ముందుగా చిన్న వివరణతో నా విశ్లేషణని ప్రారంభిస్తున్నాను.

వివరణ - ఈ టపాల మాలికలో నేను కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టాన దేవత సోనియాని విమర్శించానంటే అర్ధం - చంద్రబాబుని గానీ, వై.ఎస్. జగన్ ని గానీ సమర్దించానని కాదని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే - ‘ఏ రాయ అయినా ఒకటే పళ్ళుడగొట్టటానికి’ అని పెద్దలన్నట్లు, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా... ఒకటే! చేసేది స్వార్ద రాజకీయాలూ, ప్రజా దోపిడినే! - కాబట్టి! ఇక ఈ విశ్లేషణలలో జగన్ ఓదార్పు యాత్ర, బాబు బాబ్లీ యాత్ర నెపాన జరుగుతున్న వ్యవహారాలలో లోతట్టున జరుగుతున్న ‘అంశం’ లోని విభిన్న కోణాలని ఎత్తి చూపటమే నా ఉద్దేశం.

విశ్లేషణ:-

చంద్రబాబు బాబ్లీ యాత్రలో ఎన్నో కీలక ఘటనలూ, అసాధారణాలూ ఉన్నాయి. తెలంగాణాలో ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే కానివ్వండి, రాజకీయంగా ప్రయోజనం పొందాలను కునే కానివ్వండి, చంద్రబాబు, అనుచర బృందాన్ని వెంట బెట్టుకుని బాబ్లీ చూడబోయాడు. సరిహద్దుల్లోనే వాళ్ళని ‘రిసీవ్’ చేసుకున్న మరాఠా పోలీసులు ‘బాబ్లీ చూపెడతాం రండి!’ అంటూ తీసికెళ్ళి, ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గోనెపట్టాలేసి [ఈనాడు ఇలాగే వ్రాసింది మరి. ఫోటోలో చూస్తే పండగలూ, పేరంటాలలో పరిచే ఎర్రటి జంఖానా (తివాచీ లాంటిది) లా ఉంది.] ఆనక తీరిగ్గా ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అన్నారట.

ఆపైన కరెంటు ఇచ్చీ, తీసారట. దోమలు కుట్టి, నీళ్ళు నిప్పులూ లేకుండా, అమర్యాదకర వ్యవహారసరళితో పోలీసులు చంద్రబాబు బృందానికి చుక్కలు చూపారట! అయిదో రోజుకి అది పరాకాష్టకి చేరి లాఠీలతో చితక్కొట్టటం, కుళ్ళ బొడవటం, ఈడ్చుకెళ్ళటం, బూతులు తిట్టటం గట్రాలుగా పరిణమించాయి.

అసలు వద్దంటున్నా ‘ఎందుకు వెళ్ళినట్లు?’ అని హుంకరించే వారు కొందరు, ‘వెళ్ళకుండా ఉండాల్సింది కదా!’ అని ఊరడిస్తున్న వారు మరి కొందరు.

అసలెందుకు వెళ్ళవద్దన్నట్లు? బాబ్లీని వెళ్ళి చూస్తేనే ఏమవుతుంది? మరాఠా ప్రజలు భావోద్రేకాలకి గురవుతున్నారట. ఎందుకు? బాబ్లీ పరిరక్షణ సమితుల వెనక ఉన్నది అక్కడి రాజకీయ నాయకులే! ఇక్కడ తెలంగాణా, సీమాంధ్రా జేఏసీల కన్వీనర్లు ఎంతో, అక్కడి సమితుల కన్వీనర్లూ అంతే!

ఇవాళా రేపూ ఏ ఉద్యమాలైనా ప్రజల్లోంచి రావటం లేదు. డబ్బు ఖర్చుపెట్టి ఆయా నాయకులే జనాల్ని సమీకరించుకోవాల్సి వస్తోంది, మీడియా కవరేజిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. లేదా స్వంత మీడియా సంస్థలతో డప్పు వేసుకోవాల్సి వస్తోంది.

అలాంటి చోట.... బాబ్లీ పరిరక్షణ సమితులైనా ఇందుకు మినహాయింపేమీ కాదు. అలాగ్గాక, నిజంగా ప్రజలకే గనుక... తమ ప్రాంతం, రాష్ట్రం, దేశం పట్టినట్లయితే.... ఏ ప్రాంతంలోలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఈ రాజకీయ నాయకుల డ్రామాలు, ఆడుతున్న దోపిడి ఆటలు... సాగుతాయా?

ఈ నేపధ్యంలో పరిశీలించినా, బాబు బాబ్లీ సందర్శనని, ప్రమాదమని భావించి, శ్రమ తీసుకొని, పనీ పాటా వదిలేసుకు వచ్చి మరాఠాలు నిరోధించేది ఎంత? వెనుకనున్న ‘డ్రైవింగ్ ఫోర్సు’ ముందుకు నెట్టగా వచ్చి నిరోధించేది ఎంత? [ఇదే స్థితి నిన్నటి సాలూరు రగడది కూడా!]

సరే! మరాఠా ప్రజలే, స్వచ్ఛందంగా, బాబు బాబ్లీ యాత్రని వ్యతిరేకిస్తున్నారను కుందాం. అలాంటప్పుడు మన రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపి అదే సామరస్యంగా చెప్పవచ్చు. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిరాహార దీక్షే చేసేవాడో, లేదా ఇంటికెళ్ళి నిమ్మకాయ పులిహోరే తినేవాడో! మరాఠా ప్రభుత్వానికైతే మచ్చ అంటుకునేది కాదు కదా!

ధర్మాబాద్ ఐటిఐ లోనూ సామరస్యంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, మొత్తం మీడియాను ఆహ్వానించి, ప్రజల ఆగ్రహావేశాలను లైవ్ చూపించి, చంద్రబాబు నాయుడికి, అతని బృందానికి ఓపిగ్గా చెప్పవచ్చు. [ఇంత రచ్చకు బదులుగా అంత ఓపికా సహేతుకమే! అప్పటికి వినకపోతే బాబే expose అయ్యి ఉండేవాడు.] 9 ఏళ్ళు ప్రక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి, ఎంఎల్ ఏ లకీ, ఎంపీలకీ ప్రజాగ్రహన్ని, ప్రజల భావోద్రేకాలని పట్టించుకోవలసిన అవసరం గురించి మరింత ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

చెప్పినా బాబు వినలేదు అంటారు కొందరు. సరే! అదే నిజమైనా... అసలు ‘మహా కిరాతకం’ స్థాయిలో ‘మహా సామరస్యం’ నడిచిన దాఖలాలు కూడా లేవు కదా? మొదలే వాళ్ల న్యాయమూర్తి బెయిల్ తీసుకుని వెళ్ళండంటూ చెప్పటమే జరిగింది.

బాబు బాబ్లీ యాత్ర నేపధ్యంలో [22 జూలై, 2010], కొన్ని పత్రికలలో ప్రచురింపబడిన వార్తల్లో....

ఈ వార్త 22 జూలై, 2010 సాక్షి దినపత్రిక 9 వ పేజీలోనిది.

>>>మహారాష్ట్ర తీరుపై చంద్రబాబు ఆవేదన

మన పోలీసులు కాల్పులు జరిపితే... ఆ నెపంతో అందర్నీ ఫినిష్ చేసేవాళ్ళు.
ప్రాజెక్టు చూపిస్తామని మాయమాటలతో తీసుకెళ్ళి, తప్పుడు కేసులు పెట్టారు.
65 మందిని ఒకే గదిలో బంధించారు... నరక యాతన అనుభవించాం.
సరైన తిండి లేదు. నీళ్ళు లేవు, కటిక నేలపై దోమలతో సావాసం చేశాం.
ఆ రాత్రి నాలుగు వేల మంది పోలీసులు ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డారు.
పిడిగుద్దులు గుద్దారు.... లాఠీలతో, గన్నులతో కొట్టారు... బూట్లతో తన్నారు.
మహిళా ఎమ్యేల్యేలను సైతం ఈడ్చుకుంటూ వెళ్ళి బస్సులో పడేశారు.
సోనియా చెప్పిన తర్వాతే చవాన్ మాపై ఎక్కువ ప్రతాపం చూపారు.
స్పీకర్ కూడా స్పందించలేదు. ఉద్యోగాలు ఊడతాయనే అందరి భయం.
ఆసెంబ్లీ ఆవరణలో టీడీపీ నాయకుల ధర్నాలో చంద్రబాబు స్పష్టీకరణ.
~~~~~~

ఈ వార్త 22 జూలై, 2010 ఈనాడు దినపత్రిక 13 వ పేజీలోనిది.


~~~~~~
దీనికి ముందు రోజు అంటే 21జూలై, 2010న
>>>‘మరాఠా గాయం’... అంటూ సాక్షి పత్రిక, క్లుప్తంగా విషయం వివరించి.... ‘అతి స్పందన, అనాలోచన’ అంటూ సంపాదకీయం, ఒక పేజీ కేటాయించి వార్తలూ వ్రాసింది. చంద్రబాబు తమకి ప్రత్యర్ది వర్గం కాబట్టి, ‘వార్తల్ని వ్రాసాం’ అన్నట్లుగా వ్రాసింది. అది రాజకీయం!

‘సహ పడవ ప్రయాణీకులం’ అనే ముసుగు వేసుకుంటున్నాడేమో చంద్రబాబు! మామకే వెన్నుపోటు పొడిచిన మోసగాడితడు! ఎన్ని నటనలైనా చేస్తాడు, ఎన్ని నాటకాలైన వేస్తాడు. అదే జాగ్రత్త జగన్ ది! ఇది గూఢచర్యం!

దీని గురించిన స్పష్టత, మరికొన్ని వివరణల తర్వాత, ఈ టపాల మాలికలోనే వ్రాస్తాను.

>>>కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టారు :- 21 జూలై, 2010 ఈనాడు పత్రిక :

‘మహా కిరాతకం’
‘అశోక్ సర్కారు అమానుషం’ సంపాదకీయం.
‘అక్రమాలే పునాది బాబ్లీ’ అంటూ బాబ్లీపై పూర్తి కవరేజితో మూడవ పేజీ.
‘నరకం చూపించారు’ గట్రా వార్తలతో....
ఒక్క సంపాదకీయంలో తప్పితే.... ఏ వార్తల్లోనైనా, చంద్రబాబు పడిన అగచాట్లనీ, ఆపైన మహారాష్ట్ర, [కేంద్ర] కాంగ్రెస్ ల జులుంని గురించి వ్రాసారు. పైకి చూడటానికి... ‘కాంగ్రెస్ వ్యతిరేకి, తెదేపా అనుకూల పత్రిక ఇలాగ్గాక ఇంకెలా వ్రాస్తుంది?’ అన్పిస్తుంది.

అయితే... మొత్తం ఈనాడు చదివి తలపైకెత్తే సామాన్య పాఠకుడి బుర్రలోకి మాత్రం, ‘కాంగ్రెస్ బలం’ బలంగా చొచ్చుకెళ్తుంది. అదే విశేషం ఇక్కడ!

కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తే, మాజీ ముఖ్యమంత్రికైనా, ప్రస్తుత ప్రజాప్రతినిధుల కైనా ఏ గతి పట్టిందో చూడమన్న ‘మానసిక యుద్ద తంత్రమే’ ఉందిక్కడ! అసెంబ్లీ స్పీకర్ గానీ, [పార్లమెంట్] లోకసభ స్పీకర్ గానీ, రాజ్యసభ స్పీకర్ గానీ ఎవరూ దాని మీద చర్యలు తీసుకోలేదు.

సాధారణ నేరగాళ్ళకు, కేడీ గాళ్లకు పోలీసులు చూపించే ధర్డ్ డిగ్రీ!
చట్టప్రకారం అయితే, ఎవరి పట్లా చూపకూడని ధర్డ్ డిగ్రీ!
పోలీసులు సైతం ఠాణాలో మాత్రమే చూపించి, పబ్లిక్ లో బుకాయించే ధర్డ్ డిగ్రీ!
వందల మంది మనుష్యుల్ని బాహాటంగా చంపిన పాక్ తీవ్రవాది కసబ్ పైన కూడా ఇంతగా చూపించని ధర్డ్ డిగ్రీ!

ఇది ఎంతగా మానసికంగా ‘బ్రేక్’ చేసే తంత్రమంటే - ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టాల్సిందిగా [ఈనాడు సంపాదకీయంలో] వత్తిడి చేసారట. ఎందుకోసమైనా సరే, [బెయిల్ అభ్యర్దన కోసమని కొందరు ప్రత్యేక వ్యక్తులు వాదిస్తుంటారు.] ఖాళీ బాండుపేపర్ల మీద సంతకాలు తీసుకుంటారా? అది చట్ట విరుద్దం కాదా?

అసలుకే రామోజీరావు తరుపున గూఢచర్యం కోసం, పెట్టుబడుల ఆహ్వానం పేరిట, ప్రపంచం అంచుల దాకా పరుగులెత్తి వచ్చిన వాడైన చంద్రబాబుని ఇలాంటి ‘కిరికిరీ’లు ఎంతగా భయభ్రాంతుణ్ణి చేస్తాయో, చంద్రబాబుకి మాత్రమే బాగా అర్ధమౌతుంది.

నిజానికి బాబ్లీ యాత్ర నేపధ్యంలో... చంద్రబాబు, మరాఠా కాంగ్రెస్, కేంద్ర కాంగ్రెస్, శివసేన లది రాజకీయమే.

అయితే, ఆ సంఘటనలు... ఇలాగ్గాక, ఇంకెలాగనైనా జరిగే అవకాశం ఉంది. అది సామరస్య చర్చలు కావచ్చు. ఆంధ్రా సరిహద్దు దాటనివ్వకుండా బాబు బృందాన్ని పోలీసులు అడ్డుకోవటం కావచ్చు. ‘బాబ్లీ చూపిస్తాం రమ్మని’ వాహనాల్లో ఎక్కించుకు పోయినా, ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గాక, ఎకా ఎకి ఏ కారాగారానికైనా తీసుకు పోవచ్చు. మరాఠా ప్రజా నాయకుల, ప్రజల... ధర్నాలకు, ఉద్రిక్తతతో కూడిన దాడులకు, ఐటీఐ ప్రాంగణం ఉన్నంత అందుబాటులో, జైలు గోడలూ ప్రాంగణమూ అందుబాటులో ఉండవు కదా?

ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు మీద ఎంతగా గురిపెట్టబడిందో చూడండి.

‘కుళ్ళ బొడిచి వెళ్ళగొట్టారు’ అంటూ 21 జూలై, 2010 ఈనాడు కవర్ చేసిన వార్తాంశంలో ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి.

>>> ‘అసలు మీ డిమాండ్లు ఏమిటి?’ అంటూ కొద్ది నిముషాల పాటు కొందరు కీలక నేతలను విమానాశ్రయంలోని ఓ గదిలో కూర్చొబెట్టి చర్చలు జరిపారు. చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి, మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారనే బెంగతో.... తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్ళాలని, లేకపోతే వెళ్ళే ప్రసక్తిలేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబును ఒక విమానంలో, మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయానశాఖ అధికారులను, పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో కూర్చొబెట్టించారు. అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనానికి తీసుకెళ్ళాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా పోలీసులు స్పందించలేదు. విమానం ఎక్కే సమయంలో కూడా నేతలు, పోలీసులు ఎవరి పంతాన్ని వారు కొనసాగించడంతో... కొద్ది సేపు పోలీసులు, నేతలకు మధ్య విమానంలోనే పెనుగులాట జరిగింది. ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేక్ ఆఫ్ కోసం అధికారులను ఆదేశించారు. చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండి పోయారు. రాత్రి 9 గంటల సమయంలో విమానం హైదరాబాద్ కు బయలు దేరింది.
~~~~~
ఇదీ వార్త!

అందరినీ కలిపి ఒకే విమానంలో గాకుండా చంద్రబాబు ఒక్కడినే ఎందుకు మరో విమానంలోకి ఎక్కించినట్లు?

[ఈ రోజు అంటే 24 జూలై, 2010 "విమాన ఖర్చులు తమ ప్రభుత్వమే భరించగలదని మన రాష్ట్రప్రభుత్వం మరాఠా ప్రభుత్వానికి హామీ ఇచ్చాకే, తెదేపా నేతలను జౌరంగా బాద్ నుండి హైదరాబాద్ కు విమానంలో తరలించారని వార్తలొచ్చాయి. అంటే చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన వారికి మరో విమానం ఏర్పాటు చేయమని రోశయ్య చెప్పాడా? చెబుతాడా? దీన్ని బట్టి తెలియటం లేదా ఈ వెనుక ఉన్నది అధిష్టానమేనని? ]

అప్పటికే ఔరంగాబాద్ లో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దారిలోనూ బాబు బృందం ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్ళు రువ్వబడ్డాయి.

"మన పోలీసులు [తమ గన్ మెన్స్] కాల్పులు జరిపితే... ఆ నెపంతో మమ్మల్ని అక్కడే ఫినిష్ చేసే వాళ్ళు."

"అడిగే వాళ్ళెవ్వరూ లేరని మమ్మల్ని అక్కడే చంపేయాలనుకున్నారు" అన్నాడు చంద్రబాబు.

అంతగా అతడికి ప్రాణ భయం పెట్టబడింది.

‘వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు’ అని ఎటూ నాందేడ్ ఎంపీ అంటూనే ఉన్నాడు. ఎటూ ‘వాళ్ళు అవునంటారు, మనం కాదంటాం, అంతే’ అనుకోవటం రాజకీయ నాయకులందరికీ [పార్టీలకతీతంగా] అలవాటే.

కాబట్టి "వాళ్ళ గన్ మెన్ ముందుగా కాల్పులు జరపటంతో, ఆత్మరక్షణ కై మేమూ కాల్పులు జరిపాం. అందులో చంద్రబాబుకి తూటా తగిలి మరణించాడు!?" అని... మరాఠా పోలీసుల్ని ‘పైబాసులు’ చెప్పమంటే చెబుతారు. తాను పైబాసుగా ఉన్నప్పుడు చెప్పమంటే, తన క్రింది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు గతంలో ఇలాంటివి ఎన్ని చెప్పలేదు?

విమానాశ్రయంలో నైనా... "మరాఠా ప్రజలు, శివసేన కార్యకర్తలూ, భావోద్రేకాలతో బాబు బృందాన్ని చుట్టిముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపుని చెదర గొట్టటానికి కాల్పులు జరిపాం. పొరబాటున తూటా తగిలి చంద్రబాబు ఫినిష్ అయిపోయాడు." అన్నా మాత్రం దిక్కేముంది? పాకిస్తాన్ లో మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో కేసు ఏమయ్యింది? భారత్ లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యకేసు లేమయ్యాయి?

తాను పైలోక ప్రయాణం చేసాక, ఎన్ని ధర్నాలు, ఎన్ని గగ్గోళ్ళు నడిస్తే మాత్రం ఏముంది?

"మరోసారి చంద్రబాబు వస్తాడను కోను" అన్నాడు మరాఠా హోంమంత్రి పాటిల్.

"బాబ్లీని చూడటానికి చంద్రబాబు ఒక్కరే రావచ్చని" సూచన చేసాడు నాందేడ్ ఎంపి. అంటే - "జరిగింది చాలా? ఇప్పటికైనా వెనక్కి తగ్గు" అని అంటూ "ఇంకా ముందుకే వెళతావా? ఒంటరిగా రా! అప్పుడు చూద్దువు గానీ!" అని.

ఈ సంకేత భాష ఎందుకంటారా?

యాత్ర పేరిట జగన్ అయినా, చంద్రబాబు అయినా.... ‘[తమకు వ్యతిరేకమైన పని] చేస్తాను’ అంటున్నారు. ‘వద్దు’ అంటున్నది కాంగ్రెస్ అధిష్టానం, నకిలీ కణిక వ్యవస్థ! అదే ఇక్కడ కీలకాంశం.

వివరంగా చెప్పాలంటే... ఇంకొన్ని కీలక ఘటనలు వివరించాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

' మహా కిరాతకమా' గాడిద గుడ్డా ఇదంతా రామోజీ పన్నిన మహా పన్నాగం . అసలు 2009లో రాష్ట్రంలో చంద్రబాబును, కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టాలని రామోజీ మందస్తు వ్యూహం. కానీ దానికి రాజశేఖరెడ్డి ఒప్పుకోలేదు .మొండివాడు కదా. ఇది నచ్చని సోనియా ,రామోజీ రాజశేఖరుడికి మంగళం పాడారు. రాజశేఖరుడికి నకిలీ కణికుడు 5 ఏళ్ళు మత్రమే భరోసా ఇచ్చాడు . కానీ మహానేత దానిని కాదని మొండిగా వాదించాడు. తన మాటే నెగ్గించుకునే రామోజీ సెప్టెంబర్ 2 ముహుర్థం పెట్టాడు. అదంతా పాత కథ . ఇప్పుడు జరగబోయే కథ ఏంటంటే 2009లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని రామోజీ వ్యూహం . మాహానేత మొండి పట్టుదల వలన అది కుదరలేదు. ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నాయి ( చంద్రబాబును అధికారంలోకి తేవడానికి 2004లో చంద్రబాబు ఎదుర్కొన్న ఆటంకాలన్నీంటినీ ఇప్పుడు రామోజీనే తొలగిస్తున్నాడు ). ఇప్పటికిప్పుడూ చంద్రబాబుని అధికారంలోకి తేవడానికి ప్రస్తుతమున్న ప్రభుత్వానికి (రోసయ్య ప్రభుత్వం ) DisadvantAges ని సృష్టిస్తున్నాడు . పెరిగిన ధరలు, అవినీతి, రోశయ్య చేతగానితనం , బాబ్లీ ఇవన్నీ అందులో భాగమే. రామోజీ ఏ ప్రభుత్వాన్నైనా పడగొట్టాలంటే అందుకు ముందునుండీ Disadvantages సృష్టిస్తాడు .అలాగే ఏ ప్రభుత్వాన్నైనా అధికారంలోకి తేవాలంటే అందుకు ముందునుంచీ Advantages create చేస్తాడు .2004 ఎన్నికలకు ముందు చంద్రబాబుకి create విద్యుత్ ధరలు , ఉద్యోగ సంఘాల అయిష్టత , ఉద్యోగ నియామకాలు లేకపోవడం లాంటివన్నీ చంద్రబాబుకి Disadvantages. అలాగే పాదయాత్ర , వ్యవసాయానికి ప్రాధాన్యత లాంటివన్నీ రాజశెఖర్ రెడ్డికి AdvantAges . అలాగే ఇప్పుడు కూడా రోశయ్యకి Disadvantages, చంద్రబాబుకి Advantages create చేస్తున్నాడు . జగన్ ఓదార్పు యాత్ర కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం రాష్త్రంలో కాంగ్రెస్ కాస్త బలంగానే ఉంది . రాబోయే అసెబ్లీ మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ బలం తగ్గాలంటే ఆ పార్టీ రాష్ట్రంలో చీలిపోవాలి. అందుకే జగన్ కాంగ్రెస్ బలం తగ్గించడానికి ' ప్రతేక పార్టీ'. అప్పుడు తే.దే.పా గెలుపు సులువు అవుతుంది . ఇదంతా అర్ధం కావాలంటే దశాబ్ధాలేమీ పట్టదు. Just 7 నెలలు ఓపిక పడితే రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమౌతుంది. 2010 లో జగన్ కొత్త పార్టీ , 2011 ప్రధమార్ధంలో ఆంధ్రరాష్ట్ర అసెబ్లీకి మధ్యంతర ఎన్నికలు, ఆపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం. ఇవీ జరగబోయే విచిత్రాలు .

Tokkalo analysis in the above comment.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu