ముందుగా ఒక పోలిక!

మనం జాతరకి గాని, ఎగ్జిబిషన్ కి గానీ వెళ్ళినప్పుడు - భుజానికి తగిలించుకున్న సంచీలో బొమ్మలు వేసుకుని, నేలమీద కొట్టుకుంటున్న రెండు రబ్బరు బొమ్మల్ని సన్నని పాస్టిక్ దారంతో పట్టుకుని ఆడిస్తున్న బొమ్మలవాణ్ణి చూస్తుంటాం. ఎంతో చాకచాక్యంగా ఆ బొమ్మల్ని - నేల మీదపడి, ఒక దాని మీద ఒకటి పడుతూ లేస్తూ కొట్టుకుంటున్నట్లుగా ఆడిస్తుంటాడు.

సరిగ్గా ఇదే స్ట్రాటజీ వ్యక్తుల దగ్గరి నుండి జాతుల మీద దాకా, ప్రాంతాల దగ్గరి నుండి దేశాల మీద దాకా అమలు చేయబడుతుంది. మా స్వానుభవం నుండి కొన్ని సంఘటనలు వివరిస్తాను. 2001 లో మేం సూర్యాపేట లోని మా ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడ్డాక హైదరాబాదు, మెహదీపట్నంలోని నానల్ నగర్ బస్తీలో ఓ రేకుల గదిలో కొన్నినెలలు నివసించాము. అప్పట్లో మా ప్రక్క గదిలో ఒకామె, తన ముగ్గురు పిల్లలతో నివసించేది. చిన్న హాస్పటల్ లో పనిమనిషిగా పనిచేసేది. అక్కడుండగా, రెండున్నర నెలల పాటు నేను ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్ లో లెక్చరర్ గా పనిచేసాను. ఈ పనిమనిషి, సరిగ్గా నాకు క్లాసు టైముకి బాత్ రూం కి అడ్డం రావటం... గట్రాతో విసిగించేది. నేను ఎలాగో మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని.

కొన్ని రోజుల తర్వాత, నేను ఏరకం వస్త్రాలు ధరిస్తే ఆమె కూడా అలాంటివే ధరించటం, నేను ఏది చేస్తే ఆమె అదే చేయటం[ఆమె కూడా అదే వంట చేయటం గట్రా] చేసేది. మొదట్లో నేను అసలు గమనించలేదు. గమనించాకా పట్టించుకోలేదు. అయితే క్రమంగా ఈ పోలిక నన్ను ’అసహన పరచటమే’ లక్ష్యంగా సాగటం నాకు అర్ధమయ్యింది. చికాకు పెట్టటం, చీదర పెట్టటం- విసిగించటం! మేము ఒకటే అనుకునే వాళ్ళం - "మనమే వాళ్ళుండే బస్తీలోకి వచ్చాం! ’అలవి కాని చోట అధికులమనరాదు ’ అంటారు పెద్దలు. పట్టించుకోకపోతే సరి!’ అని. దాంతోనూ, భగవద్గీత సాయంతోనూ వాటిని దాటేసాం.

తర్వాత కాలంలో, శ్రీశైలంలో చిన్నస్కూల్లో టీచర్ గా పనిచేసాను. అక్కడా అంతే! యూకేజీ టీచర్ ఒకావిడ, నాగురించి "నాకు పోటీగా ఈ మధ్యే ఫలానా టీచర్ వచ్చింది" అన్నదని నాకు మరొకరు చెప్పటం... తద్వారా ఓ పోటీ, ఓ వైషమ్యం సృష్టించే ప్రయత్నం! నేను నవ్వేసి "ఆవిడ, నేను తనకి పోటీ అనుకుందేమో గానీ, నేను ఆవిడని, నాకు పోటీ అనుకోలేదండి! నేనెప్పుడూ నన్నునాతోనే పోల్చుకుని, నన్ను నేను improve చేసుకుంటాను" అని చెప్పాను. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి లెండి! తర్వాత.... తరచి చూస్తే... ’ఈ తంత్రం చాలా కార్యాలయాల్లో, చాలా రంగాల్లో, చాలా మంది అనుభవిస్తున్నదే’ అన్న విషయం మాకు అర్ధమైంది.

ఒకసారి గనక ఆ వైషమ్యంలోకి, పోటీ లేదా పోలిక లోకి పడ్డామా... ఇక అంతే! అక్కడక్కడే ’గుడుగుడుగుంజం’ ఆడుకోవాల్సిందే! మన ఆలోచనలు, ఆరిషడ్వర్గాలు అన్నీ ఆ బిందువు చుట్టే తిరుగుతాయి. అది దాటి ఆలోచించటం ఉండదు. ఇక అక్కడితో ఈ ’పోలిక లేదా పోటీ’ లో పడిన ఇద్దరు వ్యక్తుల అభివృద్ది ఆగిపోతుంది. ఇక ఈ జంట పీతలున్న సీసాకి మూతలెవరూ పెట్టక్కర్లేదు. ముఠాలు కట్టటం, ఒకరి మీద ఒకరు రాజకీయాలు అమలు చేయటంలలో మునిగిపోతారు. సామాన్య పరిభాషలో రాజకీయాలు అనే మాటకి కుట్రలూ కుతంత్రాలూ అన్న అర్ధం ఉంది. పై వాళ్ళకి ప్రత్యర్ధి మీద చాడీలు చెప్పటం, ప్రత్యర్ది గురించి చెడుప్రచారాలు చేయటం, ప్రత్యర్ధికి ఇతరులతో ఉన్న సంబంధాలు చెడగొట్టి తగవులు పెట్టటం, శాఖాపరంగా చెయ్యగలిగిన చెడు చేయటం గట్రా కుట్రలూ కుతంత్రాలూ అన్నమాట.

ఒక శీర్షిక క్రింద ఉప శీర్షిక ఉన్నట్లు, ఈ జాతర బొమ్మల తంత్రం, విభజించి పాలించమన్న తంత్రంలోని ఉప తంత్రమే! రాజకీయ రంగంలో సైతం బలంగా అమలు చేయబడిన, బడుతున్న స్ట్రాటజీ ఇది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం!

ఇలాంటి ఒక జంట పీతల సీసాలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ఉండేవాళ్ళు. ఇద్దరూ కాంగ్రెస్ లో సహ ప్రయాణీకులు. దాదాపు ఒకేసారి కెరియర్ ప్రారంభించిన వాళ్ళు. మధ్యలో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిపోవడంతో, అంతకు ముందు వరకూ కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు కాస్తా, తెదేపా లో చిన్నల్లుడిగా చక్రం తిప్పేసాడు. అప్పట్లో వై.యస్. ఏమనుకున్నాడో గానీ, 1995 లో మామని తోసి చంద్రబాబు స్వయంగా ముఖ్యమంత్రి అయి పోయినప్పుడూ..., ముఖ్యంగా 1999 ఎన్నికలలో ఎన్టీఆర్ గ్లామర్ గెలుపు కాకుండా తన ముఖంతోనే చంద్రబాబు గెలిచి, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాకా..., వై.యస్. ఆ దుఃఖాన్ని దాటలేకపోయాడు.

అసెంబ్లీ అప్పటి సమావేశాల్లో వై.యస్. గళంలో ఆ ఆక్రోశం చాలానే ఉండేది. ’ఇద్దరం ఒకేసారి కెరియర్ ప్రారంభించాము. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. రెండోసారి కూడా కుర్చీ ఎక్కేసాడు. నేనీ జన్మకి ముఖ్యమంత్రిని కాగలనో లేదో?’ అన్న ఆక్రోశం, అసహనం... వై.యస్. చేత... 2000 - 2001లలో అసెంబ్లీ సమావేశాలలో జరిగిన చర్చల్లో "అధ్యక్షా! తెలుగుదేశం ఆడగుండాలూ... బ్లేడులతో మా వాళ్ళని గాయపరచారు" అంటూ గొంతులో జీరల్నీ, దీర్ఘాలనీ పలికించింది. "అధ్యక్షా! ఇప్పటికే నా మీదా, నా కుమారుడి మీదా ఎన్నో కేసులు పెట్టారు. రేపెప్పుడో నా మనుమడి మీద కూడా ఏ పిడకలో దొంగి లించాడని, కేసులు పెడతారు?" అంటూ వ్యంగ్యంతో మేళవించిన ఆక్రోశాన్నీ, అసహనాన్నీ ప్రదర్శించింది.

అప్పటికే చంద్రబాబు నాయుడు అనే ’పై కారణంతో[over leaf reason]’ వై.యస్.అగచాట్లకి గురవుతున్నాడు. ఆ కసినే, వై.యస్. ముఖ్యమంత్రి అయ్యాకా, చంద్రబాబు పై ప్రతీకారంగా తీర్చుకున్నాడు. "తెదేపా ఫినిష్!" అన్నాడు. "చంద్రబాబుని [చెడుగుడు] ఆడుకున్నాం" అన్నాడు. చంద్రబాబు ఏమన్నా ’విలన్ నవ్వులూ, నాగ భూషణం నవ్వులూ’ నవ్వాడు. అలాగని చంద్రబాబు అప్పట్లో ఘోల్లు మన్నాడు. చివరికి కొడుకుల మధ్య కూడా పోలికలు తెచ్చుకున్నారు. చంద్రబాబు "మా అబ్బాయి లోకేష్ అమెరికా లో చదువుకున్నాడు. మీ జగన్ అమెరికా లో చదవలేక వెనక్కి వచ్చేసాడు" అంటూ ఎద్దేవా చేసాడు.

2004 తర్వాత, ఓ సారి ఉపఎన్నికల్లో వై.యస్. "శభాష్ so and so! ఉపఎన్నికల్లో చంద్రబాబుకి దీటుగా జవాబు చెప్పావు" అంటూ, "తెదేపా లో చంద్రబాబు ఉంటే మా పార్టీలో ఈ so and so ఉన్నాడు" అంటూ, పరోక్షంగా చంద్రబాబుని "నీ స్థాయి నాతోటిది కాదు. నా అనుచరుడైన ఈ జూనియర్ మంత్రి స్థాయి" అంటూ చంద్రబాబు అహం మీద కొట్టే ప్రయత్నం చేసాడు. ఇలాంటి విసుర్లు, పరస్పరం ఇద్దరూ ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు రెండో వాళ్ళమీద వేసినవే!

ఈ విధంగా ఈ ఇద్దరూ, ఒకరి మెడకి మరొకరు లంకె అయి, ఎప్పుడూ ’ఒక స్థాయి’ దాట కుండా ఉండేవాళ్ళు. ఇద్దరిలో ఒకరు పోయే వరకూ అదే స్థితి. ఇది అలాంటి ఏ ఇద్దరికైనా ఉండే స్థితి.

ఇక్కడ ఓ పోలిక చెబుతాను.

ఓ విశాలమైన మైదానంలో ఓ వెయ్యిమంది జనం ఉన్నారనుకొండి. వాళ్ళని 10 సమూహాలుగా విడదీసి, ఒకో సమూహాన్ని మైదానంలో ఒకో ప్రదేశంలో ఉంచారనుకొండి. ప్రతీ సమూహాన్ని మరో సమూహంతో విడదీస్తూ కొన్ని బారికేడ్లు ఉన్నాయి. ఆయా సమూహాలని ఆయా వ్యక్తుల ఎత్తుని బట్టి ఏర్పాటు చేసారు. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళంతా ఓ గ్రూపు, కొంచెం ఎత్తు మరో గ్రూపు... ఇలా. వారి ఎత్తుని బట్టి ఆయా బారికేడ్లు[అంటే హార్డిల్స్ వంటివి] ఉన్నాయి. ఒక సమూహంలోని వాళ్ళంతా ఐక్యంగా ఉంటే... క్రమంగా తమ స్థాయి [ఎత్తు] పెంచుకుని, తమను ఆపుతున్న హార్డిల్ దాటి, తము ఉన్న గ్రూపు నుండి పై గ్రూపులోకి ప్రమోట్ కావాలని ప్రయత్నిస్తారు. సాధారణంగా ఎక్కడైనా ప్రజలలో అత్యధికులు అనుచర మనస్తత్వం కలిగి ఉంటే, కొందరిలో నాయకత్వ లక్షణాలూ ఉంటాయి. ఎటూ అనుచర తత్త్వం గలవాళ్ళు ఎవరో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు. అందులోనూ పోటీ పడేవాళ్ళు , మరొకరితో లంకెలో పడతారు. ఇక నాయక లక్షణాలు గలవాళ్ళు కూడా తమతో పోల్చబడిన, పోటీ పడిన వారితో లంకెల్లో పడి, జాతర బొమ్మల్లా కొట్టుకుంటూ ఉంటారు.

దాన్ని దాటి ఏ ఒక్కడైనా తన ఎదురున్న హార్డిల్ దాటేస్తే... తను ప్రవేశించిన కొత్త సమూహంలో తిరిగి ఇదే స్థితి కొనసాగుతుంది. అప్పుడు మైదానంలోని ఈ వెయ్యిమంది జనాలనీ ఒక్కడే పర్యవేక్షించటం సులభ సాధ్యమవుతుంది. ఆ ఒక్కడూ కాస్త ఎత్తైనచోటులో కూర్చొని, అన్నీ చూడగల, పరిశీలించగల, సౌకర్యాలు కలిగి ఉన్నాడనుకొండి. అప్పుడు ఆ ఒక్కడు, మొత్తం వెయ్యిమంది మీదా దృష్టి పెట్టనక్కర లేదు. కేవలం జంట పీతల సీసాలు పరిశీలిస్తే చాలు, తమ నెట్ వర్కు సరిగ్గా నడుస్తుందో లేదో తెలిసిపోతుంది. ఇక హార్డిల్స్ దాటి గ్రూపుల్లో ప్రమోషన్ పొందుతున్న వాళ్ళ మీద దృష్టి పెడితే చాలు! ఎవరెవరిని ఎలా ఉపయోగించుకోవచ్చో వ్యూహా రచనలూ, అమలూ కూడా చేసుకోవచ్చు. అలాంటి ప్రమోటీలని ఉపయోగించుకుని, మరికొందరి మీద పర్యవేక్షణ బాధ్యతలనీ అప్పగించవచ్చు.

దీన్నే మరికొంత పెద్దపరిమాణంలో... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులూ రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగిస్తున్నారు.

ఇక్కడో విస్మయం కలిగించే విషయాన్ని పరిశీలించండి. ప్రతీ స్థాయిలోనూ ఓ నాయకుడికి, [ఓ హీరోకి, ఓ ఉన్నతాధికారికి, ఓ వ్యక్తికి] మరొక పోటీదారు, పోలిక గలవాడు లేదా జంట పీత/జాతర బొమ్మ ఉంటారు గానీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10లోని కీలక వ్యక్తులకి మాత్రం పోటీ ఉండదు. అద్వానీకి ప్రత్యామ్నాయం, అద్వానీతో పోల్చగలిగిన నేత, మరొకరు భాజపా లో లేనట్లుగా అన్నమాట! అలాగే, సోనియాతో పోల్చదగిన, పోటీ పడగలిగిన, మరో నేత కాంగ్రెస్ లో ఎవరూ లేనట్లుగా! అదే పీవీజీకైతే నెం టూ స్థానంలో మాధవ్ రావ్ సింధియా పేరూ వినబడింది, శరద్ పవార్ పేరూ వినబడింది. ఇలా ఇంకా ఇద్దరి పేర్లు కూడా వినబడ్డాయి. ఇంకా గతంలోకి వెళ్తే... ఇందిరాగాంధీకి, మొరార్జీ దేశాయ్ దగ్గరి నుండి బ్రహ్మానందరెడ్డి దాకా, చాలామంది పోటీ ఇవ్వగలిగారు. ఏకంగా రెడ్డి కాంగ్రెస్, ఆర్స్ కాంగ్రెస్, ఇందిరాకాంగ్రెస్ లుగా అఖిల భారత కాంగ్రెస్ ని విడదీయగలిగినంతగా! అధికారిక గుర్తు ఆవూదూడని లాక్కుని, కొత్త గుర్తు హస్తాన్ని , ఇందిరాగాంధీ అంగీకరించవలసినంతగా! రాజీవ్ గాంధీకి వీపీసింగ్ పోటీదారులాగా!

కాకపోతే, దాన్నే మీడియా, ’అది అద్వానీ సామర్ధ్యంగా, సోనియా దీక్షా దక్షతలుగా, పార్టీని ఏకతాటిపై నడపగలిగిన నాయకత్వం పటిమగా’ అభివర్ణిస్తుంది, భుజకీర్తులు తగిలిస్తుంది. ఇక్కడి పత్రికలలో పెద్దగా ఫోకస్ చేయబడక పోయినా... ఎర్రపార్టీ వృద్ధనేత జ్యోతి బసు, శివసేన బాల్ ధాకరే, ఎం.ఐ.ఎం. ఒకప్పటి నేత సలాఉద్దీన్ ఒవైసీ వంటి వాళ్ళు మరి కొందరున్నారు.

ఇక్కడ ఓ విచిత్రం ఏమిటంటే - అద్వానీ గానీ, సోనియా గానీ, తమ తమ పార్టీలలో తిరుగులేని, పోటీ లేని నాయకులైనా గానీ, జాతీయ స్థాయిలో కూడా ఇద్దరూ ఒకరికొకరు పోటీ కాదు. వాళ్ళ విషయానికి వచ్చే సరికి ఈ జంట పీతల, జాతర బొమ్మల స్ట్రాటజీ ఫలించదు. ఇద్దరూ ఎంతో హుందాగా, ఐక్యంగా ఉంటారు. ఒకరినొకరు విమర్శించుకోరు. ఒకరికొకరు అనుకూలంగా అంతర్గత సర్ధుబాట్లు చేసుకుంటారు. విస్మయ పరిచినా, ఇది నిజం!

ఇక మిగిలిన చాలామంది పరిస్థితి మాత్రం జాతర బొమ్మల వంటిదే. తమిళనాడులో ఒకప్పుటి సినీ సంభాషణల రచయిత కరుణానిధి, సినిమా హీరో ఎంజీఆర్ లది అదే పీతల సీసా. తర్వాత ఇద్దరి పార్టీలదీ అదే స్థితి. వెరసి తమిళ ప్రజలది మాత్రం ఈ రెండు పీతలలో ఏదో ఒక పీతని ఎన్నుకోక తప్పని స్థితి!

ఇది ఈ రాష్ట్రంలోని రెండు పార్టీలకే కాదు, ప్రపంచం మొత్తంగా కూడా అమలవుతున్న స్ట్రాటజీనే! ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది, నడిపింది అమెరికా రష్యా కూటములే. ఇవి పెద్ద పరిమాణంలో ఉన్న జంట పీతలన్న మాట.USSR కూలిపోయే వరకూ, అమెరికా గూఢచార సంస్థ CIA కి, రష్యా గూఢచార సంస్థ KGB జాతర బొమ్మ/జంటపీత. ఇర్వింగ్ వ్యాలిస్ వంటి వారి నవలల మొదలు హాలీవుడ్ సినిమాల వరకూ ఇదే పోలిక. నిజానికి [ఒకప్పటి] అగ్రదేశాలైన అమెరికా, USSR ల గూఢచార సంస్థలు కూడా, ఒకదానికొకటి లంకె వేయబడ్డాయంటే... వాటిని ఆడించిన, మరో బలమైన గూఢచార వ్యవస్థ ఒకటి ఉండాలి కదా! దానినే నకిలీ కణిక వ్యవస్థ అన్నాను.

చిన్న భూభాగమైన కొరియా అయినా అంతే! ఉత్తర దక్షిణ కొరియాలుగా దశాబ్ధాల పాటు అలాగే ఉండిపోగలవు. ఇక ప్రపంచ వ్యాప్తంగా జాతి వైరాలు చాలా మామూలు! ఇవన్నీ వేల సంవత్సరాలుగా ఉన్నాయి అంటారు కొందరు. ఇటీవలి శతాబ్ధంలో, దశాబ్ధాలలో మరింతగా పెరగటం, కొత్తవి పుట్టకు రావటమే ఇక్కడ విశేషం! భారత్, పాకిస్తానులని కూడా, ఇలాంటి జంట పీతల సీసాలో బంధించాలన్న ప్రయత్నమే, దాదాపు 60 ఏళ్ళుగాఅటు పాకిస్తాన్ పుట్టినప్పటి నుండీ కొనసాగింది. భారత్ మాత్రం ఇప్పటి వరకూ అదృష్టం కొద్ది జంటపీతగా మారలేదు. కాకపోతే చైనాని ఇప్పుడు కొత్తగా భారత్ కు జంట పీతగా చేయటానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం - ముస్లిమేతరం అన్నవి మరో రెండు జాతర బొమ్మలు/జంట పీతలు.

ఇక పశ్చిమాసియాలో శాంతి పేరిట, ప్రతీరోజూ వార్తా పత్రికలలో క్రమం తప్పక ప్రచురించబడిన, ఇజ్రాయేల్ - పాలస్తీనా యుద్దాలు, ప్రపంచ చరిత్రనీ, దృష్టినీ, కేవలం ఆ బిందువు చుట్టూ కొన్ని దశాబ్ధాల పాటూ తిప్పుకున్నాయి. రాజీవ్ గాంధీ హత్యని ముందస్తుగా హెచ్చరించిన పాలస్తీనా నేత యాసర్ ఆరాఫత్ మరణించాక, యుద్దాలు కొనసాగుతూనే ఉన్నా, ప్రాధాన్యత మాత్రం తగ్గిపోయింది. ’ఆయా ఘటనలని నడుపుతున్న నాయకులు మరణించాక, అది సర్ధుమణగటం సహజం’ అన్నమాట కేవలం పైకారణం[over leaf reason] వంటిది. ఆయా వ్యవహారాలని ఇక మూసేయాలను కున్నప్పుడు, అప్పటి వరకూ వాటిని నడుపుతున్న నాయకులు హత్యకో, సహజ మరణాలకో గురికావటం లేదా ఇతరత్రా రిటైర్ కావటం జరుగుతుంటుంది. మీడియా ప్రచారం, కేవలం పైకారణాలనే[over leaf reasonsనే] ప్రపంచం చేత నమ్మిస్తుంది. కొన్ని సహజ మినహాయింపులు ఉన్నాగానీ, అధిక శాతం ఇలా వ్యవస్థీకృతంగానే నడుపబడుతోంది.

ఈ విధమైన జంటపీతల బంధనాలు, దేశాల మధ్యనే కాదు, వ్యక్తుల మధ్యదాక ఉంటుందని పైన వ్రాసాను. అది రాజకీయ నాయకుల మధ్య నియోజక వర్గాల స్థాయిలోనే ఉంటుంది. సినిమారంగంలోనూ, వ్యాపారరంగంలోనూ, అక్కడ ఇక్కడ అనుకోనక్కర లేనంతగా, ప్రజా బాహుళ్యంలోకి ఈ ’పోటీ లేదా పోలిక’ దృక్పధం ప్రవేశ పెట్టబడింది. చివరికి మనం మన పిల్లలని కూడా, ప్రక్కవాళ్ళతో పోల్చి చదవమని సతాయిస్తూ ఉంటాం. అంతగా ప్రజల్లోకి ఈ దృక్పధం ఇంకించబడింది. అందులో ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ రచించిన వ్యూహమూ, అమలు పరచిన గూఢచర్యమే! చివరికి విద్యావిధానం దగ్గరి నుండి, వాణిజ్య ప్రకటనలలోని concepts దాకా, ఈ ’పోల్చుకోవటం’ అన్న దృక్పధాన్ని ప్రవేశపెట్టి ప్రచారించే తనమే ఉండటం గమనార్హం!

విభజించి పాలించే తంత్రంలో ఉపతంత్రం అయిన ఈ జంట పీతలు/జాతర బొమ్మలు ప్రయోగానికి తాజా సజీవ దృష్టాంతం ఒకటి సమైక్యాంధ్ర Vs తెలంగాణా అంశం. ఈ తంత్రంతో మన రాష్ట్రాన్ని, మనచేతులతోనే అన్ని రకాలుగా నాశనం చేయిస్తారు. మూల కారణం ఎప్పటికి మనం కనుక్కోలేం.

రెండో సజీవ దృష్టాంతం: వై.యస్. అర్ధంతర మరణం తర్వాత, చంద్రబాబు మీదికి మరో జంట పీత/జాతర బొమ్మ ప్రయోగింపబడుతోంది. అదెలాగంటే... తెరాస అధినేత కేసీఆర్...2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నాడు. కొన్నాళ్ళు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిపదవులు అనుభవించాక, తెలంగాణా ఏర్పాటు విషయమై యూపీఏ అధినేత్రి, కాంగ్రెస్సు తమకు హామీ ఇచ్చి, తర్వాత మాట తప్పాయంటూ బయటికి వచ్చారు. తదుపరి ’సోనియాని రోడ్డుకి లాగుతాను’ అంటూ కేసీఆర్ తన నోటి సహజ లక్షణాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. దరిమిలా 2009 ఎన్నికలకు ముందు, తెదేపా ఎర్రపార్టీలతో కలిసి ’మహా కూటమి ’ అన్నాడు.

ఇప్పుడు అదే నోటితో చంద్రబాబుని దుమ్మెత్తి పోస్తున్నాడు. తెలంగాణా కోసం, సెలైన్ బాటిళ్ళ సహితంగా నిరాహార దీక్ష కష్టాలు నటించాక, ’రాష్ట్రం ఏర్పాటు షురూ ’ అంటూ అధినేత్రి జన్మదిన కానుక ఇచ్చింది కాంగ్రెస్! ఆపైన ’ముందుకీ వెళ్ళం - వెనక్కీ తగ్గం’ అంటూ కొన్నిరోజులూ, ’ప్రతిపక్షాలూ, పార్టీల మాట తప్పాయి ’ అంటూ కొన్నిరోజులు గడిపింది కాంగ్రెస్! తర్వాత ’ఏకాభిప్రాయంతోనే ఏదైనా’ అంటూ రాష్టంలో మంటపెట్టింది కాంగ్రెస్!

అయితే కేసీఆర్ మటుకూ కాంగ్రెస్ ని ఏమనడు. పైగా జేఏసీ అంటూ... జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి వారితో కొత్తజట్టు కడతాడు. జేఏసీలో పార్టీలకి అతీతంగా అందరూ చేరాలన్న పిలుపుతో కూడా, విమర్శలు గురిపెట్టింది మాత్రం చంద్రబాబుపైనే! అతడి విషకౌగిలి నుండి తెదేపా తమ్ముళ్ళు బయటకు రావాలన్న పిలుపులు ఇచ్చాడు. నానా విమర్శలూ గుప్పించాడు. సామదాన భేద దండోపాయాలు తెదేపా మాజీమంత్రుల మీదా, ఎం.ఎల్.ఏ.ల మీదా గురిపెట్టబడ్డాయి. ఇతోధికంగా మీడియా, ఈ మానసిక యుద్ద తంత్రాన్ని తెదేపా మీదా, దాని అధినేత చంద్రబాబు నాయుడి మీదా, అతడి అనుచరుల మీదా ప్రయోగించింది.

ఆ విధంగా, ఇప్పుడు చంద్రబాబుకు కేసీఆర్ కొత్తగా లంకె వేయబడుతున్నాడు. బలంగానూ లంకె వేయబడుతున్నాడు. తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయాక కరుణానిధికి జయలలితని లంకె వేసినట్లన్న మాట. అసలు కేసీఆర్ అనబడే ఈ తెలంగాణా బొమ్మ, తెదేపా నుండి నాటకీయంగా బయటకు రావటం దగ్గరి నుండీ, ఇప్పుడు ఒకప్పుటి తన బాస్ కి [చంద్రబాబు విజన్ గొప్పదంటూ తానే పొగడ్తల వాన కురిపించిన బాస్] తానే జంట పీతగా, జాతర బొమ్మగా కేసీఆర్ పరిణమించటం వెనుక, చాలా విన్యాసాలే ఉన్నాయి. కథ పాతదే అయినా కథనం, నటీనటులు కొత్తవారైన గూఢచర్య రాజకీయ చలన చిత్రం అది! యధాప్రకారం ఈ సినిమా దర్శకుడు మాత్రం పాతవాడే! సినిమా రిలీజయ్యాక గానీ, మొత్తం కథనం అర్ధం కాదు మనలాంటి సామాన్య ప్రేక్షకులకి. ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది గదా! వేచి చూద్దాం ఏం జరుగుతుందో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

very cool and interesting one....

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu