గత టపాల్లో చెప్పినట్లు... ఏ కారణం చేతనైనా కంపెనీ షేర్ ధర ఏకబిగిన పడిపోతూనే ఉందనుకొండి. అప్పుడొస్తుంది తంటా! అప్పుడు స్థిరాస్థి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తావన కొచ్చే... మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూ వంటి ప్రక్రియ తెర మీదికి వస్తుంది.

గత టపాలో చెప్పిన ఉదాహరణే కొనసాగిస్తే.... పబ్లిక్ లిమిటెడ్‌గా అవతరించిన జగన్మాయ కంపెనీ, తనకి అవసరమైన పది కోట్ల రూపాయల పెట్టుబడిని సమీకరించుకునేందుకు కోటి షేర్లని మార్కెట్టులో విడుదల చేసిందను కొండి. వ్యాపార క్రమంలో సదరు కంపెనీ షేరు విలువ, ఒక్కొక్కటీ వంద రూపాయలకు పెరిగిందను కొండి.

ఆ ప్రకారం, బ్యాంకులో జగన్మాయ కంపెనీ తన కోటి షేర్లను భరోసాగా ఉంచి (అంటే కోటిx100రూ. =100కోట్ల రూ.) అందులో 80% అంటే 80 కోట్ల రూపాయల పరిమితి గల ఖతాను నిర్వహిస్తుంది. ఏకబిగిన కంపెనీ షేర్ ధర పడిపోతుంటే... అలా పడిపోయి పడిపోయి జగన్మాయ కంపెనీ షేరు ధర యాభై రూపాయలకి పడిపోతే... అప్పుడు దాని ఖాతా పరిమితి కాస్తా 40కోట్లై కూర్చుంటుంది. అప్పుడు జగన్మాయ కంపెనీకి, కాసులకు కరువొస్తుంది కదా!

అప్పుడు, అది, షేర్ బజార్ లో (దలాల్ స్ట్రీట్ వంటివి) గుర్తింపు పొందిన ఏజంట్ల ద్వారా, తన షేర్లను తానే బినామీగా కొంటుంది. బుల్స్ గా పిలవబడే ఈ లైసెన్స్‌డ్ ఏజంట్లు, కంపెనీలతో, అలాంటి ప్రయోజనాలు (favors) నెరవేర్చేంత సత్ససంబంధాలు కలిగి ఉంటారు. దీన్ని ‘బైబ్యాక్’ అంటారు.(గతంలో గుట్టుచప్పుడు గాకుండా నడిచే ఈ వ్యవహారాలు, ఇప్పటి ఆర్దికమాంద్యం నేపధ్యంలో ఇటీవలే వెలుగు చూస్తున్నాయి.

మొన్నామధ్య, ‘దాదాపు అన్ని కంపెనీలూ... అవసరమైనప్పుడు అంతో ఇంతో బైబ్యాక్ చేస్తాయంటూ’ చల్లగా చావుకబురు వినిపించారు.)

పత్రికల వార్తల్లో పెయిడ్ వార్తలు వ్రాయించుకున్నట్లు, ఒకప్పుడు కవులు తామే వెనక నుండి డబ్బు ఖర్చు పెట్టుకుని తమకి తామే సన్మానాలు ఏర్పాటు చేసుకున్నట్లు, గత టపా ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్‌’లో చెప్పినట్లు, ఎలాంటి సంఘటనలైనా కిరాయి వ్యక్తుల్ని పెట్టి జరిపించే సంస్థలు పుట్టాక, బైబ్యాక్ పెద్ద విషయమేమీ కాదు! నల్లడబ్బు, దొంగ ఖాతాలు, స్విస్ ఖాతాలు... నిర్వహించే కంపెనీలకు ఇదంత కష్ట సాధ్యమూ కాదు.

ఆ విధంగా పడిపోతున్న తమ కంపెనీ షేరు ధరని తామే నిలబెట్టుకుంటే... తాజాగా లావాదేవీలకు గురైన షేరు ధర ‘బుక్ వాల్యూ Vs మార్కెట్ వాల్యూలలో ఏది గరిష్టమైతే అది పరిగణింపబడుతుంది’ వంటి నియమం ప్రకారం, తాజా ధర పరిగణింపబడి, కంపెనీ బ్యాంకు ఖాతా పరిమితి కృంగిపోకుండా నిలబడి ఉంటుంది. అది కంపెనీలకు ఆయువుపట్టు వంటిది గనక గండం గడిచిపోతుంది.

ఎటూ... ఈ విధమైన బైబ్యాక్ ప్రతిరోజూ నిర్వహించనక్కరలేదు కదా! ఏకబిగిన షేరు ధర తగ్గిపోతున్నప్పుడు, అదీ వారానికోసారి నిలబెట్టుకున్నా ‘బచ్‌గయా’ అనుకోవచ్చు.

నిజానికి లాభాల ప్రకటనలతో, మీడియా ప్రచార ప్రకటనల హోరుతో ఏకబిగిన షేర్ ధర పడిపోవటం సాధారణంగా జరగదు. అన్నీ సజావుగా నడిచి గతంలో అది సుసాధ్యంగానే ఉండేది.

కాకపోతే ప్రపంచమే ఆర్దిక మాంద్యంలో చిక్కుకుని, ఇప్పుడే అంత గడ్డుస్థితి ఏర్పడింది. దీనికి కార్యకారణ సంబంధాలని తర్వాత పరిశీలిద్దాం. ఇప్పటికి జగన్మాయ కంపెనీ ఉదాహరణతో విశ్లేషణ కొనసాగిస్తాను.

ఈ విధంగా షేర్ ధర పడిపోకుండా సర్వప్రయత్నాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తే... సదరు జగన్మాయ కంపెనీ, సంవత్సరమంతా 80 కోట్ల బ్యాంకు ఖాతా పరిమితిలో నిధులని ఉపయోగించుకొందనుకొండి.

80కోట్లకు కనిష్ఠంగా నెలకు వందకు 2 రూపాయల ధర్మవడ్డీ ప్రకారం లెక్కవేసినా... సంవత్సరానికి 19.2 కోట్ల రూపాయల, నికర ఆదాయం ఉంటుంది. ఇందులో బ్యాంకుకి కట్టే వడ్డీ మినహాయించినా ఇంకా సొమ్ము మిగులే!

అలాంటిది 80 కోట్ల సొమ్ము, అంత తక్కువ వడ్డీతో వ్యాపార విస్తరణకి, లావాదేవీలకి అందుబాటులో ఉన్నప్పుడు... 80 కోట్లకి రమారమి వడ్డీ రూపేణానే 20కోట్లు సంవత్సరానికి జోడవుతాయి. అందులో షేరుకు సంవత్సరానికి 2రూపాయల లాభాన్ని (డివిడెండుని) పంచినా కంపెనీకి అయ్యే ఖర్చెంతని?

కోటి షేర్లుx2 రూ. =2 కోట్ల రూపాయలు. దీనిని కూడా త్రైమాసికంగా డివిడెండు కాబట్టి వాటిని సంవత్సరానికి దఫాలుగా, నాలుగు భాగాలుగా చెల్లింపు జరుగుతుంది. అంటే త్రైమాసికానికి 50లక్షలు షేర్ హోల్డర్లకు చెల్లిస్తే సరిపోతుంది.

ఎటూ షేర్ హోల్డర్లు కూడా... కంపెనీ తమకి పంచే లాభాల వాటా (డివిడెండు)ని దృష్టిలో పెట్టుకుని గాక, మార్కెట్టులో పెరిగే షేరు విలువని దృష్టిలో పెట్టుకునే షేర్లని కొంటారు కదా! దాంతో కంపెనీకి తాము ఉపయోగించుకుంటున్న 80కోట్లకుగాను గిట్టుబాటయ్యే 20కోట్ల వడ్డీ సొమ్ములో 2కోట్లని అదీ నాలుగు విడతలుగా చెల్లిస్తే... డివిడెండ్లు పంచిన కంపెనీగా తమ షేరధర మరింత పెరిగి, మరింత సొమ్ము తమకు వినియోగించుకునేందుకు అందుబాటులోకి వస్తుండగా... డివిడెండ్లు పంచడం మరింత లాభాదాయకమా, కాదా?

అందుకోసం లేని లాభాలు ఉన్నట్లుగా చూపటం సంభవమా, కాదా? అదే ఇప్పుడు చాలా కంపెనీల్లో నడుస్తోంది. ఉదాహరణకి మొన్నామధ్య డివిడెండ్ ప్రకటించిన లార్సెన్&టూబ్రో కంపెనీ విషయాన్నే తీసుకుందాం. ఒకో షేరుకు 12.50రూ.ల లాభవాటా (డివిడెండ్) ని కంపెనీ ప్రకటించింది. దాదాపుగా 73 కోట్ల 65లక్షల పైచిలుకు వాటాలు మార్కెట్టులో ఉన్నాయి. నిన్నటి రోజు (అంటే అక్టోబరు 18వ తేదిన) 71,245 షేర్లు ట్రేడింగ్ కు (అంటే క్రయవిక్రయాలకు) గురయ్యాయి.

సదరు ఎల్&టీ కంపెనీ షేరు ధర ఒక్కొక్కటీ 2,034 రూపాయలు. నిన్నటి ట్రేడింగ్ లో కొంత తగ్గుదలకి గురయ్యి 2,015 రూ.లకు పడిపోయింది. అంటే రెండు వేల పైచిలుకు ధర గల ఒకో వాటా కలిగి ఉన్న షేర్ హోల్డర్‌కు, కంపెనీ ఇచ్చిన లాభం 12రూపాయల ఏభైపైసలు. నిశ్ఛయంగా 12రూపాయల యాభై పైసల లాభం కోసం ఏ మదుపుదారుడూ 2,034 రూపాయల పెట్టుబడి పెట్టడు. అదీ కంపెనీ ఆరునెలలకి ఒకోసారి పంచే లాభం!

మొన్న షేర్ ఒక్కింటికి 12.50 రూ.ల డివిడెండుని ప్రకటించిన ఎల్&టి, తరువాత రోజు... 200 కోట్ల పెట్టుబడిని సేకరించేందుకు నూతన బాండ్లు విడుదల చేసింది. కనీస పెట్టుబడి 5000 రూ.లు కాగా... స్థిర ఆదాయ హామీ, 20,000రూ.ల వరకూ పన్ను రాయితీ, అదనపు ఆకర్షణలు! ఇన్ని ఆకర్షణలతో బాండ్లు విడుదల చేయనుండగా, ఇప్పటికే లావాదేవీల్లో చలామణి అవుతున్న షేర్ల మీద డివిడెండు ఇవ్వటం, మరింత ఆకర్షణీయంగా ఉంటుంది కదా! రేపటి పెట్టుబడి సమీకరణకు, నేటి డివిడెండు పంపకం బలాన్నిస్తుందన్నది సతర్కమే కదా!

అలాంటిదే బ్యాంక్ ఆఫ్ బికనీరు&జైపూర్ ది. ఒక్కో షేర్ మీద 7.50 రూ.ల డివిడెండు ప్రకటించిన తర్వాతి రోజున 800కోట్ల రూ.ల పెట్టుబడి సేకరణకు కొత్త ఇష్యూ ప్రకటించింది.

ఇంత నేపధ్యం ఉన్నప్పుడు... డివిడెండుకు వందల రెట్లలో షేర్ ధరలు పెరగటం మామూలే! వస్తూత్పత్తి చేసే సంస్థలతో బాటుగా, సేవల రంగంలోని సంస్థలూ షేర్లు విడుదల చేయటం ఒక ఆసక్తిదాయకమైన అంశం.

అలాంటప్పుడు నిశ్చయంగా, మదుపుదారులు కంపెనీ ఇవ్వనున్న, ఇవ్వజూపుతున్న లాభాలని ఆశించి షేర్లు కొనడం లేదు. ప్రైమరీ ఇష్యూనాడు షేర్లు కొని... సుదీర్ఘ కాలం వేచి ఉండే షేర్ హోల్డర్స్ ని మదుపుదారులు అనవచ్చు.

బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే తక్కువ వడ్డీ వస్తుంది గనుక,
ఇంట దాచుకుంటే దండుగ + దొంగల భయం గనుక,
ఇతరులకి వడ్డీకిస్తే ఎగవేత భయం గనుక షేర్లలో,
బాండ్లల్లో భద్రత చూసుకొని వీరు పెట్టుబడిపెడతారు.

అయితే... ఇలాంటి వారు, చాలాసార్లు మోసగించబడుతూనే ఉంటారు. లిస్టింగ్ లో మాయమై పోయే కంపెనీల షేర్లు వీళ్ళ దగ్గర మురిగి పోతుంటాయి. పెట్టుబడి పెట్టి, రోజు వారి తమ జీవన పోరాటంలో తాము మునిగి పోయి, ఆనక కళ్ళు తెరిచి "ఫలానా కంపెనీ షేర్లు ఎక్కడా (quote)కోట్ అవ్వటం లేదు. నా దగ్గర ఇన్ని షేర్లున్నాయి. ఎవరిని అడగాలి? ఎలా నా సొమ్ము నేను తిరిగి పొందాలి?" అంటూ పత్రికల్లో కాలమ్స్ నిర్వహించే నిపుణులకి వ్రాస్తుంటారు.

అంబుడ్స్‌మెన్ ల వంటి సంబంధిత అధికారులకి, అధికార వ్యవస్థలకి ఫిర్యాదులు పెట్టుకుని దీనంగా దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే... షేర్ల స్వల్పకాల క్రయవిక్రయాలకు సిద్దపడే వారంతా, కంపెనీ పంచి ఇచ్చే డివిడెండ్లని ఆశించి గాక... `షేర్ల ధరలు పెరుగుతాయి, పెరిగాక అమ్ముకుని లాభాలు పొందుదాం' అనుకుని షేర్లలో పెట్టుబడి పెడతారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

బైబాక్ అంటే కంపనీ షేర్ ధరను పెంచడానికి బినామీ అకౌంట్లతో కొనడం కాదు. మార్కెట్లో షేర్ ధర తను ఉండాల్సిని దానికంటే తక్కువ ఉన్నట్లు భావిస్తే కంపనీ పబ్లిక్‌గా బైబాక్ ఆఫర్ చేస్తుంది.

The Meaning of Buybacks
A stock buyback, also known as a "share repurchase", is a company's buying back its shares from the marketplace. You can think of a buyback as a company investing in itself, or using its cash to buy its own shares. The idea is simple: because a company can’t act as its own shareholder, repurchased shares are absorbed by the company, and the number of outstanding shares on the market is reduced. When this happens, the relative ownership stake of each investor increases because there are fewer shares, or claims, on the earnings of the company.

http://www.investopedia.com/articles/02/041702.asp

ఒక కంపనీ తమ షేరు ధర పడిపోకుండా మానిపులేట్ చెయ్యడం మీరు చెప్పినంత సులభం అయితే ఏ కంపనీ కూడా మునిగిపోగూడదు.

కంపెనీ బ్యాంకు ఖాతా పరిమితి అంటే ఏమిటో అర్ధం కవడం లేదు, కాస్త వివరిస్తారా? అలాగే దానికి ఇంగ్లీష్ పదము కూడా చెప్పండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu