ఆగస్టు 31, 2009 న వచ్చిన ఈక్రింది వార్త చూడండి.
వార్తాపత్రికలో వచ్చిన వార్తాంశాన్ని యధాతధంగా ప్రచురించాను.

>>>వేములవాడ, సిరిసిల్ల, న్యూస్ టుడే: ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పాలకులు కష్టాల మొర ఆలకించలేదు. కన్నీళ్ల కడలి నుండి ఎవరూ ఒడ్డుకు చేర్చలేదు. ఇక తన కుటుంబానికి దేవుడే దిక్కంటూ… సమస్యల భారాన్ని కాశీ విశ్వనాధుడికే వదిలేసి ఓ నేత కార్మికుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. దక్షిణ కాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా, వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయంలో, ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గర్భగుడిలో తెల్లవారుజామున మృత్యుగంటలు మోగించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కు చెందిన సిరిమల్ల సుధాకర్[45] కొంతకాలంగా అప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం రోజులుగా ఆయన వేములవాడలోనే ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారు తన కుటుంబానికి రాజన్ననే [ముఖ్యమంత్రి కాదు] దిక్కంటూ స్వామివారిని దర్శించుకున్న అనంతరం, గర్భగుడి సమీపంలోనే కోడెల క్యూ లైన్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సుధాకర్ తన భార్య అనురాధ, కూతురు ఆమని[15], కొడుకు అనిల్[10] లతో సిరిసిల్లలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. మరమగ్గాల కార్మికుడైన అతను, ఆరునెలల క్రితం తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం అప్పులు చేశాడు. అనారోగ్యానికి అప్పుల బాధ తోడడవంతో వారంరోజుల కిందట సుధాకర్ ఇంట్లో చెప్పకుండా వేములవాడ ’రాజన్న’ ఆలయానికి చేరాడు. విషయం తెలుసుకున్న భార్య అనురాధ అతన్ని వెతుక్కుంటూ వేములవాడకు వచ్చింది. ఇంటికి రావాలని కోరగా, రెండుమూడురోజులు దైవసన్నిధిలో గడిపి వస్తానని సుధాకర్ భార్యతో చెప్పి వెనక్కు పంపారు. దీంతో అనురాధ భర్త చేతిలో రూ.50 పెట్టి, జాగ్రత్తలు చెప్పి సిరిసిల్లకు వచ్చింది. ఆదివారం ఉరివేసుకుని సుధాకర్ మృతి చెందాడని వారికి సమాచారం అందింది. సుధాకర్ కుమారుడు అనిల్ మూడో, కూతురు ఆమని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇటీవల పొదుపు సంఘంలో రూ.50 వేలు అప్పు చేసిన అనురాధ, భర్త వైద్యానికి ఖర్చు చేసింది. పలుచోట్ల వడ్డీలకు అప్పులు తెచ్చారు. అనురాధ బీడీ కార్మికురాలిగా పని చేస్తూనే, పెళ్ళిళ్ళు శుభకార్యాలకూ కూలీగా వెళ్తుంటుంది. సుధాకర్ మరణంతో ఆ కుటుంబం అనాధగా మారింది. సుధాకర్ బలవన్మరణంపై సిరిసిల్ల తహసీల్ధార్ వనమాల చంద్రశేఖర్ విచారణ జరిపి, ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం రాత్రి కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. వేములవాడ ఎస్.ఐ. వెంకటనర్సయ్య కేసు నమోదు చేశారు.”
రాజ్యాంగం ప్రకారం తాసీల్దారు, కలెక్టరు, ఎస్.ఐ. తమ విధి తాము నిర్వర్తించారు. ప్రభుత్వం Perfect గా పనిచేసింది.

దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కనుకుని, పాపం, ఈ పేద నేత కార్మికుడు, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దరిచేరి ఉరిపోసుకు మరణించాడు. ఇతడి చావు ఎవరికీ పట్టలేదు. ఇతడు ముంభైలోని అయిదునక్షత్రాల తాజ్ హోటళ్ళలో బసచేసి, ముష్కరుల దాడిలో మరణించలేదు. లేదా విమానంలోనో, హెలికాప్టర్ లోనో ప్రయాణం చేసి ప్రమాదవశాత్తూ పరమపదించలేదు. ఎందుకంటే ఇతడికి డబ్బులేదు, అధికారం లేదు. అప్పులున్నాయి, జబ్బులున్నాయి. కాబట్టే ఈ నిరుపేద నేత పనివాడి చావు ఎవరికీ పట్టలేదు. కాబట్టే ఏ బర్కాదత్ లూ ఇతడి మరణ విశేషాలని టీవీ ప్రేక్షకులకి అందించటానికి పరుగులు పెట్టలేదు. ఏ టివీ-9 లాంటివాళ్ళు ఇలాంటి వాళ్ళ మరణాల మీద చర్చకార్యక్రమాలు పెట్టలేదు. ఏ మీడియా సంస్థకూడా ’ప్రత్యక్ష ప్రసారాలు’ చేయలేదు.

అప్పులతో, దారిద్ర్యంతో నేలరాలిన ఈ సామాన్యుడి ప్రాణం ఒక్కటే కాదు, ఇలాంటి అభాగ్యులు ఎందరో? ఈనెల మూడవ తారీఖు తర్వాత, అభిమానంతో గుండెలాగి మరణించిన భక్త పౌరుల గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. ఎటూ వాళ్ళకి ఎక్స్ గ్రేషియోలు ప్రకటించడానికి ప్రభుత్వాధినేతలు క్యూలో ఉన్నారు. పాపం! ఏ దిక్కూలేని ఈ పేద నేతవాడు, గుడిలో ఉరిపోసుకు ఉసురు తీసుకున్నాడు.

కానీ,
కాశీవిశ్వనాధుడని పిలిచినా, వేముల వాడ రాజరాజేశ్వర స్వామి అని పిలిచినా, శ్రీశైల మల్లిఖార్జునుడని పిలిచినా, రుద్రకోటేశ్వరస్వామి అని పిలిచినా… మల్లయ్య స్వామి చల్లని తండ్రి!!!
ఇవన్నీ చూసి ఎలా సహిస్తున్నాడో???

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu