అది ఒక కాలనీ. మధ్యతరగతి ప్రజలూ, ఎగువమధ్య తరగతి ప్రజలూ నివసించే కాలనీ. ఉదయాన్నే కాస్తంత చల్లగాలితో పాటూ, తోపుడు బండ్ల మీద వేసుకునీ, నెత్తిమీద గంపపెట్టుకునీ కూరగాయలమ్మే వారి కేకలతోనూ, సైకిళ్ళ మీద బుట్టతగిలించుకుని తాజా ఆకుకూరలమ్మే వారి అరుపులతోనూ, ఆ కాలనీ వీధులు ఒకింత సందడిగా ఉంటాయి. వాళ్ళంతా చిన్న వ్యాపారులే. ఉదయాన్నే లేవగానే, మార్కెట్టుకు వెళ్ళి కూరలు కొని, మారుబేరానికి వినియోగదారుల గడపకొచ్చి అమ్ముకునే అతి చిన్న వ్యాపారులు. అయితేనేం, ఉదయాన్నే డ్యూటిలో చేరి, బాస్ లకి దండాలు పెట్టాల్సిన అవసరంలేని స్వతంత్రులు. వారి చిన్న వ్యాపారాలతో భోగభాగ్యాలు సంపాదించలేకపోయినా, సుఖశాంతులు పొందుతున్నవారు. కూడుగుడ్డలకు లోటు లేకుండా బ్రతుకుతున్నవారు.

ఇంతలో ఆ కాలనీలోకి ఓ సూపర్ మార్కెట్టు వచ్చింది. అద్దాలస్ప్రింగ్ డోర్లు, ఏసీలు, వరుసగా అలమారల్లో అందంగా సర్ది ఉంచిన శుభ్రపరిచిన సరుకులూ, చక్కని ప్యాకింగుల వస్తువుల్ని మరింత చక్కగా ప్రదర్శిస్తూ సర్ది ఉంచిన ఫ్యాన్సీ సామానులు, గేటు దగ్గర వాచ్ మేన్, కౌంటర్ లో కంఫ్యూటర్, హంగూ, హంగామా! మనవీధి చివర చిన్న కొట్లో, బస్తాల్లో ఉంచిన పప్పులూ, ఉల్లిపాయలు, మనం అడిగాక తూకం వేసి కవర్లో కట్టి ఇచ్చే దుకాణదారునితో పోలిస్తే, ఏ వస్తువులు కావాలో ఎవర్నీ అడగకుండా, ఎదురుగా ఉన్న అలమారల్లోంచి తీసుకుని, ట్రాలీలో వేసుకుని, బిల్లు వేయించుకోవడమే! షాపింగ్ చెయ్యటం ఎంతో సులభం, ఎంతో సౌఖ్యం. పైగా సూపర్ మార్కెట్ల వారిచ్చే గిప్ట్ కూపన్లు, చిన్ని చిన్న బహుమతులూ, అదనపు ఆకర్షణలు. అదే మార్కెట్టులో, నీటిబిందువులు పరచుకున్న పాలిథిన్ కవర్లలో నవనవలాడుతున్న కూరగాయలు! మన ఇంటి ముంగిట కొచ్చే కూరలమ్మి దగ్గరున్నంత తాజాగా. ఇంకా చెప్పాలంటే మరింత తాజాగా! ఏసీలో ఉన్నవయ్యె! ఇంకా చిత్రం! కూరలమ్మి కంటే మరింత చౌకగా! కూరలమ్మిని అర్ధరూపాయ తగ్గించమంటే అయిదునిమిషాలు నసపెడుతుంది. ఉదయపు హడావుడిలో, అఫీసులకీ, స్కూల్స్ కి, కాలేజీలకి పరుగులెత్తాల్సిన సమయంలో ఐదు నిముషాలు వృధా అయితే అన్నిపనులూ ఎంత ఆలస్యం అవుతాయి? అలాంటిది, ఏ గొడవా లేకుండా ఎంతో ప్రశాంతంగా సూపర్ బజార్లో సూపర్ కూరగాయలు, చీపర్ ఖరీదులో! ఇంకేం కావాలి? క్రమంగా కాలనీలో అందరూ సూపర్ బజార్ కి అలవాటు పడ్డారు. వీధి చివర దుకాణాల్లో రద్దీ తగ్గింది. కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. కొన్ని దుకాణాలని గదులుగా మార్చేసి అద్దెలకిచ్చేసారు. మెల్లిగా ఇంటిదగ్గర కొచ్చి కూరలమ్మే వాళ్ళు తగ్గిపోయారు. కొన్నాళ్ళకి పూర్తిగా కనుమరుగయ్యారు. బహుశః వాళ్ళు కూలీలుగానో లేక సూపర్ మార్కెట్టులో స్వీపర్లుగానో మారిపోయి ఉంటారు.

ఈస్థితి బాగా బలపడ్డాక, అప్పుడు సూపర్ మార్కెట్ యాజమాన్యం కొరడా ఝుళిపించింది. అక్కడి సరుకుల ధరలకు నానాటికీ రెక్కలు వచ్చాయి. కాలనీ వాసులకి ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు. సూపర్ మార్కెట్టే ఆధారం. లేదంటే కాలనీ నుండి సుదూర మార్కెట్లకి వెళ్ళాలి. అక్కడా ఇదే స్థితి. ఇక రవాణా ఖర్చుల దండుగ తప్ప ఒనగూడే లాభం ఏదీ లేదు. ఇంతకాలం, అంటే కాలనీ వాసుల ప్రత్యామ్నాయాలన్నీ మూతపడేవరకూ, సూపర్ మార్కెట్టు వేచి ఉంది. అప్పటి వరకూ ఇచ్చిన చౌకధరలు కూడా తన పెట్టుబడిలో భాగంగా పరిగణించుకుంది. Establishment కీ, Promotions కీ కూడా, తగినంత బడ్జెట్ కేటాయించుకుంది. ఇప్పుడు ఏకైక ప్రత్యామ్నాయం [Monopoly గా] మారాక, ఇక ఇప్పుడు అంతకంతా లాభాలు వేసుకోవడం మొదలైంది. గడపదగ్గరికొచ్చే కూరలమ్మితో గద్దించి బేరాలాడిన కాలనీవాసులు, సూపర్ మార్కెట్లో కంఫ్యూటర్ ముందు కూర్చున్న మార్కెటు ఉద్యోగి దగ్గర బుద్దిగా బిల్లు చెల్లించారు.

ఏసీ మార్కెట్లో కూడా, ధరల పట్టిక చూసి చెమట్లుపట్టాయి. “ఇదేమిటమ్మా ఇంతగా రేట్లు పెరిగిపోయాయి?" అంటే అద్ధాల అలమార దగ్గర వినియోగదారుల సహాయార్ధం నిలిచి ఉన్న అమ్మాయి చక్కని చిరునవ్వే సమాధానం.

ఇది ఒక్కకాలనీ కథకాదు. అన్నికాలనీల కథ. మన కాలనీ కథ. ఇలా ఒకే సంస్థ, మిగిలిన చిన్న సంస్థల్ని కబళించి ఏకైక ప్రత్యామ్నాయం [Monopoly గా] మారకుండా నియంత్రించాల్సిన ప్రభుత్వం, ఆయా పెద్దసంస్థల దగ్గర నుండి వస్తున్న ఆదాయవనరులతో ఆనందపడి హాయిగా ఉంటుంది. ప్రభుత్వం అంటే అధికారులూ, మంత్రిపుంగవులూ అన్నమాట. కాబట్టే కార్పోరేట్ సంస్థలు – సూపర్ మార్కెట్లుగానూ, సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళు గానూ, సూపర్ డూపర్ విద్యాసంస్థలు గానూ, మరింకెన్నో రూపాల్లోనూ విస్తరిస్తూ యద్ధేచ్ఛగా దోపిడి చేస్తున్నాయి.

ఇదంతా మనకి తెలిసిన, మనం బాగా అలవాటు పడిపోయిన విషయమే. అయితే ఒకచోట దోపిడికి అలవాటు పడి, సర్ధుకుపోవటం మొదలెట్టాక, ఇక అది అంతటితో ఆగదు కదా! ఇక ఇప్పుడు, ఆ దోపిడి, మన జీవితాల్లోకి మరెంతగా చొచ్చుకు వస్తోందో, మీకు ఓ చిన్న దృష్టాంతంతో వివరిస్తాను.

ఇవి విద్యా సంవత్సరం ప్రారంభదినాలు. 10వ తరగతి ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. పది ఉత్తీర్ణీత పొందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులూ కాలేజీల్లో ప్రవేశం కోసం ప్రయత్నల్లో పడ్డారు. ఓపగలిగిన వాళ్ళు, ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు కార్పోరేట్ కాలేజీలకి [శ్రీ చైతన్యలూ, నారాయణలూ అంటూ] 47 వేల రూపాయలు నుండి 65 వేల రూపాయల దాకా ఫీజులు కట్టుకుంటూ చేరుతున్నారు. ‘బి’ సెంటర్లలోనూ, చిన్నా చితకా ప్రైవేటు కాలేజీల్లోనూ, చదువుకునేందుకు, ఎవరి ఆర్ధిక స్థాయిని బట్టి వారు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ నేపధ్యంలో – ఆరేడు సంవత్సరాల క్రితం కార్పోరేట్ కాలేజీలు, ప్రభుత్వాన్ని వత్తిడి చేసి, తమకు అనుకూలమైన నిర్ణయాలు ఇప్పించుకుంటున్నాయని, దాంతో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని, ప్రైవేట్ చిన్నకాలేజీల యాజమాన్యాల సంఘాల అలజడి, అందోళనా చేసాయి. అదెలాగో మెల్లిగా సర్ధుమణిగింది. అప్పట్లో కార్పోరేట్ కాలేజీలు పదవతరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్ధులకి ఉచిత విద్యావకాశాలు ఇస్తోన్నట్లు ప్రచారించాయి, నిజంగా ఇచ్చాయి. బాగా చదివే విద్యార్ధులకి కార్పోరేట్ కాలేజీలు ఇచ్చిన ఈ అవకాశం అందరి నుండి అభినందనలకు పాత్రమైంది. తమ PRO [Public Relation Officer లు. సాధారణంగా వీరు కమీషన్ల మీద పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు టీచర్లు అయి ఉంటారు] ల ద్వారా ఈ స్కీములని బాగా ప్రచారం చేసారు. [ఈ స్కీము మొదలుపెట్టినప్పుడు పదవతరగతిలో అత్యధిక మార్కులు పొందిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది.] క్రమంగా ఈ స్థితి ప్రైవేటు, చిన్న కళాశాలకు కూడా అనివార్యం అయ్యింది. పల్లెలలో ఉన్న పిల్లల తల్లిదండ్రుల దాకా లోతుగా చేరింది. చదువురాని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి పదవతరగతిలో మంచిమార్కులు వస్తే కాలేజీలో ఫ్రీసీటు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ ‘ఫ్రీసీటు’ ప్రభుత్వం ఇచ్చేది కాదు. ప్రైవేటు చిన్న కాలేజీలు ఇచ్చేది. పోటాపోటీలుపడి, ఫ్రీసీట్లు ఇచ్చి, ఇల్లిల్లూ తిరిగీ, నేడు ప్రైవేటు పాఠశాలలూ, కళాశాలలూ విద్యార్ధుల్ని పోగు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు గురువుని వెదుక్కుంటూ శిష్యులు దేశదేశాలు తిరిగేవారు. ఇప్పుడు శిష్యుల్ని వెదుక్కుంటూ గురువులు [పాఠశాలలు, కళాశాలల యజామాన్యాలు గురువులు అను కునేటట్లయితేనే సుమా!] తిరుగుతున్నారు.

’ఎందుకయ్యా ఇలా తిరగటం? నాణ్యమైన, క్రమశిక్షణాయుతమైన చదువు చెబితే విద్యార్ధులూ, తల్లిదండ్రులే మీ విద్యాసంస్థ ముందు క్యూ కడతారు కదా?’ అంటే – “ఈ అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధుల సంఖ్య కార్పోరేట్ కాలేజీలు ఫ్రీగా ఇచ్చేటప్పుడు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారిలో చాలామంది కార్పోరేట్ కాలేజీల్లో చేరగా, మిగతా విద్యార్ధులు, ఆర్ధిక స్థోమత ఉన్న విద్యార్ధులు, ప్రతిభ ఉన్న విద్యార్ధులు తమలాంటి చిన్నకాలేజీల్లో చేరేవారు. కానీ, ఇప్పుడు పదవతరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కార్పోరేట్ కాలేజీల్లో ఆ స్కీము రూపం మారిపోయింది. ఒక్క చదువుకు మాత్రమే ‘ఫ్రీ’ ఇస్తున్నారు. హాస్టల్ కు డబ్బు కట్టాలి. అది 35,000/- రూపాయల దాకా ఉంది. ఈ విషయం పల్లెల్లో, ‘బి’ సెంటర్లో ఉన్న చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. అంతేకాక ఆ అత్యధిక మార్కులు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఏదో ఒక కాలేజీ తమ దగ్గరకు వచ్చిమరీ ఫ్రీ సీటు ఇస్తుంది అన్న ధీమాతో కదలకుండా ఉన్నారు’ అని చిన్న కాలేజీలు సమాధానం చెబుతున్నాయి. ఇలాంటి తల్లిదండ్రులకి చెప్పుకునేందుకు తమ పిల్లలకి ఫలానా కాలేజీలో ‘ఫ్రీ సీటు’ వచ్చిందనటం కావాలి. చదువు ఎలా ఉన్నా సరే!

పరిస్థితి ఎంత భయంకరంగా తయారయ్యిందంటే చాలామంది పిల్లల తల్లిదండ్రులు, స్కూలుని “మా పిల్లలకి పదవతరగతిలో ఎన్ని మార్కులు తెప్పించగలవు” అని అడుగుతున్నారు. అలాగే ప్రైవేట్ చిన్నకాలేజీలని “మా పిల్లవాడికి 550 పైగా మార్కులు వచ్చాయి. కాలేజీ చదువు, హాస్టల్ అన్ని ఫ్రీగా ఇస్తారా” అన్న డిమాండ్ చేస్తున్నారు. 550 పైగా మార్కులు వచ్చిన పిల్లలకి ప్రైవేటు చిన్నకాలేజీలు చదువు+హాస్టల్ ఫ్రీగా ఇస్తున్నాయి.

అంతేగాక, మనకి తెలిసి ఒక్కప్పుడు PRO అంటే ‘ఫలానా కాలేజీలో బాగా చెప్తారు, మీ పిల్లలని అక్కడ చేర్పిస్తే బాగా ఉంటుందని’ చెప్పటం మాత్రమే తెలుసు. వీళ్ళని పాజిటివ్ PROలు అనవచ్చు. కాని ఇప్పుడు నెగిటివ్ PROలు కూడా తయారయ్యారు. వీళ్ళు ఏకాలేజీలో చేరాలో చెప్పినా, చెప్పక పోయినా, ‘ఫలానా కాలేజీ లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో చేర్చవద్దు’ అని మాత్రం చెప్తారు. అంతేగాక రకరకాల పుకార్లని ప్రచారం చేస్తూ కూడా ప్రైవేట్ చిన్న కాలేజీలని దెబ్బతీస్తున్నారు.అందుకని కూడా చిన్నకాలేజీల వాళ్ళు అనివార్యంగా విద్యార్ధుల ఇళ్ళకు వెళ్ళవలసి వస్తుంది. ఆ విధంగా కూడా ప్రైవేట్ చిన్న కాలేజీలు డీగ్రేడ్ చేయబడుతున్నాయి. సరియైన సిబ్బంది లేదని ఒక ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ ఇబ్బంది కార్పోరేట్ కాలేజీలకీ ఉంది. అయితే అవి క్రీం సెక్షన్లకి[బాగా చదివే పిల్లలున్న క్లాసులకి] మాత్రం బాగా చెప్పే లెక్చరర్స్ ని పంపుతాయి. మిగతా సెక్షన్లకి మాత్రం మామూలు లెక్చరర్స్ ని పంపుతాయి. ఆ లెక్చరర్స్ కు, ’బి’ సెంటర్లలో ఉన్న ప్రైవేట్ చిన్న కాలేజీ లెక్చరర్స్ కి పెద్దగా తేడాలేదు. అయితే కార్పోరేట్ విద్యాసంస్థలు ప్రచార ఆర్భాటంతోనూ, కొనుగోలు చేసిన మార్కులూ, ర్యాంకులతోనూ ఈ ఇబ్బందిని అధిగమిస్తున్నాయి. నిజానికి 20, 25 ఏళ్ళుగా, నాటి విజ్ఞాన్ నుండి నేటి శ్రీచైతన్య, నారాయణల వరకూ, చేసిన ఈ మార్కుల, ర్యాంకుల కుంభకోణాల ఫలితమే, నేడు నైపుణ్యతా, సమర్ధతా గల సిబ్బందికి కొరత ఏర్పడటానికి కారణం.

ఇందులో మరో చీకటి కోణం ఉంది. ప్రైవేటు చిన్నకాలేజీల మధ్య ‘అనారోగ్యకరమైన’ పోటీ ఉంది. నిజానికి ఇక్కడ ‘అనారోగ్యకరమైన’ అన్నపదం సరైంది కాదు. ‘వ్యూహాత్మకమైన’ అనవచ్చు. ఒక ప్రాంతంలో గల ప్రైవేటు చిన్న కాలేజీల యాజమాన్యాలలో, ఒకటి రెండు కాలేజీల యాజమాన్యాలు, తమకు నష్టం వచ్చినా సరే, విద్యార్ధుల ఇళ్ళకు తిరిగి ఇంకా ఇంకా తక్కువ ఫీజులు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో మిగిలిన కాలేజీలు అలాగే చేయక తప్పటం లేదు. ఈ పోటీని తారాస్థాయికి తీసికెళ్ళిన యాజమాన్యం కొన్నేళ్ళు తిరిగేసరికి దివాళా తీస్తుంది. అయితే ఈలోపున ఆ ప్రాంతంలోని పది, పన్నెండు కాలేజీలని దివాళా తీయిస్తోంది. ఇక్కడ స్ట్రాటజీ ఏమిటంటే – కాలేజీ నడిస్తే గడించే లాభంకంటే, ఐదేళ్ళలో దివాళా తీసినా సరే, ఆ ప్రాంతంలోని పది పన్నెండు కాలేజీలని మూయిస్తే డబ్బు ఎక్కువ వస్తోన్నప్పుడు అదే ’లాభదాయకం’ అన్పించటం. సహజమే కదా! ఐదేళ్ళు కష్టపడి కాలేజీ నడిపినా మిగిలే లాభం కంటే, ఐదేళ్ళలో తాను నష్టపోతూ, మరో పది పన్నెండు మందిని దివాళా తీయిస్తే, వచ్చే లాభం ఎక్కువగా ఉంది. విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేసుకుంటూ, నానా అగచాట్లు పడి కాలేజీ నడపటం కంటే ప్రక్కవాళ్ళని నష్టపరిస్తే లాభం ఎక్కువ. ఎలాగంటారా?

క్రికెట్ మ్యాచ్ లో గనుక, గెలిస్తే వచ్చే లాభం కంటే ఓడితే వచ్చేలాభం ఎక్కువైనప్పుడు ఓడిపోవటం జరుగుతూనే ఉంది కదా! దాన్నే కదా మనం మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంది? అలాంటిదే విద్యారంగంలోని ఈ స్ట్రాటజీ కూడా! ’బి’ సెంటర్లలో గల ప్రైవేటు చిన్న కాలేజీల మధ్య నడుస్తోన్న పోటీ ఇది. మొదట్లో ఈ ప్రైవేట్ చిన్న కాలేజీలు కలిసి సంఘంగా ఏర్పడి, కార్పోరేట్ కాలేజీల మీద పోరాటం చేసాయి. వీళ్ళు ఎంత పోరాటం చేసినా, ముఖ్యమంత్రిని గాని, మంత్రిని గాని, చివరికి ఆర్.ఐ.వో. మీదకూడా ఒత్తిడి చేయలేకపోయారు. అంతేగాక వీళ్ళపోరాటం తగ్గి, నీరసించిన తరువాత, కార్పోరేట్ కాలేజీల వాళ్ళు ఆర్.ఐ.వో.తో కుమ్మక్కై, వీళ్ళని రూల్సు పేరుమీద వేధించటం జరుగుతుంది. [ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పేదవిద్యార్ధులను కార్పోరేట్ కాలేజీల్లో చదివించటానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఫండ్ వసూలు చేస్తున్నారు. దానికి ఆర్.ఐ.వో.లు చిన్నప్రైవేట్ కాలేజీల వాళ్ళని సంవత్సరానికి ’ఇంత’ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెబుతున్నారు. లేకపోతే ఏమీ లేదు, అన్ని రూల్స్ ఖచ్చితంగా అమలు జరపబడతాయి. దాంతో చిన్నప్రైవేట్ కాలేజీల వాళ్ళకు అన్నీ ఇబ్బందులే. సొమ్ము చిన్న కాలేజీల వాళ్ళది, సోకు ప్రభుత్వానిదీ, కలెక్టర్లదీ. లాభం మాత్రం కార్పోరేట్ కాలేజీల వాళ్ళది. ఇదీ ప్రభుత్వం అమలు చూపిస్తున్నసవతితల్లి ప్రేమ. సహజంగానే చిన్నకాలేజీలు తమమీదపడ్డ వడ్డనని, విద్యార్ధుల మీద Poor Students’ Fund పేరిట వసూలుచేస్తున్నాయి. అందులో ఎవరికెంత దక్కుతుందో ఎవరికి తెలుసు?] ఇలాంటి స్ట్రాటజీలతో చిన్నకాలేజీల పోరాటం క్రమంగా మరింత బలహీనపడిపోయింది. ఎవరి స్వార్ధం లేదా ఎవరి కాలేజీ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యంలో కార్పోరేట్ కాలేజీల అంతర్గత ప్రతినిధిగా, ఒక చిన్న కాలేజీ యాజమాన్యం, తము లాభసాటిగా కాలేజీని నడపటం కోసం కాకుండా, కేవలం తోటి కాలేజీలని మూతవేయించటం కోసమే పనిచేస్తుందన్న మాట.

నగరాలలో పాఠశాలల ఫీజులు ఆకాశానికి ఎగురుతున్నాయన్న నిజం ఓ ప్రక్క ఉంటే, కార్పోరేట్ సంస్థల ఫీజులూ ఆ స్థితిలోనే ఉంటే, మరో ప్రక్క ’బి’సెంటర్లలో అంటే చిన్న చిన్న పట్టణాల్లో, ఉన్న పరిస్థితి ఇది. [ఇక్కడ స్కూలు ఫీజు కూడా, కాలేజీల ఫీజుకంటే ఎక్కువుండటం గమనార్హం.] ఇలాంటి ఊళ్ళల్లో ఇదే స్థితి కొనసాగితే… ఇక అప్పుడు కార్పోరేట్ కాలేజీలు అక్కడ బ్రాంచిని తెరుస్తాయి. అప్పటికే, చిన్న కాలేజీలు నానా అగచాట్లూ పడి విద్యావాతావరణం అక్కడ నెలకొల్పితే, దున్నబడిన పొలంలాగా, కార్పోరేట్ కాలేజీలకి అనుకూలంగా పరిస్థితి మలచబడి ఉంటుందన్నమాట. ఇక కాసులు పండించుకోవటమే తరువాయి! అప్పటికీ, పోటీ నిచ్చే చిన్నచితక కాలేజీలని, తమలో కలిపేసుకుంటూ, కార్పోరేట్ కాలేజీ ఏకైక ప్రత్యామ్నాయం [Monopoly]గా మారుతుంది. గడప దగ్గరకొచ్చే కూరలమ్మి కనుమరుగు అయ్యాక, సూపర్ మార్కెట్టే దిక్కయినట్లు, తమ ఆర్ధిక స్థాయికి అందుబాటులో ఉన్న కళాశాలలు కనుమరుగు అయ్యాక, ఇక కార్పోరేట్ విద్యాసంస్థలే దిక్కు. ఓపగలిగితే చదివించుకోవాలి. లేకపోతే….? పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చోవాలి. నేర్పుకోవడానికి సాంప్రదాయక వృత్తులు మిగిలిలేవుగా?

ఇదీ కార్పోరేటిజమనే ముసుగులోపల [Spying] గూఢచర్యం! ఇదీ వ్యాపారం పేరిట ప్రజాజీవితంలోకి చొచ్చుకు వచ్చిన గూఢచర్యం, దాని తాలూకూ అవినీతి! తమ ప్రత్యక్ష లాభంకోసం గాక, పోటీదారు నష్టంకోసం పనిచేయటం, తత్ఫలితంగా పరోక్ష లాభం పొందటం, అందుకోసం కార్పోరేట్ విద్యాసంస్థల రహస్య PRO గా పనిచేయటం [పైకి కాలేజీ యాజమాన్యం అన్న ముసుగు ఉంటుంది] నిశ్చయంగా అవినీతే.

ఇది – గూఢచర్యం అట్టడుగు దాకా, పేరుతెలియకుండానే ప్రాకటం కాదా? ఇంతగా కుట్రలు, అవినీతి, అనైతికత ప్రజాజీవితంలోకి చొచ్చుకురావటం, పూర్తిగా ఆక్రమించటం చూశాక కూడా, దేశంలో కుట్రలు జరగటం లేదని, దేశద్రోహం జరగటం లేదనీ అనుకుంటే అది అమాయకత్వం మాత్రమే!

ప్రస్తుతం బియ్యం, పప్పుల ధరలే కాదు, చదువుల ధరలూ భరింపశక్యం కానివే! నియంత్రణలోకి వస్తాయను కోవటం ఖచ్చితంగా దురాశే! మరేమిటి పరిష్కారం? వ్యక్తిత్వ నైపుణ్యాల కంటే మార్కులూ, ర్యాంకులూ, సర్టిఫీకేట్లూ విలువైనవి అనుకున్నంత కాలమూ, ‘పరిష్కారం’ ఎండమావే! ‘ఉద్యోగమే’ పరమార్ధం అనుకునే స్థితి మారనంత కాలమూ, బ్రతుకంతా అంధకారమే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

12 comments:

వాస్తవం ప్రతిబింబించింది.

"అబ్బే, అలాంటిదేమీ లేదండీ, నిజంగానే ఆ సూపర్ మార్కెట్ వాడికి గత్యంతరం లేదు. వాడూ బయటినుండే తేవాలి. రేట్లు ఏమన్నా మాములుగా ఉన్నాయా "
ఇలా అంటారు మా హైలీ ఎడ్యుకేటెడ్ కొలీగ్స్. మరి ఊరి బయట తక్కువకే దొరుకుతున్నాయి అంటే, మరి సూపర్‍మార్కెట్ వాడు అక్కడనుండి తెచ్చుకోవాలి,ప్రిసర్వ్ చెయ్యాలి. ఫ్రెష్‍గా ఉంచాలి. మిగతా ఇన్‍ఫ్రాస్త్రక్చర్ ఖర్చు ఇవన్నీ భరించాలి కదా అంటారు.ఏం చెప్తాం.

Its 100% truth...చాలా బాగారాసారండి.

మనోహర్ గారు,

చాలామంది నమ్మరు. రైతు దగ్గర కిలో పచ్చిమిర్చి 2/- రూ. అదే సమయంలో మార్కెట్లో కిలో 12/- రూ., టమోటా రైతులు గిట్టుబాటు ధర రాక పారబోయటం రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో మార్కెట్లో మా నంద్యాలలోనే 3/- రూ. తక్కువ లేదు. కిలో మినప్పప్పు మార్కెట్లో 35/- నుండి 40/- రూ. దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కొచ్చి, రైతు కిలో 20/- రూ.కి ఇచ్చాడు. ఇలా రైతునే అమ్ముకోనిస్తే, మనకి చౌకగా సరుకులు వస్తాయి, రైతులకి గిట్టుబాటు ధర, ఉపాధి వస్తూంది కద! మరి కార్పోరేట్ వాళ్ళ లాభాల కోసం, మనం, మనతో బాటు రైతులు ఎందుకు నష్టపోవాలి?

చాలా బాగా చెప్పారు లక్ష్మి గారు... నేను రైతు బజారు కి వెళ్ళి కూరలు కొనుక్కొస్తే అంత దూరం వెళ్ళడం ఎందుకు ... అని మా వారు సణుక్కుంటారు.... కానీ రైతు బజారు లో తెచ్చిన కూరలు వారం వరకూ నిలవ ఉంటాయి. ఈ హై టెక్కు సూపర్ మార్కెట్లలో తెచ్చిన కూరలు రెండు రోజులకే పాడైపోతున్నాయి. నేను మాత్రం మా ఇంటి ముందుకు బండి వస్తే తప్పక కూరలు కొంటాను. బడా బడా సంస్థల లాభాన్ని పెంచడం కన్నా ఈ చిరు వ్యాపారులకి ఒక రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే ఏమీ మునిగిపోలేదని నా అభిప్రాయం. చాలా మంచి విషయాలు రాసారు.

వాస్తవం చాలా చక్కగా చెప్పారు. అభివృద్ధి అంటే, యే అంబానీ పేరో ఫోర్డ్ పత్రికలో రావటం కాదు. దేశంలో ప్రతి ఒక్కరికి తమ జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల భరోసా కలగటం. ఆ రోజులెప్పుడొస్తాయో??

బియ్యం , కూరగాయలు ధరలు తగ్గే రోజులు పోయాయండీ! వడ్ల ధరలు ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగాయి. రైతులు గూడా వారిపిల్లలను మీరు చెప్పినట్లు కర్పొరేషన్ స్కూళ్ళలో చదివించుకోవాలగదా! వడ్లధరలు ఇకపై తగ్గే సూచనలేవీ లేవు. కాబట్టి బియ్యం ధరలు ఇకపై తగ్గవు. కూరగాయల ధరల కు ఇప్పటికే అలవాటు పడి పోయాము. సీజనులో కొంచెం తగ్గినా చాలా కొద్ది రోజులే. రైతులు కూడా కొంచెం మంచిగా బ్రతకాలిగా!

@విరజాజి గారు,
మీ పరిశీలన నిజమేనండి. సూపర్ మార్కెట్ కూరగాయలు త్వరగా పాడవుతాయి.

@రవి గారు,
అలాంటి రోజు వచ్చినప్పుడే మనం అభివృద్ది చెందినట్లు అనుకోవాలి. కార్పోరేట్ కంపెనీల ఆస్థులు పెరగటం అభివృద్దికి హోల్ సేల్ చిహ్నం కాదు.

@జయచంద్ర గారు,
మీరనుకొన్నట్లు రైతులకేమీ లాభం కలగటం లేదండి.చాలామంది నమ్మరు. రైతు దగ్గర కిలో పచ్చిమిర్చి 2/- రూ. అదే సమయంలో మార్కెట్లో కిలో 12/- రూ., టమోటా రైతులు గిట్టుబాటు ధర రాక పారబోయటం రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో మార్కెట్లో మా నంద్యాలలోనే 3/- రూ. తక్కువ లేదు. కిలో మినప్పప్పు మార్కెట్లో 35/- నుండి 40/- రూ. దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కొచ్చి, రైతు కిలో 20/- రూ.కి ఇచ్చాడు. ఇలా రైతునే అమ్ముకోనిస్తే, మనకి చౌకగా సరుకులు వస్తాయి, రైతులకి గిట్టుబాటు ధర, ఉపాధి వస్తూంది కద! మరి కార్పోరేట్ వాళ్ళ లాభాల కోసం, మనం, మనతో బాటు రైతులు ఎందుకు నష్టపోవాలి?

చాలా మంచి విషయం గురించి వ్రాసారు.ధన్యవాదాలు.

చలా బాగా చెప్పరు....dint know how all these things works...thanks for explaining

virajaji garu:

మీరన్నది నిజమే, మరి రెండు రోజులకే పాడవకపోతే , మళ్ళీ వారం వరకూ మీరు షాపుకి రారు కదా. అదీ టెక్నిక్. కాదంటారా? మా వదిన ఇంతకుముందు ౨౦౦౭(2007)లో ప్రతీ శనివారం ఓపిగ్గా లింగంపల్లి సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చేది. మళ్ళీ వారం వరకు సరిపోయేవి. మరి ఇప్పుడైతే మోర్,విజేత వీటిల్లో తప్ప కూరగాయలు కొనడం లేదు. ఏం చేస్తాం.

వారణాశి లో సట్టి అని ఉంటుంది. ఇక్కడకు చుట్టుపక్కల ఉన్న రైతులు తమ కూరలు తీసుకువచ్చి అమ్ముతారు. 5 కిలోలు లేక 2 1/2 కిలోలు ఇలా కాస్త టోకుగా అమ్ముతారు. బయట రెండు కిలోలకు పెట్టే ఖర్చుతో ఇక్కడ 5 కిలోలు కొనేసుకోవచ్చు. సరుకు అంతా తాజా గా ఉంటుంది.

అలాగే బియ్యం కూడా. 100 కిలోలు 1600 - 1800 వరకు దొరుకుతాయి, మసూరి రకం. రైతులు దాదాపు 125 కిలోల వరకూ తెస్తారు అంతా తీసుకోవాలి. ఇవే బియ్యం దుకాణదారులు కాస్త బాగుచేసి కిలో 20 - 30 దాకా అమ్ముతారు. ఇక్కడ నాకు బాగా నచ్చినది ఇదే.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu