భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం రేపు చేస్తారట. మా ఊరి రామాలయంలో కళ్యాణం ఈ రోజే . కాబట్టి మా పండగ ఈ రోజే .

ఈ పండగ రోజు ఆనందంగా చదువుకునేందుకు ఓ చిన్నికథ. రాముల వారి పండగ రోజు నసీరుద్దీన్ కథేమిటి అనుకోవద్దు. నసీరుద్దీన్ ఒక మతస్థుడి కంటే మనిషి గా అందునా సామాన్య మానవుడిగా కన్పిస్తాడు నాకు. మనిషి, మానవత్వం మతానికి అతీతం కదా! సరే, ఈ చర్చ ఇక్కడ వదిలి మీ ఇంట్లోని చిన్నిపాపలు సంతోషంగా చెప్పుకునేందుకు ఈ చిన్నికథ.

ఓ రోజు తైమూర్ సభతీర్చి ఉన్నాడు. సభికుల్లో నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. సభలో ఇష్టాగోష్టి నడుస్తోంది. తైమూర్ కి కొంత తలతిక్క[తాను రాజునన్న అహంకార మాన్నమాట] ఉంది. పిసినారి, అసూయాపరుడు కూడా. ప్రజల్లో నసీరుద్దీన్ కి ఉన్న మంచిపేరు, ఆదరణ పట్ల తైమూర్ కి చాలా దుఃఖంగా ఉండేది.

ఆరోజు చర్చ చదువులు మీదికి మళ్ళింది. మొద్దు పిల్లలకు, మూర్ఖులకు చదువు చెప్పటం అసాధ్యం అన్నారు కొందరు. అదేం లేదు, ఓపికగా నేర్పితే ఎలాంటి వారికైనా చదువు చెప్పవచ్చు అన్నారు కొందరు. వాదన తారాస్థాయికి అందుకుంది.

ఇంతలో నసీరుద్దీన్ “ఏలిన వారు చిత్తగించాలి. ఈప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. సాధింపబడేవరకూ ప్రయత్నించాలి, అంతే. ఓపికగా చెబితే నా గాడిదకి సైతం చదువు నేర్పవచ్చు” అన్నాడు.

తైమూర్ కి నసీరుద్దీన్ పనిపట్టడానికి అదే తగిన అవకాశం అన్పించింది. “అయితే నీగాడిదకి చదువు నేర్పగలవా?" అన్నాడు సవాలు చేస్తున్నట్లుగా.

"తప్పకుండా. కాకపోతే కొంత సమయం పడుతుంది. మరికొంత ఖర్చువుతుంది” అన్నాడు నసీరుద్దీన్.

"ఎంత సమయం కావాలి? ఎంత డబ్బుకావాలి?" మరుక్షణం ప్రశ్నించాడు తైమూర్.

"సంవత్సరం పడుతుంది. రోజుకి వంద బంగారు దీనార్ లు ఖర్చువుతుంది” నింపాదిగా చెప్పాడు నసీరుద్దీన్.

‘చచ్చింది గొర్రె !’ మనసులో అనుకున్నాడు తైమూర్.

"నసీరుద్దీన్! బాగా ఆలోచించుకో. సంవత్సరం తర్వాత నీ గాడిదకి చదువురాలేదనుకో, నీకు మరణశిక్ష తప్పదు” అన్నాడు తైమూర్ గంభీరంగా.

సభికులంతా ఉత్కంఠగా చూడసాగారు. నసీరుద్దీన్ చిన్నగా నవ్వుతూ “ఏలిన వారు చిత్తగించాలి. సంవత్సరం తర్వాత నా గాడిద ఓ ఉద్ర్గంధాన్ని చదవటం తమరు చూడవచ్చు. దీనారాలిప్పించండి” అన్నాడు.

తైమూర్ నసీరుద్దీన్ కు 36,500 బంగారు దినార్ లు ఇప్పించాడు. అందరూ ఆ దిగ్ర్బాంతి నుండి తేరుకునే లోపలే నసీరుద్దీన్ సంతోషంగా డబ్బుమూట తీసుకొని గాడిదనెక్కి ఇంటికెళ్ళి పోయాడు.

విషయమంతా విన్న నసీరుద్దీన్ భార్య నెత్తినోరు బాదుకుంది. “గాడిదకి చదువెల చెబుతావు? తైమూర్ తో తమాషాలా? సంవత్సరం తర్వాత ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటావా? డబ్బుకోసం ఇంతపని చేస్తావా? నీకేమైనా అయితే మేమంతా ఎలా బ్రతకాలి? ” అంది.

నసీరుద్దీన్ “ఓసి పిచ్చిదానా! ఇప్పటి వరకూ తైమూరే మూర్ఖుడనుకున్నాను. నువ్వు కూడానా! సంవత్సరం సమయం ఉంది. ఈ లోపున రోజుకి వందచొప్పన 36,500 ల బంగారు దీనార్ లు ముట్టాయి. ఆనందించక, ఎప్పుడో ఏదో అవుతుందని ఏడుస్తావేం? దేవుడు దయతో చూస్తే ఏడాది లోపల ఏమైనా జరగవచ్చు. నేనే చచ్చిపోవచ్చు. తైమూరే చచ్చిపోవచ్చు. ఈ గాడిద చచ్చినా చచ్చిపోవచ్చు. లేదా ఈ గాడిద చదవనైనా చదవవచ్చు. నిశ్చింతగా ఉండు” అనేసి వెళ్ళిపోయాడు.

తైమూర్ ఇచ్చిన డబ్బుతో రోజులు హాయిగా నడుస్తున్నాయి. పాపం! నసీరుద్దీన్ అన్నట్లు ఏవీ జరగలేదు. 11 నెలలు గడిచిపోయాయి. ఇంక ఒక నెల గడువు మిగిలింది. నసీరుద్దీన్ భార్య లబోదిబో మనసాగింది.

ఇక తప్పదన్నట్లు నసీరుద్దీన్ తీవ్రంగా ఆలోచించాడు. అతడికో ఉపాయం స్పురించింది. గాడిదని తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపువేసుకున్నాడు. లోపలేం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. నెలరోజులు గడిచిపోయాయి. నిర్ణీతగడువు రోజున గాడిదనెక్కి నసీరుద్దీన్ సభకి వచ్చాడు. ‘గాడిద చదవటం’ అన్న వింత చూసేందుకు ఆరోజు సభకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.

తైమూర్ సభకు వచ్చాడు. లోలోపల అనుమానంగా ఉంది. ‘ఈ నసీరుద్దీన్ కాలాంతకుడు. ఏదో చేస్తాడు’ అనుకుంటూ లోపల పళ్ళునూరుకున్నా పైకి చిరునవ్వునవ్వుతూ కూర్చున్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! చూడండి నా గాడిద చదువుతుంది” అంటూ తన గాడిద ముందు ఓ పెద్ద పుస్తకాన్ని ఉంచాడు. గాడిద ఒకో పేజీ తెరచి, నాలుకతో ఆ పేజీ అంతా నాకడం, మరో పేజీ తెరవటం, మళ్ళీ ఆ పేజీ నాకడం……. ఇలా పుస్తకం మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ తిరగేసింది. అది చూసి అబ్బురంతో ప్రజలంతా చప్పట్లు చరిచారు. వాస్తవం ఏమిటంటే నసీరుద్దీన్ గాడిదని నెలరోజులుగా గదిలో పెట్టి దాని ముందు పెద్ద పుస్తకం పెట్టాడు. ఒకో పేజీలో గుప్పెడు ఓట్స్ గింజలు పోసాడు. గాడిద ఆ గింజల్ని నాలుకతో నాకి తినేటట్లు శిక్షణ ఇచ్చాడు. రుచికరమైన ఓట్స్ గింజలు దొరకటంతో గాడిద తేలిగ్గానే పేజీలు తిప్పటం నేర్చుకుంది. గింజలు గాక, పేజీలు తినేసినప్పుడు దానికి శిక్షలు పడేవి. అందునా పేజీలు తిప్పుతూ గింజలు మాత్రమే నాకి తినేస్తే తర్వాత దానికి రుచికరమైన దాణా పెట్టబడేది. దాంతో గాడిద ఎంచక్కా ఉద్ర్గంధం పేజీలు తిప్పటం నేర్చేసింది.

అయితే గాడిద ఇలా పేజీలు తిప్పిమరీ పుస్తకం చదివేసరికి తైమూర్ కి ఏడుపొచ్చేసింది. నసీరుద్దీన్ కి మరణ శిక్ష వేయచ్చు, అధమం దేశ బహిష్కారమన్నా విధించవచ్చు అనుకుంటే డబ్బులు పోయాయి. దాంతో అక్కసుగా

"గాడిద చదివింది. నిజమే గానీ ఏం చదివిందో మనకెలా తెలుస్తుంది?" అన్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! మన ఒప్పందం ప్రకారం గాడిదకి చదువునేర్పమన్నారే గానీ, చదివింది పైకి చెప్పాలని అనుకోలేదు గదా! కావాలంటే మరో ఏడాది గడువూ, రోజుకి వంద బంగారు దినార్ లూ ఇప్పించండి. ఈ సారి నా గాడిద తను చదివింది పైకి చెప్పేటట్లు చేస్తాను” అన్నాడు.

ప్రజలంతా ఒక్కసారిగా ఆమోదయోగ్యంగా చప్పట్లు చరిచి, హర్షధ్వానాలు చేసారు. దాంతో తైమూర్ మరోసారి 36,500 బంగారు దినార్ లు ఇచ్చి, సంవత్సరం గడువిచ్చాడు. మరో ఏడాది నసీరుద్దీన్ హాయిగా గడిపేసాడు. సంవత్సరం తర్వాత మునుపటి లాగే సభకి గాడిదనెక్కి వచ్చాడు. ప్రజలంతా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘ఈసారి నసీరుద్దీన్ ఓడిపోవటం ఖాయం’ అనుకుంటూ ఆనందంగా వచ్చాడు తైమూర్.

నసీరుద్దీన్ “ఏలిన వారు చిత్తగించాలి” అంటూ గాడిద ముందు పెద్ద ఉగ్ర్గంధంపెట్టాడు. మునుపటిలాగే గాడిద ఒకో పేజీ తిప్పటం, నాలుకతో పేజీనంతా నాకటం, ఆ పైన నసీరుద్దీన్ వైపు చూసి ‘బే’ అంటూ ఓండ్రపెట్టటం చేసింది. ప్రజలంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. జరిగిందేమిటంటే నసీరుద్దీన్ రోజూ గాడిదకి పుస్తకం పుటలలో గింజలు పెడుతూ, మధ్య మధ్యలో ఒకరోజు గింజలు పెట్టడం మానేసేవాడు. దాంతో అది గింజలు పెట్టని రోజునా ఒకో పుటా తిప్పతూ గింజలు లేవన్న సూచనగా నసీరుద్దీన్ వైపు చూసి అరుస్తుండేది. తర్వాత నసీరుద్దీన్ దానికి మంచిదాణా ఇచ్చేవాడు. ఈవిధమైన శిక్షణతో గాడిద బాగా అలవాటుపడింది.

అయితే గాడిద ఇలా పేజీలు తిప్పి అరవడంతో తైమూర్ ఉడికిపోయాడు.

"నసీరుద్దీన్! ఇదేమిటి ఇదేం చదివిందో పైకి చెప్పమంటే ఇలా ఓండ్రపెడుతోంది?” అన్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! తానేం చదివిందో తన భాషలో చెబుతోంది. మనభాషలో చెప్పాలని మనం ముందుగా షరతు పెట్టుకోలేదుగా” అన్నాడు. తైమూర్ కి కోపంతో పిచ్చెక్కినంత పనయ్యింది. కానీ ఏం చేస్తాడు? పైకి ఏమీ అనలేని పరిస్థితయ్యె.

దాంతో “అయితే ఈసారి నీగాడిద తను చదివింది మన భాషలో చెప్పేలా శిక్షణ నివ్వగలవా?" అన్నాడు కసిగా.

నసీరుద్దీన్ చల్లగా నవ్వుతూ “మన్నించాలి హుజూర్. రెండేళ్ళుగా చదువుచెప్పి చెప్పి నేనూ, నేర్చుకుని నా గాడిదా బాగా అలిసిపోయాము. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు చూద్దాం” అన్నాడు.

ప్రజలంతా ఒక్కపెట్టున చప్పట్లు చరిచారు. తైమూర్ లోలోపల ఏడుపుతో కుళ్ళిపోతూ పైకిమాత్రం నసీరుద్దీన్ ని అభినందించాడు.

ఇదీ కథ!

ఈ కథలో నసీరుద్దీన్ కి భవిష్యత్తుపట్ల ఉన్న నమ్మకం, తన మీద తనకి ఉన్న నమ్మకం కన్పిస్తాయి.

బాబోయ్! టైమయ్యిందండి. రాముల వారి గుడికి వెళ్ళాలి.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

goodone............baaagundi...............

మీ స్టైయిల్లో బాగుంది. మీకు కూడా శ్రీ రామనవమి శుభాకాంక్షలు..

nice one

శ్రీ రామనవమి శుభాకాంక్షలు..

మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము రేపు చేసుకుంటున్నాం

మీకు శ్రీ రామ నవమి శూభాకాంక్షలు..

ha ha ha

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu