఉండదు.

ఇక ఇన్ని పనుల మధ్య ప్రతీరోజూ వంట… పెద్ద తంటానే! రుచి కోసమో, తీరిక లేకనో ‘కర్రీ పాయింట్లనీ, రెడీ టూ ఈట్ ఫుడ్ పాకెట్లనీ, సాంబారు రసం పొడులనీ, రెడీమెడ్ మసాలాలనీ’, ఆశ్రయించక తప్పదు. అందులో వాడే ఇన్ గ్రేడియంట్లలో (రంగు రుచి వాసనల కోసం వాడే రసాయనాలతో) అలర్జీల దగ్గరి నుండి అంతు దొరకని, అర్ధం కాని అనారోగ్యాలూ, ఈతిబాధలూ వస్తాయి. ఏది ఎందుకు వచ్చిందో కూడా గుర్తించుకునే తీరిక ఉండదు.

ఒకేరోజు తిన్న నూడిల్స్ నుండి వచ్చిందో, పిజ్జా బర్గర్ నుండి వచ్చిందో, చాక్లెట్లూ బిస్కట్లకే వచ్చిందో, దుమ్ము గాలికీ, ట్రాఫిక్ లో ఇంధన పొగకి వచ్చిందో తెలియని జలుబూ తుమ్ములూ మాత్రం, పర్మెనెంట్ కేరాఫ్ అడ్రెస్ గా మన ఇంట్లోనో ఒంట్లోనో ఉండి పోతాయి.

యధాప్రకారం మెడికల్ బిల్లు మన జేబుని గీకుతూనే ఉంటుంది.

ఇక కరెంటు టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ సిలెండరూ, సూపర్ మార్కెట్ నుండి సరుకులూ తెచ్చుకునేందుకు వేరెవరి సాయమో అవసరమౌతుంది. ఆ సేవల రంగంలోని సంస్థలని మామూలుగా పోషించాల్సి రావచ్చు. పండుగ పబ్బాలకి పులిహోర పాయసాలు కూడా స్వగృహ ఫుడ్ నుండి తెచ్చుకున్నట్లుగా, పెళ్ళి పేరంటాలకి ఈవెంట్ మేనేజర్స్ కీ, బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలకీ మరికొంత సమయం వెచ్చించక తప్పదు.

వీటన్నిటిలో ‘అవసరమైన ఖర్చెంత? అనవసరమైన ఖర్చెంత? అనివార్యమైన ఖర్చెంత?’… లెక్క వేసుకుంటే?

నిజానికి… గృహ నిర్వహణ అవమానకరమైన పని కాదు. తమ దోపిడికి ముందస్తు బ్రెయిన్ వాష్ గా నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించిన అంశాల్లో ఇది ఒకటి. భార్యాభర్తల్లో ఎవరికి సహనం ఎక్కువగా ఉంటే వారు, ఎవరికి వీలైతే వారు – గృహ నిర్వహణని ఒక బాధ్యతగా తీసుకుంటే పైసమస్యల్లో చాలా వాటి సంఖ్య తగ్గిపోతుంది.

ఎందుకంటే – డబ్బు కంటే, ఆస్తుల సంపాదన కంటే విలువైనవి… ఆరోగ్యమూ, కుటుంబ జీవనమూ, భావితరాల పెంపకమూ! ముందటి తరం పట్ల కృతజ్ఞతా, వారికీయ వలసిన గౌరవం, చేయవలసిన సేవ… అంతకంటే విలువైనవి. ఒకసారి వాళ్ళు తమ కాల్షీటు పూర్తి చేసుకొని, భగవంతుడి పిలుపు అందుకొని వెళ్ళిపోయాక… ‘వాళ్ళు బ్రతికి ఉన్నరోజుల్లో మనం ఇంతకంటే ఇంకా బాగా ప్రవర్తించి ఉండాల్సింది!’ అని ఎంతగా అనుకున్నా, గడిచిన కాలం తిరిగి రాదు కదా? పోయిన ఆప్తులూ మనం ఎంత ఆర్తిగా తలుచుకున్నా తిరిగి రారు!

అలాంటి చోట… కుటుంబంలో ఇద్దరూ సంపాదన కోసం పరుగుమాని, ఒక్కరు కుటుంబ శ్రేయస్సు కోసం సమయం కేటాయిస్తే… చాకలి/డ్రైక్లీనర్ బిల్లు దగ్గరి నుండి మెడికల్ బిల్లుల దాకా… ఫ్యాన్సీ షాపు నుండి పచారీ కొట్టు దాకా… చాలా మిగులే వస్తుంది. పిల్లల గురించి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్న తృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన ఆనందం మిగులుతుంది.

ఎంత మిగులు వచ్చినా జీతం అంత మిగులు రాకపోవచ్చు. కాని కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు అన్న సూత్రమే ఇక్కడా వర్తిస్తుంది.

సహజంగా స్త్రీకి ప్రకృతి పరంగా పిల్లలతో మమేకం ఎక్కువా, సహనం ఎక్కువా గనుక, గృహ నిర్వహణ తల్లి బాధ్యతగా, ఉపాధి నిర్వహణ తండ్రి బాధ్యతగా పెద్దలు అమర్చి ఉంటారు. అందులో పురుషాధిక్యత అహంకారానికి ఓ రూపమైతే, ఫెమినిజం మరో రూపం!

ఏమైనా… ఆర్ధికంగా ఇంటిని నడపటం ఎంత ముఖ్యమైనదో, కుటుంబ సభ్యుల ఆలనా పాలనా కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి గృహ నిర్వహణ గౌరవనీయమైనదే, అది స్త్రీ నిర్వహించినా పురుషుడు నిర్వహించినా! కాకపోతే పురుషుడు నిర్వహిస్తే వింతగా చూడటం మన సమాజంలో సుదీర్ఘకాలంగా ఉంది. అవగాహనా రాహిత్యమే అది! గృహ నిర్వహణ అవమాన కరమైనది కాదు, మనిషి జీవితానికి అత్యంత విలువైనది. గృహమే కదా మరి స్వర్గ సీమ! ఎంత బాగున్నా, ఎంత ఖరీదైనదైనా, ఇంటి కంటే ఏదీ పదిలం కాదు.

కాబట్టే మన పెద్దలు… మన పరుగుకి, సంపద సృష్టికి కొన్ని హద్దులు ఏర్పరిచారు.

ఈ నేపధ్యంలో నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

చాలా చక్కగా వివరించారు . మనం కోల్పోయినది పోగొట్టుకున్నది ఏమిటో ఇప్పటికైనా ఆలోచించాలి

@ఆదిలక్ష్మి గారు

$అందరూ ఒక్కసారిగా పరుగు ఆపితే తప్ప, ఒక్కరుగా ఎవరు పరుగు ఆప ప్రయత్నించినా అది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం వంటిదే!

నిజమే!.

$డబ్బు కంటే, ఆస్తుల సంపాదన కంటే విలువైనవి… ఆరోగ్యమూ, కుటుంబ జీవనమూ, భావితరాల పెంపకమూ! ముందటి తరం పట్ల కృతజ్ఞతా, వారికీయ వలసిన గౌరవం, చేయవలసిన సేవ… అంతకంటే విలువైనవి.

ఏంతో విలువైన మాట చెప్పారు. నూరు వరహాల మూట మీ మాట :)

మీరు చెప్పిన బాటలో నడవటానికి ప్రయత్నిస్తున్నా. ధన్యవాదాలు.

దుర్గేశ్వర గారు: అవునండి. నెనర్లు!

రాజేష్ గారు: మీ అభిమానాన్ని ఆనందిస్తున్నామండి! నెనర్లు!

Nice post.

నీహారిక గారు: నెనర్లు!

చాలా మంచి విషయాలు చెప్పారు.కాని ఈ రోజుల్లో అందరు డబ్బు వెనకాల ,దాని ద్వారా వచ్చి పడే సౌక్యాల వెనకాల పరిగెట్టడం అలవాటు గా మార్చుకున్నారు
దానివలన పొందుతున్న దానికంటే పోగొట్టుకున్తున్నదే ఎక్కువ.అది తెలిసిరావాలంటే టైం పడుతుంది జనాలకి .Thanks to the nice post.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu