నిజానికి హరి జవహార్ లాల్ అనబడే ఈ ఈ.వో., ఎల్.ఎల్.బి. చేశాడు. కాబట్టి అతడికి legal, Administration బాగా తెలిసి ఉండాలి. అయితే దురదృష్టం ఏమిటంటే అతడి ప్రాధామ్యాలు[Priorities] కేవలం Accommodation and Medicine మాత్రమేనట. విద్యకు స్థానం లేదుకాబోలు. పోనీ అదే అనుకుందామన్నా, టీచర్స్ గా మేం చేస్తున్న సర్వీసు శ్రీశైలం రోడ్లు ఊడ్చే స్వీపర్ల పాటి చేయదా? మేం విద్య నేర్పుతుంది శ్రీశైలం ప్రజలకేగా? అక్కడికి వచ్చే యాత్రికులకు ఎవరైతే సేవలు చేస్తున్నారో [ఉద్యోగులుగా, వ్యాపారులుగా, ఇతరత్రా] వాళ్ళ పిల్లలకే గదా? అతడన్న మాటల్లో ఒక్కటి మాత్రం నిజం. ఆ ఊర్లో ఎప్పటి నుండో బదిలీలు లేకుండా పాతుకుపోయి ఉన్న వాళ్ళు, అటెండరు స్థాయిలో ఉన్న వాళ్ళు, పెద్దకాటేజీలు పొంది ఉన్నారు. కొత్తగా వచ్చినవాళ్లు యు.డి.సి. స్థాయిలో ఉన్నా సరైన accommodation లేదు. అయితే శ్రీశైలంలోని దేవస్థాన కాటేజీల్లో అధికభాగం అక్కడి ఉద్యోగులవే. బదిలీ అయి వెళ్ళిన ఏ ఒక్క ఉద్యోగి, అక్కడ కాటేజీని ఖాళీ చేయడు. సంవత్సరంలోపు బదిలీ అయిన వాళ్ళు కాదు, దాదాపు 10 ఏళ్ళ క్రితం బదిలీ అయిన వాళ్ళు కూడా, కేవలం ఆ ఉద్యోగి మాత్రమే భద్రాచలమో, కాణీపాకమో, ఎక్కడికి బదిలీ అయితే అక్కడకు వెళ్తారు గానీ, కుటుంబం మాత్రం శ్రీశైలంలోనే ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలంలో వాళ్ళకి బినామీ పేర్లతో బొమ్మలు దుకాణం లాంటి షాపుల దగ్గర నుండి, వడ్డీ వ్యాపారాల దాకా ఉన్నాయి మరి. అంతేకాదు రిటైర్ అయిపోయిన ఉద్యోగులు సైతం భారీసంఖ్య లోనే ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎవరూ కాటేజీలు ఖాళీ చేయరు. అందుకోసం ఏవో మతలబులు చేస్తూనే ఉంటారు. ఇవి గాక పెట్రోలు బంకు, ప్రసాదాలు, అన్నదానాలు గట్రాగట్రాల్లో జరిగే అవినీతిది అదో పెద్ద గ్రంధం. ‘అవినీతి లేనిదెక్కడ?’ అన్న ప్రశ్నతో అదంతా అమోదయోగ్యం అయిపోయింది గనుక, ఇక్కడ ఇక దాని గురించి వ్రాయడం లేదు.

ఈనేపధ్యంలో గదులు/ కాటేజీలని రెగ్యులరేట్ చేస్తానన్న ఈ.వో., మా రూమ్ తప్ప మరెవ్వరికీ, ఆ తర్వాత నెలలోపు గానీ, ఇప్పటికి రెండేళ్ళు గడిచాయి, ఈలోపు గానీ ఎవరికీ రూంలు కాన్సిల్ చేయలేదు. ఏ రెగ్యులరైజేషనులూ క్రమబద్దీకరణలూ చేయలేదు. అయితే మేం ప్రత్యామ్నాయ వసతికోసం, శ్రీశైలం కొత్తపేటలో గానీ, శ్రీ గిరి కాలనీ లో గానీ, ఎక్కడైనా ప్రైవేటు భూముల్లోని ఇల్లు అద్దెకు తీసుకుందామని ప్రయత్నించినప్పుడు, కులసత్రాలలో నెలవారీ అద్దెకు గది తీసుకుందామని ప్రయత్నించినప్పుడు మాత్రం, అక్కడ కూడా అతడు గదులని ’రెగ్యులరేట్’ చేసి పారేసాడు. అలా గది నెలవారి అద్దెకి ఇచ్చే పద్దతి అక్కడ ఉంది. చల్లా వెంకయ్య సత్రంలోకి రాక ముందు మేం కన్నడ వారి మల్లిఖార్జున సత్రంలో నెలవారీ అద్దెకు గది తీసుకుని మూడు నెలలు ఉన్నాము. కాకపోతే శివరాత్రి, ఉగాది సమయాల్లో మాత్రం ఆయా గదుల దాతలు వస్తారు గనుక, మనం ఖాళీ చేయాల్సిన ఉంటుంది. మిగిలిన రోజుల్లో శ్రీశైలంలో అంతగా రద్దీ ఉండదు. అందుచేత ఈ పద్దతి అక్కడ ఉంది.

ఎలాగైతేనేం పిల్లల తల్లిదండ్రులంతా కలిసికట్టుగా ప్రయత్నించి, ఎట్టకేలకు 5 వారాల సమయం సంపాదించి పెట్టారు. ఇక గది/ ఇల్లు అద్దెకు చూసే ప్రయత్నంలో పడ్డాము. మా తరుపున తల్లిదండ్రులు కూడా ప్రయత్నించసాగారు. అయితే అదెంత ఊరని? కొత్తపేటలో దేవస్థానపు భూమి ఆక్రమించుకుని కొందరు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకున్నారు. అక్కడ మేం ‘గూడు’ పొందలేం. మనం ఏదైనా చిన్నషెడ్డు నిర్మించగానే, ఖచ్చితంగా దేవస్థానం ఈ.వో., డి.ఈ.వో. లేదా మరొకరు అడ్డం పడతారు. ఇక శ్రీగిరి కాలనీ ఉంది. అక్కడ దాదాపు 100 మంది దాకా పట్టాలు పొందారు. అందులో దాదాపు ౩౦ మందిదాకా తమ పట్టాభూముల్ని అన్యాక్రాంతం చెయ్యకుండా వాళ్ళే చిన్నవో చితకవో ఇళ్ళేసుకుని నివసిస్తున్నారు. దాదాపు 70 మంది పేదలు, భాగ్యవంతులకి తమ పట్టాభూముల్ని బినామీగా అమ్మేసారు. అందులో శ్రీశైలంలోని ఉద్యోగులు, పూజారులు, కొందరు వ్యాపారులు పెద్దపెద్ద భవంతులు కట్టించుకున్నారు. అద్దెలకూ ఇస్తారు. అక్కడ మేం ఇంటికోసం ప్రయత్నించాము. అద్దె ఎక్కువే. దాదాపు సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు 2000/-Rs. దాకా చెప్పారు. అయినా సిద్దపడ్డాము. అయితే ఖాళీలు దొరకలేదు.

‘మార్కండేయులు’ అనే పూజారి శ్రీగిరి కాలనీలో అప్పుడే ఇల్లు ఖాళీ అవుతుంది. మా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలామంది ఆయన్ని అడిగారు. మేమూ వేరేవాళ్ళ చేత అడిగించాము. ఖాళీ అవ్వగానే అద్దెకు ఇస్తామని చెప్పాడు. వారం తరువాత అడిగితే ‘అంతకు రెండురోజుల క్రితమే ఈ.వో. తమకి నోటిసులు ఇచ్చాడనీ, శ్రీశైలంలోనే గదులు/ కాటేజీలకు కొరత ఉన్నందున, శ్రీగిరి కాలనీలో స్వంత ఇళ్ళు ఉన్నవాళ్ళు, దేవస్థానం ఇచ్చిన కాటేజీలు ఖాళీ చేసి, స్వంత ఇళ్ళల్లోకి వెళ్ళాల్సిదన్నది ఆ నోటీసు సారాంశమనీ’ చెప్పాడు. శ్రీగిరి కాలనీలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, అది పేదవాడైన పట్టాదారు పేరుమీదే ఉంటుంది. చట్టపరంగా అది ఇల్లు కట్టుకున్న భాగ్యవంతుడిది కాదు. ఆ తరువాత రోజుల్లో ఇలా పట్టాదారుల భూముల్లో బినామీగా భవంతులు కట్టుకున్న భాగ్యవంతులపై ప్రభుత్వం చర్యతీసుకోబోతుందని వార్తల్లో వచ్చింది. ‘మరి ఏ అధికారంతో, ఏ చట్టప్రకారం ఈ.వో. హరి జవహార్ ఈ పూజారులకీ, ఇతర ఉద్యోగులకీ తమ స్వంత ఇళ్ళల్లోకి మకాం మార్చి దేవస్థానం ఎలాట్ చేసిన గది/ కాటేజీ ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వగలడు? ప్రైవేటు భూములు, రెవిన్యూ భూముల్లో గల ఇళ్ళనీ కూడా ఇతడు [రెగ్యులరేట్] క్రమబద్దీకరిస్తున్నాడు కాబోలు’ అనుకున్నాము.[ అసలే ఆ ఈ.వో.కి legal & administration బాగా తెలుసయ్యే మరి!] ఇక్కడ ఇంకోవిషయం ఏమిటంటే వేసవిలో మూడు నెలలు బోరులో అస్సలు నీళ్ళురావు. అప్పుడు అందరు శ్రీశైలంలోని పబ్లిక్ పంపుల నుండి తోపుడుబళ్ళ ద్వారా నీళ్ళు తెప్పించుకుంటారు. అంత భయంకరంగా నీటికి కరువు. అలాంటి స్థితిలో ఏ ఉద్యోగి తన గది/ కాటేజీ ఖాళీ చేసి వెళ్తాడు. దేవస్థాన పరిధిలో అయితే కావాల్సినన్ని నీళ్ళు.

అయితే ఇదంతా మేం ఒకసారి సూర్యాపేటలో చూసిన సినిమానే! నటీనటులు మారారు, అంతే. అక్కడ మా ఇంటి ఓనరు చికెన్ కొట్టు భాగ్యలక్ష్మి అయితే, ఇక్కడ ఆ పాత్ర డి.ఈ.వో. కృష్ణయ్య, ఈ.వో. హరిజవహర్ లాల్ నిర్వహిస్తున్నారు. అంతే తేడా! దర్శకుడైతే రామోజీరావే అన్నది స్పష్టపడిపోయింది. మేం సి.ఐ. కరుణాకర్ ని కలిసి, వాళ్ళ స్టేట్ మెంట్ల తర్వాత జరిగిందంతా చెప్పి “ఇదేం వేధింపు?" అని అడిగాము. అతడు సూర్యాపేటలో సి.ఐ.ఖాన్, నల్గొండ ఎస్.పి. శివధర రెడ్డిల లాగే ఎంతో ‘చాకచక్యంగా’ రెడ్ టేపిజం చూపిస్తూ ’తమ ఎంక్వయిరీ తాము చేస్తున్నామని’ చెప్పాడు. ‘ఇది దేవస్థానపు భూమి గనుక, ఇక్కడి గదులు/ కాటేజీలు వారి పూర్తి అధికారంలో ఉన్నాయి గనుక, తామేమీ చేయలేమని’ చెప్పాడు. కృష్ణయ్య దగ్గర తానే స్టేట్ మెంట్లు తీసుకున్నానని నిర్ధారించాడు. అప్పుడు మాకు నీటి వేధింపు నేపధ్యంలో రమణయ్య సెల్ ఫోన్ లో నేను రిసీవ్ చేసుకున్నది Fake Phone కాదని, ఎవరి చేతో దొంగఫోన్ చేయించి రమణయ్య డి.ఈ.వో. కృష్ణయ్య పేరిట నన్ను బెదిరించ ప్రయత్నించలేదని, ఆ ఫోన్ స్వయంగా కృష్ణయ్యే చేశాడనీ అర్ధమయ్యింది. పైకారణాలు మారాయి, వ్యక్తులు మారారు గానీ, వేధింపులో మాత్రం సూర్యాపేటకీ, హైదరాబాదు నానల్ నగర్ కీ, శ్రీశైలానికి తేడాలేదు.

ఇదంతా జరిగేసరికి ఓ పదిరోజులు గడిచాయి. ఈలోపు ఊళ్ళో ఎవరుమాతో మాట్లాడినా “ఆ ఈ.వో. ఏదో కుంభకోణాలు చేశాడటండి. అవి గుప్పిట్లో పెట్టుకుని కృష్ణయ్య సారు ఈ.వో.ని ఆడిస్తున్నాడు. కృష్ణయ్య సారు చెప్పినట్లు ఈ.వో.చేస్తున్నాడు. కృష్ణయ్యసార్ కి ఈ రమణయ్య ఎక్కిస్తున్నాడు. ఇక్కడంతా రాజకీయాలు మేడం” అనేవాళ్ళు.

ఈమాట విని వినీ నాకు విసుగు పుట్టింది. ఓ రోజు పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు “ఎలా మేడం. వచ్చేసంవత్సరం ఎక్కడ పెడతారు స్కూలు?" అంటూ అందోళన పడుతుంటే, నేను “ఈ.వో., డి.ఈ.వో. కృష్ణయ్య మాట వింటున్నాడట. కృష్ణయ్య తన వంటవాడు రమణయ్య మాట వింటున్నాడట. వెరసి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఆ వంటవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయట. కానివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాను, నవ్వు మిళితం చేసి. భయంకరమైన విచిత్రం ఏమిటంటే – ఆ తర్వాత ‘డి.ఈ.వో. మాట ఈ.వో., రమణయ్య మాట డి.ఈ.వో.’ గట్రా డైలాగు వినబడితే ఒట్టు.

మరో విచిత్రం ఏమిటంటే – ప్రతివాళ్ళు “ఈ ఊళ్ళో రాజకీయాలు ఎక్కువ మేడం” అనటం. దాంతో మేము “దీన్ని రాజకీయం అనకండి. పోలీసు భాషలో, అడ్మినిస్ర్టేషన్ లో దీన్ని నేరం అంటారు” అన్నాము. అంతే! ఇక మళ్ళీ ఆ డైలాగు మా చెవిన బడలేదు. దాంతో ఆ ఊళ్ళో ఎవరి బలం ఎంతో మాకు బాగానే అర్ధమైంది. [“ఈ ఊళ్ళో రాజకీయాలు ఎక్కువ” అన్నమాట నేను ప్రతీ ఊరిలో విన్నాను. ఒకరకంగా సమస్యని లోకలైజ్ చేయటానికి ఇలా అంటారు.]

ఎందుకంటే శ్రీశైలం చాలా చిన్న ఊరు. అక్కడి ఉద్యోగుల బదిలీలు గానీ, విధినిర్వహణలో వెసులుబాట్లు గానీ ఈ.వో. చేతిలోనూ, డి.ఈ.వో. చేతిలోనూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపారుల షాపుల ఎలాట్ మెంట్లు కూడా! కేవలం ఈ.వో., డి.ఈ.వో. లని తెరమీద చూపించి కూడా ఊరు మొత్తాన్ని గ్రిప్ చేయవచ్చు. ఆశ కి, భయానికి లొంగని వారు అరుదు గదా! ఇక సాక్షాత్తు సి.ఎం.లూ, పి.ఎం.లూ, యు.పి.ఏ.కుర్చీవ్యక్తులూ, రామోజీరావు చేతిలో ఉండగా CBCID, IG లూ, శ్రీశైలం సి.ఐ. లూ ఎక్కడకి పోతారు?

ఈ.వో. నుండి ఐదు వారాల సమయం పొందాక, మరో ఇల్లు వెదికే ప్రయత్నాలు ఓప్రక్క చేస్తూనే, మరో ప్రక్క అడ్మినిస్ట్రేషన్ యుద్దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. మార్చి 31 న సమయం పొందగానే, ఏప్రియల్ ఒకటిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఒక లేఖ వ్రాసాము. అప్పటికి CBCID, IG, ఇంకా వార్తా సబ్ ఎడిటర్, ‘రామోజీరావు గురించి మాది భ్రాంతి’ అన్నందున, CID, IG మేం అవీ ఇవీ కలిపి వ్రాసి కేసు నిర్మిస్తున్నామన్నందున, ఈసారి లేఖలో రామోజీరావు పేరుఉదహరరించకుండా, ఒక సామాన్యుడు వ్రాసినట్లుగా వ్రాసాము. సీ.ఎం.కి వ్రాసిన లేఖలో ‘దేవస్థానపు ఈ.వో. అధికారాన్ని మేం ప్రశ్నించటం లేదనీ, అలాగే తనక్రింది ఉద్యోగులకి వసతీ, వైద్యం సమకూర్చాలన్నా విధి నిర్వహణ పట్ల అతడికి గల నిబద్దతనీ శంకించడం లేదనీ, అయితే అతడు అదే కరుణని మాదగ్గర చదువుకుంటున్న 58 మంది చిన్నారుల మీద కూడా ప్రసరింపచేయలేడా’ అని అడిగాము. ‘టీచర్సుగా మేం చేస్తున్న సర్వీసు శ్రీశైలంలో రోడ్లు ఊడ్చే స్వీపర్లు, కాంట్రాక్ట్ లేబర్ చేసే సర్వీసు పాటి కూడా చేయదా’ అని వ్రాసాము. వారం గడిచింది. స్పందన లేదు. దాంతో ఏప్రియల్ 8 న మరో ఫిర్యాదు వ్రాసి, దాని కాపీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి APJ అబ్ధుల్ కలాంకీ, సోనియాగాంధీకి పంపించాము. అందులో Fake Phone దగ్గర నుండి, సి.ఐ. తీసుకున్న స్టేట్ మెంట్లు, దాని పర్యవసానాలు, ఐ.జి. కృష్ణరాజ్ మాతో చేసిన ఆర్గ్యూమెంట్, మా రూం కాన్సిల్ చేయటం వరకూ జరిగిన ప్రతిసంఘటన క్లుప్తంగా స్పష్టంగా వ్రాసాము. అందులో ఐ.జి. వాదనకి మా తార్కిక జవాబు కూడా వ్రాసాము. కృష్ణయ్య వాదన, దాని పూర్యాపరాలు కూడా వ్రాసాము. అతడి మీద అసలు మేం కంప్లైంటు పెట్టలేదనీ, పెట్టింది రమణయ్య మీద అనీ, అప్పటి Fake Phone తాలూకూ, నీటి వేధింపు విషయంలోని Topograph copy తో సహా enclose చేసాము.

‘మేం రామోజీరావు విషయం రిఫర్ చేయకుండా సమస్య పరిష్కరించుకో ప్రయత్నిస్తే, సదరు ఉద్యోగులు రెడ్ టేపిజం చూపిస్తున్నారు. రామోజీరావుని రిఫర్ చేస్తే మా భ్రమ[hellusination] అంటున్నారు. ఇదేం డ్రామా?’ అని అడిగాము. ‘ఏమయినా మీకు పెట్టిన ఫిర్యాదులు క్రిందికి Farward అయ్యాయంటూ వాటిమీద స్టేట్ మెంట్లు డ్రామా చేసి విజయవంతంగా స్థానిక పోలీసు స్టేషన్, దేవస్థానం కలిసి మాగది ఎలాట్ మెంట్ రద్దు చేశారు’ అని వ్రాసాము. సూర్యాపేటలో, హైదరాబాదులోని వేధింపుని గుర్తుచేసి, ‘పిచ్చుక గూడు కట్టినట్లు మేం గూడు, ఉపాధి ఏర్పరుచుకోవటం, ఏదో పైకారణాన దాన్ని ఊడగొట్టటం. ఇలా ఎన్నిసార్లు మేం జీవితాన్ని మళ్ళీ మళ్ళీ ప్రారంభించాలి’ అని ప్రశ్నించాము. దీనికి ప్రధానమంత్రి నుండి జవాబు రాలేదు. రాష్ట్రపతి నుండి మాత్రం విషయాన్ని రాష్ట్రప్రభుత్వపరిశీలనకు పంపుతున్నట్లు నాకు లేఖ వచ్చింది. అయితే అది మే 8 తర్వాత, మేం శ్రీశైలం వదలివచ్చిన తర్వాత శ్రీశైలంలోని మాగదికి చేరింది. మా అంతస్థులోనే ఉన్న పోస్టల్ ఉద్యోగి సహాయంతో దాన్ని మేం కొరియర్ ద్వారా తెప్పించుకున్నాము.

ఏప్రియల్ 11 వ తేదిన ఉదయం 11 గంటల సమయంలో దేవస్థానకాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరు ఒకనోటిసు తీసుకుని వచ్చాడు. అందులో కృష్ణయ్య సంతకంతో, ‘దేవస్థాన ఈ.వో.ని మేం మార్చి 27 న పెట్టుకున్న requisation [cancel order ని recall చెయ్యమని మేము వెళ్ళి ఈ.వో.కి పెట్టుకున్న అర్జీ అది.] మీద ఈ.వో. regretted వ్రాసినందున, దాన్ని పురస్కరించుకుని గది వెంటనే ఖాళీ చెయ్యవలసింది’ అని ఉంది. దాని తర్వాత మేమంతా తల్లిదండ్రులతో కలిసి ఈ.వో.ని కలిసినప్పుడు మే 8 దాకా ఈ.వో. మాకు సమయం ఇచ్చిన విషయం చెప్పి నేను ‘ నోటిసు తీసుకొను’ అని చెప్పేసాను. ఆ ఉద్యోగి వెళ్ళి మళ్ళీ 5 నిముషాల్లో వచ్చాడు. “అయితే గదికి తాళం వేస్తారట. సీజ్ చేస్తామని చెప్పమన్నారు కృష్ణయ్య సార్” అని చెప్పాడు. నాకు అరికాలి మంట నెత్తి కెక్కింది. అందునా అప్పటివరకూ చాలా సహనం కూడదీసుకుంటూ ఉన్నాను. దాంతో ఒక్కసారిగా “మంచిది, వేసుకొమ్మని చెప్పండి” అని గట్టిగా చెప్పాను. పిల్లలతో “రేయ్! బుడ్డీస్! వీళ్ళు మన స్కూల్ కి తాళాలు వేస్తారట. రేపట్నుండి మీరుస్కూలుకు రానక్కరలేదు. బ్యాగ్స్ సర్ధుకుని ఇంటికి వెళ్ళండి” అన్నాను. పాపం! పిల్లలంతా బిక్కముఖాలు వేసారు. కుర్చీలన్నీ సర్ధి, బొమ్మలు,బోర్డులూ లోపల పెట్టేసి బయలు దేరారు. ఎప్పుడైనా బందులూ గట్రా జరిగి, పెద్దవాళ్ళు రాకముందే పిల్లల్ని ఇళ్ళకి పంపవలసి వచ్చినప్పుడు, చిన్నపిల్లల్ని అదేదారిలో వెళ్ళే పెద్దపిల్లలకి అప్పజెప్పి పంపించడం మాకు అలవాటే. అలా పిల్లలుందర్నీ disburse చేసాము. మేమిదంతా చేస్తుండగానే ఆ ఉద్యోగి వెళ్ళిపోయాడు. 12 గంటలకి మరో ఉద్యోగి [ఈసారి పర్మినెంటు ఉద్యోగి] వచ్చి నోటిసు మాగది తలుపుకి అంటించి, "మాదేముందండి! కృష్ణయ్య సార్ నోటిసు ఇచ్చిరమ్మంటే వచ్చాం. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకొండి” అన్నాడు. నేను భగ్గుమంటూ “ఏం మాట్లాడాలి? ఎన్నిసార్లు వెళ్ళాలి? వెళ్ళిమాట్లాడబోతే గడపే తొక్కవద్దన్నాడు. మే 8 వరకూ టైమిచ్చి మళ్ళీ 10 రోజుల్లోనే మరో నోటిసు తీసుకుని వచ్చారు. ఏం డ్రామాలాడుతున్నారా? వేసుకుంటే వేసుకొండి గదికి తాళం! ఈ ఫర్నిచర్ కోసం కూడా వెనక్కి తగ్గను. ఈడ్రామాలు మీకు కొత్తేమో గానీ ఇది నేను చూసిన సినిమానే” అన్నాను. వాళ్ళు వెంటనే అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. మర్నాడు మేము, మరిద్దరు పేరెంట్సు కలిసి ఈ.వో. ఇంటికి వెళ్ళి, దీనిగురించి అడగాలని బయలుదేరాం. ఇంతలో ఈనాడు శివ ఎదురు వచ్చి ‘తాను మాట్లాడివచ్చాననీ, టైం ఇచ్చిన విషయం తెలియక కృష్ణయ్య అలాచేశాడు. అదంతా ఏంలేదని’ మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఇదంతా వివరంగా ప్రధానికీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి వ్రాసిన ఫిర్యాదులో ఉన్నాయి.

ఈ గొడవంతా తెలిసి కొంతమంది తల్లిదండ్రులు ఆతృతగా ఫోన్లు చెయ్యటం, స్కూలు దగ్గరికి రావటం చేసారు. తర్వాత తేలిన సమాచారం ఏమిటంటే – ఈ.వో. మాకు టైం ఇస్తూ సంతకం పెట్టిన requisation వాళ్ళదగ్గరికి రాలేదట. ఈ.వో. మర్చిపోయి అది తన టేబుల్ సొరుగులోనే ఉంచుకున్నాట్ట. తమ దగ్గరికి regretted అని సంతకం పెట్టిన requisation మాత్రమే వచ్చిందట. దాని ప్రకారం తమ డ్యూటీ తాము చేసారట. అక్కడికి శ్రీశైలం దేవస్థానం మహా సాగరమంత ఆఫీసు, దానిలో ఎక్కడేం జరుగిందో ఎవ్వరికీ తెలీదు అన్న లెవల్లో చెప్పారు. అక్కడ ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువమంది రూం అటెండర్లు వంటి నాల్గవ తరగతి ఉద్యోగులే. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు చాలా చిన్నది. అసలు ఊరే చాలా చిన్నది. ఊరిలోనే ఎక్కడేం జరిగినా గంటలో అందరికీ తెలిసిపోతుంది.

అటువంటిది – ఇక్కడ ఇప్పుడు ఈ నాటకం! మాకు favorable అయిన విషయం/ ఫైలు అయితే పదిరోజులైనా కదలదు. [మార్చి 31 నుండి ఏప్రియల్ 11 వతేది వరకూ] అదే మాకు infavor అయితే మూడు రోజుల్లో కదులుతుంది. మార్చి 10 తేదిన వాళ్ళ స్టాఫ్ రమణయ్య మొదలైన వాళ్ళు representation పెడితే, దాని మీద ఈ.వో., డి.ఈ.వో.కి మార్కు చేయడం, డి.ఈ.వో. మా సత్రంలో ఎంక్వయిరీ చెయ్యడం, [ఎప్పుడు చేశాడో, ఎవరిని ప్రశ్నించాడో ఎవరికి తెలియదు] ఆవిడ [అంటే నేను] అలాంటి మనిషే. అందరితో తగవులు పెట్టుకుంటుంది. కాబట్టి రూం కాన్సిల్ చెయ్యమని ఈ.వో.కి రిపోర్టు పంపటం, దానిమీద ఈ.వో. మాకు గది కాన్సిల్ చేస్తూ నోటిసు పంపటం – ఈ కార్యక్రమం అంతా మూడే మూడురోజుల్లో [మార్చి 10 వతేదినుండి 13 వ తేది వరకూ] జరిగింది. అదీ మాపైన నడిచిన వేధింపు తీరు! లేదా రెడ్ టేపిజం తీరు. పైన తన మీద కంప్లైంటు చేసినందుకు, అదేదో తన స్వంత జాగీరు దారు అన్నట్లు మాకు కేటాయించిన దేవస్థాన గదిని కాన్సిల్ చేసాడు దేవస్థాన ఉద్యోగి కృష్ణయ్య.[ఇప్పటికి అతడు రిటైర్ అయ్యి రెండేళ్ళవుతుంది. ఇంకా దేవస్థాన కాటేజీని ఖాళీ చేయలేదని విన్నాను.] ఆవిధంగా ఉద్యోగులు తమ వ్యక్తిగత భావోద్రేకాలూ, అహంకారాలు కూడా జనాల మీద చూపటానికి ఇది ప్రజస్వామ్యమా లేక హైదరాబాదు నిజాం పాలనా?

ఇదే ఉటంకిస్తూ, అన్ని వివరాలతో ఏప్రియల్ 13 న మళ్ళీ మరో ఫిర్యాదు పి.ఎం.కి, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి వ్రాసాము. అందులో దేవస్థాన ఉద్యోగి మధుసూదన రెడ్డి అనే C2 clerk మా గురించి ఊళ్ళో ప్రచారం చేస్తున్న పుకార్ల గురించి కూడా వ్రాసాము. అతడు తాడిపత్రి నేటివ్ గా గలవాడు. నాటి దేవదాయ శాఖామంత్రి జే.సి. దివాకర రెడ్డికి సమీప లేదా దూరపు బంధువని చెప్పుకుంటారు. అతడే గాక దాదాపు 10, 15 మంది పైనే తాడిపత్రి బ్యాచ్ ఒకటిఅప్పట్లో శ్రీశైలంలో చలాయించుకుంటూ ఉండేది. ఇక ఈ గుమస్తా ప్రచారించిన అంశాలు ఏమంటే -
1]. మార్చి 31 న మాకు ఈ.వో. ఐదువారాల గడువిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి మళ్ళీ ఏప్రియల్ 11 న మరో నోటిసు ఎందుకు పంపాడని మా విద్యార్ధి తండ్రి, పోలీసు కానిస్టేబుల్ సుధాకర్ అడిగితే, మధుసూదన రెడ్డి చెప్పిన జవాబు అసలు మా విఙ్ఞాపన పత్రం మీద ఈ.వో. సంతకమే పెట్టలేదని. 20 మంది తల్లిదండ్రుల ఎదుట 40 నిముషాల ఉపన్యాసమిచ్చి, ఐదు వారాల గడువు ఇస్తున్నట్లు మాట ఇచ్చిన ఈ.వో. సంతకం పెట్టలేదట. ఏది నిజమో అతడికే తెలియాలి.

2]. మరో విద్యార్ధి తండ్రి, ఈ.వో.డ్రైవరు గణపతి అడిగితే, ఆఫైలు కనపడటం లేదని అందుచేత మొదటిregretted requisition మీద తమ react అయ్యామనీ చెప్పాడు. వారి ఆఫీసులో ఫైలు గల్లంతవ్వటం ఎవరితప్పో? అసలెందుకు గల్లంతయ్యిందో?

3]. మరో విద్యార్ధి తండ్రికి ఈ.వో. ఆ requisation ని క్రిందికి క్లర్కు దగ్గరికి పంపలేదని, తన టేబుల్ సొరుగులో పెట్టుకుని మరిచిపోయి ఉండొచ్చని చెప్పాడు.

4]. మరో విద్యార్ధి తండ్రి రాజశేఖర్ రెడ్డికి “వాళ్ళు వాళ్ళూ రాజీపడ్డారట. ఆ సారూ మేడం వాళ్ళు రాజీపత్రం రాసిచ్చారట అందుచేత ఇక వాళ్ళ రూం ఖాళీ చెయ్యక్కర్లేదు” అని చెప్పాడట. ఆ రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి ఈవిషయం మాకు చెప్పినప్పుడు, మాకు విపరీతమైన ఆశ్చర్యం వేసింది. ఎవరితో రాజీ, ఏమని రాజీ, రాజీపత్రం ఏమిటీ? నిజానికి ఈరాజీ [compromise] అన్న పదం సూర్యాపేటలో ఎ.ఎస్.పి. శివానందరెడ్డి నోట వచ్చినప్పుటి నుండి, ఇలాగే అసాధారణంగా విన్పిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆ అసాధారణం చూసి ఆశ్చర్యపోవటమే మా పని అవుతుంది. ఇలాంటి పుకార్లతో మామీద చేసే మానసిక హింస, అందోళనలు సృష్టించే ప్రయత్నం [Psychological play] మాకు అర్ధమౌతునే ఉంది.

ఇక్కడ మరో వైచిత్రి ఏమిటంటే – ఆరోజు అంటే, మార్చి 11 వ తేదిన సాయంత్రం ఓవిద్యార్ధి తండ్రి వచ్చి “ఈ.వో.గారు మనకు టైం ఇస్తూ వ్రాసిన నోట్ ఉన్న లెటర్ క్రిందికి పంపడం మరిచిపోయాడట మేడం. ఆయన టేబుల్ సొరుగులోనే పెట్టుకున్నాడట. అందుకని కృష్ణయ్య సార్ ఈరోజు మళ్ళీ మీకు నోటిసు జారీ చేశాట్ట. మనమో పని చేద్దాం. రేపు మళ్ళీ పేరెంట్సందరినీ పిలవండి. మొన్నట్లాగే మళ్ళీ ఓ 20,30 మందిమి వెళ్ళి ఆ లెటర్ క్రిందికి పంపలేదని రిక్వెస్టు చేద్దాం” అంటూ కూర్చున్నాడు. అది అమాయకత్వం అనలేం. అలాగని శ్రేయోభిలాషి ముఖం పెట్టిన అతడితో, కఠినంగానూ వ్యవహరించలేం. అసలు నిజం చెప్పాల్సి వస్తే ‘శత్రువు శత్రువులాగా ముఖం పెడితే అది కనీసం యుద్ధం అవుతుంది. స్త్రీలైనా, పురుషులైనా యుద్ధంలో ఒకవీరత్వం ఉంటుంది. శత్రువు మిత్రువులా ముఖం పెడితే ఆ కుట్ర అతినీచంగా ఉంటుంది. అటు స్త్రీ, ఇటు పురుషుడు కాని నపుంసకత్వం అది. ఇలాంటి మిత్రులని నేను చాలా మందిని చూసాను. చాలా చాలా దగ్గరై, మా మోటివ్స్ తెలుసుకొని, చేరవేయటం అన్న విషయం మేమూ బాగా గమనించాం. దాదాపు ఆరు నెలలు పాటు పరిశీలించి మరి ఆ స్నేహాలని కట్ చేసుకున్నాం.

ఆ విద్యార్ధి తండ్రితో సహనంగా “అలా మళ్ళీ కదుపుతాం. ఆ తర్వాత అది ఆ క్రింది క్లర్కు దగ్గర మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ వెళ్ధామా? ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు తెలియదేమో గాని నాకు తెలుసునండీ! కానివ్వండి. వాళ్ళు మా రూంకి తాళం వేస్తే వెయ్యనివ్వండి. అదీ చూస్తాను. అయినా ఇది సూర్యాపేటలో నేను చూసిన సినిమానేనండీ! నా వెనక ఏంజరుగుతుందో నాకు తెలుసు. పిల్లల తల్లిదండ్రులుగా మీఆతృతా, ఆందోళనా నాకు అర్ధమయ్యాయి. కానీ మీరు చెపుతుంది impractical. చూద్దాం. ఏంచేస్తారో చెయ్యనివ్వండి. ఎన్ని డ్రామాలాడితే అన్నీ ఆడనివ్వండి. గుడిలో మల్లయ్య అందర్నీ చూస్తునే ఉంటాడు” అన్నాను. అతడు కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి మిత్రువు ముఖం పెట్టిన శత్రువులు మాకు జీవితంలో చాలామందే తారసపడ్డారు.

ఈ దేవస్థాన ఆఫీసు డ్రామాలన్నింటిని పి.ఎం.కీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి ఫిర్యాదు పంపాక మాకు మే 5 వతేదిన AICC Letter head మీద ఏప్రియల్ 20 వ తేది తో దిగ్విజయ్ సింగ్ నుండి ఓలేఖ వచ్చింది. అదీ పోస్టల్ డిలే తో రాగా మా ప్లోరుమీద ఉన్న పోస్టల్ ఉద్యోగి ఆరోజు మధ్యాహ్నం తెచ్చి “అక్కా! ఇది మా ఆఫీసులో టేబుల్ మీద ఉంది. అడ్రస్సు locate కాక సున్నిపెంట అంతా తిరిగి వచ్చిందట. అక్కడ ఉంటే గమ్మున పట్టుకొచ్చేసాను” అంటూ ఇచ్చాడు. అతడికి కృతఙ్ఞతలు చెప్పి తీసుకుని చూస్తే అందులో సోనియాగాంధీ పేరిట ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామారావు [రామోజీరావు బదులుగా అలా టైపు చేయబడి ఉంది. స్కాన్డ్ కాపీ Fire Pot లో చూడగలరు] మమ్మల్ని వేధిస్తున్నట్లుగా ఆరోపిస్తూ, మేము వ్రాసిన ఫిర్యాదులు తనకు Farward అయ్యాయనీ, అందులో విషయాలు తాను నోట్ చేసుకుంటున్నాననీ ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

శత్రువు శత్రువులాగా ముఖం పెడితే అది కనీసం యుద్ధం అవుతుంది. స్త్రీలైనా, పురుషులైనా యుద్ధంలో ఒకవీరత్వం ఉంటుంది. శత్రువు మిత్రువులా ముఖం పెడితే ఆ కుట్ర అతినీచంగా ఉంటుంది. అటు స్త్రీ, ఇటు పురుషుడు కాని నపుంసకత్వం అది

కరెక్ట్‌గా చెప్పారు

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu