నిన్న సాయంత్రం, టీవీలో కామెన్వెల్త్ క్రీడల ప్రారంభ సంరంభం చూస్తున్నంత సేపూ (మధ్యలో డీడీ ప్రసారాల్లో అంతరాయం షరా మామూలుగానే!) చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాము.

నిజంగా... విశ్వవీణపై శతకోటి భారతీయుల హృదయరాగం కనిపించింది.
భిన్నత్వంలో ఏకత్వం వినువీధి మారుమ్రోగేటట్లు వినిపించింది.

హిమవన్నగాల నుండి, హిందూ మహాసాగరం దాకా విస్తరించిన... విభిన్న సంస్కృతుల, విశిష్ట కళలు, విశేష వేషభాషలు! పైకి వైవిధ్యంగా కనబడుతున్నా... అంతర్లీనంగా ఐక్యమై కనిపించే భావనలతో.... భారతీయ ఆత్మ అక్కడ సాక్షాత్కరించినట్లనిపించింది.

శబ్దపవిత్రతకు చిహ్నంగా, శఃఖనాదంతో ప్రారంభమైన వ్యాఖ్యానం కూడా, ఆద్యంతం ఆకర్షణీయంగా సాగింది. పైగా క్లుప్తంగా, స్పష్టంగా!




ఇక, రకరకాల డోలు చప్పుళ్ళతో....! దేశంలోని నలుమూలల నుండి డప్పు వాయిద్య కళాకారులు....! పెద్ద పెద్దవి, పొడవుగా, భారీగా ఉన్న డోళ్ళు! గుండ్రంగా చిన్నగా ఉన్న డోళ్ళు! ఆ డప్పు చప్పుడులో భారతీయుల గుండె చప్పుడు విన్పించింది.

మామూలుగానే... డప్పు చప్పుడుకీ భారతీయుల రక్తానికీ అవినాభావ సంబంధముంది. పుట్టినప్పుటి నుండీ పోయే వరకూ, డోలూ సన్నాయిలు మనకు స్వాగత వీడ్కోలు నిస్తాయి. ఇప్పటికీ ‘వంద వాయిద్యాల ఆధునిక ఆర్కెస్ట్రాలు యువతని కట్టిపడేస్తున్నాయని’ ఎంతగా ప్రచారం హొరెత్తిస్తున్నా... డప్పు మోత వినబడగానే, ఆడుతున్న క్రికెట్ బ్యాట్‌ని క్రింద పారేసి, చిందేసే చిన్నారులని చూస్తూనే ఉంటాం. అంతగా డప్పు చప్పుడు... మన రక్తంలో ఇంకిపోయింది.

ఇక ఆ వాయిద్యాలని విభిన్న ఆకృతులతో, అలంకారాలతో మెరిపిస్తూ, తదనుగుణంగా ఉన్న ఆహార్యంతో... కళాకారులు లయబద్దంగా కదులుతూ, అంతకంటే లయబద్ధంగా భేరీలు మ్రోగించారు. ఆ అరంభం చాలా హుషారు తెప్పించింది. ఎవరో బుడతడు, పాండిచ్చేరి పిడుగట, కేశవ్! ఉస్తాద్‌ని అనుకరిస్తూ జులపాల జుట్టుని ఊపినా, తబలా వాయిస్తున్నంతసేపూ చిరునవ్వుతో ముద్దుగా ఉన్నాడు.


గాజులు అలంకరించుకున్న చేతుల ఆకృతిలో నిలబడి, పిల్లలు, తాళబద్ధంగా కదులుతుండగా... హరిహరన్ ‘స్వాగతం’ కూడా బాగుంది. క్షణాల్లో మువ్వన్నెల జండారంగుల్లోకి మారిన పిల్లలు, చకచకా వేసిన, భారతీయతలో భాగమైన గోరింటాకు చేతుల బొమ్మలు... పిల్లల సత్తాని, మన కళల వైవిధ్యపు సత్తాని కూడా చూపించాయి.



హీలియం నింపిన తోలు బొమ్మలు వయ్యారంగా కదులుతూ, మన ప్రాచీన కళకి ఆధునిక హంగుల సోయగాలని అద్దినట్లు, అందంగా కదిలాయి.

71 దేశాల జట్లను పరిచయం చేస్తూ, చీరకట్టుల్లో, సాంప్రదాయ దుస్తుల్లో... అందమైన యువతులు, అందాన్ని హుందాగా ప్రదర్శించారు. కాకపోతే... చీరకట్టు చేతకాలేదేమో, కుచ్చిళ్ళ దగ్గర ఉబ్బెత్తుగా ఉండి, చాలామంది బొద్దుగా కనిపించారు. కానీ రంగు రంగుల చీరలు! పట్టు, జలతారు, కుట్టుపువ్వులు అలంకరించిన చీరలు!

పాల్గొనే దేశాల జండా రంగులని ప్రతిబింబిస్తూ... ‘భారతదేశపు సుసంపన్నతకు నిదర్శనమా!?’ అన్నట్లు... కంచిపట్టు, పోచంపల్లి, బెంగాల్ కాటన్, వారణాళి పట్టు, కాశ్మీరీ పట్టు... అసలు భారతదేశంలో ఎన్ని విశిష్టతలున్నాయో ప్రపంచం విభ్రాంతి పడేలా ప్రదర్శించినట్లనిపించింది. ఎంతో చక్కని అలంకారాలతో, సంస్కృతీ సాంప్రదాయాలు మూర్తీభవించిన ముగ్ధత్వం... వెరసి భారతీయ స్త్రీత్వం! మనోహరంగా తోచింది.

నేతల ఉపన్యాసాలు ప్రారంభం కాగానే, కల్మాడీ ఏదో మాట్లాడుతున్నాడు... అంతలోనే మా టీవీ ఎంచక్కా దృశ్యం మాయంచేసి గుర్రుగుర్రు మంది. అంచేత ఎవరేం మాట్లాడారో, ఏ తంటాలు పడ్డారో మా కంటికి కనబడలేదు. :)

మళ్ళీ టీవీ మామూలుగా అయ్యేసరికి సాంస్కృతిక కార్యక్రమాలు వస్తున్నాయి. నాకైతే అవి చాలా నచ్చాయి. చూస్తున్నంత సేపూ ఎంత ఆనందించానో!





కూచిపూడి, భరత నాట్యం, మోహినీ ఆట్టం, ఒడిస్సీ, కథక్, మణిపురి.. శాస్త్రీయ నృత్యల్లోనూ ఎంత వైవిధ్యమో, అంత ఉత్కృష్టం! కళ ప్రయోజనం... ‘కళాకారులనీ, ప్రేక్షక శ్రోతలని మమేకం చేయటమే కదా!’ అన్పించేటట్లు. రంగురంగుల్లో... రకరకాల హంగుల్లో... వేల కొద్దీ సంవత్సరాలు... తరం నుండి తరానికి సంక్రమించిన వారసత్వంగా... ఎవరెంతగా నాశన మొనర్చ ప్రయత్నించినా, తిరిగి చిగురించే చేవగల కొమ్మలుగా... ఎంత సమ్మోహనంగా నిలిచాయో!

వాటితో పోటీపడుతూ జాన పదాలు! ‘భల్లె భల్లే’ అని భుజాలెగరేసే పంజాబీ భాంగ్రా లేకపోతే నిండుదనం లేదు. దాండియా, ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్యాలు... దేనికదే, వేటికవే... ఎంతో ప్రత్యేకంగా, అందంగా.... ‘ఎంత విశాలమైనది ఈ భారతదేశం! ఎంత విభిన్నమైనది ఈ విశాల ఖండం!’ అన్పించేటట్లు.... "నిజమే. అందుకే ఇది ఉపఖండం" అనిపించేటట్లు... అందరినీ ఒప్పించేటట్లు ఉండింది.

ప్రాచీన ప్రాచ్య కళలని, జీవన శైలిని ప్రతిబింబిస్తూ... సంగీత సాధన చేస్తున్న గురుశిష్యులని చూపించారు. ఎంతో చక్కగా... గురువు, శిష్యురాలిని భుజమ్మీద చెయ్యేసి, తండ్రిలా నడిపిస్తూ నేర్పిస్తూ.. తీసికెళ్ళటం హృద్యంగా అభినయించారు. ఉదయాన్నే చేతనత్వాన్ని  సంతరించుకునే దృశ్యాన్ని, భారతీయుల జీవన విధానాన్ని, అద్భుతంగా అవిష్కరించారు.

ఓ వైపు సూర్యానమస్కారం చేసే బ్రాహ్మణుడు... మరో వైపు కసరత్తులు చేస్తున్న యోధుడు, చేటలు రోకళ్ళు చేతబట్టిన గృహిణులు, నీటి కుండల దొంతరని నెత్తిన బెట్టి కదిలిన మహిళలు... చదివిన పదిపుస్తకాల జ్ఞాపకాలు, ఒక్కసారిగా ఒకేక్షణంలో స్ఫురణకి తెచ్చినట్లుందా ప్రదర్శన!


కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా భారతీయ యాత్రని కళ్ళకు కడుతూ ‘A Tribute to Common Man of India'గా చెప్పబడిన రైలు బండి ‘ఛయ్య ఛయ్యా’ అంటూ చలాకీగా... పల్లెలోని టీ కొట్టుని, పొద్దున్నే పేపరు దగ్గర నుండి సాయంత్రం మల్లెపూల మాలలు దాకా, అన్నిటినీ ఇంటి గడప దాకా తెచ్చి అందించే చిన్న వ్యాపారుల రాజ వాహనం సైకిలునీ, ఎలష్కన్లప్పుడు మైకులు పట్టుకుని వచ్చి వంగివంగి దణ్ణాలు పెట్టే రాజకీయాలోళ్ళనీ... కార్మికుణ్ణీ, కూలీవాణ్ణీ అందర్నీ యిముడ్చుకుంటూ... కూర్చున్న చోట నుండి కదల కుండానే భారతదేశాన్నంతటినీ తిప్పి చూపించేసింది.


అన్నింటినీ మింగేస్తూ... బాలీఉడ్ తారల వాసన గానీ, క్రికెట్ కంపుగానీ రాకపోవటంతోనో ఏమో, హోటల్ తిండిలాగా కాకుండా, మన వంటింటి తాళింపు పరిమళంలాగా హాయిగా అనిపించింది.

ఇసుకలో వేళ్ళు కదుపుతూ, క్షణాల్లో బాపూ సత్యగ్రాహ సన్నివేశాన్ని ఆవిష్కరించిన యువకుల్ని చూస్తే... భారతీయులు అరవైనాలుగు కళలు కాదు, ఆరొందలరవై కళలు నేర్వగలరనిపించింది. 

అన్నిటిలోనూ అద్భుతంగా తోచింది... పతంజలి మహర్షి ప్రసాదించిన యోగశాస్త్ర ప్రదర్శన! ఒంటినిండా దుస్తులు వేసుకున్న బాల బాలికలు, (ముఖ్యంగా కొందరబ్బాయిలు పంచెలు కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారో!) క్లిష్టమైన, ఆకర్షణీయమైన యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నేపధ్యంలో విన్పించిన సంస్కృత శ్లోకాలు కూడా, రాగయుక్త ఉచ్చారణతో సహా.... ఎంత చక్కగా ఉందంటే, వివరించి చెబితే అతిశయోక్తిగా అన్పించేంత!



కుండలినీ యోగంతో, కఠోర సాధనతో, ఒకప్పుడు సాధకులు ఆత్మని శరీరం నుండి వేర్పరచి, విశ్వంతారాళంలో విహారం చేసి, తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టే వాళ్ళట. ఎక్కడో చదివాను! అది నిజమోకాదో, సాధ్యమో లేదో గానీ... వందల వేల కోట్లు ఖర్చుపెడితే గానీ, అదీ అరగొరగానే చేయగల ‘రాకెట్టుతో అంతరిక్ష యానం’, యోగ సాధనతో చేయగలగటం! అసలలా ఊహించగలిగారంటేనే, సాధనకు రూపకల్పన చేశారంటేనే ఎంత జ్ఞాన సంపన్నులై ఉండాలీ పతంజలి వంటి ఆనాటి మహర్షులు!?

విద్యుత్ పరికరాల సాయంతో బుద్ధుణ్ణి, బాపూజీ ఆవిష్కరించిన తీరు గానీ, కుండలినీ యోగంతో శరీరంలో చక్రాలని శిరో భాగానికి ఉర్ధ్వాభిముఖంగా ప్రయాణింపచేయాటాన్ని గానీ... ప్రదర్శించినప్పుడు, ‘సాంకేతికత అసలు ప్రయోజనాలు ఇలాగే ఉండాలి కదా!’ అన్పించింది. ఊహాశక్తి లేనివాళ్ళకు కూడా, ఒక ఊహని కళ్ళకి కట్టినట్లుగా సాక్షాత్కరింప చేయటం కంటే, చక్కని ప్రయోజనం ఏముంటుంది?

నేను బీజింగ్‌లో జరిగిన ఒలెంపిక్స్ ప్రారంభపు ప్రత్యక్షప్రసారాన్ని కూడా చూశాను. (ఆ రోజూ మధ్యమధ్యలో డీడీ అంతరాయలనీ అందించింది లెండి. అది మామూలే కదా!) ఆ రోజు బర్డ్శ్‌నెస్ట్‌లో... చైనా ప్రదర్శించిన టెక్నాలజీ చూసి, నిజంగానే అబ్బురమనిపించింది.

ఆ రోజు చైనా అత్యున్నతంగా కనబడే ఆధునిక సాంకేతికతని ప్రదర్శించింది. ఆహుతులైన దేశదేశాల జట్లని పరిచయం చేసేటప్పుడు, అందమైన చైనా యువతులు, మెరిసిపోతున్న ఎర్రని దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అయితే... అందరూ ఒకే రంగు, ఒకే డిజైను! ఎంత బాగుందనిపించినా వందమంది అమ్మాయిల్ని ఆ దుస్తుల్లో చూశాక ఇక ఆకర్షణ అనిపించదు.

అయితే నిన్న భారతీయ యువతులు, ఆహ్వానం పలుకుతూ ఒకో జట్టుకు ముందు నడుస్తుంటే, ప్రతీ వారినీ ఆసక్తిగా పరిశీలించటం అప్రయత్నంగానే చేసేస్తాం. ఆయా దేశపు జట్ల జెండా రంగును ప్రతిబింబిస్తూ, ఆయా రంగుల్లో, భారతీయ సాంప్రదాయ చీరకట్టులో... ఎంతో చక్కగా... సంస్కృతీ సాంప్రదాయాలని ప్రదర్శించారు.

ఆనాడు చైనా, బీజింగ్‌లో, టెక్నాలజీ రూపేణా... భాగ్యవంతమైన శరీరాన్ని ప్రదర్శిస్తే, ఈనాడు ఇండియా, ఢిల్లీలో, విభిన్న కళల రూపేణా... సుసంపన్నమైన భారతీయ ఆత్మని ప్రదర్శించినట్లుంది! ఇది చైనాని తక్కువ చేయటానికి, వ్రాయలేదు. ‘మనం మాత్రమే గొప్ప, తక్కిన వాళ్ళంతా దిబ్బ’ అనే ఉద్దేశమూ నాకు లేదు.

ప్రకృతిలో... శరీరం లేని ఆత్మ, ఆత్మలేని శరీరం అస్తిత్వం లేనివి. ఆత్మా, శరీరమూ పరస్పరాశ్రితాలు! శరీరం లేనిదే ధర్మ సాధన సాధ్యం కాదు. ఆత్మ నివసించనిదే శరీరం మనజాలదు. కాబట్టి, రెండూ ముఖ్యమైనదే! శరీరమూ, ఆత్మా... అచ్చంగా భౌతిక, భావ వాదాల్లాంటివి. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎక్కడికి ఏది అవధో... నిర్ణయించుకోగలగటంలోనే జీవితపు నేర్పు ఉంది.

ఈ విషయం ఇక్కడితో వదిలేసి, మళ్ళీ కామన్వెల్త్ ప్రారంభాని కొస్తే... మొత్తంగా ఆ ప్రదర్శనలో, భారతీయ ఆత్మ.... ‘భిన్నత్వంలో ఏకత్వమై’ అంబరమంత అపరిమిత పరిమాణంలో వెలుగులు చిమ్మింది - అన్నది మాత్రం పరమ సత్యం.

ఎంత అవినీతి జరిగిందో... అది మన్మోహన్, సోనియా, కల్మాడీ, షీలా దీక్షిత్, జైపాల్ రెడ్డి గట్రాలకి తెలియాలి. "ఎంత అభాసుపాలు చేస్తారో ఏమో" అనుకునే పరిస్థితుల్లో.... కామెన్వెల్త్ ఆరంభం మాత్రం, నిజంగా అదరగొట్టింది, అద్భుతమనిపించింది.



ఆతిథేయ దేశం, ఇండియా జట్లు... 70 జట్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెండా మోస్తున్న అభినవ్ బింద్రా, సుశీల్, విజయేందర్‌ల చిరునవ్వులో... వందకోట్లపైగా ఉన్న భారతీయుల పెదవుల మెరుపు కలగలిసి పోయింది. ఆహుతులంతా కూడా, చప్పట్లు చరుస్తూ ఆహ్వానించిన తీరు బాగుంది. గృహస్తూ బాగున్నాడు, అతిధులూ బాగున్నారు అన్నట్లుగా!

చివరికి పాకిస్తాన్ జట్టు వచ్చినప్పుడు కూడా... ఈ గడ్డ మీద ఇంత నెత్తురు చిమ్మించినా, నిన్నమొన్ననే కసబ్ జైలు సిబ్బందిని కొట్టినా, ‘భారత్ మాత్రం పెద్దమనస్సునీ హుందాతనాన్నీ చాటుకుందా?’ అన్నట్లు, ఆహాద్లంగా ఆహ్వానించారు. ‘శతృవునైనా ఆదరించగలగటం భారతీయులకే చెల్లు’ అన్నట్లుగా! 



అయితే ఇందులో మరకలా మిగిలిన కొనమెరుపు ఏమిటంటే - ఏఆర్ రెహమాన్ పాట, ప్రదర్శన! ‘యారో... ఇండియా బులాలియా’ పాటలో బులా....దీర్ఘం, సా...గి, రసస్ఫూర్తి రాహిత్యంతో ఉండగా... ‘జయహో’ అంటూ అతడు ముగింపుగా పాడిన పాటలో, అతడి కిరువైపులా నాట్యం చేసిన అమ్మాయిలు... ‘ఈనాడు పత్రిక’ శుక్రవారం ప్రచురించే బ్రిసా చీరలు ధరించి అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చే మోడళ్ళలా ఉన్నారు. పమిటలేని చీరవంటి వస్త్రధారణతో, వక్షస్థలం మీద పూసల కుట్టిన లోదుస్తులు (బ్రాసియర్లు) ధరించి, శరీరాన్ని ఊపుతూ చేసిన ఆధునిక నాట్యం!

సింబాలిక్‌గా... "అదిగో అంత ఘన వారసత్వ సంపద వంటి మహోన్నత సంస్కృతి నుండి... ఇదిగో ఇంత నాసి పరిమాణానికి మేం ప్రయాణించాం" అని చెప్పకనే చెప్పినట్లుంది!

"దీనినే... ‘ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలతో బాటు, మేం ఆధునికతనీ అందుకోగలం’ అని చెప్పినట్లుంది కదా...." అని సరిపెట్టుకుందామన్నా...

అర్దనగ్నంగానో, పూర్తి నగ్నంగానో, శరీరాన్ని ప్రదర్శించేదీ... ఆధునిక సంస్కృతి అయితే, ఆ ఆధునిక సంస్కృతి భారతీయులకి వద్దనుకోవటం ఉత్తమం!

10 comments:

విద్యుత్ పరికరాల సాయంతో బుద్ధుణ్ణి, బాపూజీ ఆవిష్కరించిన తీరు గానీ, కుండలినీ యోగంతో శరీరంలో చక్రాలని శిరో భాగానికి ఉర్ధ్వాభిముఖంగా ప్రయాణింపచేయాటాన్ని గానీ... ప్రదర్శించినప్పుడు, ‘సాంకేతికత అసలు ప్రయోజనాలు ఇలాగే ఉండాలి కదా!’ అన్పించింది. ఊహాశక్తి లేనివాళ్ళకు కూడా, ఒక ఊహని కళ్ళకి కట్టినట్లుగా సాక్షాత్కరింప చేయటం కంటే, చక్కని ప్రయోజనం ఏముంటుంది?
నిన్న రాత్రి చూస్తున్నపుడు నాకు కలిగిన అనుభూతికి ఫోటోలతో సహా అక్షర రూపం ఇచ్చారు, చాలా బాగా వర్ణించారు. ధన్యవాదాలు.

Great Summary. I totally agree with you.

Excellent description...

very nice review.
Most of the Indians should have felt the way you described.

how did sonia allow all this to happen?

Nice explanation as usual... Thanks Amma

very nice post

ఆదిలక్ష్మి గారు, వేడుక చూడని వారికి కళ్ళకు కట్టినట్లు, మీ వర్ణన వుంది.

Excellent opening ceremony. No foreign media talking any more nonsense now.

నీహారిక గారు: నా టపా నచ్చినందుకు నెనర్లు!
వీకెండ్ పొలిటిషీయన్ గారు, మొదటి అజ్ఞాత గారు, మైత్రేయ గారు : కృతజ్ఞతలండి!
రెండవ అజ్ఞాత గారు: దీనిమీద టపాకాయ పేల్చాను చూడగలరు!:)
కిరణ్ గారు, మూడవ అజ్ఞాత గారు: నెనర్లండి!
సత్యేంద్ర గారు: నా వర్ణన మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
Truely గారు: అవునండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu