వార్తాపత్రికలు జిల్లాల సంచికలతో ‘విభజించి వార్తలు ప్రచారించటం’ ప్రారంభించాక, అన్ని వార్తలూ అందరికీ తెలియటం అరుదై పోయింది కదా! అందుచేత, మూడు రోజుల క్రితం... ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల కర్నూలు జిల్లా ఎడిషన్లలో ప్రచురితమైన ఒక వార్తాంశం, చాలామందికి తెలియక పోవచ్చు.

అందులో ఏదో లొసుగుంది. అసత్యమో, అసహజమో అయిన లొసుగు! ఓసారి క్రింది వార్తాంశం పరిశీలించండి.


చదవగానే జుగుప్సా, ఆవేశాలతో మనశ్శరీరాలు సెగలూ, పొగలూ అయ్యాయి. తర్వాత ఫాలోఅప్ వార్తల కోసం వేచి చూశాను. ఎక్కడా ఏ చప్పుడూ లేక పోవటంతో ఆశ్చర్యం వేసింది.

ఇక్కడ.... నాకు, అసత్యమో, అసహజమో అయినదేదో ఉందని ఎందుకు అనిపించిందంటే -

పట్టపగలు, జనసమ్మర్ధం ఉన్న బస్టాండుకు ఎదురుగా సత్రంలో, ఎందరో జనం గుడ్లప్పగించి చూస్తుండగా... మద్యం మత్తెక్కినా, కామపు కొవ్వెక్కినా... మనిషన్న వాడు బహిరంగంగా కామక్రియ జరపగలడా?

అలా చేస్తుంటే గుంపుగా ఉన్న జనం చూస్తూ ఊరుకుంటారా? (స్త్రీలు భయందోళలకి లోనయ్యారని విలేకర్లు వ్రాసారు.)

అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు దీని మీద ఉలుకూ, పలుకూ లేకుండా ఎలా ఉన్నారు?

ఎంతగా మిడ్‌నైట్ మసాలాలు, సినిమాల్లో రేప్‌సీన్లూ చూసి సున్నితత్వం కోల్పోయారన్నా, కళ్ళెదుట... వికలాంగురాలైన స్త్రీ మీద, అందునా ఆమె కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలుతున్నా... కామాంధుడు అత్యాచారానికి పాల్పడితే, జనం చూస్తూ నిల్చుంటారా? ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయటంతో పోలీసులు వచ్చి బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తీసుకుపోయి ఆనక కేసు నమోదు చేశారట.

పోలీసులొచ్చేలోగానే, సదరు కాముకుడు (ఇతడి పేరు గొపాల్ అని వార్తాంశపు తొలి వాక్యంలోనే వ్రాయబడింది.) తీరిగ్గా పని కానిచ్చుకొని పారిపోయాడు. ఇంత జరుగుతుంటే - నిజంగా ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? అంత చేవ జచ్చి ఉన్నారా? అంతగా తామసం తలకెక్కి ఉన్నారా?

వీధిలో కుక్కలు సంభోగానికి సిద్దమౌతున్నప్పుడు కూడా, ‘పిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారు’ అన్న స్పృహతో... సాధారణంగా ఎవరైనా వాటిని ప్రక్కకి అదిలిస్తారు.

అలాంటిది, పట్టపగలు, పదిమంది చూస్తుండగా, మనిషి పందిలా కామక్రియకి పాల్పడితే, సినిమా చూస్తున్నట్లు చూస్తూ నిలబడతారా?

మొన్న కీర్తన అనే ఏడేళ్ళ చిన్నారిని, కన్నతల్లి కర్కశంగా, ప్రియుడితో కలిసి హింసిస్తే, నలుగురూ కలిసి ఆ యిద్దర్నీ నాలుగు పీకి పోలీసులకి అప్పచెప్పారు.

కీచక పర్వం నిర్వహిస్తూ విద్యార్దినులని వేధించాడని ఆరోపించబడినా, నిజంగానే వేధించినా, అలాంటి ఉపాధ్యాయులని పదిమందీ కలిసి పళ్ళురాలగొట్టిన వార్తలు వింటున్నాం.

చివరికి డబ్బున్న వాడనుకున్న పార్క్‌ఉడ్ అయూబ్ వ్యవహారం వెలుగు చూసినప్పుడు కూడా, ఆ ఊరి ప్రజలు, సదరు పాఠశాల ముందు మూగి అయూబ్‌ని శిక్షించాలని నినదించారు.

అలాంటిది... ఈ ఊరు, ఉయ్యాలవాడలో చూస్తూ నిలబడిపోతారా? అందునా... స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషాన్ని ఇప్పటికీ అప్పుడప్పుడన్నా గుర్తుకు తెచ్చుకుంటారిక్కడి ప్రజలు!

అలాంటిది, నిజంగా అలా చూస్తూ ఊరుకున్నారంటే - సదరు నేరస్తుడు ఆ ఊర్లో పేరుమోసిన రౌడీ అయినా అయి ఉండాలి, తెగబలసిన... ధనమూ, అధికారమూ ఉన్నవాడైనా అయి ఉండాలి.

అలాంటప్పుడు... సదరు కాముకుడి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? ‘గోపాల్’ అని పేరు వ్రాయగలిగిన విలేకరులకి తెలిసే ఉండాలి కదా? ఎందుకు ఫాలో‌అప్ వెలుగు చూడలేదు. లేక ప్రజలకి, పోలీసులకి, విలేకరులకి కూడా ‘యాచకురాలి గురించి అంతకంటే ప్రాధాన్యత ఏముందిలే?’ అనిపించిందా?

ఎందుకంటే ... దేశంలో ఎన్నోసార్లు ఎన్నోచోట్ల బాంబులు పేలినా ముంబై తాజ్‌లో పేలితేనే అంతటా గగ్గోలు పుట్టింది. అంతే సంచలనమూ మీడియా చేసింది.

అలాగే... దేశంలో నిత్యమూ ఎందరో పేద, మధ్యతరగతి ప్రజల బిడ్డలు కిడ్నాపులకీ, హత్యలకీ గురైనా, విజయవాడ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె నాగవైష్ణవి కిడ్నాపూ, హత్య మాత్రమే పతాక శీర్షికలకి, రోజు వారీ వరుస సంచలనాలకి నోచుకుంది.

ఆ విధంగా... కేవలం డబ్బున్న వాళ్ళ మాన ప్రాణాలు మాత్రమే విలువైనవై, సాధారణ పేదల మనశ్శరీరాలు, మానప్రాణాలు పనికి మాలినవై పోయాయి. కాబట్టి - ప్రజలూ, పోలీసులూ, మీడియా కూడా ఈ విషాయంలో మిన్నకున్నాయా?

లేకపోతే... బహిరంగ, లజ్జాహీన, నీచత్వాన్ని కూడా పట్టించుకోనంత ప్రత్యేక కారణం ఏమి ఉంటుంది?

మామూలుగా ఏ చిన్న సంచలనం దొరికినా, చర్చా గోష్టులు నిర్వహించే మీడియా కూడా గమ్మునుందంటే - ప్రభుత్వం, పోలీసు శాఖా కూడా... "మరీ గొడవైతే అసహ్యంగా ఉంటుంది( ప్రభుత్వానికి కూడా!)... ఇక్కడితో సద్దుమణిగిద్దాం" అనుకున్నాయా? నిజానికి... అదీ ఒక రకంగా సరైనదే! అయితే నేరగాడిని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఈ గోప్యత లేదా మౌనం కొంత అర్ధవంతంగా ఉంటాయి.

ఇంతకీ ఈ నేరగాడు గోపాల్ ఎవరో, అతడి నేపధ్యమేమిటో తెలియదు. ఇక అతడిని ఏ విధంగా శిక్షిస్తారో, ఇంకేం తెలుస్తుంది? అసలు శిక్షిస్తారో లేదో!

ఏది ఏమైనా... సమాజంలో పశుప్రాయత పెరిగిందనాలా? ప్రజల్లో పిరికితనం పెరిగిందనాలా? అసలా వార్తలో చెప్పింది నిజమేనా? నిజమైతే రాజకీయ నాయకులు నిశ్శబ్దాన్ని ఎందుకు పాటిస్తున్నారు? ఎక్కడో ఏదో లొసుగుంది. అసత్యమో, అసహజమో అయిన లొసుగు! అసలేం జరిగిందో ఆ గ్రామస్థులకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ నిజం తెలిస్తే లొసుగెక్కడుందో తెలుస్తుంది. ఎందుకంటే తర్కానికి అసత్యం గానో, అసహజంగానో తేలుతోంది మరి! ఏమంటారు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

nijame sumandi!!

very bad and sad. His hand&leg shud be amputed and let off to beg in the same bussatnd. Shame on Uyyalawada people.

లలిత గారు: నెనర్లండి!

అజ్ఞాత గారు: మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తానండి!నెనర్లు!

ఎక్కడయినా గానీండి ఏదయినా విపరీతం జరుగుతూ౦టే...విచిత్రంగా జనం చూడ్డమే కాదు దాన్ని ఆపబోయే లేదా నిలవరించబోయే వాళ్ళని ఈ చుట్టూ వుండే గుంపు.. అప్పుడే ఆకాశం లొంచి వూడి పడ్డట్టు మరింత విచిత్రంగా చూస్తారు..మీరెప్పుడూ చూళ్ళేదా?ఆ చూపులు భరించలేక ఏదయినా చేద్దామనుకునే వాళ్ళు కూడా సైలెంట్ గా అక్కడినించి జారుకుంటారు..

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu