ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ, 1977 లో నిర్వహించిన ’ఆంధ్రప్రదేశ్ దర్శన్’ వైజ్ఞానిక పర్యటనా కార్యక్రమంలో పాల్గొనేందుకు, గుంటూరు నుండి నేను ఎంపిక చేయబడ్డాను. అప్పటికి స్టాల్ గాళ్స్ హైస్కూలులో చదువుతుండేదాన్ని. దాదాపు నెలన్నర పాటూ, అప్పటికి మన రాష్ట్రంలో పేరెన్నిక గన్న అన్ని ప్రదేశాలనీ చూశాను.

ఆ పర్యటనలో భాగంగా, నెల్లూరు జిల్లాలో వాకాడు విద్యానగర్ ని సందర్శించాము. నాకు గుర్తుండి అక్కడ రాత్రి బస ఏర్పాటు చేయబడింది. విశాలమైన ఆవరణలో ఉన్న విద్యాసంస్థలు. అప్పటికే ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉందని చెప్పారు. మేము స్కూలు ప్రాంగణాన్ని చూశాము. ముందుగానే మాకు ఆ విద్యాసంస్థల గురించిన బ్రోచర్స్ ఇచ్చారు.

దాన్లో చదివి - అక్కడున్న విద్యార్ధులలో అందరూ పేద విద్యార్ధులేనని, అందులోనూ ఎక్కువమంది అనాధలనీ కూడా తెలుసుకున్నాను. ఆ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారి గురించి చదివినప్పుడు నాకెంతో ఆశ్చర్యంగా, స్ఫూర్తిదాయకంగా అన్పించింది.

ఆ బ్రోచర్స్ లో... తోటలో కూరగాయలు పెంచడం, మెస్ లో వంటకు సహాయం చేయటం వంటి పనులను కూడా నిర్వహించే విద్యార్ధులు, చదువుతో పాటూ, వృత్తి విద్యనీ, శ్రమించే తత్త్వాన్నీ నేర్వడం గురించి వ్రాయబడింది. మరునాడు దాన్ని మేం కళ్ళారా చూశాం కూడా! అలాగే బాలకృష్ణారెడ్డి గారు ఆ విద్యాసంస్థలని స్థాపించిన నేపధ్యం గురించీ, సంస్థల తొలినాళ్ళ గురించీ కూడా వ్రాసారు.

ఆయన చిన్నప్పుడు చదువుకోలేదు. పేదకుటుంబం నుండి వచ్చి, చదువుకోలేక పోయిన తాను బడికి వెళ్ళే పిల్లల వైపు మెరిసే కళ్ళతో చూసేవాడట. తాను పెద్దై, స్వంత కాళ్ళ మీద నిలబడినా అంతంత మాత్రపు ఆర్ధిక స్థాయే! అప్పుడే.... "చదువుకోవాలనుందండి!" అంటున్న ఆరుగురు విద్యార్ధులు ఆయనకు తారసిల్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఉచితమే! కానీ భోజనం? తిండి పెట్టి చదివించగల స్థోమత లేని ఆ పిల్లల తల్లిదండ్రులూ, కూలికెళ్ళి చేతనైన పని చేసి పొట్టపోసుకోక తప్పదనే స్థితిలో ఉన్నారు.

చిన్నప్పుడు తాను చదువుకోలేక విలవిల్లాడింది గుర్తుకొచ్చింది. అప్పుడే బాలకృష్ణారెడ్డి గారు ఆ పిల్లల్ని చదివించాలని నిర్ణయించుకున్నాడట. వాళ్ళ కోసం ఓ వసతి! మెల్లిగా ఓ హోం తయారయ్యింది. తన ఒక్కడి కష్టం అందరు పిల్లల్ని పోషించలేదు.

ఊళ్ళో అందరి సాయమూ అడిగాడు. కొందరు చేశారు. కొందరు ’నీకెందుకీ గోల పొమ్మన్నారు!’ అయినా బాలకృష్ణారెడ్డి గారు పట్టు వీడలేదు. ఇంటింటికీ తిరిగి ఓ చిన్న మట్టి కుండ [చట్టి] ఇచ్చాడట. "అమ్మా! ప్రతీరోజూ మీరు బియ్యం చేటలోకి తీసుకునే టప్పుడు, మీకు మరో బిడ్డ ఉన్నాడనుకొని, వాడి కడుపు నింపేటన్ని గాకపోయినా ఓ గుప్పెడు బియ్యం ఈ కుండలో వెయ్యండి. మూడు పొద్దులు మూడు గుప్పెళ్ళు వేసినా, అది ఒక్కడికి ఓ పూట కడుపు నింపుతుంది" అని అర్దించాడు.

ఎందరో తల్లులు సహకరించారు. వారానికోసారి, ఆ కుండలలో బియ్యాన్ని సేకరించే వారట. అలాగయ్యీ తొలినాళ్ళల్లో పిల్లలు ఓ పూట గంజితాగి పడుకున్న రోజులున్నాయట. ధనికుల ఇళ్ళకు వెళ్ళి ప్రాధేయపడి విరాళాలు సేకరించేవాడట. ఓ సారి ఓ ధనికుడు ఈ రోజూ రేపూ అంటూ తిప్పించాడట. అతడి ఇంటి ముందు బైఠాయించిన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డిని, ఆ ధనికుడు బెదిరించినా లేవనందుకు, భౌతిక దాడి చేయించాడట. అయినా ఆయన పట్టు వీడకపోయే సరికి, చివరికి ఆ ధనికుడు విరాళాం ఇచ్చాడట.

అలా.... అలా.... ఆరుగురు పిల్లలతో ప్రారంభమైన విద్యాసంస్థ, అనాధలనీ, పేదలనీ అక్కున చేర్చుకుని, విస్తరించి విద్యానగర్ అయ్యింది.

ఇదంతా బ్రోచర్స్ లో చదివాక, నాకు ఆయనని చూడాలని చాలా కుతుహలం కలిగింది. మరునాడు ఉదయం అల్పాహారం తర్వాత ఆయనతో సమావేశమయ్యాము. తెల్లగా, కొంచెం పొడుగ్గా, అప్పటికే చాలా పెద్దాయన! చూడగానే ఎంతో గౌరవ భావం కలిగింది. ఖద్దరు పంచె, చొక్కా, పైనకండువా! నాకు గుర్తుండి నుదుట నిలువు బొట్టుంది. మార్ధవమైన గొంతుతో ’తన అనుభవాలు, మాకు సందేశంగా’ చిన్న ఉపన్యాసం ఇచ్చారు. బ్రోచర్ లో చదివినదే, ఆయన నోట వింటే, నిలువెత్తున మా ఎదుట నిలబడిన ఆయన వ్యక్తిత్వం నాకు అద్భుతంగా తోచింది. నా తోటివాళ్ళ సంగతి నాకు తెలియదు గానీ నేను మాత్రం ఆయనని చూసీ, ఆ ఉపన్యాసం వినీ కదిలిపోయాను.

ఎంతగా అంటే.... ఆయన ఉపన్యాసం అయిపోగానే, నేను వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసాను. అప్పటికి....పుట్టిన రోజునాడు, పండగలపుడు, అమ్మానాన్నలకి, పూలజడ వేయించుకున్నప్పుడు మామయ్య, బాబాయిలు తాతయ్యలకి తప్ప, ఇతరులకి ఎప్పుడూ పాదాభివందనం చెయ్యలేదు. [మ బడిలో గురుపూజోత్సవం రోజున కూడా మా పంతులమ్మలు మేం దండం పెడుతుండగానే భుజాలు పట్టుకు లేపేసే వాళ్ళు.] అప్పటికే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారికి బహుశః నా భావ సంచలనం అర్ధమైందనుకుంటాను. నన్ను ఆదరంగా లేపి తలమీద చెయ్యి వేసి దీవించారు. కొద్దిసేపు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని నా వివరాలడిగారు.

అక్కడి పరిసరాలన్నీ పరిశీలించాక, మధ్యాహ్నం అక్కడి నుండి వచ్చేసాము. కానీ వాకాడు నా మనస్సులో బాగా గుర్తుండిపోయింది.

తర్వాత ఏడాదికో, రెండేళ్లకో ఆయన పోయారని ఆకాశవాణి వార్తల్లో విన్నాను. ఎంత బాధ వేసిందో! అది 1979 కావచ్చు. అప్పటికి నేను విని ఉన్న దాని ప్రకారం నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారికి సంతానం లేదు.

తర్వాత్తర్వాత, రాజకీయాలలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి పేరు విన్నాను. పత్రికల వార్తలలో చదివాను. 1990 కల్లా అతడు ముఖ్యమంత్రీ అయ్యాడు. వాకాడు విద్యాసంస్థలున్న విద్యానగర్ నుండి, నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు వేసిన పునాదులు మీదుగా, [ఆయన సోదరుడు కుమారుడుగా] రాజకీయ కెరీర్ ప్రారంభించిన నేదురుమల్లి జనార్ధన రెడ్డి, ఎంఎల్ సీ గా కెరీర్ మొదలుపెట్టి, పదేళ్ళు తిరిగేసరికల్లా ముఖ్యమంత్రి అయిపోయాడు.

ఎంత గబగబా రాజకీయ నిచ్చెనలు ఎక్కేసాడో! కాబట్టే చెన్నారెడ్డిని దింపటానికి జరిగిన గల్లంతుల అనంతరం, వై.యస్. సీఎం అవుతాడేమో ననే వదంతులు రాజ్యమేలుతుండగా, అనూహ్యంగా రాత్రికి రాత్రి చక్రం తిరిగి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి సీఎం అయిపోయాడు. అతడు సీఎం అయ్యాక, అతడి మెడలో పడిన తొలి దండ.... రామోజీరావు పంపగా, అతడి ప్రతినిధి, నేదురుమల్లి మెడలో వేసినదే! అంతగా అండ దొరికాక రాజకీయ నిచ్చెనలు దొరకవా మరి!?

నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకి నేదురుమల్లి జనార్ధన రెడ్డి అంతప్రియమైన వాడు కావటంలో, అతడికి ఉన్న మరో లక్షణం కూడా ముఖ్యమైనదే! స్త్రీలోలత్వం! అసలు ’ఆడది, ఆకలే’ వాళ్ళ ప్రధాన స్ట్రాటజీలైన చోట, స్త్రీలోలత్వం కలిగిన జనార్ధన రెడ్డి రాజకీయాల్లో త్వరగా పైకెదగటం సహజమే! నేదురుమల్లి జనార్ధన రెడ్డి స్త్రీ లోలత్వం గురించి ‘పీవీజీ - రామోజీరావు - మా కథ’లోని టపాలలో వివరించాను.

చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే నేదురుమల్లి జనార్ధన రెడ్డిలు, నెహ్రు - గాంధీల పేరు చెప్పుకొని రాజకీయాల్లో చెల్లుబాటు కావాలనుకునే సోనియాలకి నమ్మిన బంట్లు!

ఇటీవల వాకాడు విద్యాసంస్థల యాజమాన్యవివాదాలలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి తమకు అన్యాయం చేసాడని నేదురుమల్లి పద్మనాభ రెడ్డి అనే వ్యక్తి పత్రికలకి ఎక్కాడు. తన చేతుల మీదనే జనార్ధన రెడ్డిని పెంచాననీ చెప్పాడు. ఇప్పుడు ఆ స్థలాల విలువ వందల లేదా వేల కోట్ల రూపాయలు చేస్తాయి. నేదురుమల్లి పద్మనాభ రెడ్డి గురించి నాకు తెలియదు గాని, నేదురుమల్లి జనార్ధన రెడ్డి మాత్రం నిశ్చయంగా అవినీతిపరుడే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

పూర్వపు విద్యానగర్ బావుంది. ఆయనకు జోహార్లు. ఇలాగే రంగినేని మోహన్ రావ్ ఫౌండేషన్ కూడా పనిచేస్తోంది.

నేను పుట్టింది, పెరిగింది, ఇంజనీరింగ్ వరకు చదువుకుంది ఆవాకాడులోనే. టపాశీర్షిక చూడడంతోనే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆమహానుభావుడి వేదనను అర్థం చేసుకునే వాళ్ళు, ఆదారిలో నడవాలన్న తపన ఉండేవాళ్ళు మచ్చుకైనా కనపడని సమాజమ్ ఇది. ఆయన సమాధిపైన చెత్త ఊడ్చేందుకు కూడా నిధులు లేవట హరిజన విధ్యార్థి ఉద్ధ్హారకసంఘం వాళ్ళకి. ఆయన భార్య వైద్యానికి తగినంత డబ్బులేక మరణించింది. ఇదొక్కటి చాలనుకుంటా విషయం అర్థం అవ్వటానికి.

జీవని గారు: రంగినేని మోహన్ రావు పౌండేషన్ గురించి నాకు తెలియదండి. మంచి పని చేసే వారి గురించి తెలిస్తే అదో సంతోషం. మరికొన్ని వివరాలు చెప్పగలరని ఆశిస్తున్నాను. నెనర్లు!

సుబ్రహ్మణ్య చైతన్య గారు : నేను గత టపాలలోనే చెప్పానండి. అలాంటి మహానుభావుల అందరి ఆత్మల శక్తి ఇప్పుడు ఈ కుట్రదారులని చావ చితక బాదుతోంది. ఎందుకంటే సువర్ణముఖి ఉంటుంది కదా! ఆయన భార్య వైద్యానికి తగినంత డబ్బు లేక మరణించటం గురించి నాకు ఇప్పటి వరకూ తెలియదు. బాధగా ఉంది.

నేను వాకాడులో పుట్టలేదు కానీ,విధ్యానగరులో చదివాను. నేదురుమల్లి పద్మానాభ రెడ్డి కాలేజి వార్షికోత్సవాలకి వస్తే అందరూ అతనిని ఏడిపించేవారు.

నాకు బాలకృష్ణారెడ్డి గురించి తెలియదు, కొత్త విషయాలు చెప్పారు.

జనార్ధన్ రెడ్డి ముఠా తగాదాలు బాగా విన్నాను.

శ్రీగారు: అక్కడ చదువుకుని ఆయన గురించి తెలియక పోవటం అంటేనే అప్పటికే పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అర్ధమవుతుందండి. అది విద్యార్ధుల తప్పిదం కంటే యాజమాన్య తప్పిందంగా కన్పిస్తోంది. వ్యవస్థాపకుడి గురించి స్మరణ కూడా చేయలేదన్న మాట. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu