నవంబరు 5 వ తేదీ, ప్రముఖ దినపత్రిక ఈనాడు లో ప్రచురితమైన, ఈ క్రింది వార్తని ఒకసారి పరిశీలించండి.



పైవార్తలో పన్ను ఎగవేత దారుల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సదరు సామాన్యుడు అవినీతిపై గెలిచాడు. కానీ జీవితంలో విఫలం చెందాడని ఉటంకించారు.

నిజానికి విఫలయ్యింది సామాన్యుడా? ఎంతమాత్రం కాదు.

1]. ప్రభుత్వ యంత్రాగం విఫలమయ్యింది :
ఎలాగంటే – సామాన్యుడికి ప్రతిఫలం/పారితోషికం/నష్టపరిహారం గట్రాలలో ఏది చెల్లించాలన్నా, సామాన్యుడికి ఏ మేలు చేయాలన్నా…..ఆ పని చెయ్యటానికి ప్రభుత్వ యంత్రాగానికి ఒక్కకారణం కనబడదు గానీ, చెయ్యకపోవటానికి వంద రూల్స్ కనబడతాయి. దాన్నే ఒక్కమాటలో చెప్పాలంటే ’రెడ్ టేపిజం’ అంటాం. ఈ రెడ్ టేపిజం చూపించటంలో, ’ఫిర్యాదీ, తన పనులు మానుకొని ఆఫీసుల చుట్టూ తిరగలేడు కదా’ అని ప్రభుత్యోద్యోగుల ఉద్దేశం.

2]. న్యాయస్థానాలు విఫలమయ్యాయి:
ఎలాగంటే - చాలా మామూలుగా, హైకోర్టు, కాశయ్య సమర్పించిన వివిధ పత్రాలు, నివేదికలు పరిశీలించి, అతడి విజ్ఞప్తి పై పునర్విచారణ చేసి ’అవకాశం ఉంటే న్యాయం చేయాలని’ 1995 నవంబరు 17 న ప్రభుత్వానికి సూచించింది. [అప్పటికి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి, చంద్రబాబు నాయుడు సెప్టెంబరు ౧ న ముఖ్యమంత్రి అయ్యాడు.] దాంతో బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకుంది. ఫిర్యాదీ, లాయర్ ఖర్చులు పెట్టుకుని, కోర్టు చుట్టూ ప్రతిసారి తిరగలేడు కదా!

3]. రాజకీయ నాయకులు విఫలమయ్యారు :
ఎలాగంటే - సాక్షాత్తు అసెంబ్లీలో దుమారం చెలరేగినా, అంతే ’మామూలు’గా అంతా సర్ధుమణిగి పోయింది. అప్పటి అధికార పార్టీ తెదేపా నాయకులు గానీ, అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ కాశయ్యకి న్యాయం చేయించలేక పోయారు.

4.] ప్రధానమంత్రి , రాష్ట్రపతి విఫలమయ్యారు:
ఎలాగంటే - ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు కీలకమైనవి, అత్యున్నతమైనవి. సామాన్యుడితో పోల్చుకుంటే అత్యంత శక్తివంతమైనవి. ఆయా పదవులలో ఎవరున్నా సరే! అయినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.

5]. రాజ్యాంగం విఫలమయ్యింది :
ఎలాగంటే - ఎంతగా ఇతర దేశాల నుండి కాపీ/పేస్ట్ చేసుకున్నా, అందులో కూడా, పైకి చెప్పుకోవటం కోసమన్నా, కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమైనా, దేశంలో అవినీతిని వెలికి తీసిన ఫిర్యాదీకి, పట్టుబడిన సొమ్ములో కొంత శాతం పారితోషికంగా ఇవ్వబడుతుంది.

దీన్ని గురించే రజనీకాంత్ ’శివాజీ’ సినిమాలో, ఐటీ ఆఫీసు ముందు బజ్జీల కొట్టులో శివాజీ, ఆది పాత్రల మధ్య సంభాషణ నడుస్తుంది.

అంతేకాదు. దొంగరవాణా అవుతున్న సరుకును పట్టి ఇచ్చిన ఫిర్యాదీకి కూడా, పట్టుబడిన సొమ్ములో కొంతశాతం బహుమతిగా ఇవ్వాలన్న నిబంధనలున్నాయి. ఆ విధంగా నిర్దేశించడంలో, ప్రజలే పోలీసులై, దేశాన్ని రక్షించుకోవాలన్న స్ఫూర్తి ఉంటుంది. ఎందుకంటే – ఎంత కాదన్నా, నేరస్తులతో [ఆర్ధిక నేరాలతో సహా] పోల్చుకుంటే, పోలీసుల సంఖ్య, తనిఖీ అధికారుల సంఖ్య, మొత్తంగా ఉద్యోగుల సంఖ్య తక్కువే ఉంటుంది. అదే ప్రజలే ఫిర్యాదు దారు మనస్తత్వం కలిగి ఉంటే, అప్పడు ప్రతి దొంగతనాన్ని, ప్రతి హత్యనీ పోలీసులే పట్టుకోనక్కర లేదు, ఛేదించనక్కర లేదు. అందులో ప్రజల ప్రమేయమూ తప్పక ఉంటుంది.

అందుకే…..ఆదాయపన్ను, స్మగ్లింగ్ వంటి విషయాల్లో అలాంటి నిబంధనలు ఉంటాయి. కనీసం పారితోషకాన్ని [ప్రతిఫలాన్ని కోరి అయినా పనిచేయటం] ఆశించి అయినా, జనం అవినీతి పై కాపలా కాస్తారు. అప్పుడు ‘ధనికులు అత్యంత ధనికులు అవ్వటం, పేదలు మరింత పేదలవ్వటం కొంత నియంత్రింపబడుతుంది’ అన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశం.

ఇక్కడో విషయం గమనించండి. ఒక ఫిర్యాదీ ఆదాయపు పన్ను ఎగవేత దారుల గురించి సమాచారం ఇచ్చాడనుకొండి. ప్రభుత్వానికి ఓ 70 కోట్లు జమ అయ్యాయి. అది నిజానికి ఏ 700 కోట్లో ఉందనుకొండి. మిగిలిన కోట్లు వదిలేసినందుకు సదరు అధికారులకి,[క్రింది నుండి పైదాక అన్ని స్థాయిల్లోనూ], స్థానికం నుండి కేంద్రం దాకా రాజకీయ నాయకులకి వాటాలందాయనుకొండి. తమకు ఇంత ’జిడ్డు’ వదల గొట్టినందుకు సదరు ఫిర్యాదీ మీద ఆ పన్నుఎగవేత దారులకి అరికాలి మంట నెత్తి కెక్కటం ఖాయం.

దాంతో మరికొంత నష్టం అనుకుని, ఆయా ఆదాయపన్ను ఎగవేతదారులు, సదరు ఫిర్యాదీని వేధించినందుకు అధికారులకి మరికొంత ముట్టచెబుతామంటే చాలదా?

దీన్నే సినిమాల దగ్గర నుండి వాస్తవం దాకా అంతటా చూస్తున్నాము. చివరికి సంపూర్ణంగా హాస్యప్రధానమైన ’హలో బ్రదర్’ వంటి సినిమాల్లో సైతం అవినీతిని ఎదుర్కొన్నందుకు పోలీసు అధికారి [కోట శంకర్రావు నటించిన పాత్ర] హత్యకు గురవుతాడు. ఫిర్యాదు చేసిన/సాక్ష్యం చెప్పిన హీరో చెల్లెలు అపవాదులకి గురవుతుంది. యధాప్రకారం ఈ సినిమాలోనూ జడ్జీలు దేవుడి తీర్పులు ఇచ్చేసారు.

ఈ విధంగా అన్నిమార్గాల్లో, అన్ని కోణాల్లో సామాన్యుడికి చెప్పబడేదేమిటంటే “అవినీతి మీద ఫిర్యాదు చేయకు. తలవంచుకునిపో!” కాబట్టి “ఇంతమంది రోడ్డుమీద వెళ్తున్నారు. లేదా ఇంతమందికి ఇది తెలుసు. వాళ్ళెవరైనా ఫిర్యాదు ఇచ్చారా? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పనులున్నాయి. నీకేం పని లేనట్లుంది. ఈ పిచ్చితనం వదిలేసి….. ఏదైనా పనికొచ్చేపని, దమ్మిడిలొచ్చే పని చేసుకో!” అనే మాటలు వినబడుతూ ఉంటాయి.

ఏమయినా, జయప్రదంగా ’సామాన్యుడిని విఫలం చేయటం’ అనే పనిని, ప్రభుత్వ యంత్రాంగం దగ్గరినుండి, అత్యున్నత కోర్టుల దాకా, అందరూ చేశారు కాబట్టే, రాజ్యాంగం విఫలమయ్యింది.

ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే –
మీడియా కూడా విఫలమయ్యింది :
ఎందుకంటే - ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనా, రాజకీయ నాయకులు విఫలమైనా, రాజ్యాంగం విఫలమైనా….. సామాన్యుడి క్షేమం కోసమే అహరహము తహ తహ లాడుతుంటామని, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటమే తమ నైజమనీ, నీతి నిజాయితీలకు తాము నిలువెత్తు రూపాలమనీ చెప్పుకునే మీడియాకి, ఓ సామాన్యుడి పోరాటం కనబడలేదా?

ఇందరికి ఇన్ని లేఖలు పంపుకున్న, ఆ సామాన్యుడు, మీడియాకి కూడా సమాచారం ఇచ్చే ఉంటాడు కదా? మరెందుకు ఈ 14 ఏళ్ళలోనూ స్పందించలేదు? అసలు అసెంబ్లీలో దుమారం రేగినప్పుడైనా మీడియా దృష్టికి ఈ విషయం వెళ్ళి ఉంటుంది కదా? మరెందుకు follow up చెయ్యలేదు? అసలింతగా అన్ని విభాగాలూ విఫలమౌతుంటే మీడియా ఎలా కిమ్మన కుండా ఉంది?

ఇప్పుడు ఇలాంటి వార్తలని, ఇంత లావాటి శీర్షికలలో ప్రచురిస్తూ కూడా, మీడియాతో సహా, ప్రభుత్వయంత్రాంగమూ, రాజకీయరంగమూ, అంతా కలిసి వ్యవస్థీకృతంగా, సామాన్యుడికి చెప్పకనే చెబుతోంది ఒకటే –
’అవినీతిపై పోరాడకు – అందులో పొర్లాడు’ అని!

కాబట్టే అవినీతి ఇంత వ్యవస్థీకృతంగా నడుస్తోంది. అవినీతిపై ఫిర్యాదు వేసినా, దానికి వ్యతిరేకంగా పోరాడినా, అంతే వ్యవస్థీకృతంగా వేధింపు నడుస్తోంది.

మరోసారి ఆ వార్తని పరికించి చూస్తే….. ‘ఈనాడు’ ఇలాంటి వార్తని ప్రచురించి సామాన్యులకి ఏమని సంకేతాలిస్తోంది? అవినీతిపై విజయం సాధించినా, జీవితంలో ఓడిపోతావంటూ – సామాన్యులకి ఏమని సందేశాలిస్తోంది.

’అవినీతి పై పోరాడకు! అందులో పొర్లాడు’ అనేగా?
పై వార్త చదవగానే, మాకు, సూర్యాపేటలో మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి గుర్తొచ్చింది. ఆమె నన్ను నానా దుర్భాషలాడుతూ “నువ్వు చదువుకున్నావు గానీ, నీకు తెలివి లేదు. అలా కాదు ఇలా అని మాట్లాడుకుంటారు గానీ కంప్లయింట్లు పెట్టుకుంటారా?" అంది.

అప్పట్లో ఆ మాట మాకసలు అర్ధం కాలేదు. [దాని పూర్వాపరాలు మీరు నా గత టపాలలో చదివి ఉన్నారు.] అయితే 2007 మార్చిలో, రామోజీరావు మాపై చేస్తోన్న వ్యవస్థీకత వేధింపు గురించిన సాక్ష్యాలతో సహా, ఈనాడు పోటీ పత్రిక ’వార్త’ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు, అక్కడి ఉపసంపాదకుడు నాతో “చూడమ్మా! నేను ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసాను. లంకలో కూడా పనిచేసాను. ఎల్.టి.టి.ఇ. సానుభూతి పరుణ్ణని జైల్లో కూడా కొంతకాలం ఉంచారు. అనుభవంతో చెబుతున్నాను. మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు ఇచ్చిన ఈ వివరాలతో మేం పత్రికలో వేస్తాం. ఓ మూడు నాలుగురోజులు ఇది సంచలనం అవుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మీ బ్రతుకు మరింత దుర్భరం అవుతుంది. పెద్దవాడిగా చెబుతున్నాను. కావాలంటే మీకు ఆర్ధికసాయమైనా చేస్తాను. మీరు చుట్టుప్రక్కల గిరిజన గ్రామాలకి వెళ్ళి సామాజిక సేవ చెయ్యండి. వాటి గురించి మాకు ఆర్టికల్స్ వ్రాసి పంపండి. మేం పూర్తిగా సపోర్టు చేస్తాం” అంటూ…..ఇంకా చాలా చెప్పాడులెండి. ఆ వివరాలన్నీ మా కథకు సంబంధించిన గత టపాలలో వ్రాసాను.

వెరసి అతడు పెట్టిన ఆఫర్ మాకు అర్ధమయ్యింది. ’మీకు పేరు ప్రఖ్యాతులు కావాలసి ఉంటే, డబ్బుతో పాటు గొప్ప సామాజిక సేవకులుగా మీకు ఇమేజి ఇస్తాం. ఇలాంటి కేసులు పట్టుకు వేళ్ళాడకండి. ఇవాళ రేపు ఇది బ్రతక నేర్చినతనం కాదు’ అని!

ఆ ఆఫర్ కి ఒప్పుకుంటే అవార్డులూ, రివార్డులూ రావటం పెద్దవిషయం కాదన్నది మాకు స్పష్టంగానే అర్ధం చేసేప్రయత్నం చేసారు. ఇలాంటి అనుభవాలు మరికొన్ని ఉన్నాయి. మాకే కాదు, మాలాగా ఎవరు చేసినా, మా స్థానంలో ఎవరు ఉన్నా, పరిస్థితి ఇలాగే ఉంటుంది. దాన్నే ’సూర్యాపేట’ న్యూస్ టుడే వారు వ్రాసిన కాశయ్య వార్త మరోమారు నిరూపించింది.

ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రముఖ నిస్వార్ధ సామాజిక సేవకుడూ, బాబా ఆమ్టే కుమారుడూ, ప్రకాష్ ఆమ్టే స్వంతమాటల్లో చెప్పాలంటే – “నిజానికి ఈ గిరిజనుల బ్రతుకు దుర్భరం చేస్తోంది ప్రభుత్వ అధికారులూ, అటవీ శాఖ ఉద్యోగులే. కాని వారి అవినీతి గురించి మనం ఒక్కమాట అన్నా, ఇక ఒక్క గిరిజనుడికి కూడా మనం మేలు చేయలేం. అందుచేత మేం అవినీతి గురించి జోక్యం చేసుకోం. మాకు చేతనైనంతలో గిరిజనుల బ్రతుకులు అభివృద్ధిలోకి తేవటానికి కృషి చేస్తాం. వారికి అక్షరాస్యత, చదువు నేర్పటం, ఆరోగ్యం, వృత్తి నైపుణ్యాలు, ఇతర సామాజిక అంశాల మీద అవగాహన తేవటం వంటి వాటి ద్వారా మా కృషి జరుగుతుంది.”

అంతగా అవినీతి పేరుకు పోయిందన్నది వాస్తవం. అవినీతిని ఎదురించవద్దనీ, ఎదిరిస్తే చేయగలిగింది శూన్యమనీ, సమాజానికి ఏమాత్రమన్నా మేలు చేద్దామనుకునే వాళ్ళకి సైతం, ఇంకించడం అంతకంటే వాస్తవం!

అందుకే, మా కథ వ్రాసినప్పుడు అది మా కథ, మీ కథ, మన కథ - సామాన్యుడి కథ అని వ్రాసాను. ఈ విధంగా సామదాన బేధ దండోపాయాలని రకరకాల Permutation and Combination లో ఉపయోగించి, సామాన్యులకి, అవినీతి పరులతో నిండిన ప్రభుత్వ యంత్రాంగమూ, రాజకీయ రంగమూ, మీడియా…. ఇచ్చే సందేశం ఏమిటంటే,

“అవినీతి పై పోరాడకు – అందులో పొర్లాడు” అని.

ఇక ఈ టపా ముగించే ముందు మరో ఆసక్తికరమైన విషయం చెప్పకపోతే నిండుదనం ఉండదు. ఈ మధ్య వార్తాపత్రికలు కొత్త కొత్త సూక్తులూ, ఎప్పుడూ వినని, చదవని పెద్దల నుడికారాలూ ప్రచారిస్తున్నాయి.

మచ్చుకు కొన్ని –
నీ తప్పుల్ని తెలియజెప్పినందుకు నీ శత్రువుని ప్రేమించు.
పశ్చాత్తాపం పొందితే శతృవునైనా క్షమించు.
శతృవుని సైతం ప్రేమించగలవాడే మోక్షానికి అర్హుడు.
గట్రా గట్రా
ఇప్పటికి, సమాజంలోకి ’పంపిణీ’ చేసిన కుహనా భావావాదం చాలక, ఇలాంటి కుహనా సుద్దులు కూడా నన్నమాట.

నిజానికి శతృవు గురించి, శతృ సంహరాన్ని సంపూర్ణంగా నిర్వహించిన కురుక్షేత్రం యుద్ధం కంటే గొప్పగా చెప్పగలది మరొకటి లేదు. విషాదంలో మునిగిన అర్జునుణ్ణి, గీత ద్వారా అనేక విధాల చైతన్యవంతుణ్ణి చేసిన శ్రీకృష్ణుడు, స్వయంగా తాను పగ్గాలు చేతబట్టి, సారధ్యమూ, మార్గదర్శకత్వమూ వహించి మరీ శతృసంహారం చేయించాడు. శతృవుని ప్రేమించమనో, క్షమించమనో చెప్పలేదు.

ఎందుకంటే – ధర్మగ్లాని చేసిన వాడు మనిషికి శతృవు కాదు, మానవత్వానికే శతృవు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ధర్మగ్లాని చేసిన వాడు మనిషికి శతృవు కాదు, మానవత్వానికే శతృవు!--
అందుకని అటువంటివారిని తీవ్రాతితీవ్రంగా శిక్షించాల్సి ఉంది. ఉపేక్ష అస్సలు పనికి రాదు. కాని ప్రస్తుతం జరుగుతున్నది ----????????

కాసయ్యకి న్యాయం జరగాలని డిమాండ్ చేసే సంఘాలేమీ లేవా, కనీసం కమీషన్ తీసికొని పోరాదేవి అన్న పర్వాలేదు :)

మనం మాత్రం ఏమి చేస్తున్నాము చదివి వదిలెయ్యడం తప్ప. ఇంకా ఇలాంటి న్యూస్ వాళ్ళ ముందు ముందు ఇంఫోర్మేర్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది :) .... కాబట్టి ఈ పోస్ట్ కాని, పేపర్ న్యూస్ కాని ఇంకెవరూ చూడకూడదు అని కోరుకుంటున్నాను :P

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu