నకిలీ కణికుల గూఢచార వలయాన్ని, వ్యవస్థనీ నిర్ధారించుకునేందుకు, దాని పనితీరు తెలుసుకునేందుకు, ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్న ఆ వ్యవస్థలో కీలక వ్యక్తి, వ్యక్తులను గుర్తించేందుకు, పీవీజీ, భారత నిఘా సంస్థలూ కలిసి చాలా ప్రయోగాలూ, నిర్ధారాణలే చేసుకున్నారు. మచ్చుకి ఒకటి – సోలంకి వ్యవహారం [మాధవ్ సింహ్ సోలంకి?] ఈతడు, విదేశీ పర్యటనలో భాగంగా, విమానాశ్రయంలో, జేబులో రహస్య సమాచారం గల కవరుతో పట్టుబడ్డాడు. అంటే సమాచారం చేరవేస్తూ కొరియర్ షిష్ నిర్వహించాడన్న మాట. పట్టుబడేసరికి, ’తానేమీ పెద్దగా ఆలోచించలేదనీ, విమానాశ్రయాంలో ఎవరో కుర్రాడు తెచ్చి ఇచ్చిన కవర్ ని యధాలాపంగా జేబులో పెట్టుకున్నాననీ’ బొంకాడు. అచ్చంగా ’తాటి చెట్టు ఎందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నాడట’ అన్న సామెత మాదిరిగానే!

మామూలుగా అయితే మంత్రుల్ని అంతగా తనిఖీ చెయ్యరు. ఇప్పుడైతే పరిస్థితులు ఎంత మారాయోగానీ అప్పట్లో అయితే మంత్రులకి ఆపాటి మినహాయింపులుండేవి. భాజాపా అధికారంలో ఉన్నరోజుల్లో అమెరికా పర్యటనకి వెళ్ళిన మంత్రుల్ని, అక్కడి అధికారులు నఖశిఖ పర్యంతం పరీక్షించారన్న దుమారం కూడా చెలరేగింది. ఆవిధంగా, అప్పట్లో మంత్రులని అంతగా తనిఖీ చేయకపోవటం కద్దు. ఆ స్థితిలో, ధైర్యంగా, సదరు మంత్రి సోలంకి సమాచారపు కవర్ ని జేబులో పెట్టుకుపోయి దొరికిపోయాడు. ఆ తర్వాత అతడి ఊసు రాజకీయాల్లో ఇక విన్పించలేదు. అలా దొరికి పోవటంలోనే దాగి ఉంది గూఢచార క్రీడ! ఫలానా సమయంలో, ఫలానా చోట, ఫలానా మంత్రిని తనిఖీ చేస్తే దొరికిపోతాడన్న ఖచ్చితమైన సమాచారం ఉంటే తప్ప ప్రయత్నం చెయ్యకూడని ఎత్తుగడ ఇది. ఎందుకంటే, తీరా తనిఖీ చేసాక సదరు మంత్రి దగ్గర తప్పు చేస్తున్నట్లుగా ఏ ఋజువూ దొరకలేదనుకోండి, సదరు మంత్రి, అతడి అనుచరగణాల్ని అడ్డుపెట్టుకుని అతడి వెనుకనున్న గూఢచార ఏజన్సీ, నానా గొడవ చేస్తారు. చాలా ఇబ్బందుల్ని సృష్టిస్తారు. అంటే వారిది పట్టు, గ్రిప్ అవుతుందన్న మాట. [ఇందిరాగాంధీ ఇలాగే తప్పుడు సమాచారంతో దాడులు, తనిఖీలు చేసి బాగా ఇబ్బందులు పడింది.] అదే – సదరు మంత్రి లేదా వ్యక్తి దొరికి పోయాడనుకొండి. అప్పుడు ఆ ఏజన్సీ పెద్దగా కిక్కురు మనదు. అంటే వీరిది పట్టు, గ్రిప్ అవుతాయన్న మాట.

ఇలాంటి సంఘటనలు ఎన్నో! కొన్ని వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెరవెనుకే ఉండిపోయాయి. ఇలాంటి పరీక్షలన్నిటితో పీవీజీకి, ఐ.బి, ’రా’ వంటి గూఢచార సంస్థలకి, ‘సి.ఐ.ఏ. ముసుగుమాటున ఐ.ఎస్.ఐ.కి ఉన్నబలం, ప్రపంచవ్యాప్తంగా పరుచుకొని ఉన్న నకిలీ కణిక వ్యవస్థ’ స్పష్టంగా గోచరమయ్యింది. అప్పటికి ప్రపంచానికి ఇంకా పరిచయం చెయ్యని, ఆధునిక సమాచార జ్ఞానం, నకిలీ కణిక వ్యవస్థ ప్రధానబలం. నిజానికి శతాబ్ధాలుగా నకిలీ కణికుల స్ట్రాటజీ అదే! ఎప్పటికప్పుడు, అప్పటికి అభివృద్ధి చెందిన ఆధునిక టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకుని, దాని గురించి గోప్యంగా ఉంచుతారు. ఇతరత్రా ప్రచారాలతో తమకు కావలసిన వార్తలు ప్రచారం చేస్తారు.

1992 నాటికి చాలాదేశాలు సమాచార ఉపగ్రహల నుండి ఛానెల్స్ ను అద్దెకు తీసుకుని ఉపయోగించుకుంటుండగా, కొన్నిదేశాలకు స్వంత ఉపగ్రహాలుండేవి. అయితే అన్నిఉపగ్రహాల్లోనూ నకిలీ కణికుడి వ్యవస్థకు, సమాచార మార్పిడికి కావలసిన సర్వసదుపాయాలు ఉండేవి. వారికి గల ’సందట్లో సడేమియా’ వంటి మార్గం, డబ్బు, కెరియర్ ఇవ్వటం, ఫేవర్స్ చేయటం వంటి స్ట్రాటజీలతో నిర్మించుకున్న నెం.10 వర్గంతో ఈ వ్యవహారమంత నిర్మింపబడేది, నిర్వహింపబడేది. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతీదేశంలోనూ, ఆ దేశ ప్రభుత్వం నడుస్తోందనుకోవటం, ప్రజల్ని పాలిస్తోందనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. సమాంతరంగా నకిలీ కణికుడి ప్రభుత్వమే నడుస్తోంది. అతడి ఏజంట్లే అభివృద్ధి చెందుతూ ఉన్నారు.

ఇదంతా పీవీజీకి, భారత నిఘా సంస్థలూ, ఎవరికైతే భారతదేశం పట్ల నిబద్దత ఉందో వారికి తెలియచెబితే అర్ధమయ్యేస్థితి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైతే తమ తమ దేశాల పట్ల నిబద్దత ఉందో, మానవీయ విలువలున్నాయో వారికీ తెలియచెబితే అర్ధమయ్యింది. ఎందుకంటే వారికీ ఎంతోకొంత గూఢచర్యం తెలుసుగనుక. అయితే నకిలీ కణికుడి ప్రచార వరదలో కొట్టుకుపోతున్న సామాన్య ప్రజలకి? చెబితే నమ్మగలరా? ఎదురు నకిలీ కణికుడి ఏజంట్లు ‘అదంతా నాటకమో, బూటకమో’ అని ప్రచారంతో హోరెత్తిస్తారు కదా? ఇందిరాగాంధీ ఆనాడు విదేశీ హస్తం అంటే కుళ్ళు జోకులేసినట్లుగానే! అంతేగాక నకిలీ కణిక వ్యవస్థ ప్రతీవిషయంలోనూ ఎన్నో ద్వంద్వాలని సృష్టించి ఉంచింది. తమ వాదనకి దృష్టాంతాలుగా, మద్దతుగా వాడుకునేందుకు అలాంటి ద్వంద్వాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ ఇస్తాను. 1992 కు ముందర ఎవరైనా ‘నేటి సినిమాలు జనాన్ని, యువతని నాశనం చేస్తున్నాయి. పగా, ప్రతీకారం తప్ప మరో కథాంశం లేదు. లేదా శ్రీవారి ముచ్చట్లు, పనికిమాలిన ప్రేమకథలు! అరిషడ్వర్గాలని రెచ్చకొట్టే విధంగానూ, తర్క రాహిత్యంతోనూ, అడ్మినిస్ట్రేషన్ గురించి అవాస్తవాలు ప్రజలకి చేరే విధంగానూ ఉన్నాయి’ అని అన్నారను కొండి. దానికి వెంటనే నకిలీ కణికుడి ఏజంట్లు, ఏజంట్లు వంటి వారు లేదా ఆ విషప్రచారం తలకెక్కించుకున్న వారు ఈ విధంగా వాదిస్తారు. “మీరంటున్నది తప్పు. శంకరాభరణం వంటి సినిమాలు రావటం లేదా?" అంటారు.

నిజానికి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతిని చాటి చెబుతూ, వాటిని గౌరవించమని ప్రభోదించే అలాంటి సినిమాలు కొన్నే వస్తాయి. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు, పైన చెప్పిన పనికిమాలిన ప్రేమకథలు, పగా ప్రతీకారం వంటి చెత్త సినిమాల పరంపర తర్వాత ఎడారిలో ఒయాసిస్సులా, ఒకటీ అరా అలాంటి సినిమాలు వస్తాయి. వాటికి జనం నీరాజనం పడతారు. దాన్ని బట్టి నకిలీ కణిక వ్యవస్థ, ఇంకా ఈ జనాల్లో ఎంతగా తమ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల గౌరవం, ప్రేమా, ఇష్టం ఉన్నాయో, ఇంకా ఎంతగా వాటిని విధ్వంసం చేయవచ్చో లెక్కలు గట్టుకుంటుంది, నిర్ధారణ చేసుకుంటుంది. అందుచేతనే అటువంటి సినిమాలు పకడ్బందీ స్ర్కిప్టుతో, తార్కికతతో, ఉన్నత భావజాలంతో, స్పూర్తిదాయకంగా ఉంటాయి. రక్తి కట్టే కథనంతో తెరకెక్కుతాయి. అన్నివిధాలా నాణ్యత కలిగి ఉంటాయి. ఇక ఆ తర్వాత అదే తరహాకథతో మూసచిత్రాలు వరుసగా వస్తాయి. వీటిల్లో స్ఫూర్తి ఉండదు. ఏవిధమైన నాణ్యతా ఉండదు. దాంతో అవి పరాజయం పొందుతాయి. వెంటనే నకిలీ కణికుడి ఏజంట్లు, పత్రికలూ “చూశారా? కాలం మారిపోయింది. జనం ఆ పాత సంస్కృతినీ, సాంప్రదాయాల్ని పట్టించుకోవటం లేదు. ఎప్పుడో ఒకటీ అరా, అదీ కొత్తదనం కొద్దీ అటువంటి చిత్రాలు జయప్రదం అయ్యాయి. అంతే” అంటూ ప్రచారిస్తారు. అందరూ కూడా ‘కామమ్మ మొగుడంటే కామోసనుకుంటారు’. ఇందులో మరో విషయం ఏమిటంటే, చాలాసార్లు ఈ ఉత్తమ కళాఖండాలని సృష్టించే ’కళా తపస్వి’లు, ‘దర్శకరత్న’లూ ఘోస్ట్ రచయితలను ఉపయోగించుకోవటం కూడా కద్దు. దాంతో ప్రతిభగల అసలు వ్యక్తులు మరింత నైరాశ్యానికి గురవ్వటం, తద్వారా సమాజంలో మరిన్ని నెగిటివ్ భావనలు పెరగటం జరుగుతోంది. ఈ విషయంలో పాలకుల బాధ్యత గురించి నారదనీతి స్పష్టంగా వివరిస్తుంది. నారదనీతికి విపర్యయమే నకిలీ కణికుడి స్ట్రాటజీ మరి!

ఇక ఇంత ద్వంద్వమూ బహిర్గతంగా తెలియక, వాదనకు దిగినవారు అయోమయానికి గుర్వవటం ఖాయం. అందుకోసమే ఇలాంటి ద్వంద్వాలు సృష్టించబడుతుంటాయి.

ఈ నేపధ్యంలో 1992 లో పీవీజీ గాని, మరెవ్వరు గాని, భారతదేశంమీద కుట్ర జరుగుతుందని చెబితే వినేవాళ్ళు ఎందరు? నమ్మేవాళ్ళెందరు? అర్ధంచేసుకోగల వాళ్ళెందరు? స్పందించగలిగే వాళ్ళెందరు? అలాంటిచోట, ‘అసలు ప్రపంచవ్యాప్తంగా ’మానవత్వం’ మీదే కుట్ర జరుగుతోంది, కార్పోరేట్ వ్యాపార రంగం ముసుగులో మనుష్యులు ఇతరులకు ఆదాయ వనరులుగా మారిపోతున్నారు’ అంటే అర్ధంచేసుకోగల స్థాయి గురించి ఊహించటం కూడా కష్టమే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వర్గం నెం.10 కి వ్యతిరేకంగా పోరాడుతున్న, పోరాడదలిచిన వారంతా క్రమంగా సమిష్టి అయ్యారు. దాన్నే నెం.5 వర్గంగా సౌలభ్యం కోసం సరిపోల్చాను. నెం.5 లక్ష్యం నెం.10 ని బహిరంగపరచటమే. ఎందుకంటే, అప్పటికే నకిలీ కణిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదృక్పధాన్ని కలుషితం చేసింది, ప్రభావ పరచింది. గూఢచర్య బలం, గుప్తంగా ఉంచుకున్న ఆధునిక సాంకేతికత, నకిలీ కణిక వ్యవస్థ మూల బలాలు. దానికి తోడు వారికి డబ్బు, ఇతరవనరులూ, అప్పటికే పటిష్టంగా పనిచేస్తున్న ఒక నెట్ వర్కు ఉన్నాయి.

కాబట్టే వారి గూఢచర్య తంత్రాలనీ, సాంకేతిక రహస్యాలనీ బహిరంగ పరచటమే లక్ష్యమయ్యింది. ఎందుకంటే అదే సరైన పరిష్కారం, శాశ్వత పరిష్కారం కాబట్టి. ఎందుకంటే వారి వ్యవస్థ, నెట్ వర్కు పనితీరుని expose చేయటం, బహిరంగ పరచటమే ఏకైక పరిష్కారం కాబట్టి.

కాబట్టే గమనించి చూడండి –

1992 కు పూర్వం ప్రజలని ప్రభావపరచగల సినిమాలు పూర్తిగా తర్క రాహిత్యాన్ని ప్రజల్లో induce చేసేవి. మీడియా ఇంతగా expose అయ్యిందీ లేదు. మీడియా చెప్పిందే వేదం. ఇప్పటికీ అదే కొనసాగుతున్నా, పరిస్థితిలో మాత్రం చాలా మార్పు వచ్చింది. మీడియాని, ప్రభుత్వం [ఇప్పటి ప్రభుత్వం కాదులెండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీజీల నాటి ప్రభుత్వాలు] ఏమాత్రం నియంత్రించబోయినా, మరుక్షణం, ‘పత్రికాస్వేచ్ఛని ప్రభుత్వం కాలరాస్తోందని’ మహా గగ్గోలు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడో? [అదే ఇప్పుడైతే… వై.యస్.ని చూసి ఈ మీడియా నవాబు రామోజీరావే వెనక్కితగ్గుతున్నాడు. ఎంతలో ఎంత మార్పు? ఈ మాత్రం పట్టు, పదునుని ఇందిరాగాంధీ చూపించలేకపోయింది, పాపం!] పత్రికలు పరమ నిజాలేవీ వ్రాయవనీ, తమకి ఇష్టమైనట్లు వ్రాస్తాయనీ, తమ స్వప్రయోజనాలకి అనుగుణంగా వ్రాస్తాయనీ, తము ‘నంది అంటే నంది అన్నట్లు, పంది అంటే పంది’ అనేటట్లూ ప్రచారిస్తాయనీ సామాన్య పాఠకుడికీ కూడా తెలిసిపోయింది. ఒకప్పుడు ఈ స్ట్రాటజీని ప్రజలేమాత్రం పసిగట్టలేకపోయారు గదా!

ఒక్కమాటలో చెప్పాలంటే 1992 కు ముందర మనదేశం మీద కుట్ర జరుగుతోంది అంటే అర్ధం చేసుకోగల వారు చాలా తక్కువమంది. అలాంటి చోట ఆ కుట్ర ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోగల అవకాశం ఎంత? ఇదేస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. పూర్తిగా మానవజాతి మీద, మానవీయ విలువల మీద, భావజాలం మీద, వాటిని ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని చెబితే వినేవారు, అర్ధంచేసుకునేవారు, నమ్మేవారు లేరు. అదే, ఇప్పుడు జరిగిన దృష్టాంతాలతో, జరుగుతున్న సంఘటనలతో, తదనుగుణంగా పరిణామం చెందిన టీవీ, సినిమా మాధ్యమాలతో ప్రజల అవగాహనా స్థాయి పెరిగింది.

గమనించి చూడండి. మనమంతా టీవీ సీరియళ్ళ మీద జోకులు వేస్తుంటాం. నిజంగానే అవి సమయాన్ని మింగేసే కార్యక్రమాలే. అయినా అందులోనూ ఓ గొప్పప్రయోజనం ఉంది. చాలా వరకూ, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ, టీవీ సీరియళ్ళలో కుటుంబాల్లో కుట్రలే కథాంశాలుగా ఉన్నాయి. ఇంట అడుగుపెట్టిన కోడలు అత్తింటిని ఇక్కట్ల పాలు చేయటానికో, నాశనం చేయటానికో కుట్రలు పన్నడం, పరస్పర వ్యాపార సంస్థలకు సంబంధించిన కుటుంబాల్లో, కంపెనీల్లో ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకోవడం – ఇవే కథాంశాలు. ఇలాగే సినిమారంగం కూడా! సినిమాల్లో ఎక్కువ భాగం, ఏ కథాంశంలోనైనా, మోసం, కుట్రల గురించి ప్రజల్లో అవగాహన పెరిగేటట్లు చూపిస్తున్నారు. ఆ విధంగా 1992 ముందు సినిమాల్లో కంటే, ఇప్పటి సినిమాలు మరింత పరిణతియైన మోసాలు, కుట్రలు చూపిస్తున్నాయి. ఆ విధంగా ప్రజలలో కుట్ర స్వరూపంపై అవగాహన కల్పిస్తున్నారు.

నిజం చెప్పాల్సి వస్తే, మామూలు ప్రజలు అప్పటికీ ఇప్పటికీ కూడా, కొంత అమాయకులే. పూర్తి అమాయకులనీ, పూర్తి నిజాయితీ పరులనీ, అసలేమాత్రం కల్లా కపటం తెలియనివారనీ, మోసం దగాలు చెయని వారనీ, కుట్ర కుతంత్రాలు తెలియని వారనీ అనను. కానీ, మనకి తెలిసిన మోసం, కుట్రల కంటే నకిలీ కణికుని వ్యవస్థ ప్రయోగించే మోసం, దగా మరింత తీవ్రమైనవి, సంక్లిష్టమైనవి, నిగూఢమైనవి మరియు పరిణతి చెందినట్టివి. వాటిని గుర్తించటం కష్టం. ‘అంతా మామూలుగా జరుగుతున్నాయని’ అనుకుంటాం. పైకారణాలుగా మీడియా చేసే ప్రచారంలో మునిగిపోతాం, నమ్మేస్తాం.

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను. ఈ కథ మూలం, జీడిపప్పు గారు సమీకరించిన చందమామ కథల్లో చదివాను. కథ ప్రకటించేసాను కాబట్టి తస్కరించలేదని మనవి. ఇంతకీ కధేమిటంటే…

అనగా అనగా…..

రామాపురం అనే ఊరిలో రంగయ్య అనే సామాన్య రైతు ఉండేవాడు. ఇతడు కొంచెం అమాయకుడు. ఇతడికి ఓ పాడి ఆవు ఉండేది. కొన్నేళ్ళకి అది కాస్తా ఒట్టిపోయింది. రంగయ్య దాన్ని సంతలో అమ్మేసి మరో ఆవును కొనుక్కోవాలనుకున్నాడు. సంతకు తోలుకెళ్ళి ఆవును అమ్మజూపాడు. సంతలో ఓ కొనుగోలుదారుడు “ఏమయ్యా! నీ ఆవు పాలిస్తుందా?" అంటే “లేదు బాబయ్యా! ఒట్టిపోయింది” అని చెప్పాడు.

మరో కొనుగోలుదారుడు “ఏమన్న! నీ ఆవు గాట్లో చక్కగా మేస్తుందా, గడ్డంతా చిందర వందరగా తొక్కేస్తుందా?" అని అడిగితే “నా ఆవు గాట్లోనే పేడవేసేస్తుంది బాబయ్యా” అని చెప్పాడు.

మరొకడు “కొంపదీసి నీ ఆవుగాని పొడుస్తుందా?" అంటే

"అవును బాబయ్యా! ముందుకొస్తే కొమ్మువిసురుతుంది. వెనక్కొస్తే కాల్తో తంతుంది” అన్నాడు అమాయకంగా, అన్నీ నిజాలే చెబుతూ!

దాంతో అతడి ఆవుని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. క్రమంగా అతడి చుట్టూ గుంపు పల్చబడింది. చివరకు బిక్కుబిక్కుమంటూ రంగయ్య, ఆవు ప్రక్కనే నిలబడి దిక్కులు చూడసాగాడు. సాయంత్రమయ్యింది. పొద్దున్నుంచీ ఈ తతంగమంతా గమనిస్తున్న మాటకారి వాడొకడు రంగయ్యని సమీపించి “ఏమయ్యా! ఆవుని అమ్ముకోవాలంటే ఇలా కాదు. నేను అమ్మిపెడతాను. ప్రతిఫలంగా నాకు కొంత సొమ్ము ముట్టచెప్పాలి” అన్నాడు. రంగయ్య అందుకు ఒప్పుకున్నాడు.

వెంటనే మాటకారి వాడు ఆ ఆవుని సంతలో మరోచోటికి తీసుకుని వెళ్ళి, గొంతు సవరించుకుంటూ “రండి బాబయ్యా! రండి! ఆలస్యంచేస్తే మంచి అవకాశం పోతుంది. గంగిగోవు బాబూ! కుండేడు పాలిస్తుంది. చక్కగా గాట్లో మేస్తుంది. పసిబిడ్దలాంటి ఆవు. కుమ్మటమే ఎరగని మాతల్లి. అవసరం వచ్చి అమ్ముతున్నాను గానీ లేకుంటే అమ్మకపోదును. రండి బాబూ రండి” అంటూ కేకలు పెట్టాడు. దాంతో జనం బాగా మూగారు. మాటకారి వాడు పదేపదే ఇదే చెప్పసాగాడు. దాంతో కొనుగోలుదారులు పోటీ పడి బేరమాడటం మొదలెట్టారు.

ఇదంతా చూసిన రంగయ్య, "ఛస్! ఇంత మంచి ఆవుని నేనేందుకు అమ్ముతాను? అమ్మను గాక అమ్మను!” అంటూ తన ఆవుని, తన ఇంటికి తోలుకెళ్ళిపోయాడు.

మాటకారి వాడు మొదట నివ్వెరపోయాడు. తర్వాత తన చాతుర్యాన్ని చూసుకుని తానే మురిసిపోయాడు. బహుశః కాలక్రమంలో, ఇదెంతో లాభసాటిగా ఉండటంతో, తానే ఇక నుంచి సంతలో సరుకమ్మి పెట్టే వాణిజ్య ప్రకటనదారు అవతారం ఎత్తి ఉంటాడు. కాలక్రమంలో ఆ మాటకారి వాడి లాంటి వాళ్ళే మీడియాగా రూపాంతరం చెంది ఉంటారు.

ఈ కథలో అమాయకుడిలాంటివారం మనం, మాటకారి వంటిది మీడియా.

ఆ విధంగా మనల్ని, మనం కాదని, మనచేతే నమ్మించగలదు, మీడియా! మీడియా ముసుగువేసుకున్న నకిలీ కణిక వ్యవస్థ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
***********

1 comments:

కరెక్ట్ గా చెప్పారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu