షేర్ మార్కెట్ వ్యాపార విస్తరణ గురించి చెప్పేముందు, ఓ చిన్న కథ చెబుతాను.

అనగా అనగా...

సుధనా పురం పేరుకు తగ్గట్లుగా ధనవంతులున్న ఊరు. పేద్దది కాకపోయినా ఓ మోస్తరు పట్టణమే! ఆ వూళ్ళో అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. రకరకాల దుకాణాలు, వివిధ రకాల వ్యాపారులూ ఉన్నారు. చుట్టుప్రక్కల చాలా పల్లెలకూ అది కూడలి కావటంతో, ప్రతిరోజూ ఆ ఊరికి వచ్చిపోయే వాళ్ళకీ కొదవలేదు.

ఇలా ఉండగా... ఓసారి ఆ ఊరికి కనకయ్య అనే నడివయస్సు వ్యక్తి, కుటుంబంతో సహా వచ్చాడు. రావటం రావటమే ఊళ్ళో పెద్ద బజారులో ఓ భవనం కొన్నాడు. పట్టు వస్త్రాల దుకాణం తెరిచాడు. మనుష్యుల్ని పెట్టి ఊరంతా ‘టాం టాం’ గా తన వస్త్ర వ్యాపారం గురించి ప్రచారం చేయించాడు.

అది ఆ ఊరికి కొత్త కావటంతో, సహజంగానే, కనకయ్య పేరు ఒక్కసారిగా ఊళ్ళో మారుమోగిపోయింది. త్వరలోనే అతడి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉందనే మాట ఊరంతా పాకిపోయింది. క్రమంగా ఊళ్ళో ఇంకొన్ని స్థలాలు, తోటలూ కొన్నాడు.

క్రమంగా అతడు వడ్డీ వ్యాపారం కూడా ప్రారంభించాడు. ఏది చేసినా... ‘కనకయ్య నిజాయితీగా వ్యాపారం చేస్తాడనే’ పేరు తెచ్చుకున్నాడు. ‘అవసరానికి అప్పుకి వచ్చారు కదా!’ అని ఎక్కువ వడ్డీ గుంజే వాడు కాదు. అప్పుడప్పుడూ పేద సాదలకి దాన ధర్మాలు కూడా చేసేవాడు.

ఇలా ఉండగా... ఓ రోజు కనకయ్య, పట్టణాధికారి దగ్గరికి వెళ్ళి "అయ్యా! రాత్రి నాకు ఓ కల వచ్చింది. ఆ కలలో దేవుడు కన్పించి ‘కనకయ్యా! ఇటీవల నీవు కొన్న జామ తోటలో ఈశాన్య మూల తవ్వు. అక్కడ నీకు ఓ స్వర్ణ కలశం దొరుకుతుంది. దాన్నిండా బంగారు నాణాలు, మణిమాణిక్యాలూ ఉన్నాయి. అయితే... అది తవ్వితీసిన నాటి నుండి ఐదేళ్ళపాటు దాన్ని తెరవకూడదు.

సరిగ్గా ఐదేళ్ళ తర్వాత దాన్ని తెరిచి, అందులో పదోవంతు, పేదలకి అన్నసంతర్పణ చెయ్యి. మిగిలింది నువ్వు తీసుకో! నీ నిజాయితీ వ్యాపారానికి మెచ్చి, ఆ బిందెని నీకనుగ్రహిస్తున్నాను. అయితే ఓ షరతు! ఆ బిందెని నీవు ఊరు దాటించకూడదు. ఊరందరి సమక్షంలోనే దాన్ని తవ్వించాలి. అప్పుడు ఊరులోని అందరు కూడా నా అనుగ్రహం కోసం నీలా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు’ అని చెప్పాడు. పదిమంది పెద్దల సమక్షంలో అక్కడ పూజాదికాలు నిర్వహించి, ఆపైన తవ్వకం చేపట్టాలని నా సంకల్పం. అందుచేత మీ దగ్గరికి వచ్చాను" అన్నాడు.

అది విని పట్టణాధికారి ఆశ్చర్యపోయాడు. సరే కానిమ్మని పురోహితుణ్ణి పిలిచి పూజకి ముహుర్తం పెట్టించారు. ఆ వార్త ఆ నోటా ఈ నోటా పాకింది. ముహుర్తం రోజున సగం ఊరక్కడే పోగయ్యింది.

శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి తవ్వటం ప్రారంభించారు. చెప్పుకోదగినంత లోతు తవ్వాక ఓ బిందె దొరికింది. మట్టి తుడిచి శుభ్రం చేసి చూస్తే, అది తళతళాలడుతున్న సువర్ణ కలశం! పోతపోసిన మూతతో ఉన్న ఆ బిందె చాలా బరువుగా కూడా ఉంది.

అందరూ ఆశ్చర్యంతోనే కనకయ్యని అభినందించారు. కనకయ్య బిందెనింటికి తీసుకుపోయాడు. అది మొదలు కనకయ్య వ్యాపారం మరింత అభివృద్ది చెందసాగింది. ఆ విషయం కనకయ్యే స్వయంగా ప్రకటించుకున్నాడు.

ఇలా సంవత్సర కాలం గడిచింది. అంతలో కనకయ్యకి దూరాన ఉన్న స్వంత ఊరు నుండి కబురొచ్చింది. స్వంత ఊళ్ళో తల్లిదండ్రులూ, అత్తమామలూ... వృద్దులైన కారణంగా అనారోగ్యంతో ఉన్నారనీ, చివరిరోజులలో కనకయ్య కుటుంబసమేతంగా తమ వద్దే ఉండాలని కోరుతున్నారనీ!

దాంతో కనకయ్య... తన ఇల్లూ, పొలాలూ, తోటలూ, వ్యాపార దుకాణాలని అమ్మడానికి పెట్టాడు. బాగా నడుస్తున్న వ్యాపారం కాబట్టి మంచిధర పలికింది. మొత్తం ఆస్తంతా అమ్మి రొక్కంగా మార్చుకున్నాడు. ఇక మిగిలింది... భూమిలో దొరికిన బంగారు లంకె బిందె!

భగవంతుడు విధించిన నియమం ప్రకారం దాన్ని ఊరు దాటించకూడదు. ఆ విషయమై పట్టణాధికారిని సలహా అడిగాడు కనకయ్య. పట్టణాధికారి పదిమంది పెద్దలతో సదస్సు పెట్టి, విషయాన్ని చర్చించాడు. అందరూ కలిసి "కనకయ్యా! బిందెని తగిన ధరకు అమ్మి, అందులో పదోవంతుతో పేదలకి అన్న సంతర్పణ చేసి, మిగిలింది నువ్వు తీసికెళ్ళు. గడువు రోజున కలశాన్ని కొనుక్కున్న వ్యక్తి, దాన్ని తెరిచి ఆ సంపదని ఉపయోగించుకుంటాడు" అని తీర్మానించారు. కృతజ్ఞతలు చెబుతూ కనకయ్య వారికి మంచి బహుమతులిచ్చాడు.

ఆ ప్రకారం కనకయ్య బిందెని అమ్మకానికి పెట్టాడు. అప్పటికే ‘అందులో చాలా బంగారు నాణాలు, విలువైన మణిమాణిక్యాలు ఉన్నాయనీ, సాక్షాత్తూ దేవుడు కలలో కనబడి ఎక్కడుందో చెప్పటంతోనే అది లభించిందనీ, అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందనీ, ఆ బిందె లభించిన తర్వాతే కనకయ్య వ్యాపారం మరింత లాభాలతో నడిచిందని’ ప్రచారాలు ఉండటంతో... చాలామంది దాన్ని కొనడానికి పోటీపడ్డారు. దాంతో వేలంపాట నిర్వహించవలసి వచ్చింది.

ఉళ్ళోని మరో ఐశ్వర్యవంతుడు దాన్ని లక్షవరహాలకు కొన్నాడు. కనకయ్య అందులో పదివేల వరహాలు పెట్టి అన్న సంతర్పణ చేసి, మిగతా సొమ్ము మూటగట్టుకొని కుటుంబంతో సహా స్వంత ఊరుకు తరలిపోయాడు. వెళ్ళేముందు పట్టణాధికారికి, సదస్సులోని పెద్దలకి మరోసారి భారీగా కానుకలు ఇచ్చాడు. అన్నిరకాలుగా అందరికి లాభంగా అన్పించింది కాబట్టి, అందరూ సంతోషంగా కనకయ్యకి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు.

కొన్ని రోజులు గడిచాయి. బంగారు బిందె కొన్న భాగ్యవంతుడికి, ఒక్కసారిగా లక్ష వరహాలు ఏకమొత్తంగా మదుపు పెట్టడంతో చేతిలో డబ్బు ఆడక వచ్చింది. దాంతో అతడూ దాన్ని అమ్మకానికి పెట్టాడు. మరొకరు కొన్నారు. మరేవో కారణాలతో అతడూ దాన్ని అమ్మేశాడు. అలా బంగారు బిందె క్రమంగా చేతులు మార జొచ్చింది.

‘అది ఎవరి దగ్గరుంటే వారికి అదృష్టం కలిసి వస్తుందన్నారు కదా! మరి ఎందుకు చేతులు మారుతోంది!?’ అని ఎవరికీ సందేహం రాలేదు. ఎందుకంటే అమ్ముకునే ప్రతివారికి అమ్మేటప్పుడు ఏదో ఒక కారణం ఉంటూ వచ్చింది.

అలా అలా... వ్యక్తుల చేతులు మారి, క్రమంగా ఒక్కరే కొనటం సాధ్యం గాక పోవటంతో, పదిమంది కలిసి సమిష్టంగా కొనటం, అమ్మటం కొనసాగింది. ఐదేళ్ళు గడిచాయి.

ఈ లోపున పట్టణాధికారి పదోన్నతి రావటంతో రాజధానికి వెళ్ళిపోయాడు. అతడి స్థానంలోకి కొత్త అధికారి వచ్చాడు. అప్పుట్లో కనకయ్యకి కలశం అమ్ముకొమ్మని సలహా ఇచ్చిన పదిమంది పెద్దల సదస్సులో కూడా, సభ్యులు మారిపోయారు. కొందరు మరణించారు. కొందరు దేశాంతరాలు పోయారు. వెరసి ఇప్పుడందులో అందరూ కొత్తవారే ఉన్నారు.

కలశం తెరిచే గడువు రోజు నాటికి, దాన్ని అయిదు వందల మంది సాధారణ ప్రజలు, ఒక సమూహంగా ఏర్పడి, సమిష్టిగా కొని ఉన్నారు. వాళ్ళంతా తమకున్నంతలో సాదాసీదాగా బ్రతుకు గడుపుతూ, పొదుపుచేసిన సొమ్ము తలా కొంత వాటాలుగా వేసుకొని, సువర్ణ కలశాన్ని కొన్నవారు.

ఎంతో ఆశగా... గడువురోజున, కలశానికి పుజాదికాలు నిర్వహించి, పట్టణాధికారి, పెద్దల సదస్సు సమక్షంలో, సీలు పగల కొట్టి కలశాన్ని తెరిచారు.

చూస్తే ఏముంది?

దాన్నిండా బరువుగా ఉండే చిల్లపెంకులూ, గులకరాళ్ళూ ఉన్నాయి.

పాపం! కలశ ప్రస్తుత యజమానులు గుండెలు బాదుకుని బావురుమన్నారు.

పట్టణాధికారి "నేను కొత్త వాణ్ణి! గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, నా బాధ్యతా లేదు" అన్నాడు. అదే మాట పెద్దల సదస్సుదీ! కనకయ్యే ఇలా చేసాడా? లేక చేతులు మారినప్పుడు ఎవరయిన ఇలా చేసారా? దానాదీనా ‘విత్తు ముందా? చెట్టు ముందా?’ అన్న ద్వంద్వం తయారయ్యింది.

వెరసి... పనికిమాలిన చిల్లపెంకులను, గులక రాళ్ళనూ ఎంతో వెలపోసి కొన్నట్లయ్యింది. మొదట అందరూ లాభ పడ్డారు. చివరకి, గడువు ముగియటం అనే అంతిమ సంఘటన నాటికి, దానిలో ఎవరయితే వాటాదారులో... వాళ్ళే నష్ట పోయారు! అంతే కాదు, ఐదేళ్ళుగా ఎందరి చేతులో మారిన సువర్ణకలశం మీద, ఎన్నో క్రయవిక్రయాలతో, ఎంత వ్యాపారం జరిగిందో లెక్కలు వేస్తే... అప్పటికి యాభైలక్షల వరహాలని తేలింది.

వెరసి... ఏమీ లేని దాని మీద యాభై లక్షల వరహాల వ్యాపారం జరిగిందన్న మాట!

అందులో విశేషం ఏమిటంటే - మొత్తం యాభై లక్షల వరహాల వ్యాపారంలో... ఒక్క వరహా ఖరీదయ్యే ముడి సరకూ వాడ బడలేదు, ఒక్క వరహా ఖరీదయ్యే వస్తూత్పత్తీ జరగలేదు. ఇక ఉపాధికి బాటలు వేయటం కలలో మాటే!

ఇదీ కథ!

ఇక ఈ కథకి అనువర్తన ఏమిటంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

శెహభాష్ అమ్మాయీ!

భలే మంచి కథ--దీని రచయిత(త్రి) యెవరూ, దీన్నెక్కడ పట్టుకొన్నావూ అని అడగక్కర్లేదనుకుంటా!

అమ్మకడుపు చల్లగా--కొనసాగించు--కొంతమందికైనా బుధ్ధి వస్తుందేమో!

కృష్ణశ్రీ గారు: మీ అభినందనకి ఎంతో సంతోషం కలిగిందండి! మీ ఊహ నిజమే! ఆ కథ నా స్వంతం! దీని అనువర్తనతో తరువాతి టపా కొనసాగించాలనుకుంటున్నాను. నెనర్లు!

కధ చాలా బాగుంది.

షేర్ మార్కెట్ కి ఈ కధ కి సంబంధం లేదు అని నా అభిప్రాయం. షేర్ మార్కెట్ లో ఉన్న కొన్ని కంపెనీలు మీరు అన్నట్లు చిల్లర పెంకులు లాంటివే, వాటి విలువకన్నా ఎక్కువ పెట్టి కొంటారు. అందరికి తెలుసు వాటి షేర్ విలువ ఎక్కువని, అయినా కొంటారు. కొన్నాళ్ళకు అందరు అమ్మెయ్యటం మొదలు పెడతారు. ఎవరు తెలివిగా ముందు అమ్మితే వాళ్ళు లాభ పడతారు. కాని అన్ని కంపెనీల విషయం లో ఇలా జరగదు.

మార్కెట్ లో అన్ని కంపెనీలలో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే (మ్యూచువల్ ఫండ్స్ ద్వారా), మూడు లేదా నాలుగు సంవత్సరాలు కదలకుండా ఉంచితే లాభం రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

సరే, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యటం దేశానికి మరియు మనకి కూడా మంచిది కాదు అని అనుకుందాం కాసేపు. మరి అప్పుడు మన దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బుని ఎక్కడ పెడదాం?

మిగతా మార్గాలు
- ఫిక్సెడ్ డిపాజిట్ (ఇది సుద్ధ వేస్ట్. పైసా రాకపోయినా పరవాలేదు, పైసా కూడా పోకూడదు అనుకునే వాళ్లకు మాత్రమే. అంటే కృష్ణ, రామా అనుకునే బాగా ముసలి వాళ్లకి, ;) ఎందుకంటే వాళ్ళు డబ్బు సంపాదించినా వాళ్ళు అనుబవించలేరు కదా).
- గోల్డ్ (దీనిలో పెట్టడం వలన లాభమే కాని, కాని దేశానికి పెద్ద ఉపయోగం లేదు లేదనుకుంటా.)
- L I C (20 / 25 సంవత్సరాల తరువాత బోలెడంత డబ్బు వస్తుందని చెప్పి బుట్టలో వేసుకుంటారు. వడ్డీ లెక్కేస్తే 8 - 9 % కూడా రాదు. పాపం జనాలకి వడ్డీ ఎంతో వస్తుందో తెలియక, 20 సంవత్సరాల తరువాత ఎంతో వస్తుందో చూసుకొని, గుడ్డిగా పెట్టేసి, అడ్డంగా బలి అయిపోతారు. ఇక L I C వాడు షేర్ మార్కెట్ లో 20 సంవత్సరాలు పెట్టి, అన్ని రకాల పండగలు చేసుకొని, 15 నుండి 20 % వడ్డీతో లాభాలు సంపాదిస్తాడు. అందులో సగం కన్నా తక్కువగా మనకి బిచ్చంగా పారేస్తాడు. అదేదో మనమే షేర్ మార్కెట్లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసేసి, ఒక టర్మ్ ఇన్సురన్సు తీసుకుంటే ఎంత బాగుంటుంది..)
- రియల్ ఎస్టేట్ (దీనిమీద పెట్టగలిగెంత డబ్బు ఉంటె మంచిదే. కాని ఒక పదివేలో, ఇరవై వేలతో ఇన్వెస్ట్ చెయ్యలేం కదా??)
- వగైరా వగైరా

ఇవి నాకు తెలిసిన ఇన్వెస్ట్ మెంట్ మార్గాలు. ఇంకా మంచివి ఉంది ఉండొచ్చు. మీకు తెలిస్తే చెప్పండి, అందులోనే నేను పెడతా. :)

rajesh gaaru,

asalu sharemarket value 8000 nundi 20000 varaku ela dusukellindi? mari daaniki taggattuga, india abhivrudi lo kooda rendithalu ayinda?

రాజేష్ గారు,

మంచి అంశాలు లేవనెత్తారు. అయితే మీరో విషయం గమనించాలి. నేను స్టాక్ మార్కెట్ ని వ్యతిరేకించడం లేదండి, అందులో జరిగే మోసాలని, మాత్రమే ఎత్తి చూపిస్తున్నాను. ప్రతీ విషయంలోనూ మంచీ చెడూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ విషయం లోనూ అంతే! ఈ ప్రక్రియని ప్రారంభించేటప్పుడు... ఏ దేశంలోనైనా... ఆ దేశానికీ, కంపెనీలకి కూడా మేలేనని చెప్పబడింది. ఆచరణలో, కంపెనీ బడాబాసుల స్వార్ధానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, అందుకోసం అన్నిటినీ ఎలా సానుకూలం చేసుకున్నారో... ఇలాంటి మోసాలెన్నో ఉన్నాయి. ఉన్నదంతా చిల్లపెంకులేనన్నది నా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ అసత్యాలదే అధిపత్యం అన్నది గమనార్హం!

అజ్ఞాత గారు: నెనర్లండి!

అజ్ఞాత గారు,
చాలా మంచి ప్రశ్న వేసారు.

దానికి మొదటి కారణం సామాన్య ప్రజలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానిని శిక్షించాల్సింది ప్రజలే. మరి అలాంటి ప్రజలే ప్రభుత్వం తప్పులు చేస్తున్నా గుడ్డ్లప్పగించి చూస్తూ, రోజు తిడుతూ, ఎన్నికల ముందు రోజు వాళ్ళు ఇచ్చే డబ్బులతో మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేసేస్తారు. మరుసటి రోజు నుండి తిట్టడం మరలా మొదలు పెడతారు. నోటికి తప్పితే చేతలకు పని చెప్పని వారిని గురించి ఎవరూ పట్టించుకోరు.

ఉదాహరణకు మసూరి బియ్యం ఎగుమతి చేస్తే, రైతులకు వచ్చే లాభం 80000 వేల కోట్ల రూపాయలు (చాలా ఎక్కువ కదా?). (ఇది చూడండి http://goo.gl/5iww) మరి ఎగుమతి చెయ్యటానికి అనుమతి లేదు. అనుమతి కోసం రైతులు అందరు కలిసి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఒప్పుకోదా? ఒక వేళ ఒప్పుకోకపోతే, నాలుగు సంవత్సరాల తరువాత అధికార పార్టీ పీక వాళ్ళ చేతిలోకి వస్తుంది. వాళ్లకు నచ్చినట్టుగా తిప్పుకోవచ్చు. ఒక వేళ వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశ పడినా, లేదా "మన బతుకులు ఇంతే, ఎవడూ బాగు చెయ్యలేడు" అని నిరుత్సాహ పడినా, మరల 5 సంవత్సరాలు నరకమే. పైన చెప్పిన మసూరి బియాం ఎగుమతి లాంటివి ఇంకా బోలెడన్ని ఉంటాయి.

రెండవ కారణం, షేర్ మార్కెట్ పడిపోతే ప్రజల ఆర్ధిక పరిస్థితి మీద చాలా ప్రభావం ఉంటుంది. ప్రజలు తమ షేర్లు అమ్మినా పెద్దగా లాభం రాదు. ఆ ప్రభావం తిరిగి ప్రభుత్వం మీదకే వెళిపోతుంది. ఎలా అంటే, ఒక వ్యక్తికి షేర్ల వల్ల బాగా లాభం వచ్చింది అనుకోండి. వాడు వంటకో పని మనిషిని, కారుకో డ్రైవర్ని, బట్టలు ఉతకడానికి ఒక మనిషిని ఇలా పెట్టుకుంటాడు. వాడికి షేర్లలో ఆదాయం తగ్గింది అనుకోండి, సింపుల్ గా వీళ్ళందరినీ పీకేస్తాడు. అప్పుడు ఉద్యోగాలు పోయిన వాళ్ళు అందరూ ప్రభుత్వం మీద పడతారు. అప్పుడు ప్రభుత్వం తల ప్రాణం తోకకు వస్తుంది వీళ్ళందరికీ ఉపాధి కల్పించలేక. దీనికి పరిష్కారం ఏమిటంటే F.I.I (Foreign Institutional Investors) లను మన దేశం లో పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇవ్వటం. తద్వారా షేర్ మార్కెట్ బాగుంటుంది. ధనిక ప్రజల ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. ఎంతో మందికి ఉపాధి లబిస్తుంది. అప్పుడూ అందరూ హాపీస్.

రాజేష్ గారు:మీరు పరిష్కారంగా చెప్పిన FII వ్యవహారం ఏమిటో ఒకసారి ఈ దిగువ వార్తను పరిశీలించండి.
సాక్షి, 19అక్టోబరు,2010:

ఎఫ్‌ఐఐలు రివర్స్ అయితే స్టాక్ మార్కెట్లు క్రాష్
చెన్నై: భారీగా తరలి వస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) నిధులు ఒకవేళ వెనక్కు మళ్లితే పడితే దేశీయ ఫారెక్స్, స్టాక్ మార్కెట్లలో భీతావహ పరిస్థితులు నెలకొంటాయని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వెలిబుచ్చారు.

రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకుని, పార్టిసిపేటరీ నోట్లను అదుపుచేయాలని కోరారు. ।పెద్ద ఎత్తున వస్తున్న విదేశీ నిధులు మన కరెన్సీ మారకం రేటును, వివిధ ఉత్పత్తుల ధరలను పెంచుతూ, ఎగుమతుల్లో పోటీ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. 200809 ప్రథమార్థంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 18 శాతానికి పెరిగిన వస్తువుల ఎగుమతులు ప్రస్తుతం 13 శాతానికి క్షీణించాయ*ని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

1997 నాటి తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభాన్ని ఉదహరిస్తూ, విదేశీ నిధుల్లో ఎన్నో ఒడిదుడుకులుంటాయనీ, ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేమనీ అన్నారు. ఇలాంటి నిధులపై ఆధారపడడమే తప్పని వ్యాఖ్యానించారు. నమోదు కాని (అన్‌రిజిస్టర్డ్) సంస్థలు భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఉపయోగించే పార్టిసిపేటరీ నోట్లను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.

మీతో ఏకీభవిస్తున్నాను. అతిగా FII లను మన మార్కెట్లోకి వదలటం ప్రమాదకరం.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu