300 సినిమాలో - పారశీక రాజైన జెక్సీస్ దూత, స్పార్టన్ ల దగ్గరికి ఓ చిన్నపాటి రథం మీద వస్తాడు. దాన్ని లాగుతున్న బానిసల్ని "ఇంతేనా మీ వేగం? ఇంకా వేగంగా లాగండి" అంటూ కొరడాతో బాదుతూ స్పార్టన్ల ని సమీపిస్తాడు. ఎంతో అతిశయంగా "రాజులకే రాజు. దేవుళ్ళకే దేవుడు. జగజ్జేతగా అవతరించనున్న రాజాధిరాజు జెక్సీస్ కు రహస్య గూఢచారినన్న గర్వంతో చెబుతున్నాను. స్పార్టన్స్! ఆయుధాలు క్రిందపారేసి మా మహారాజును శరణు కోరండి" అంటూ హుంకరిస్తాడు. ఏదో కొందరిని గెలిచినంత మాత్రాన అపారమైన జెక్సీస్ సేనలని గెలవగలమను కోవద్దంటూ, హితవు చెబుతున్నట్లుగా చెబుతాడు. అపారమైన తమ సేన నీళ్ళు తాగితే జీవనదులు ఎండిపోతాయనీ, నడిస్తే ఆ పద ఘట్టనల క్రింద దేశాలే నామ రుపాల్లేకుండా పోతాయనీ గర్వపడుతూ, అలాంటి తమ సేనని ఆపడానికి స్పార్టన్లు నిర్మించిన అడ్డగోడ ఏ మాత్రమూ నిలవ లేదనీ అంటాడు.

స్పార్టన్ యోధుడు దానికి స్పందిస్తూ ’తమ పూర్వీకులు తమ దేశ స్వాతంత్రం కాపాడటానికి నిర్మించిన ఆ గోడకి, మరింత బలం చేకూర్చటానికి తాము, యుద్దంలో పోరాడ లేక మరణించిన జెక్సీస్ బానిసల శవాలను ఉపయోగిస్తున్నామనీ’ అంటాడు. రెచ్చిపోయి, కారుకూతల కూస్తూ కొరడా ఝుళిపించిన జెక్సీస్ గూఢచారి చేతిని నరికి "మచ్చుకి నీ చేతిని నరికాను. పోయి నీ రాజుకి చెప్పుకో"మంటాడు స్పార్టన్ యోధుడు.

చెయ్యి నరకబడిన నొప్పి, క్రోధాలతో కుప్పకూలిన జెక్సీస్ గూఢచారి "నేను కాదు బానిసని! మీ దేశపు పౌరులు, స్త్రీలూ, పిల్లలూ బానిసలౌతారు. కానీ మీరు కారు. ఎందుకంటే మీరు ఈ రోజు రాత్రిలోగా మరణించబోతున్నారు" అంటాడు. పోరాడలేక కుప్పకూలినప్పుడు కలిగే నిస్సహాయలో నుండి ఉబికి వచ్చే వదరుబోతుతనం అది. ఓడిపోతున్నప్పుడు ఉపయోగించే వాచాలత!

దానికి అంతే దీటుగా.... స్పార్టన్ వీరుడు చిరునవ్వు నవ్వుతూ "అందుకు మేమెన్నడూ సిద్దమే!" అంటాడు. కళ్ళెం జీనులకి లొంగని, అసలా బానిసత్వాన్నే ఎరగని, అడవి గుర్రం.... జూలు విదిల్చినట్లుగా ఉంటుంది అతడి దేహభాష!

స్వేచ్ఛా ప్రియత్వం, స్వాతంత్ర కాంక్ష, స్వాభిమానంలతో వచ్చే శక్తి అది!

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. బానిసత్వానికీ, స్వేచ్ఛాస్వాతంత్రాలకీ ఉన్న వ్యత్యాసం ఎలాంటి దంటే - ఒక కార్పోరేట్ విద్యా సంస్థలో టీచర్ ఉన్నాడనుకొండి. తనకి ఇష్టం ఉన్న లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, అవసరం ఉన్నా డ్యూటీకి వెళ్ళక తప్పదు. కష్టించి పనిచేసే అతడు సోమరి కాడు. కానీ ఏ రోజన్నా, ఏ కారణంగానైనా ఓ రోజు డ్యూటీకి వెళ్ళ బుద్ది గాకపోతే, యాదృచ్చంగా సెలవు తీసుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వంద లెక్కలు వేసుకోవాలి. ఎన్ని సెలవులు పెట్టుకున్నామో, ఎన్ని మిగిలి ఉన్నాయో, సెలవు కారణంగా ఏం చెప్పాలో, ఏ కారణం చెబితే రిస్క్ ఉండదో.... ఇలా!

అదే.... చిన్నదో పెద్దదో స్వంత వ్యాపారం, వ్యవసాయం చేసుకునే వాడు ఇన్నిలెక్కలు వేసుకోనక్కరలేదు. ఉద్యోగి, వ్యాపారి - ఇద్దరూ శ్రమించే వాళ్ళే, బాధ్యతాయుతులే! ఉత్తి పుణ్యానికి పని ఎగ్గొట్టే రకాలు కాదు. అయినా వ్యక్తిగత స్వేచ్చానుసారం ప్రవర్తించాలనుకుంటే ఉద్యోగికి అది కష్టసాధ్యం, స్వంత ఉపాధిదారుకి అది పెద్ద విషయం కాదు.

ఇక స్వంత ఉపాధి దారుకి కూడా పరిస్థితులు మూసుకు పోయి, ఇష్టం లేకున్నా, ఎదుటి వారికి తైరు కొట్టటం దగ్గర నుండీ సవాలక్ష పనులు చేయవలసి రావటం అంటే - మొత్తంగా సమాజమే బానిస వ్యవస్థగా మారిపోయినట్లే! దీన్నే మనం ’హిపోక్రసీ’గా ఇంగ్లీషులో చెప్పుకుంటాం.

ఇదే వెయ్యేళ్ళక్రితం.... భారతదేశపు పల్లెల్లో వ్యవసాయాది కుల వృత్తులన్నీ, ఆయా వ్యక్తులు, తమకి ఇష్టమైన పద్దతుల్లో, తమకి అనువైన వేళల్లో, తమకి తామే బాసులూ తమకి తామే అనుయాయూలూ అయ్యి పనిచేసుకు పొట్టపోసుకుంటే - సమాజం స్వేచ్చా స్వాతంత్రాలతో ఉన్నట్లన్నమాట. అధికారంలో రాజరికం ఉన్నా, ప్రజాస్వామ్యం ఉన్నా, దోపిడిని బట్టే, సమాజంలో బానిసత్వం Vs స్వాతంత్రాల పరిస్థితి ఉంటుంది.

అదే జెక్సీస్ సేనకీ లియోనెడస్ యోధులకీ అద్దంపడుతుంది. జెక్సీస్ సేనలు కొరడా దెబ్బలు తింటూ యుద్దానికి సిద్దపడితే, లియోనైడర్స్ యోధులు స్వచ్ఛందంగా....’దేశ స్వాతంత్రం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా మేం సిద్దం’ అంటూ యుద్దానికి సిద్దపడతారు. జెక్సీస్ బానిసలు అపారమైన సేన అయితే స్పార్టా యోధులు 300 మంది. వాళ్లతోనే యుద్దానికి సిద్దపడి, శతృవుని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. చివరికి స్పార్టాన్ దేశపు గూనివాడు జెక్సీస్ దగ్గర కెళ్తాడు. స్పార్టాన్స్ యోధులను ఎదుర్కొవటానికి వెనుక దారి గురించి చెప్పి ఆ గూనివాడు వెన్నుపోటు పొడుస్తాడు. ఆ విధంగా, జెక్సీస్ వెన్నుపోటుదారుడిని చెంతకు చేర్చుకుంటేనే ఆ పాటి చిన్నవిజయం అయినా వస్తుంది.

చివరకు స్పార్టన్స్, సంవత్సరం తర్వాత పదివేల మంది సేనలతో 30,000 జెక్సీస్ బానిస సేనను తేలిగా ఎదుర్కొగలమన్న ఆత్మవిశ్వాసంతో కదనరంగానికి కదులుతారు. అంటే స్పార్టాన్ 300 మంది యోధులను చంపిన తర్వాత కూడా, జెక్సీస్ బానిస సేన, స్పార్టా మీదకి వెళ్ళటానికి సంవత్సర కాలం పట్టింది. ఆ విధంగా కూడా జెక్సీస్ కు, అతడి బానిస సేనకు, స్పార్టన్స్ అంటే ఎంత భయమో తెలుస్తుంది. అదీ ’శతృవును భయపెట్టటం’ అంటే!

ఇక జెక్సీస్ సేనలు ఎంతగా బానిసలంటే - కొరడా దెబ్బలకి భయపడి వెనుక నున్న వాళ్ళ ముందుకు తోస్తుంటే, యుద్దరంగంలో శతృవుకెదురుగా ఉన్న ముందటి వరసలోని వాళ్ళు ’ఒద్దు’ అంటూ గగ్గోలు పెడుతుంటారు. మరో సన్నివేశంలో... భూకంపమే వస్తోందా అన్పించినంతగా అపారమైన జెక్సీస్ సేనలు దాడి చేసినప్పుడు, స్పార్టన్లు తమ కత్తీ డాలులతో స్పందించిన తీరు, పోరాడిన వైనం, రజోగుణస్పోరకమై అద్భుతంగా ఉంటుంది. "స్పార్టన్స్! దాడి చేయండి" అనేటప్పుడు లియోనైడర్స్ గొంతు నాళాలు ఉబ్బుతుండగా, గర్జించే సింహంలాగా, ఉరిమే మబ్బులాగా, ఆ స్వరం ప్రేక్షకులని కూడా రోమాంచిత రజస్సులోకి తీసుకు పోతుంది.

మీదపడిన శతృమూకల్ని వెనక్కి తోస్తూ "ఒక్కరినీ విడిచి పెట్టకండి. వెనక్కి తొయ్యండి" అంటూ స్పార్టన్లు, ఒకరి కొకరు హెచ్చరించుకుంటూ యుద్దం చేస్తుండగా.... జెక్సీస్ బానిస సేనల్ని వెనక్కి తోస్తూ స్పార్టన్లు! వాళ్ల కాళ్ళక్రింద పొరలుగా రేగుతూ ఇసుకా, మట్టి!

ఆ దృశ్యం లో ఉన్న భావపు విలువల్ని నా కలం కంటే, సియాచిన్ లో దేశ సరిహద్దులకి కావలి కాస్తూ, పహారా తిరుగుతున్న సైనికుడి పదఘట్టన మరింత బాగా విడమరిచి చెప్పగలదు. మంచుని సైతం గడ్డకట్టించే కర్తవ్య దీక్ష అది! కార్గిల్ లో, దేశపు ఎల్లలు దాటి పాకిస్తాన్ ముష్కరులు దేశంలోకి చొచ్చుకు రాకుండా నిరోధిస్తూ, శతృమూకల్ని వెనక్కి తోస్తూ పోరాడిన సైనికుడి ఊపిరి, కారిన రుధిరం మరింత విశదంగా చెప్పగలదు. దేశ భూభాగపు రక్షణకి భుజానికెత్తుకున్న ఆయుధం అది!

అప్పుడే కాదు, జెక్సీస్ సేనల గురించి "వారికి దాహం వేస్తున్నట్లుంది" అంటాడు స్పార్టా యోధుడు. "అయితే వాళ్ళకి సహాయం చేద్దాం" అంటాడు లియోనైడర్స్. స్పార్టన్ యోధులు వాళ్ళని మృత్యులోయలోకి తోసేస్తారు. మరోసారి లియోనైడర్స్ శతృసైనికుణ్ణి చూపుతూ దళపతితో "వాడు కొనఊపిరితో ఊగుతున్నాడు" అంటే, దళపతి వాణ్ణి బరిసెతో గుచ్చి "ఇక ఊగడు" అంటాడు. యుద్దక్రీడ అది. అంతగా యుద్దాన్ని, ఇష్టంగా ఆస్వాదించాలంటే ఆ యోధులకి అంత కంటే ఎక్కువగా మాతృదేశం పట్ల ప్రేమ, స్వాతంత్రం పట్ల మక్కువా ఉండాలి.

అచ్చంగా.... ముంబాయి ముట్టడిలో పాక్ తీవ్రవాదులని మట్టుబెట్టడానికి వెళ్ళిన కమెండోలు, ఆపరేషన్ పూర్తయి, ఢిల్లీ తిరిగి వెళ్ళాక.... "సార్! మేం వచ్చేసాం" అంటూ తమ పై అధికారికి నవ్వుతూ రిపోర్టు ఇచ్చినట్లుగా!

ఇంకా.... ఒక చెవి తెగిన కమెండో, అది తమ పైఅధికారికి చూపిస్తూ.... "సార్! ఇక నా భార్య నా చెవి మెలి వెయ్యలేనందుకు సంతోషిస్తున్నా!" అంటే, మరో కమెండో "మిత్రమా రెండవ చెవి ఉన్నది జాగ్రత్త సుమా!" అని చతురోక్తి విసిరేంతగా!

ఇలాంటి మరో సన్నివేశమే - యుద్దరంగంలో దళపతీ, అతడి కుమారుల సంవాదాలు. శతృవుని దునుమాడి "చూశావా నా సత్తా" అని పుత్రుడంటే "నీకీ విద్య నేర్పింది నేనేగా?" అంటాడు తండ్రి. "నువ్వేనాడు ఒప్పుకున్నావ్ గనక" అని పరిహాసాలాడుకుంటూ, ప్రాణాపాయమైన రణాన్ని అనురక్తితో ఆస్వాదించే క్రీడగా పోరాడటం! ఎన్నడూ తనని మెచ్చని తండ్రి! "మనం సాధించాం" అంటూ మెచ్చినందుకు ఆనందంగా చూస్తున్న కుమారుడు! అదే ఆఖరి క్షణమై, తండ్రి జాగ్రత్త చెబుతుండగానే తల ఉత్తరించబడి, పెనువృక్షం నేలకూలినట్లుగా కుప్పకూలిపోగా... ఆ దృశ్యం చూసిన తండ్రి కళ్ళల్లో బాధ, ఆక్రోశం, దుఃఖం! ఆ సన్నివేశంలో దళపతి పాత్రధారి చూపిన నటన, కళ్ళల్లో పలికించిన భాష సజీవమైనవి.

"పుత్రవియోగంతో చింతిస్తున్నావా?" అన్న లియో నైడర్స్ ప్రశ్నకు "చింతా? ప్రతీకారం తప్ప వేరే ఆలోచనేదీ లేదు" అంటాడు. "మాతృదేశ రక్షణకై ప్రాణాలర్పించాడు నా కుమారుడు. ఆ క్షణం కోసమే నేనూ ఎదురు చూస్తున్నాను" అంటాడు. రక్తి పిపాసిలా శతృవులని చీల్చి చెండాడతాడు. ’ఆ రోజూ స్పార్టన్ల విజయానికి చెందినదే, అయినా శశ్మాన నిశ్శబ్దం’ అంటాడు వ్యాఖ్యాత!

"మా పయనం.... దేశం కోసం, స్వాతంత్రం కోసం, సహజీవనం కోసం" అంటూ బయలుదేరి, స్వచ్ఛందంగా నిర్ద్వంద్వంగా పోరాడి, ఒక మహోన్నత లక్ష్యం కోసం కొడుకు ప్రాణాలర్పిస్తే... ఆ వ్యధ, క్షోభ ఎలా ఉంటాయో, అయినా వెనుకడుగు వేయని దీక్ష ఎలా ఉంటుందో.... సందీప్ లని పోగొట్టుకున్న ఉన్ని కృష్ణన్ లని అడిగితే తెలుస్తుంది.

"నాకు మరో కొడుకు ఉంటే, అతణ్ణి పంపడానికీ సిద్దమే" అనే వీర జవానుల తల్లిదండ్రుల నడిగితే తెలుస్తుంది. అశోక చక్రలూ, పరమ వీర చక్రలూ వంటి ఆవార్డుల కోసం సైనికుల ప్రాణాలర్పించరు. దేశ గౌరవం కోసం, భూమి కోసం ప్రాణాలర్పిస్తారు. తాము పోయాక అచ్యుతానన్ లూ, మన్మోహన్ లూ, సోనియాలూ ఇచ్చే అవార్డులు, కితాబులు వారికి లెక్కకాదు. యుద్దభూమిలో అవేవీ గుర్తుకూ రావు!

ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. గత నెలలో రాష్ట్ర రాజధాని నగరంలో వైమానిక దళానికి చెందిన కార్యక్రమాలు కొన్ని జరిగాయి. ఆ సందర్భంగా ప్రసారమైన డిడి కార్యక్రమంలో, వైమానిక దళ అధికారి [ఆయన పేరు స్పష్టంగా ప్రసారం చేయలేదు. డిడి కార్యక్రమాలలో గుర్ర్ ర్ ర్ అంటుంది కదా!] తమ గురించి చెబుతూ "జీతపు స్కేలు, సౌఖ్యాలు - ఇలాంటి ఆలోచనలుంటే ఈ రంగంలోకి రావద్దు. సాహసం, ధ్రిల్, దేశం కోసం పనిచేయటంలో ఆనందం - ఇలాంటి ఆలోచనలున్న వాళ్ళకి ఇది చక్కని జీవితం" అన్నాడు. ఆ ముఖంలో ఎంతో దీప్తి, తృప్తి!

అవును. మనం జీవించేది ఆనందం కోసం. ఇష్టమైన తిండి తింటే, ఒక విజయం సాధిస్తే.. ఒక వస్తువు సంపాదిస్తే.... ఆనందం!

"ఈమె నా భార్య. వీళ్ళు నా పిల్లలు" అనుకుని వాళ్ళని సంరక్షించడం గృహస్తుగా ఆనందం.

అలాంటి చోట "ఇది నా దేశం" అనుకుని మాతృభూమి రక్షణ కోసం పోరాడటం సైనికుడికి ఆనందం.

"ఇది నా దేశం. ఇది నా మతం. ఇది నా సంస్కృతి" అనుకునే స్థితికి ప్రతి పౌరుడు ప్రయాణిస్తే... అప్పుడు ఆ దేశం స్వర్గధామం, సురక్షితం! దాన్నే స్పార్టన్లు చూపించారు. స్పార్టన్ల మీద మత పెద్దలు, మంత్రి, అతడి అనుయాయూలూ కుట్రలు చేయక పోలేదు. జెక్సీస్ దూతలతో లాలూచీ పడిన స్వార్టా మంత్రి తెరాస్, మత పెద్దలకీ జెక్సీస్ దూతలకీ నడుమ మధ్యవర్తిగా వ్యవహారించాడు.

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ఇలాగే పనిచేస్తుంది. ఒక వ్యక్తినీ, ఒక గుంపునీ ప్రభావపరచాలంటే, వాళ్ళ కంటే పైవాణ్ణి ముందుగా లోబరుచుకుని, అతణ్ణే మధ్యవర్తిగా నియోగిస్తుంది. అందుకోసమే నీచులనీ, అవినీతిపరులనీ పైకి తీసికెళ్ళి అధికారంలో కూర్చోబెడుతుంది. అంటే ఓ ఉద్యోగిని ప్రభావపరచాలంటే, సామదాన భేద దండాలలో ఏది ఉపయోగించి ప్రభావ పరిచినా, అందుకు పైఅధికారి ప్రమేయమూ, మధ్యవర్తిత్వమూ జోడింపబడుతుంది.

నిజానికి 300 యోధులు సినిమాలో స్పార్టన్లుగా వ్యవహరించబడింది, కేవలం స్పార్టాకి సంబంధించి మాత్రమే కాదు. స్వేచ్ఛని కోరే ఏ దేశానికైనా ఇది వర్తిస్తుంది. కార్పోరేటు బానిసత్వంతో పాటు, ఏ బానిసత్వాన్నైనా వ్యతిరేకించే, దోపిడిని ప్రతిఘటించే.... ప్రతి దేశానికీ స్పార్టా ప్రతీక! పాకిస్తాన్ లో ప్రస్తుత ఐఎస్ ఐ కీ, మాజీ సైనికాధికారులకీ, తాలిబాన్లకీ వ్యతిరేకంగా ప్రతిఘటించ అభిలషించే పాకిస్తానీయులు స్వల్ప సంఖ్యలోనే ఉండొచ్చు గాక, పాకిస్తాన్ గడ్డ పట్ల నిబద్దత గల ఆ స్వల్ప సంఖ్యలోని పాకిస్తానీలతో సహా, ఏ దేశమైనా స్పార్టాకి ప్రతిరూపమే! ఒక్కమాటలో చెప్పాలంటే - ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశం నుండీ నెం.5 వర్గంలో పని చేస్తున్న వాళ్ళు స్పార్టన్ యోధులకి ఆత్మస్వరూపులే!

ఈ సినిమాలో మరొక రసవత్తరమైన గొప్ప సన్నివేశం - జెక్సీస్, లియోనైడర్స్ ల సంభాషణ!

జెక్సీస్... పారశీక దేశపు రాజు. ఒకప్పుడు పారశీక మని పిలవబడిన ప్రాంతం ఇప్పుడు టర్కీగా, ఇరాన్ గా పిలవబడుతుంది. టర్కీ ఒకప్పుడు ముస్లింల సామ్రాజ్యం. [వీళ్ళని పార్శీలంటారు. టాటాలు పార్శీ వాళ్ళే. బ్రిటీషు హయాంలో, అంతకు మునుపు ఢిల్లీ మొగలాయిల హయాంలో చాలామంది పార్శీలు భారతకు వలస వచ్చి స్థిరపడ్డారు.]

ఇక జెక్సీస్ పాత్రధారి ఆహార్యమూ[అంటే వేషధారణ] దేహ భాష, స్త్రీపురుషులకు మధ్యస్తంగా నపుంసకుడిని గుర్తుకు తెస్తున్నట్లుగా ఉంటుంది. లియోనైడర్స్, జెక్సీస్ లు.... వేషధారణలో పూర్తి వ్యతిరేక బిందువుల్లా ఉంటారు. ముక్కుకు ముక్కెర, తల నుండి చెవిదాక అలంకరించుకున్న రకరకాల గొలుసులు, కంఠాభరణాలూ, హస్తాభరణాలతో, కంటికి కాటుకా గట్రాలతో జెక్సీస్ భారతదేశం లోని గ్రామీణ అనాగరిక మహిళలా ఉంటాడు. [మా ఊళ్ళో గడ్డికోసుకు వచ్చే మహిళల్లో చాలామందికి ఇవే ముఖకవళికలు ఉన్నాయి. వాళ్ళెవరికైనా ముఖాన్ని అతడికిలాగే అలంకరిస్తే తేడా ఉండదు.] దీన్నే ధృవీకరిస్తూ లియోనైడర్స్ "నేను మగవాళ్లతో మాత్రమే చేతులు కలుపుతాను" అంటాడు.

స్త్రీ అయినా, పురుషుడయినా ధైర్యంగా యుద్దం చేయటం వీరత్వం అన్పించుకుంటుంది. భయాన్ని, ప్రలోభాలనీ ఉపయోగిస్తూ, లంచాలిచ్చి ఇతర దేశాల్లో వ్యక్తుల్ని లోబరుచుకుంటూ కుట్రలు పన్నటం నపుంసకత్వమే! శారీరకంగా కాదు, ఇది ఖచ్చితంగా మానసిక నపుంసకత్వం.

ఇక, అసలు జెక్సీస్ ని చూడగానే లియోనైడర్స్ "నా ఊహే గాని నిజమయితే నీ పేరే జెక్సీస్" అంటాడు. జెక్సీస్ లియోనైడర్స్ మీద భయ ప్రలోభాలని ఒకేసారి ప్రయోగిస్తూ... "నన్ను ఎదురించడం చిన్న సైన్యంతో నీకు సాధ్యం కాదు. నాకు సామంతుడివైతే నీకు సకల భోగాలూ అనుగ్రహిస్తాను. నన్ను కాదన్న వాళ్ళు ఇప్పటికే మట్టిగొట్టుకుపోయారు. అలాంటి వాళ్ళ కంకాళాలతోనే ఈ రధం నిర్మించబడింది" అంటూ తన భారీ రధాన్ని చూపుతాడు.

లియోనైడర్స్ అలవోకగా నవ్వుతూ "నన్ను కంకాళాలు భయపెట్టలేవు" అంటాడు. చావుని లెక్కచేయని వీరుణ్ణి, చచ్చిన వాడి కపాలం ఏ పాటి భయపెడుతుంది? మనిషికి తన ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఉద్యోగం, సంపద,..... ఏదీ! అలాంటి ప్రాణాన్ని ఫణంగా పెట్టిన వాడు మరిక ఏం పోతుందని భయపడతాడు? ’జాతస్యః ధృవో మృత్యుః’ అనుకుంటే ’హతోవా ప్రాప్య సే స్వర్గం’ అనుకుంటే.... ప్రతి పౌరుడూ, ప్రతివ్యక్తీ ఒక లియోనైడర్సే!

ఈ సమాధానికి ఛర్రుమన్న జెక్సీస్ "నన్నెదిరించి పోరాడిన వాళ్ళు లేరు. నా సేనకి ఎవరూ ఎదురు నిలబడలేరు. ఆపైన నీ దేశంలోని ఆడవారి పరిస్థితి ఆలోచించు" అంటాడు. లియోనైడర్స్ "మా దేశపు ఆడవాళ్ళు సంగతి ఇప్పుడెందుకులే! నీ దగ్గరున్న బానిసల కంటే వారికి వీరం ఎక్కువ" అంటాడు. ఈ దృశ్యం చూస్తూ, డైలాగ్ వింటున్నప్పుడు.... రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీభాయి, ఇందిరాగాంధీ వంటి భారతీయ యోధులు గుర్తుకు వచ్చారు. వీరందరికీ మూలశక్తి, మహిషాసుర మర్ధని, ఆ ఆదిపరాశక్తి కళ్ళముందు కదలాడింది. లియోనైడర్స్ అంతటితో ఆగడు. "నీ దగ్గరున్న వారు బానిసలు! యోధులు కాదు. నీ కొరడా దెబ్బలకి భయపడి వాళ్ళు యుద్దానికి వచ్చారు" అంటూ వాస్తవాన్ని ఎత్తి చూపుతాడు.

దాంతో వాదన మార్చి జెక్సీస్, ఈ సారి "ఈ సమస్త గ్రీకులకీ నిన్ను సామంత రాజుని చేస్తాను. నీ విరోధులయిన ఎధీనియన్లని నీ ముందు మోకాలి దండ వేయిస్తాను. నీకు సకల సంపదలూ ఇస్తాను. నువ్వు నాముందు మోకాలి దండవెయ్యి" అంటాడు.

ఇక్కడ అచ్చంగా కనబడేది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల పనితీరే! ఆద్యంతమూ, ప్రతీ సీన్ లోనూ, కథలోని ప్రతి అంశంలోనూ ఈ సారూప్యత అనుశృతంగా ఉంది. జెక్సీస్ ముందు భయపెట్ట ప్రయత్నించాడు. సాధ్యం కానప్పుడు ప్రలోభపెట్ట ప్రయత్నించాడు. చివరికి 300 సినిమాలోని యుద్దపు చివరి సీన్ లో కూడా, గూనివాడి సహితంగా జెక్సీస్ దూత చెప్పేది కూడా ఇదే. వీలైతే భయపెట్టడం, కుదరకపోతే ఆశపెట్టటం.

ఎప్పుడైనా వాళ్ళ తీరు అదే! ముందు భయపెడతారు. ఎదుటివాడు భయపడలేదనుకొండి. తర్వాత ప్రలోభపెడతారు. ఆశకు పడిన వాణ్ణి మెల్లిగా బానిసని చేసుకుంటారు. తర్వాత కొరడాదెబ్బలూ మామూలే, పీక కత్తిరించడాలూ మామూలే!

చిన్న ఉదాహరణ చెప్పాలంటే - గత కొన్నేళ్ళల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థ గుంటూరులో మిగిలిన చిన్న చిన్న విద్యాసంస్థల్ని సంలీనం చేసుకుంది. సురేష్ కోచింగ్ సెంటర్, విజ్ డం గట్రా..... వాళ్ళ విద్యాసంస్థల్ని టేకోవర్ చేస్తున్నప్పుడు సదరు సురేష్ లకీ, ఎంకేఆర్ లకీ స్వాగతం చేబుతూ, ’ఈనాటి నుండి మా అపూర్వ ఫ్యాక్టల్టీలో ఈ గౌరవనీయులు కూడా చేరుతున్నారంటూ’ అర్ధపేజీ/పూర్తిపేజీ ప్రకటలిచ్చిన శ్రీ చైతన్య బీఎస్ రావు, నెలలు తిరిగేటప్పటికి ’శతకోటి లెక్చరర్లలో మీరో బోడిలెక్చరర్’ అన్న డీల్ చూపటమూ, కోరలు పీకి కూర్చోబెట్టటమూ మామూలే! కాకపోతే ఇది కెరీర్ పరంగా కోరలు పీకటమన్న మాట.

అచ్చంగా ఇలాగే.... జెక్సీస్, ఇప్పుడు కొరడాలతో కొడుతున్న బానిసలనైనా, ఒకప్పటి రాజులనైనా, ఇప్పుడు ఓటమి వార్త తెచ్చినందుకు పీక కోసి, మరణాన్ని ప్రసాదించిన వాళ్ళనైనా.... లొంగ దీసుకునే రోజు ఇప్పుడు లియోనైడర్స్ కి ఇచ్చిన ఆఫరే ఇచ్చి ఉంటాడు కదా! మొదట సామంతు వంటాడు, ఆపైన నువ్వు ఓ దళపతి వంటాడు, ఆ తర్వాత నా కాలి క్రింద పీట వంటాడు. చరిత్రలో చూసుకున్నాకూడా కనిపించేది ఇదే! ఒకప్పుడు బ్రిటన్, నాజీజంతో హిట్లర్, కమ్యూనిజంతో రష్యా, కాపిటలిజంతో ఆమెరికా, ఎలక్ట్రానిక్స్ లో జపాన్, ఇప్పుడు చైనా! తాలిబానిజంతో ముస్లింలు! ముందు అకాశానికెత్తడం తరువాత ఎత్తి కుదేయటం.

అందుకే నెం.5 వర్గం ఓటమి స్ట్రాటజీని ఎంచుకున్నది. అందుకే, ప్రజలలో తామసం నశించి, రజోగుణం రగలటం తప్ప మరో మార్గాంతరం లేదన్నదీ! ఉన్నవి రెండో దారులు - పోరాటం లేదా బానిసత్వం. మరో మాటలో చెప్పాలంటే అవినీతిపై పోరాటం లేదా అవినీతిలో పొర్లాడటం.

పోరాడతావా కార్గిల్ కి రా! పొర్లాడతావా కార్చిచ్చులోకి పో! బానిసత్వం కార్చిచ్చు వంటిదేనన్న విషయం బానిస సంకెళ్ళు తగిలించుకున్నాక ఖచ్చితంగా అర్ధమైతీరుతుంది. ఇక ఇక్కడ కార్గిల్ దేశ సరిహద్దుల్లో లేదు, ప్రతిమనిషి నడి జీవితంలో ఉంది.

ఎంత కాలం ఓర్చుకుంటూ, రాజీపడుతూ, పోరాటానికి భయపడుతూ బ్రతుకుతారు ఎవరైనా....? తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఉపముఖ్యమంత్రి అయిన స్టాలిన్ దంపతుల పెళ్ళిరోజు కానుకగా, తమిళ భక్తులు వెయ్యిరూపాయల నోట్లతో కోటి రూపాయల విలువైన దండవేయటంతో ప్రారంభమై.... యూపీ మాయావతి మెడలో దండ పదిహేనో ఇరవయ్యో కోట్లయి కూర్చొంది.

ఓ ప్రక్క, ప్రజలు పదిరూపాయలు, ఓ స్టీల్ పళ్ళెం, గ్లాసూ, ఓ లడ్డూ, ఓ చేతి రూమాలుతో వస్తుదానం, అన్నదానం చేస్తామని, ఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామిగారు ప్రకటిస్తే, సదరు స్వామి ఆశ్రమంలో పదివేల మంది గుమిగూడి, తొక్కిసలాటలో 71 మంది ప్రాణాలు కోల్పోయేంత గర్భదారిద్ర్యం తాండవిల్లుతుండగా....

మరోప్రక్క, దోచుకునేందుకు బడా కాంట్రాక్టులూ, ఉన్నతోద్యోగ పదవులూ, లాభసాటి పోర్టుపోలియోలు, పదవులూ దక్కిన మాయావతి భక్తులు, తమ అభిమానాన్ని భారీ కరెన్సీ దండలుగా బాహాటంగా సమర్పిస్తున్నారు. వీళ్ళంతా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తుల బానిసలే! బాస్ కి కాళ్ళుపట్టి, క్రింది వాళ్ళ చేత కాళ్ళుపట్టించుకునే బానిసలు!

ఇప్పటికీ నిట్టూర్పులు విడుస్తూ "ఏం చేస్తాం? ఎవరూ ఈ దేశాన్ని కాపాడలేరు" అని ఆక్రోశిస్తూ.....! చూద్దాం, తామసపు హద్దులు ఎంత లోతుగా విస్తరించాయో! ఇక ఈ విషయం ఆపి, జెక్సీస్ లియోనైడర్స్ ల సంవాదం దగ్గరికి తిరిగి వస్తాను.

జెక్సీస్ ప్రతిపాదనకి లియోనైడర్స్ "అద్భుతమైన ప్రతిపాదన. నాకు తెలిసి ఎంత మూర్ఖుడు కూడా దానిని కాదనడు. కాని సమస్య ఏమిటంటే నీ బానిసల్ని హతమార్చి హతమార్చి నా తొడ నరాలు బెణికాయి. అంచేత మోకాలి దండ వేయమన్నావు చూడు, అది కుదరని పని" అంటాడు. "ఈ యుద్దం ముగిసే లోగా నువ్వు రక్తం చిందించడం తధ్యం" అని హెచ్చరిస్తాడు. చిత్రం చివరిలో యుద్దరంగంలో లియోనైడర్స్ విసిరిన ఈటె కుడి చెంపని చీల్చుకు పోగా, చిందిన రక్తాన్ని చేత చూసుకుని, జెక్సీస్ ఎంతగా భయభ్రాంతుడవుతాడో కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు చిత్రదర్శకుడు.

పరిశీలించి చూస్తే, జెక్సీస్ అలియాస్ నకిలీ కణిక అనువంశీయుల నైజం 70 MM లో కన్పిస్తుంది. ఎలాగంటే….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

ఆమధ్య Meet the Spartans అనే సినిమా వచ్చింది ఇది 300 యొధులకు పేరడీ. 300 యోధులు నెం.5 వర్గానికి ప్రతిరూపమైతే ఇది( Meet the spartans) నెం.10 వర్గానికి ప్రతిరూపం. దీనిలో అచ్చంగా స్పార్టన్ల నైతికతనూ , పోరాట పటిమనూ , ధీరత్వాన్ని అవహేలన చేస్తూ చిత్రించారు. అయితే ఇది విజయం సాధించ లేదు . కానీ నాకు తెలిసి ఏ చనెల్ లోనూ 300 సినిమాను ప్రదర్శించలేదు ... కానీ 20 రోజుల క్రితం Meet the spartans ను STAR MOVIES లో ప్రదర్శించారు

అవునా! నాకు తెలియదండి. దొరికినప్పుడు Meet the Spartans సినిమా చూస్తాను. మంచి సమాచారం ఇచ్చారు. నెనర్లు!:))

వద్దు అమ్మా మీరూ "మీట్ ద స్పార్టన్స్" చూడవద్దు, అది ఒక వల్గర్ సినిమా అటువంటి వాటిని దయచేసి చూడవద్దు.

కాని 300 సినిమాని మీరు అనువర్తించి వివరించిన విదానం అందరికి అంటె ప్రతి సామాన్యుడికి అర్ధమవ్వాలని మీరు రాస్తున్న వ్యాసలు చాలా గొప్పగ వున్నాయి. మీరు ఇలగే కొనసాగించండి. ఎందుకంటె తాడేపల్లి గారి వ్యాసంలో చెప్పినట్టుగా "జీవితానిక్కావాలి ఊహా, ఉత్ప్రేక్షా - రసం, స్వప్నం - శైలీ, శిల్పమ్" నేను చూసిన చాలా మందిలొను ఈ విశయలు లొపించాయి అన్నది నా అనువభవం, అవన్ని ఒక్క మీ బ్లాగ్ లొనే వున్నవి అన్నదికూడ నా అనుభవమే. అందుకే ఎంత పని వున్నాసరే కనీసం రొజులొ ఒక్కసారైనా మీ బ్లాగ్ కి వస్తాను. తప్పకుండా మీరు మాకొసమ్ మరోకటి సిద్దంచెసి ఉంటారని.

అయితే గత టపాలలొ ఒకదాంట్లొ మీరు పొతన భాగవతం గురించి ప్రస్తావించడం జరిగింది, అప్పటి నుంచి సమయ బావంవల్ల మీకు విషయం తెలియజేయడమ్ కుదరలేదు. నా దగ్గర 'పొతన భాగవతం' నాలుగు సంపుటాలు ఉన్నాయి, నా దగ్గర కొంత కాలంగా వున్నా నేను ఎప్పుడు తిసి చదివె సమయం దొరకడం లేదు పైగా అందులో భావనను మీరు వర్ణించినంతగా మరెవ్వరికి సాధ్యం కాదు. కాబట్టి అవి నా దగ్గర కంటె మీ దగ్గర ఉండడమే ఉత్తమమని భావించి, నేను మీకు వేగు పంపగా అది మీకు చెరడం లెధు అందుకే ఇక్కడ వ్యాఖ్యగా రయల్సివచ్చింది. మిగిలినవి కొంత సమయము తరువాత తప్పక మీకు పంపగలను. నేను నిత్యం పుస్థకాలు ఖరిదు చేసే షాపు అతని దగ్గర పాత ముద్రణలు తెప్పించవలసిందిగా కొరితే అతను 'పొతన భాగవతం' మరికొన్ని ఇతర పుస్తాకాలు తిసుకువచ్చాడు. వెతకగా నాలుగు సంపుటాలు దొరికినినవని మరికొన్ని త్వరలొ తెప్పిస్థానని చెప్పాడు, ఇవి దొరకడం కష్టమని సమయం కావలని చెప్పాడు. టి.టి.డి వారి పాత ముద్రణలు, విటిని మీకు ఎలాగైనా అందచెయలని ఆశ. విటిని నేను మీకు తపాల ద్వార పంపించగలను, మీరు అనుమతిస్తే నా వ్యక్తిగత వేగు(renukumar9@gmail.com)కు మీ చిరునామా పంపవలసినదిగా మనవి, నా విన్నపాన్ని మన్నిస్థారని అశిస్థాను.

అయితే నేను మెచ్ఛిన ఉత్తమ ఛిత్రాలలొ మొదటి స్థానంలొ ఉంది 300 చిత్రం, మరొక అత్యధ్బుత చిత్రం "మ్యాట్రిఖ్స్" మూదు బాగాలుగ వచ్ఛిన ఈ సినిమా పూర్థిగ మన ఇతిహసలనుంచి తిసుకొని చెప్పిన కథా కథనాలు ఎంతొ అద్బుతంగా ఉంటుంది. మీకు తప్పక నచ్ఛటమే కాక మీ వ్యాసాలకి ఉపయుక్తంగా కూడా ఉంటుందని నా అనుకొలు.

- రేణూ కుమార్

రేణూ కుమార్ గారు : మీకు మెయిల్ తప్పక ఇస్తానండి.

ముందుగా మీకు శుభాకాంక్షళు. ఇప్పుడె చూసాను, మీరు సొంతంగా పూర్తి తరహ వెబ్ సైట్ ప్రారంభించడం చాలా సంతొషంగా ఉంది. నేను సొంతగా ప్రారంభించిన ఇంతగా ఆనందించనేమో...

- రేణూ కుమార్

రేణూ కుమార్ గారు: అది ఇంకా పూర్తి కాలేదండి. డిజైన్ జరుగుతూ ఉంది. అన్నీ తానై శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నాడు. తానూ అమ్మఒడి అభిమాని.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu