కిటికీ లోనుండి బయటకు చూస్తున్నప్పుడు, ఆశాజీవి ఆకాశంలోని నక్షత్రాలని చూస్తాడట. నిరాశా జీవి నేల మీది బురదని చూస్తాడట.

సగం వరకూ నీళ్ళు నింపిన గ్లాసుని వర్ణించమంటే, ఆశాజీవి ’అర్ధ గ్లాసు నిండుగా ఉంది’ అంటే నిరాశా జీవి ’అర్ధ గ్లాసు ఖాళీగా ఉంది’ అంటాడట.

నిరాశావహ దృక్పధం కల వ్యక్తి ప్రతి అవకాశంలోనూ పది అవాంతరాలు చూస్తే, ఆశావహ దృక్పధం కల వ్యక్తి ప్రతి అవాంతరంలోనూ పది అవకాశాలు చూస్తాడట.

మన దృక్పధాన్ని బట్టి చూసే దృశ్యం ఉంటుందనీ, చూసిన దృశ్యాన్ని అర్ధం చేసుకునే తీరు ఉంటుందనీ, దాన్ని బట్టే మన ప్రవర్తనా సరళి ఉంటుందనీ... చెబుతూ, మన్నవ గిరిధర రావు గారు తన ’కాంతి రేఖలు’ పుస్తకంలో, పైన చెప్పిన పోలికలు వ్రాసి, మరో రెండు సంఘటనలు వ్రాసారు.

అవి మీ కోసం...

చావుకీ బ్రతుకుకీ మధ్య దూరం ఎంత?

సముద్రంలో ప్రయాణిస్తున్న నౌక ఒకటి ప్రమాదానికి గురై మునిగిపోయింది. మునిగిపోయిన వాళ్ళు మునిగిపోయారు. లైఫ్ బోట్లు దొరక బుచ్చుకున్న వారు ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రయాణికుల్లో ఇద్దరికి లైఫ్ బోట్లు దొరకలేదు, లైఫ్ జాకెట్లూ దొరకలేదు. ఇద్దరూ ఈదడం మొదలు పెట్టారు. అంతూ దరీ లేని సాగరం! ఈది ఈది ప్రాణాల కడబట్టిపోతున్నాయి. వారిలో ఒకరికి ఇక ఆశ చచ్చిపోయింది. "మిత్రమా! ఇక ఈదలేను" అంటూ సొమ్మసిల్లిపోయాడు. మునిగిపోయాడు. రెండో వ్యక్తి నిరాశకి గురికాలేదు. ఈదుతూనే ఉన్నాడు. మరి మూడూ నిముషాలు గడిచే సరికి దూరంగా హెలికాప్టర్ కనిపించింది. మునిగిపోతున్న నౌక పంపిన ప్రమాద సంకేతాలని అందుకున్న వారు పంపిన రక్షణ హెలికాప్టర్ అది. రెండో వ్యక్తి రక్షింపబడ్డాడు.

"చావుకీ బ్రతుకుకీ దూరం ఎంత?" అని అతణ్ణి అడిగితే చిరునవ్వుతో "మూడు నిముషాలు" అంటాడు.

గెలుపుకీ ఓటమికీ మధ్య దూరం ఎంత?

దక్షిణాఫ్రికాలో ఓ బంగారు గనిని గుత్తకు తీసుకున్న ఓ వ్యాపారి. లాభసాటిగా ఉన్నంత వరకూ ఖనిజం తవ్వుకున్నాడు. ఇక ఒట్టి పోయిందని పించాక, గనిని చౌకగా మరో వ్యాపారికి గుత్తని బదలాయించాడు. రెండో వ్యాపారి గనిని తవ్వాడు, తవ్వాడు. ఎంత తవ్వినా మన్నూ మశానమే తప్ప బంగారు ఖనిజం దొరకనే లేదు. నిరాశ ఆవరించింది. అప్పటికి పెట్టిన పెట్టుబడే దండగ అన్పించింది. వదిలేసుకు వెళ్ళి పోయాడు. ఈ సారి మరో వ్యాపారి దాన్ని గుత్తకు తీసుకున్నాడు. అందరూ వారిస్తున్నా, నిరాశపరిచినా తవ్వకం ప్రారంభించాడు. ఇంకా అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ నమ్మకంతో, ఆశతో తవ్వాడు. మరో మూడగులు తవ్వే సరికి బంగారం బయటపడింది.

గెలుపుకీ ఓటమికీ ఎంత దూరం అని అతణ్ణి అడిగితే "మూడు అడుగులు" అంటాడు.

మన్నవ గిరిధరరావు గారు, పై రెండు సంఘటనలలో వ్యక్తుల పేర్లూ, స్థల కాలాలు కూడా ఉటంకించారు. నాకు గుర్తు లేనందున కేవలం సంఘటనలనే వివరించాను.

[1992 లో నేను ఓ సూక్తి విన్నాను. ’నిరాశా నిస్పృహల వలయం చుట్టుకున్నా ఆశని కోల్పోకూడదు’ అని! ఈ 17 సంవత్సరాల పోరాటం మాకు, పై సూక్తిని బాగా అర్ధం చేసింది.] జీవితంలో ఆశా నిరాశల ప్రభావం ఎంతగా ఉంటుందో మాకు అనుభవపూర్వకంగా తెలుసు. దిక్కూ దరీ తోచని క్లిష్టస్థితిలో ఉన్నప్పుడు, నిరాశ నన్నావరించిందో, చుట్టూ చీకటి తప్ప మరేం ఉండదు. ఎప్పుడైతే ఆశని ప్రోది చేసుకుని, నమ్మకాన్ని ధృఢపరుచుకుంటానో, అంతటి కష్టంలోనూ భగవంతుడు చూపేదారి స్పష్టంగా కనబడేది. దైవం మానుష రూపేణా అన్నట్లు, ఎవరో ఒకరు సహృదయంతో సాయపడేవాళ్ళు. మొత్తానికి కష్టం మాత్రం దాటుతాం! ఇలాంటి అనుభవాలు చాలామందికీ ఎదురై ఉంటాయి.

జరుగుతున్న మోసాల గురించి, కుట్రలను గురించీ, ఈ బ్లాగులోని టపాలు చదివి... అప్పుడప్పుడూ కొందరు జ్ఞాతలూ, తరచుగా ఎందరో అజ్ఞాతలూ ఎంతో నిరాశాపూరితంగా వ్యాఖ్యానిస్తుంటారు.

"అన్నీ దగాలే! అయినా ఏం చేయగలం?"

"ఎన్ని జరుగుతున్నా ఎవరు చేయగలిగిందీ ఏమీ లేదు!"

"ఈ జనం ఇలా ఉన్నంతకాలం అంతే! అన్నీ జరిగిపోతూనే ఉంటాయి"

"ఎవరెంత గోల పెట్టినా, ఎవరెంత మొత్తుకున్నా ఈ రాజకీయ నాయకులకి బుద్దిరాదు. అంతే! ఇలా కాలం గడిచిపోతూనే ఉంటుంది."

ఇలా! అజ్ఞాతల వ్యాఖ్యాలని ప్రచురించకుండా తిరస్కరిస్తూ ఉంటాము.

నిజానికి ఇది మనలో ప్రవేశపెట్టబడిన వ్యతిరేక ఆలోచనా విధానపు [Negative thinking] ప్రభావమే! నిరాశాపూరిత ఆలోచనా విధానం! ఇది ఇప్పుడు కాదు, శతాబ్ఠాల క్రితమే భారతీయులలో బుర్రలలో ఇంకించబడింది. ఆత్మన్యూనతతో మిళితం చేసి మరీ ఇంకించబడింది.

కాబట్టే స్వామి వివేకానంద "సింహాలు మీరు! గొర్రెల్లా మిగిలిపోకండి. గర్జించండి!" అన్నారు.

కాబట్టే ఎందరో స్వాతంత్ర సమరయోధులు భారతీయుల ఆత్మని తట్టిలేపి వారి ఆత్మశక్తిని వారికి గుర్తు చేసారు.

సాగర లంఘనానికి ముందు ఆంజనేయస్వామి శక్తిని ఆయనకే గుర్తు చేసినట్లుగా! అప్పుడుగానీ ఆకాశానికి ఎగరలేదాయన! [ఆంధ్రులకు వాళ్ళ శక్తి వాళ్ళకే తెలియదని, ఆంధ్రులు కూడా ఆంజనేయ స్వామిలాంటి వాళ్ళేనని మాజీ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ గారు అప్పట్లో అన్నారు! ]

నిజానికి... ఇప్పటి పరిస్థితులలో, ఏం చెయ్యగలమో తర్వాతి విషయం! ముందు ఏం జరుగుతుందో తెలుసుకుంటే... అప్పుడు ఏంచెయ్యాలో స్ఫురిస్తుంది. పోయిన చోట వెదికితేనే పోగొట్టుకున్న వస్త్తువు దొరుకుతుందంటారు పెద్దలు! సమస్య తెలిస్తే పరిష్కారం తెలుస్తుంది. ఎందుకంటే పరిష్కారం లేని సమస్య ఉండదు గనక!

సమస్య పరిష్కారం పట్ల మనకి నిబద్దత ఉంటే పరిష్కారం తప్పకుండా స్పురిస్తుంది. కావలసిందల్లా ఆ పరిష్కారం కోసం సాధన చెయ్యగల దైర్యం! ఎందుకంటే ఇప్పుడు మన ముందున్న సమస్యలకి పరిష్కారం బయటి పరిస్థితులలో లేదు. మనలోనే ఉంది! ఎవరి చేతుల్లోనో లేదు. ఎవరికి వారి చేతుల్లోనే ఉంది. మన ఆలోచనా విధానం లోనే ఉంది. మన దృక్పధంలో ఉంది. మన మనస్సులో ఉంది.

భగవద్గీత ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెపుతుంది. దిగువ శ్లోకాలు పరిశీలించండి.

శ్లోకం:
ఉద్ధరే దాత్మ నాzzత్మానం నాత్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః

భావం:
ఈ సంసారం నుండి యెవరికి వారే ఆత్మోద్దరణం చేసుకోవాలి గాని - పతనం కాకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు మరియు శత్రువూ కూడా అయివుంది.

శ్లోకం:
బంధు రాత్మాzzత్మన స్తస్య యే నాత్మై వాత్మనాజితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాzzత్మైవ శత్రువత్

భావం:
నిగ్రహపరులకు ఆత్మ బంధువు గాను - నిగ్రహం లేనివారికి ఆత్మయే శత్రువుగానూ వుంటుంది.

[పై శ్లోకాలలో ’ఆత్మ’ని, శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండేది గానూ, శరీరం నశించినా తాను నశించని ఆత్మగానూ కాకుండా... ఆత్మ విశ్వాసం, ఆత్మ నిగ్రహం వంటి పదాలలో self కు పర్యాయంగా వాడినట్లు... ఆలోచనల సముదాయానికి అంటే మనస్సుకి పర్యాయంగా పరిగణించవచ్చు. ఇది గీతా శ్లోకాల్ని మేము అర్ధం చేసుకున్నతీరు.]

మన ముందున్న సమస్య లేదా సమస్యలు... ఎంత జటిలమైనవైనా, ఎంత ద్వంద్వపూరితమైనా[Paradox], పరిష్కారం మాత్రం ఉండితీరుతుంది. ఈ విషయాన్ని మన ఇతిహాసాలు స్పూర్తిదాయకంగా వివరిస్తాయి.

భాగవతంలో ప్రహ్లాద చరిత్ర మనకందరికీ తెలిసిందే!

అందులో హిరణ్యకశ్యపుడు దానవరాజు. ’ఉగ్ర’ తపస్సు ఆచరించి మరణం లేకుండా వరం కోరతాడు. అది కుదరకపోయే సరికి పరస్పర విరుద్దాలతో, ద్వంద్వాలతో మరణం లేకుండా వరం పొందుతాడు.

రాత్రి గాని, పగలు గాని
ఇంట్లో గాని, బయట గాని
నేల మీద గాని, నింగిలో గాని
నీటిలో గాని, గాలిలో గాని
నరుల చేతిలో గాని, జంతువుల చేతిలో గాని
దేవతల చేతిలో గాని, రాక్షసుల చేతిలో గాని తనకు చావు రాకూడదు.
ఏ ఆయుధం చేతగానీ తనకు చావు రాకూడదు.

ఇదీ హిరణ్య కశ్యపుని కోరిక!
’ఇన్ని మెలికలూ, ద్వంద్వాలూ[Paradoxes] పెట్టాడు గనక తనకు చావురాదు’ అన్నది అతడి నమ్మిక!

అయితే భగవానుడు ద్వంద్వాతీతుడు.
’హిరణ్యకశ్యపుని చావు’ అనే సమస్యని ఆయన పరిష్కరించిన తీరు పరమాద్భుతమైనది, స్ఫూర్తిదాయకమైనది.
హిరణ్యకశ్యపుని కోరిక ప్రకారం......

రాత్రీ పగలూ గాని సంధ్యవేళ [సూర్యాస్తమయానికి, చంద్రోదయానికీ మధ్యవేళ]
ఇంటా బయటా గాని గడప మీద,
నేల మీదా ఆకాశంలోనూ కాని తన తొడల మీద,
నీటిలోనూ గాలిలోనూ కాని తన ఒడిలో,
నరుడూ మృగమూ గాని నరసింహ రూపంలో,
ఏ ఆయుధమూ కాని తన చేతి గోళ్ళతో,
హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడి, పేగులు తీసి తన మెడలో ధరించి...

భీకరంగా, భీభత్సంగా దుష్ట శిక్షణ గావించాడు.
కారుణ్య వాత్సల్యాలతో శిష్టరక్షణ చేశాడు.

కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ, ఎలాంటి సమస్యలని చూసీ భయపడవలసిన, బెంగపడవలసిన, నిరాశపడవలసిన అవసరం లేదు.
ధైర్యమూ, ఆశా వీడకుండా సాధన చేస్తే పరిష్కరించుకోలేని సమస్యా ఉండదు.

ప్రపంచమంతా పరిగణించే కొత్త సంవత్సరం 2010 లో మనకి వచ్చే తొలిపండగ, పంటల పండుగ, పెద్దపండగ అయిన సంక్రాంతికీ
మీ అందరి ఇళ్ళల్లో పాలు సిరులు పొంగాలని,
ఆనందాలు నిండాలని కోరుకుంటూ...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

11 comments:

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

సంక్రాంతి శుభాకాంక్షలు .

అమ్మకు భోగి పర్వదిన శుభాకాంక్షలు

అమ్మకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Srikar

wonderful description.sankranthi subhaakankshalu..nenevaro teliyadu kadu.im rukminidevi...

im rukminidevi . .urs one of the followers. baagundi mee samasya-parishkaaram..

మారుతి గారు, మాలా కుమార్ గారు, చిలమకూరు విజయమోహన్ గారు, శ్రీకర్ గారు, రుక్మిణి దేవి గారు,

అందరికీ నెనర్లు!

~~~
రుక్మిణి గారు,

నా follower గా తెలుసండి. మీరు ఎందుకు అలా అన్నారు?

సంక్రాంతి శుభాకాంక్షలు

spoorti daayakamaina mee rachanaa pravaaham ilaa saagutoone umdaalani korukumtunnaanu

నాకు నా చిన్నప్పుడెప్పుడో సంస్కృతశ్లోకపఠనానికి అనుకుంటాను మొదటి బహుమతిగా వచ్చిందండీ ఈ మన్నవ గిరిధరరావుగారి కాంతిరేఖలు పుస్తకం. అప్పుడెందుకో ఆ పుస్తకం చదవాలీ అనిపించలేదు. ఇప్పుడు మీరు వ్రాసినది చూచాక, ఈసారి ఇంటికి వెళ్లినప్పుడు తప్పకుండా ఆ పుస్తకం చదవాలీ అనిపిస్తోందండీ.

* * *

గీతాచార్యులు కూడ క్షుద్రం హృదయదౌర్బల్యం అనే కదా అన్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని చెప్పినట్టుగా, ఏ సమస్యకైనా కనీసం ఒకటైనా "మంచి" పరిష్కారం తప్పక ఉండి తీరుతుంది.

బాగా చెప్పారండీ.

@దుర్గేశ్వర రావు గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలండి.
~~~~~~~
రాఘవ గారు:తప్పక చదవండి. చిన్నపిల్లలకి చాలా మంచి పుస్తకం. ఎవరయినా మీకు తెలిసిన పిల్లలుంటే చదివించండి. నెనర్లు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu