గతంలోని పల్లెలకీ ప్రస్తుత గ్రామాలకీ, అదే విధంగా పల్లె జీవితాలకీ నగర జీవనానికీ మధ్య వ్యత్యాసాన్ని సమీక్షిస్తే…

మహాకవి కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంలో… అరణ్య మధ్యంలోని ముని వాటికల్లోంచి నగరానికి వచ్చిన కణ్యముని శిష్యులు, శార్జరవుడు, శారద్వతుల సంభాషణలో ‘నగరం తగలబడుతున్న ఇల్లు’లా ఉందంటాడు. [పరుగులు పెడుతున్న జనం కవికి కలిగించిన భావన అది!]

అందమైన ఆ శ్లోకాలని ఓ సారి పరిశీలించండి.

శార్జరవుడు:
మహాభాగః కామం నరపతిరభిన్న స్థితిరసౌ
న కశ్చి ద్వర్ణానామపథమపకృష్ట్యోపి భజతే
తధాపీఠం శశ్వత్పరిచితవివిక్తేన మనసా
జనాకీర్ణం మన్యే హతవహవరీతం గృహమివ!


శారద్వతుడు:
అభ్యక్తమిప స్నాతః శుచిరశుచి మిప
ప్రబుద్ధ ఇవ సుప్తమ్
బద్ధమివ స్వైరగతిర్ణనమిహ
సుఖసంగినమవైమి!

జనసమ్మర్ధంతో కూడిన పురం తగలబడుతున్న ఇల్లువలె వున్నదని ఒక శిష్యుడు అంటాడు. పురప్రజలను చూస్తున్నప్పుడు స్నానం చేసినవాడు, అశుభ్రంగా వున్నవాడిని, పవిత్రుడు దుష్టుడిని, మేలుకుని వున్నవాడు నిద్రితుడిని, స్వేచ్ఛగా వున్నవాడు కారాబద్దుడిని చూస్తే కలిగే ఏవగింపు వంటిది కలగడం సహజమేనని మరొక శిష్యుడు అంటాడు.

భోజుడు కాళిదాసుల కాలం నాటికే నగరాలు తగల బడుతున్న కొంపల్లా కనబడితే, ఈనాటి పరిస్థితి మాటేమిటి?

నగరాలు, పట్టణాలతో పోలిస్తే… పల్లెల్లో ఫ్యాషన్ల ప్రభావం, కృత్రిమత ముద్రా తక్కువ. నిజానికి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, నట్టింట తిష్ఠ వేసిన టీవీల్లో కేబుల్ ప్రసారాల ద్వారా, ప్రైవేటు ఛానెళ్ళల్లో సినిమాల హోరు ద్వారా ఫ్యాషన్ల రూపు రేఖా విలాసాలు గ్రామీణుల దాకా ప్రసారమైనా, వాటిని స్వయంగా అనుకరించేందుకు, అంది పుచ్చుకునేందుకు గ్రామీణులు కొంత బిడియ పడతారు.

[మేము ప్రస్తుతం ఉండేది గ్రామీణ ప్రాంతమే! మా చుట్టుప్రక్కల గల పల్లెల్లో పగలు బారెడు పొద్దెక్కాక నైటీల్లో కనబడితే ఎద్దేవా చేయబడటం కద్దు.] అంతేకాదు, గ్రామాల్లో ఫ్యాషన్ గా చలామణి అయ్యే అధునాతన వస్తువులు, తిండి పదార్ధాల లభ్యత కూడా, నగరాలూ పట్టణాలతో పోల్చుకుంటే తక్కువ.

ఆ రకంగా గ్రామాలు ‘ఫ్యాషన్, కృత్రిమత్వం’ అనే ప్రమాణాల్లో నగరాలకి ‘గత కాలం’లో ఉంటాయి. మరో మాటగా చెప్పాలంటే – గ్రామాలు, నగరాలతో పోలిస్తే ప్రకృతికి మరికొంత దగ్గరగా, కృత్రిమత్వానికి దూరంగా ఉంటాయి.

కాబట్టి అనుభూతులూ, భావనల విషయంలో కూడా, గ్రామీణుల స్థితి కొంత మేరకు కాలుష్యరహితంగా ఉంటుంది. అలాగని గ్రామీణులందరూ పోతపోసిన మంచితనాలూ, భావవాదులూ అనిగానీ, నగర వాసులంతా అచ్చొత్తిన పదార్ధ వాదులనీ గానీ అనటం లేదు.

గ్రామీణ జీవితం మరికాస్త ‘తెలియని తనానికి’ దగ్గరగా ఉండటాన, భావ కాలుష్యానికి కూడా కాస్త దూరంగా ఉంటుందంటాను. అదీ సాపేక్షంగానే! ఇది ఇప్పటి పరిస్థితి!

అదే ఒకప్పుడైతే… పల్లె జీవితాలకీ, నగర జీవన శైలికీ చాలా వ్యత్యాసమే ఉండింది. అప్పటికైతే… భావపరంగా గ్రామీణులు ప్రకృతి సహజ పుష్పాలైతే నగర వాసులు ప్లాస్టిక్ పువ్వులూ, కాగితపు పువ్వులూ! గ్రామీణుల నవ్వులు పూల పరిమళాలైతే, నగర వాసుల నవ్వులు ఫెర్ ప్యూమ్ బాటిళ్ళు!

అయితే ఈ సాపేక్ష తారతమ్యత అనుశృతంగా కొనసాగుతూనే ఉంటుంది.

నిజానికి చరిత్ర పరిశీలిస్తే… నగరాలు పల్లెల భవిష్యత్తులైతే, పల్లెలు నగరాల గతాలు.

ఇటీవలి సినిమా ‘ఖలేజా’లో పాటలో మాదిరిగా ‘ఆ మహాశివుడి పాదముద్రలు మోసి మురిసిపోయిన’ కాశీక్షేత్రం… నాడు కాశీ పట్టణమైనా, నేడు కాశీ నగరమైనా, ఒకప్పుడు పల్లె కాశీయే గదా!

ఈ సంబంధం… పల్లె పట్టణాల మధ్యే కాదు, దేశాలైనా అంతే! అభివృద్ధి చెందిన దేశాల గతకాల స్థితిలో అభివృద్ధి చెందుతున్న దేశాలుంటాయి. వెనక బడ్డ దేశాలు, భవిష్యత్తులో అభివృద్ధి చెందితే, ప్రస్తుత అభివృద్ది చెందిన దేశాల్లా ఉంటాయి. కొద్ది దేశాల ‘గతం’ మరికొన్ని దేశాల ‘వర్తమానం’ అవుతుంది.

ఆ విధంగా విభిన్నదేశాలు, విభిన్న సమాజాలు, అభివృద్ధి పరంగా చూస్తే విభిన్న దశలలో ఉండటమనేది సహజ పరిణామం! ఇది పదార్ధ వాద పరంగా, ఆర్ధిక అభివృద్ధి విషయంలో!

ఆర్ధికాభివృద్ధికి ఇతరమైనదీ, దానికంటే ముఖ్యమైనదీ – భావపరమైన ఉన్నతి! ఏ విధంగానైతే భౌతిక వృద్ధిని నిర్లక్షం చేయకూడదో, అదే విధంగా భావపరమైన అభివృద్ధినీ నిర్లక్ష్యం చెందకూడదు. ఆర్ధిక సంపద ఎంత ముఖ్యమో, భావసంపద కూడా అంతే ముఖ్యమైనది, ఇంకా చెప్పాలంటే ఒకింత ఉత్తమమైనది.

వాస్తవానికి, భారతదేశంలో, పల్లె జీవితం, వ్యవసాయం పెనవేసుకు పోయి, భారతీయ ఆత్మ ఆవిష్కరింప బడుతుంది. ఆత్మ స్వరూపమంటే భగవానుడి బాహ్య రూపమే కదా!

ఒకప్పుడు ‘పనీపాటా’ అంటూ… పనిలో పాటల్ని మిళితం చేసుకుని, పనిని ఆనందిస్తూ గడిపిన భారతీయ రైతులూ, పల్లెలూ… నేడు ఏ స్థితికి ప్రయాణించాయి? ఒకనాడు ‘తాను తిని పదిమందికి తిండి పెట్టిన రైతు, మీసం తిప్పే రైతు మారాజు!’ ఈ రోజు? ఆత్మహత్యలు చేసుకుంటున్న దుర్బలుడు! ఎందుకింతగా పరిస్థితులు దిగజారి పోయాయి? ప్రశ్న చాలా చిన్నది! జవాబు సుదీర్ఘమైనది!

ఒకప్పుడు గడ్డి మోపు మోసుకొచ్చే పల్లె యువతి వర్ణచిత్రం, అందానికి ఐకాన్! ఈ రోజు? దుస్తులు విప్పేసిన దుడ్డు సుందరి తాలూకూ సినిమా స్టిల్ ఆ స్థానంలో ఉంది.

శ్రమైక జీవన సౌందర్యానికి పునాది రాళ్ళ వంటి ‘కొడవలి, నాగలి’ చేతబట్టిన యువతీ యువకులు సౌందర్యాధి దేవతలు కాకుండా పోయారు. ఈసడింపుకీ గురవుతున్నారు. అక్కడ ప్రారంభమైన ‘భావపతనం, అనుభూతి కాలుష్యం’ పరిస్థితుల్ని మరింతగా దిగజార్చేసాయి.

ఈ రోజు గ్రామాల్లో రైతులు, ఇతర వృత్తుల వాళ్ళూ, జీవన మాధుర్యాన్ని, శాంతీ సంతోషాలనీ, వృత్తి సంతృప్తినీ కోల్పోయారు. వాటినెక్కడ, ఎప్పుడు పారేసుకున్నారో వారికే తెలియదు.

ఈ స్థితి గ్రామీణులది మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరిదీ ఇదే స్థితి.

అంథపాంధుల లాగా ఎడారిలో ఒయాసిస్సు కోసం వెదుకుతున్న స్థితి.

దాహార్తులై, నీటి కోసం ఎండమావుల వెంట, ఆయాసపడుతూ ఆతృతగా పరుగులెడుతున్న స్థితి.

జీవితంలో నిజమైన ఆనందాన్ని కోల్పోయిన స్థితి!

దమ్మిడీల పరుగులో, డబ్బు కుప్పల్లో ఆత్మని పారేసుకున్న స్థితి.

వృత్తిలో, సాంఘిక స్థాయిలో పోటీపడుతూ, ఆ పోటీలో భావాలనీ, అనుభూతుల్నీ పారేసుకున్న స్థితి!

హృదయపు ఆర్ధ్రతనీ, మానవీయ స్పందనలనీ బిజీ షెడ్యూల్ మధ్యలో బిగించేసుకున్న స్థితి!

ఎంతమందికి, ఉదయాన్నే సూర్యకిరణాలకి స్వాగతం చెబుతూ ‘తెల్లారింది లెగండోయ్’ అనే పిట్టల కువకువలని విని ఆనందించేంత తీరిక ఉంది? అసలు కువకువలాడేందుకు పిట్టలకి జాగా ఎక్కడిది?

చీకటి పడుతూ పడుతూ ఉండగానే… రావిచెట్ల మీదా, మర్రిచెట్ల మీదా చేరి, పెద్దపేద్దగా అరుస్తూ, ఉప్పర్ మీటింగ్ పెట్టుకుని, పగలంతా ఆహారాన్వేషణలో తామేం చిత్రాలు చూసాయో నేస్తాలన్నిటికీ చెప్పుకుంటున్నాయా అన్నట్లు చప్పుడు చేస్తూ, ఆ చప్పుళ్ళని రావిచెట్టు ఆకుల గలగలలో కలబోస్తూ, అల్లరల్లరి చేసే పక్షుల గోల ఎంతమంది చూసి ఉంటారు?

సూర్యాపేట పోలీసు స్టేషన్ ఆవరణలోనూ, అచ్చం పేట ఆర్టీసీ బస్టాండు ఎదురుగానూ సాయం సంధ్యలో పిట్టల రొద చూసి, అప్పటికి నాకున్న సమస్యలన్నిటినీ మరిచిపోయిన అనుభవంతో చెప్పగలను, నిజంగా అది అపూర్వ చైతన్యమది!

ఇప్పుడు… సాయంత్రపు నడకకి పొలాల మధ్య, రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటే… చేల మీద పంట ఏపుగా పెరిగి, కోతల దశకు చేరుతుండగా… ఆకాశానికి అడ్డం పడి గిరికీలు కొడుతూ, పొలం చుట్టూ తిరిగి, చెట్ల మీద వాలుతూ, చిన్న ముక్కకు ఇరువైపులా ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని నింపుకుని, తిక్కతిక్కగా పాడేసే చిన్నిపిట్టల ముఖాల్లో, స్పష్టంగా, సంతోషం ద్యోతకమౌతుంది.

ఆ దృశ్యం ఎంతందంగా ఉంటుందని! కనుచూపు మేరలో కుముద్వని(కుందూ) నదీ ప్రవాహం లీలగా కనబడుతుంటే, ఆ పక్షుల గానం విశ్వకవి రవీంద్రుడి గీతాంజలిలా, ఘంటసాల లలిత గీతంలా, ఎంత మధురంగా ఉంటుందో!!

అసలు పొలాల మీద పంట పచ్చగా ఊగుతుంటే… ఆ పరిసరాల్లో కూడా ఎంత చైతన్యమో! రకరకాల పైరు వాసనలు నింపుకున్న గాలిలోనే, ఏదో తెలియని చైతన్యపు సవ్వడి, నిశ్శబ్దంగా విన్పిస్తుంటుంది.

చిగురు మొదలు, చెట్టుదాకా… ప్రతి అణువు లోనూ భగవంతుడి దివ్యప్రేమ, మన చుట్టూ పరుచు కున్నట్లుంటుంది! మెల్లిగా మన శరీరాన్ని తాకే గాలి, ఆ తడి స్పర్శని, భగవంతుడి ప్రేమ స్పర్శనీ, అనుభూతిలోకి తెస్తుంది.

పచ్చని పొలాలూ, గాలికి ఊగే పచ్చదనం, అచ్చంగా అమ్మఒడి మనల్ని స్వాగతిస్తున్నట్లుంటుంది.

పసిబిడ్డగా ఉన్నప్పుడు, అమ్మ దగ్గరికి ఉరికినట్లుగా మనం!

చేతులు చాచి నవ్వుతూ మనల్ని హత్తుకున్న అమ్మలా ఆ నేల!

కనుచూపు మేర దాకా పరుచుకున్న పచ్చని పొలాలు, కంటి నిండా పరుచుకొని, చిన్నప్పుడు నాన్న చేతుల మధ్య భద్రంగా ఉన్నప్పుడు పొందిన ధైర్యాన్నీ, Protective feeling నీ గుర్తుకు తెస్తుంది.

ఎంత గొప్పగా ఉన్నా, rich గా, భారీగా ఉన్నా… ఏ ఆకాశ హర్మ్యాలూ, ఏ ఫ్లైఓవర్లూ, ఎనిమిది లైన్ల బిజీ జాతీయ రహదార్లూ కూడా… ఇలాంటి సహజ భావనలనీ, పసితనపు గురుతుల్నీ మన కివ్వలేవు.

ఈ సందర్భంలో, చిన్నప్పుడు చదువుకున్న చిన్న కథ ఒకటి చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

gd nd expressive post

ఆర్ద్రంగా చెప్పారండీ. బాగుంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu