పేపరు మిల్లులకీ, పరిసర ప్రాంత అటవీ సంరక్షణకీ సంబంధించిన ప్రణాళికా రచనలకీ ఆచరణకీ మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిదే మరో చిన్న ఉదాహరణ పరిశీలించండి.

ఇది నా స్వానుభవం కూడాను!

మనకి రాష్ట్రాల్లో ఆర్టీసీ లుంటాయి కదా! APSRTC, KSRTC గట్రాలు. వీటన్నింటికీ బ్యాటరీలు, ఆయిల్ ఫిల్టర్లు, టైర్లు గట్రాలను సరఫరా చేసేందుకు... కాంట్రాక్టులని ఖరారు చెయ్యడానికి, ఢిల్లీలో, ASRTU అని ఓ ప్రభుత్వ సంస్థ ఉంటుంది. ASRTU అంటే All States Road Transports Undertaking అని!

ఒకటికి రెండుసార్లు, నేను ఈ సంస్థ నిర్వహించే బిడ్‌లో పాల్గొన్నాను. అప్పుడు మనం ఫిల్ చేసి దాఖలు చెయ్యాల్సిన టెండరు ఫారాలలో... ఉదాహరణకి మా బ్యాటరీల విషయంలో అయితే, ఎన్నిKVAల బ్యాటరీలను, ఏ ధరకు సరఫరా చేయగలమో Quote చెయ్యాలి. KVAలని సాధారణంగా ప్లేట్ల సంఖ్యలో కూడా చెబుతారు.

అంటే 25 ప్లేట్ల బ్యాటరీలు, 21ప్లేట్ల బ్యాటరీలు... ఇలాగన్న మాట. వాటి ధరతో పాటు, ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా సీసం ధర టన్నుకు వెయ్యి రూపాయలు పెరిగినట్లయితే, మన బ్యాటరీని వందకు ఎన్ని రూపాయలు (ఎంత శాతం) పెంచుతామో కూడా, మనం Quote చెయ్యవలసి ఉంటుంది. అలాగే... టన్నుకి సీసపు ధర వెయ్యిరూపాయలు తగ్గితే, మనం ఎంత తగ్గించగలమో ముందే చెప్పాలి. దాదాపుగా ధర పెరగడం తప్పితే, తగ్గడం ఉండదను కొండి, అది వేరే సంగతి.

ఇక్కడ మెలికేమిటంటే - బ్యాటరీ ఉత్పత్తి చేపట్టే పరిశ్రమలలో చిన్న స్థాయి వాటికి (ఇవి పూర్తిగా దేశీయ కంపెనీలు, నా ఫ్యాక్టరీ మాదిరిగా!), అంతర్జాతీయంగా రాబోయో ధరవరల్లో మార్పు చేర్పులు అంచనా వేసేంత అవగాహన ఉండదు. అదే Amco, Exide, Standard వంటి బహుళ జాతి కంపెనీలకి, ఆ సమాచారం కరతలామలకంగా ఉంటుంది.

అంతేకాదు వాటి ధరలని వాళ్ళే నియంత్రించగలరన్న విషయం, మామూలు చిన్న కంపెనీలకు తెలియను కూడా తెలియదు. ఇక మామూలు జనాలకి తెలిసే ప్రసక్తే లేదు. అదే ఇప్పుడయితే... బహుళ జాతి కంపెనీల సిండికేట్ వాటి ధరలని ఎలా నియంత్రిస్తాయో పేపరు చదివే సామాన్య జనాలకి కూడా తెలిసి పోయింది. అది ఈ 18 సంవత్సరాల్లో వచ్చిన మార్పు.

ASRTUలో బిడ్ ఓపెనింగ్ ప్రోగ్రాంకి నేను వెళ్ళినప్పుడు... Exide, Amco సంస్థల సంబంధిత ఉద్యోగులు కూడా ఆ కార్యక్రమానికి రావటం తటస్థించింది. ఒక చిన్న పారిశ్రామిక సంస్థ నడిపే, మహిళా పారిశ్రామిక వేత్తగా నన్ను వాళ్ళంతా ఆశ్చర్యంతో చూశారు, ప్రోత్సహించారు.

అయితే టెండరు Quote చేసే పద్దతిలోనే... దేశీయ లఘు సంస్థలకు పురిటి సంధి కొట్టించే ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఆ విషయమై ఆ సమావేశంలో జరిగిన చర్చతోనే, నాకు అప్పటి అవగాహన కలిగింది.

మామూలుగా రాష్ట్ర RTCలలో, మేం బ్యాటరీలకు ఆర్డర్లు అడిగితే... డైరెక్టర్లు, క్రింది స్థాయి ఉద్యోగులు "స్థానిక కంపెనీల ఉత్పత్తులు చౌకగా ఉండొచ్చుగాక, పనిచేయక పోతే, మేం పైవాళ్ళ చేతుల్లో తిట్లు తినాల్సి వస్తుంది. అదంతా మాకెందుకు? సంస్థకు లాభాలు చూపెట్టడం మా పని. చిన్నపరిశ్రమలని ప్రోత్సహించమని కాగితాల మీద, నోటితో చెబుతారు. అదే నష్టాలొచ్చినప్పుడు ‘చిన్న కంపెనీలతో మనకెందుకు? బ్రాండెడ్‌కు ఆర్డరివ్వాల్సింది?’ అంటారు" అనేవాళ్ళు.

నిజానికి ఇక్కడ మనం ఉప్పు ప్యాకెట్ కొన్నట్లు, ఆర్టీసీ ఏం కొనదు. ముందు ట్రయల్ ఆర్డరు కొద్ది సంఖ్యలో(100లోపే) ఇచ్చి, అవి బాగా పనిచేస్తేనే, తరువాత ఆర్డరు ఇస్తారు. అదే ఆర్టీసీ డైరక్టర్లకు బినామీ పేరు మీద ఉన్న యూనిట్లకు పేపరు మీదే ఆర్డరు ఇస్తారు, పేపరు మీదే స్క్రాప్ క్రింద ఆ సరుకు బయటకు వస్తుంది. అంటే బ్యాటరీలు తయారి ఉండదు, సరఫరా ఉండదు. బ్యాటరీ గ్యారంటీ అయిపోయిన తరువాత తుక్కు క్రింద సరుకు బయటకు కూడా వస్తుంది. మొత్తం పేపర్ మీదే ఇదంతా నడుస్తుంది. మరి ఇలా చేస్తే ఆర్టీసీ నష్టాల పాలుగాక ఛస్తుందా?

"రాష్ట్రంలోని చిన్న కంపెనీలకు మీ వాడకంలో 10% వాటాగా ఆర్డర్లు ఇవ్వాలి కదా! ప్రోత్సహించండి సార్!" అని అడిగితే... మరో సారి పైన చెప్పిన రికార్డే మళ్ళీ వినిపిస్తారు. ‘తాము ASRTU సర్టిఫై చేసిన కంపెనీల ఉత్పత్తులకే ఆర్డరు చేస్తామనీ, అదే తమకి సురక్షితం అనీ’ తెగేసి చెబుతారు. సదరు ASRTUలో, చిన్న కంపెనీలని, బహుళ జాతి కంపెనీలు నలిపి నామరూపాల్లేకుండా చేసే విధానాలే అమలులో ఉంటాయి.

వెరసి దేశీయ కంపెనీలు, మార్కెట్టులో నిలదొక్కుకోలేవు. మాటల్లో అయితే మంత్రి మహామహులు పేజీల కొద్దీ ఉపన్యాసాలు, దేశీయ కంపెనీలని, చిన్న సంస్థలనీ ప్రోత్సహిస్తామంటూ ఊకదంపుడుగా చేసిపోతారు.

దీనికి తాజా ఉదాహరణ పరిశీలించండి. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో (మచ్చుకి మా నంద్యాల వంటి పట్టణాలు) చిన్న పాఠశాలలుంటాయి. తిప్పికొడితే 200 మంది విద్యార్ధాలుంటే ఎక్కువ! చుట్టుప్రక్కల వాళ్ళు పోతే ఆ స్కూళ్ళకి ప్రక్క ఊళ్ళనుండి, పట్టణంలో దూరంగా ఉన్న ప్రాంతాల నుండి, వ్యాన్‌కి వచ్చే వాళ్ళ సంఖ్య 40-50 మంది మాత్రమే ఉంటారు. ఇలాంటి స్కూళ్ళన్ని వ్యక్తిగత పేరుమీద నడిచేవై ఉంటాయి.

అయినా, అలాంటి స్కూళ్ళు, ప్రభుత్వ నియమాల ప్రకారం, పసుపురంగు వేసిన స్కూలు వ్యానులని నిర్వహించక తప్పదు. అయితే ఈ సంవత్సరం... ‘పాతబస్సులు, పాతవ్యానులూ నిర్వహిస్తున్నారనీ, దాంతో ప్రమాదాలకు గురై చిన్నారి విద్యార్ధులు మృత్యవాత పడుతున్నారనీ’... ప్రభుత్వం పాత వ్యానుల స్థానే కొత్త బస్సులు/వ్యానులు ప్రవేశపెట్టటం తప్పనిసరని, పాఠశాలల యాజమాన్యాలకి ఆదేశాలు జారీ చేసింది.

అసలుకే ఆయా చిన్నపాఠశాలలు కార్పోరేట్ పోటీకి తట్టుకోలేక, ఏదో కుంటుతూ నడుస్తున్నాయి. ఇక్కడ నేను, స్కూళ్ళు డొక్కు వ్యానులే మెయిన్‌టెయిన్ చేయాలని, విద్యార్ధుల ప్రాణాలు గాలికోదలాలనీ చెప్పటం లేదు. ఆ మాటకొస్తే.... కార్పోరేట్ స్కూళ్ళు వ్యానులు/బస్సులు ప్రమాదాలకి గురైన సంఘటనలు తక్కువేం కాదు.

ఇంకో విషయం ఏమిటంటే - ఇలాంటి చిన్నపట్టణాలలో ట్రాఫిక్ పెద్దగా ఉండదు, ప్రమాదాలు పెద్దగా జరగవు. [ప్రభుత్వం చూపించే ఇంత నిబద్దత... పల్లెల్లో, చిన్న పట్టణాల్లో ట్రాన్స్‌కో నిర్లక్ష్యం వలన కరెంటు షాకులతో ఇంతకంటే ఎక్కువ మంది మరణించినా, మచ్చుకి కూడా కనబడదు. కనీసం ఆ ప్రమాదాలకి విద్యుత్ సంస్థ ఉద్యోగిని కూడా బాధ్యుణ్ణి చేయరు. అదీ ప్రభుత్వానికి ప్రజల మీద ఉన్న శ్రద్ధ!]

అయితే వ్యానుల నిర్వహణ, కండీషన్‌లతో నిమిత్తం లేకుండా, స్కూళ్ళ ఆర్దిక స్థితిగతులు గురించి concern లేకుండా, ఒక్క ఉదుటున జారీ చేయబడిన ఆదేశాల గురించి చెబుతున్నాను.

సాధారణంగా ఇలాంటి చిన్న బడుల్లో చేరే విద్యార్ధుల ఆర్ధిక స్థితిగతులు అంతగొప్పగా ఉండవు. దిగువ మధ్య తరగతి పిల్లలుంటారు. ఫీజులు అరగొరగా కడుతుంటారు. యాజమాన్యాలు ఏదో నడిపేస్తుంటాయి. యాజమాన్యాలు కూడా ‘ఎక్కడో పెద్ద స్కూళ్ళల్లో టీచర్‌గా చేరితే వచ్చే జీతం కంటే స్వంతంగా తమ స్కూలుకు కష్టపడితే అంత కంటే ఎక్కువ వస్తుంది అనీ, స్వతంత్రంగా జీవంచవచ్చనీ’ నడుపుతుంటారు.

అలాంటి చోట... ముందస్తు ఏర్పాట్లకు అవకాశం లేకుండా, ఒక్కసారిగా వచ్చిపడ్డ ఆదేశాలతో, ఈ చిన్న స్కూళ్ళు కుందేలయ్యాయి. ఇలాంటి ఒడిదుడుగులు తట్టుకోలేక, ఇలాంటి చిన్న స్కూళ్ళు మూతబడితే, కార్పోరేట్ స్కూళ్ళ ఆక్రమణ పెరిగిపోతుంది.

అలాగ్గాక చిన్న స్కూళ్ళు... చచ్చీచెడి, తల తాకట్టు పెట్టి కొత్త వ్యాన్లు/బస్సులు కొంటే, కార్పోరెట్ వాహన ఉత్పత్తిదారులకి లాభం! అయితే అటు కార్పోరెట్ స్కూళ్ళకు, లేకపోతే ఇటు కార్పోరేట్ వాహన కంపెనీలకు ప్రయోజనం సమకూరుతుంది. ఇలా రెండు వైపులా పదునైన కత్తితో... ప్రభుత్వం యధాశక్తి, కార్పోరేట్ సంస్థలకి ఉపయోగపడుతుంది.

ఈ విధంగా బడా సంస్థలకి భారీగా దోచిపెడితే, వాటి నుండి తమకి భారీగా నిధులందుతాయి. ఇదే ప్రస్తుతం ప్రభుత్వాధినేతల పనితీరు. రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా!

ఇలాంటివే అన్ని ఉత్పత్తుల విషయంలోనూ అటు ఇటూగా ఉంటాయి. దేశీయ చిన్న కంపెనీల విషయంలో ఇంత సవతి ప్రేమ చూపించే ప్రభుత్వాలు (సవతి ప్రేమ అని ఎందుకన్నానంటే - మాటల్లో ప్రోత్సాహం, వాస్తవంలో దుంపనాశన విధానం ఉంటాయి గనక.), అదే షేర్ మార్కెట్ దిగ్గజాలైన కార్పోరేట్ కంపెనీల విషయంలో అయితే... నిత్యసేవకు ఎంతగా సదా సర్వసంసిద్దంగా ఉంటాయో, ఇప్పుడు ఆర్దిక మాంద్యం నేపధ్యంలో... కొన్ని సంవత్సరాలుగా మనమంతా చూస్తూనే ఉన్నాం.

నిజానికి ఇది మన కళ్ళెదుటే ఉన్నా, అర్ధం చేసుకోవటానికి చాలా సంక్లిష్టంగా కనిపించే మార్కెట్ మాయాజాలం!

ఎప్పుడో హర్షద్ మెహతాలో, కేతన్ పరేఖ్‌లో, సత్యం రామలింగ రాజులో... షాకిచ్చినప్పుడు... ఒక్కసారిగా ఉలిక్కిపడతాం, అర్ధం చేసుకునేందుకు హైరానా పడతాం. అప్పుడే మీడియా కూడా నానా గల్లంతూ చేస్తుంది. తర్వాత మెల్లిగా చల్లారుస్తుంది. ఆనక అన్నీ మామూలే!

నిజానికి పైకి నారికేళ పాకంలాగానో, పరమ పాషాణ పాకంలాగానో కనిపించే, షేర్ మార్కెట్ మాయా జాలంలో, మీడియా+కార్పోరేట్ సంస్థలు+మీడియా కీర్తించిన ఆర్దిక సిద్ధాంతకర్తలు కలగలిసి... కృత్రిమంగా సృష్టించిన వింత పదాలు, వాటి గందరగోళ నిర్వచనాలు, అంతూదరీ దొరకని అంతరార్ధాలని పట్టించుకోకుండా... సత్యాన్వేషణ చేస్తే... అదేమీ అంత అంతుబట్టని జడపదార్ధమేమీ కాదు!

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.

మనం ఏ విశాఖ పట్టణంకో లేదా మచిలీ పట్నంకో వెళ్ళి, సముద్ర తీరానికి వెళ్ళాలనుకున్నామనుకొండి. సందుగొందుల్లో తిరుగుతున్నాం. ఒకోసారి డెడ్‌ఎండ్ అయిపోతున్న వీధుల్లో, దారిలేక వెనక్కి తిరగాల్సివస్తుంది. మెలికలు తిరిగి.... ఉత్తరానికో, దక్షిణానికో వెళ్ళాల్సి వస్తుంది. ఏ రోడ్డు పట్టుకు వెళ్ళాలో కొత్తవాళ్ళకి అర్ధం కాదు.

అయితే సముద్రం తూర్పు దిక్కున ఉంది. ఎటు మెలికలు తిరిగినా... ‘ప్రధానంగా తూర్పు వైపునే ప్రయాణించాలన్న’ దానిమీద దృష్టిపెడితే, అంతిమంగా సముద్ర తీరాన్ని చేరతాం కదా! ఇదీ అలాంటిదే!

ఇక ఈ షేర్ మార్కెట్ మాయాజాలం ఎంతగా మెలికలు తిరిగిన సందుగొందుల ప్రయాణమో గమనించాలంటే, ఇటీవల బ్రిటన్‌లో జరిగిన దిగువ ఉదంతాన్ని పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu