చల్లావెంకయ్య సత్రంలో క్రింది అంతస్థులో 9 గదులూ, పై అంతస్థులో 9 గదులూ ఉండేవి. పైనున్న 9 గదుల్లో, రెండింటిలో బ్రహ్మచారులుండేవాళ్ళు. మిగిలిన 7 గదుల్లో మాలాగే కుటుంబాలు ఉండేవి. రెండు అంతస్థులకూ విడివిడిగా రెండు భారీ సింటెక్స్ ట్యాంకులు [చాలా పెద్దవి] టెర్రస్ పైన ఉండేవి. వాటిలో గ్రౌండ్ ప్లోరు వారి ట్యాంకు పల్లంలోనూ, మొదటి అంతస్థువారి ట్యాంకు ఎత్తులోనూ ఉండేది. రెండు ట్యాంకులకి నీటి సరఫరా ఒకే గొట్టంతో జరిగేది. రెండు ట్యాంకులకీ, నీటి ధారని నియంత్రించటానికీ, నిండి పొర్లుతున్నప్పుడు నీటి సరఫరా ఆపు చెయ్యాటానికి విడివిడిగా వాల్యులూ ఉండేవి. రెండు ట్యాంకులకీ ఒకే గొట్టం ఉన్నందునా, క్రింది అంతస్థు వారి ట్యాంకు పల్లంలో ఉన్నందునా, నీళ్ళు ఎక్కువగా క్రిందివారి ట్యాంకులో పడేవి గానీ, పై అంతస్థువారి ట్యాంకు అంతగా నిండేది కాదు. దానికి తోడు క్రింది అంతస్థువారికి తోటలు ఉండటంతో ఉదయం ట్యాంకు నిండినా సాయంత్రానికి ఖాళీ అయిపోయేది. దాంతో వారు తమ ట్యాంకులోనికి మరిన్ని ఎక్కువనీళ్ళు పడేటట్లు వాల్వులు తిప్పేవారు. దానికి పై అంతస్ధు వారు అభ్యంతరం చెబుతుండేవాళ్ళు. దానిమీద కొద్దిపాటి వాదులాటలు నడిచేవి. మాకు వచ్చిపోయే అతిధులెవ్వరూ ఉండకపోవటం చేత, ముగ్గురమే కుటుంబసభ్యులు కావటం చేత, హైదరాబాదు నానల్ నగర్ లో ఉండగా అనివార్యమై నీటి పొదుపు నేర్చుకుని ఉండడం చేత, నీటి ఎద్దడి సమస్యకి మేం సర్ధుకుపోగలుగుతుండేవాళ్ళం. అందుచేత చాలా రోజుల వరకూ ఈ గొడవల్లో మేం వెనుకనే ఉండేవాళ్ళం. ఈ సమయంలోనే మాకు 18 నుండి 10 వ నెంబరు గది ఎలాట్ అయ్యి, అదే సత్రంలోని, అదే మొదటి అంతస్థులో అటు చివరిగది నుండి ఇటు చివరి గదికి 2004 లో మారాము. 2005 వేసవి నాటికి గ్రౌండ్ ఫ్లోరు వాళ్ళు, పైకి ట్యాంకులకి నీరు సరఫరా చేసే గొట్టానికి మధ్యలో ఒక స్టాండ్ పంపు వేయించారు. అది అనధికార పంపు. కృష్ణయ్య వంటవాడు రమణయ్య, ఇతరులతో కలిసి తమ పలుకుబడి ఉపయోగించి వేయించినట్లుగా వాళ్ళే చెప్పుకున్నారు. ఈ స్టాండ్ పంపుమూలంగా పైకి ట్యాంకులకి నీటి సరఫరా చేసే గొట్టంలో పీడనం పడిపోయి, ట్యాంకులకి నీళ్ళు ఎక్కడం బాగా తగ్గిపోయింది. దానికి తోడు పైన ట్యాంకుల వాల్వుని పూర్తిగా తమ ట్యాంకులోకి పడేటట్లు తిప్పుకుని రంపంతో కొసేసారు. ఇది చాలదన్నట్లు అదే గొట్టానికి మరికొంత దూరంలో మరో స్టాండు పంపు వేయించారు. దాంతో పూర్తిగా పై అంతస్థువారికి నీళ్ళు రావడం మానేసాయి. ఓరోజు పైఅంతస్థువారికి, క్రింది అంతస్థువారికి హోరాహోరి వాగ్యుద్ధం నడిచింది. ఆరోజూ నేను చూస్తూ ఊరుకున్నాను. తర్వాత పైఅంతస్థులోని తోటి వారితో కలిసి మేము నీళ్ళ కోసం క్రింది వారితో గొడవ పడకతప్పలేదు. వాళ్ళ 5 కుటుంబాల వారు కలిసి క్రింది అంతస్ధులోని 4 కుటుంబాలకూ, పైఅంతస్థులోని 9 కుటుంబాలకూ నీళ్ళు లేకుండా చేశారు. తాము మాత్రం క్రింది పంపుల నుండి దాదాపు 100 అడుగుల రబ్బరు ట్యూబ్ తో ఇంట్లోకి, తోటలకీ నీళ్ళు పెట్టుకునేవారు. ‘అంతకంటే ట్యాంకులలో నీళ్ళు నింపుకుంటే హాయిగా ఇంటి లోపల స్నానాల గదుల్లో పంపు తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి కదా! ఇలా వీధి కుళాయి దగ్గరలా ఏమిటీ గొడవలు’ అని మా అంతస్థులోని ఎవరం చెప్పినా వినేవాళ్ళు కాదు. ‘నీళ్ళు రావటం లేదు. మరేం చెయ్యమంటారు?’ అనేవాళ్ళు. ‘మరి నీళ్ళు రావటం లేదు కదా! అందరం కలిసి వెళ్ళి వాటర్ వర్క్సు ఏ.ఇ.నీ, ఇ.ఇ.నీ రిక్వెస్ట్ చేద్దాం లేదా ఫిర్యాదు చేద్దాం రండి’ అంటే వచ్చేవాళ్ళు కాదు. మా అంతస్థులో ఉండే పోలీసు కానిస్టేబుల్ [ఇతడు బ్రహ్మచారి], కాంట్రాక్టరూ[ఇతడూ బ్రహ్మచారి], ఎన్నోసార్లు వెళ్ళి వాటర్ వర్క్సు వాళ్ళని సమస్య పరిష్కరించమని అడిగి వచ్చారు. ఫలితం శూన్యం. మా ప్లోరు మీద పూర్ణచంద్రమాచారి అని జిల్లా పరిషత్ స్కూల్ ఇన్ చార్జి ప్రిన్స్ పాల్ ఉండేవాడు. ఆయనా చాలా సార్లు ప్రయత్నించాడు. పోస్టల్ ఉద్యోగి ఒకరు, మిగిలిన వారు దేవస్థానపు పర్మినెంట్ ఉద్యోగులు ఉండేవారు. అందరం చాలాసార్లు వాటర్ వర్క్సు ఏ.ఇ.ని కలిసి రిక్వెస్ట్ చేసేవాళ్ళం. వెళ్ళి అర్ధించిన తర్వాత ఒకటి రెండు రోజులు బాగా ప్రెషర్ వదిలేవాళ్ళు. క్రింద స్టాండ్ పంపులు ఉన్నా పైన ట్యాంకులకు నీళ్ళు ఎక్కేవి. మూడోనాడు మళ్ళీ సమస్య యధాతధం. ఇలా 365 రోజులూ ఉండేది.

మేం స్కూలు పెట్టిన మొదటి రెండు సంవత్సరాలు, కనీసం మాకు ఆయమ్మ కూడా దొరకలేదు. ఎవరు పనిచేసినా ఒకటి రెండు నెలలే. మిగిలిన స్కూల్స్ లో ఇచ్చేదానికి రెట్టింపు జీతం ఇచ్చేవాళ్ళం. టీ, టిఫిన్ ఇచ్చేవాళ్ళం. పండగలప్పుడు అదనంగా డబ్బు లిచ్చేవాళ్ళం. అయినా ఎవరు స్థిరంగా పనిచేసే వాళ్ళుకాదు. అలాగని ఆ ఊళ్ళో పనివాళ్ళకి కొదవేం లేదు. మాకు దొరికేవారు కాదు. పనివాళ్ళు చాలామంది దేవస్థానపు అడవి భూమిలో పూరి గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు. మా దగ్గర పనిచేసేవాళ్ళ గుడిసెలు పీకేయిస్తానని ఫణిధర ప్రసాద్ [ఇతడి రెండవ భార్యకి శ్రీశైలంలో స్కూలు ఉంది.] బెదిరించేవాడు. ఆ విషయం మాకు చాలా మంది చెప్పారు. సరే కానిమ్మన్నట్లుండేవాళ్ళం. ఎందుకంటే అలాంటి వాటిని మనం నిరూపించలేం కాబట్టి. మొదటి రెండు సంవత్సరాలు, పిల్లలు మధ్యాహ్నం భోజనం తర్వాత నేనే శుభ్రం చేసేదాన్ని. ఒకోసారి మా పాప కూడా శుభ్రం చేసేది. అంతేగానీ ఎంగిళ్ళు ఊడవమని నేను పిల్లలకి చెప్పేదాన్ని కాదు. తర్వాత రెండు సంవత్సరాలు ఆయమ్మ పనిచేసింది. కాకపోతే ఈమె వృద్ధురాలు. నీళ్ళు మోయగలిగేంతగా, అందునా మెట్లమీద మోసుకు రాగలిగేంత బలంగా ఉండేది కాదు. పోనీ ఎలాగోలాగా తంటాలు పడదామన్నా, చుట్టూ ఎక్కడా పబ్లిక్ టాపులు లేవు. అదీగాక ఒకరోజు, రెండురోజులు కాదు దాదాపు ప్రతీరోజూ అదేపరిస్థితి. ఆయమ్మ మానేసిందనుకోండి, ఇక మేమూ స్కూల్ మానేసి, రోజూ నీళ్ళు తెచ్చుకుంటూ గడిపేయాలి. మా సత్రం ఎదురువీధిలో గల మా విద్యార్ధుల ఇళ్ళకు పంపినా ఒకటి రెండు రోజులకే ఏదో కుంటిసాకులు చెప్పబడేవి గానీ నీళ్ళు ఇచ్చేవాళ్ళుకాదు. స్కూలులో పిల్లల పేరంట్స్ చాలామంది దేవస్థానపు ఉద్యోగులు ఉండేవారు. వాళ్ళని అడిగితే ఒకటి రెండు రోజులు బాగా వచ్చేవి. మళ్ళీ యధాతధం. ఈ విధంగా నీటి సమస్య మా ఒక్కరికే కాదు, మా అంతస్థులోని 9 గదుల వాళ్ళమూ అనుభవించాము. చుట్టూ అందరి OH టాంక్ లూ ప్రతీరోజూ, రెండుపూటలా పొంగి పొర్లుతుండేవి.

ఈనీటి సమస్యతో దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షు మాదిరిగా ఏదో తంటాలు పడుతూ ఉన్నాం అందరమును. వాస్తవానికి నాకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7.30 వరకూ పిల్లలు మా ప్లోరు మీదనే ఉంటారయ్యే. అదీగాక క్లాసుకు అయిదారుగురే ఉన్నా 1 నుండి 5 వరకూ తరగతులు ఉండేవి. 7 వతరగతి కి చెప్పడం మానేసాము. అయితే శ్రీశైలంలో ఈనాడు పేపరు ఏజంటు ఒకరు ఉండేవారు. ఆయన ‘తనకు మార్కుల పట్టింపు లేదనీ, కావాలంటే తను మార్కుల వేయించుకోగలననీ, కావాలంటే తనకి డిగ్రీ సర్టీఫికేట్ పుట్టించుకోగలననీ, కానీ దాని వల్ల లాభం ఏమీ లేదనీ, అందుచేట తమ పిల్లవాడికి మేము చదువు చెప్పక తప్పదనీ’ ఒత్తిడి చేశాడు. అతడితో మాకున్నా స్నేహం, terms రీత్యా ఒప్పుకోక తప్పలేదు. వీరందరికీ అన్ని సబ్జెక్టులూ చెప్పటం, అందర్నీ ప్రవర్తనతో సహా దిద్దకు రావడం, అన్నికోణాల్లో పిల్లలు పరిణతి చెందేలా జాగ్రత్త తీసుకోవటం – వీటితో నాకు అసలు తీరిక ఉండేది కాదు. చిన్నపిల్లలతో మావారిదీ అదేపరిస్థితి. ఇవిగాక యూనిట్ టెస్ట్ లూ, త్రైమాసిక, అర్ధవార్షిక, గట్రా పరీక్షల కోసం ప్రశ్నాపత్రాల వ్రాసుకోవటం, జిరాక్స్ తీయించి పరీక్షలు పెట్టి, జవాబులు దిద్ది…… ఇలా నిరంతరం పని. అదో యఙ్ఞం లాగా ఉండేది. ఉదయం 5.30 కు నిద్రలేస్తే మళ్ళీ రాత్రి పడుకునే సరికి దాదాపు 11.30 అయ్యేది.

మరోప్రక్క మాపాప చదువుగురించి బాగా శ్రద్ధ తీసుకునేదాన్ని. అప్పటికి 2005 నడుస్తోంది. వాస్తవానికి మాపాపకి నేను నేర్పిన చదువు కంటె జీవితం చాలా నేర్పింది. అప్పటికి తనకి 10 ఏళ్ళు నిండాయి. అప్పటికే తను జీవితపు ఒడిదుడుగులని చూసింది. పస్తులు అనుభవించింది. జీవితపు మాధుర్యం, కాఠిన్యం కూడా అప్పటికే ఆమెకి కొంత పరిచయం అయిపోయాయి. సూర్యాపేటలో ఉండగా స్కూలుకు వెళ్ళేది. తర్వాత ఆమె చదువు మా చేతిలోనే సాగింది. మేము ఆమెని ఒకటి రెండు అంటూ తరగతులు వారిగా తీసికెళ్ళలేదు. ముందు తెలుగు చదవటం వ్రాయటం నేర్పాము. రోజూ వార్తాపత్రిక, అందులో పిల్లల పేజీలు చదివించేవాళ్ళం. పాత చందమామలు సేకరించి కథలు చదివించేవాళ్ళం. ఇంగ్లీషు తన చిన్నప్పటి నుండి నాతో మాట్లాడటం నేర్పాను. అందుచేత గ్రామర్ గొడవలు లేకుండానే అలవోకగా మాట్లాడటం నేర్చుకుంది. చిన్నచిన్న కథలు చదివేది. మెల్లిగా గణితం, ఆల్ జిబ్రా నేర్పాను. బట్టీ వేయడం కాకుండా స్వంతంగా వ్రాసేలా నేర్పాను. 2002 లో మేం, నానల్ నగర్ బస్తీలో ఉండగా ఓసారి సాయంత్రపు నడకకి మెహదీపట్నం రైతుబజార్ కు నడుస్తున్నాం. అది రంజాన్ మాసం. దారిలో మాకు ఓ ఒంటె కనబడింది. మాపాప దాన్ని చూసి మహా ఉత్సాహపడింది. అప్పటికి తనకి 7 ఏళ్ళు. నేను ఒంటె గురించి, ఎడారుల గురించి, అక్కడి జీవన విధానం గురించి, వివరంగా చెప్పి మర్నాటికి అదంతా తన స్వంతంగా నోట్స్ వ్రాసి చూపెట్టమన్నాను. దాదాపు రెండు పేజీలు వ్రాసి చూపించింది. అలా తర్ఫీదు ఇచ్చుకుంటూ వచ్చాను. [ఇప్పుడైతే తెన్నేటి సూరి వ్రాసిన ఛంఘీజ్ ఖాన్ చదివి గోబీ ఎడారి గురించి నాకు విశేషాలు చెబుతుంటుంది. ‘తానొక టెమూజీన్ ని, ఆకలి దప్పికలనీ కూడా ఓర్చుకోగలను’ అంటుంది. 2005 లో రాజస్థాన్ లోని జైపూర్ తీసికెళ్ళినప్పుడు ఎడారుల గురించి తెగ ఊహించుకుందట. ఇసుకపర్రలు కనపడలేదని నిరాశ చెందింది. ‘మనం బికనీర్ వెళ్ళలేదు తల్లి’ అని చెప్పాం.] ఇలా మా ప్రత్యేక శిక్షణతోనే 2003 లో మేం స్కూలు ప్రారంభించిన తర్వాత తను చాలా త్వరగా అల్లుకుపోయింది. 7th లో ఇతర విద్యార్ధులతో పాటు – సిలబస్ చెప్పాను. చక్కగా గ్రహించింది. క్రమంగా 10th సిలబస్ వరకూ తీసుకుపోయాను. Magnetism వంటి Physics, Periodic Table వంటి Chemistry, Trigonometry వంటి Maths Chapters తను అర్ధం చేసుకున్న తీరు నాకు చాలా సంతృప్తిగా అన్పించింది. సరే చూద్ధాం అని 10th కి తయారు చేశాను. అయితే ఆమెని ఒత్తిడేమీ చెయ్యలేదు. 2005 లో కర్నూలు జిల్లా విద్యాధికారిని కలిసి అనుమతి కోసం ప్రయత్నించాం. రాలేదు. తెలిసిన వాళ్ళు ‘కొంచెం ఖర్చు పెట్టుకుంటే, హైదరాబాదు నుండి అనుమతి తెచ్చుకోవచ్చు’ అని చెప్పారు. మాకు మా పాప 10 ఏళ్ళకే 10th వ్రాసింది, బాలమేధావి, సూపర్ కిడ్ అనిపించుకోవాలన్నా మోజేమీ లేదు. ఇప్పుడు అనుమతి రాకపోతే తనకి 14 ఏళ్ళు నిండాకే వ్రాస్తుంది లెమ్మని ఊరుకున్నాను. ఆ తర్వాత ఆమె హాయిగా భారత, భాగవత, రామాయణాలు, భట్టి విక్రమార్క కథలు, స్వామి వివేకానంద జీవిత చరిత్ర వంటి అమూల్యమైన గ్రంధాలు చదివేసింది. బాపూ సత్యశోధన చదవటానికి ప్రయత్నించి, తనకి రుచించక చదవలేదు. ఆ సత్యశోధన రెండు, మూడు నెలల క్రితం చదివి బాపూ పట్ల అభిమానంతో ఊగిపోతుంది. ఇర్వింగ్ వ్యాలెస్ నవలలు, యండమూరి నవలలు, మధుబాబు షాడో, బుడుగు వంటివి ఆస్వాదించింది. మా స్కూలు లెబ్రరిలో కావాలసినన్ని చిన్నపిల్లల కథల పుస్తకాలు ఉన్నాయి. వాటన్నింటిని చదివింది. ఇప్పటికీ తను పుస్తకాల పురుగే.

అయితే 2005 లో ఆమెని 10th కి తయారు చేస్తున్నరోజుల్లో, మాజీవితంలో మమ్మల్ని ఉలిక్కిపడేలా చేసి, జీవితాన్ని పునరావలోకించే సంఘటన జరిగింది. అప్పటికి మా పాపకి 10 ఏళ్ళు నిండాయి. అప్పటికి ఓ సంవత్సరం క్రితం మా స్కూలులో ఇద్దరు పిల్లలు చేరారు. ఒకడు 8th, మరొకడు 7th చదివేవారు. ఇద్దరి పేర్లు వినుకొండలో వేరే స్కూలులో రిజిస్టర్ చేయించారు. వారి తండ్రి ఆర్.టి.సి.లో డ్రైవరు. తాత గారు శ్రీశైలంలో ఆర్.టి.సి. డిపో కంట్రోలరు. వారి బంధువు మా అంతస్థులోనే ఉంటారు. వినుకొండలో వారికేవో ఇబ్బందులు రావటంతో అర్ధంతరంగా శ్రీశైలంకి మకాం మార్చారట. వాళ్ళ అమ్మమ్మ మా స్కూలులో అడ్మిషన్ ఆడిగినప్పుడు స్థానిక సంబంధాల కారణంగానూ, స్కూలులో కాస్త పెద్దపిల్లలు ఉంటే మిగిలిన చిన్నపిల్లల్ని నియంత్రించేందుకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటారన్న కారణంగానూ సీటు ఇచ్చాము. ఆ పిల్లలు వయస్సుకన్నా పెద్ద ఆలోచనలు కలిగి ఉండేవారని ఆలస్యంగా గ్రహించాము. 2005 నాటికి మేము 7th చెబుతున్నాము. తర్వాత పూర్తిగా 5వ తరగతికి కుదించుకున్నాము. మా స్కూలు విద్యార్ధులతో పాటు పరిషత్ స్కూలు పిల్లలు కూడా కొందరు ట్యూషన్ [మేము వచ్చిన కొత్తలో చేరిన పరిషత్ స్కూలు పిల్లలు, వారు మానకుండా వస్తూనే ఉన్నారు] కు వచ్చేవారు. వీళ్ళల్లో కొందరు మా పాపకి ‘చూడు ఫలానా అబ్బాయి నీవైపే చూస్తున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు’ అని చెప్పేవారట. అప్పటికి కొన్నేళ్ళుగా ఎటుచూసినా ‘తూనీగా తూనీగా’ అనో ‘ఖుషి’ అనో చిన్నవయస్సు లోనే ఏర్పడ్డ ప్రేమల కథ సినిమాలే ఉండేవి. మాపాప ప్రక్కన ఓ ‘చెంచా’ చేరింది. ఈ నేపధ్యంలో మాపాప బాగా అలజడిలో చిక్కుకుంది. దాంతో ఆమె చదువులోనూ, ప్రవర్తనలోనూ పొరబాట్లు ఎక్కువయ్యాయి. ఆ క్రమశిక్షణా రాహిత్యానికి ఓరోజు నాకు బాగా కోపం వచ్చింది. లోపలిగదిలో తనని బాగా తిట్టాను. కోపంతో రెండు దెబ్బలు కూడా వేసాను. ఆరోజు సాయంత్రం వేరే అమ్మాయి [ఈ పిల్ల అప్పటికి 10th చదువుతుంది. పరిషత్ స్కూలు ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ కూతురు. దాదాపు 15 ఏళ్ళుంటాయి. బాగా చదువుతుంది.] మా పాపతో ’తనకీ అలాంటి సమస్యలే ఉన్నాయనీ, తననీ తన తల్లిదండ్రులు తిడుతున్నారనీ, అంచేత ఆత్మహత్య చేసుకుందామనీ’ చెప్పిందట. ఆ మీదట ఈ పిల్లలిద్దరూ [నాకూతురు, ఆ పిల్లా] ఎలా చనిపోవాలా అని ప్రణాళికలు ఆలోచించారట. వీళ్ళిద్దరికి ఆ ‘చెంచా’ ప్రేక్షకురాలు. చివరికి ఆ పిల్ల ఎలుకల మందు తింటే చచ్చిపోవచ్చందట. దాంతో మాపాప నేను ఎలుకల కోసం తెచ్చిన Rat killer ని పట్టుకుపోయింది. అయితే నాబిడ్డ పిరికిది కాదు. అప్పటికే అది జీవితంలో చేదు సంఘటనలని చూసింది. దాంతో తీరా ‘చచ్చిపోదాం’ అన్న ప్రయత్నం దగ్గరికి వచ్చేసరికి నాకూతురు ముందడుగు వేయలేదు. ప్రక్కనున్న ఆపిల్ల ప్రోత్సహిస్తుంది. దాంతో నాకూతురు ‘పోనీ ఇంట్లో నుండి పారిపోదామా’ అని కొత్త ప్రపోజల్ పెట్టింది. దాంతో వారిద్దరి మధ్య ఆవిషయం తేలలేదు. ఆరోజు యాదృచ్చికంగా ఎలుక వస్తే, మేము ఎలుకల మందుకోసం వెతికితే దొరకలేదు. మావారు ’తెచ్చిన తరువాత వాడలేదు’ అంటారు. మా ఇంట్లో ఏవస్తువు కనపడకపోవటం అన్నది ఉండదు. ఎలా మాయం అయ్యిందో తెలియలేదు. మా పాపని పిలిచి, ఎలుకల మందు ఎక్కడయినా పొరపాటున పెట్టామా అని అడిగాము. తను బ్రేక్ అయి తనంతట తానే విషయం మొత్తం చెప్పింది. మేము ఒక్కసారిగా షాక్ అయ్యాము. ఓపికగా కౌన్సిల్ చేసి, ఏం జరిగిందని ఆరా తీసాము. మొత్తం విషయం చెప్పింది. దాంతో నేను కొయ్యబారిపోయాను. మొత్తం వివరాలు తెలుసుకున్నాక, ముందుగా మేం చేసిన పని – వయస్సుకి మించిన ఆలోచనలు ఉన్న ఆర్.టి.సి. వారి పిల్లల్ని ఇంటికి పంపించేయడం. మా పాపతో ప్రేమాయణం అన్న పిల్లవాడికి తిప్పికొడితే 11 ఏళ్ళు ఉంటాయి. నాకు మా పాప ఎంత పసిదిగా కనబడిందో, వాడూ అలాగే కనబడ్డాడు. ఇంతచేసి ఇద్దరి మధ్య ఏమాటలు సాగలేదు. వాళ్ళు, మాపాపని ప్రేమాయణంలోకి లాగటానికి ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నారని అర్ధం అయ్యింది. మా పాపనీ, ఆ 10th అమ్మాయిని ఇద్దరిని కౌన్సిల్ చేసాం. ‘చెంచా’ మాత్రం తిట్లు తిన్నది. వాళ్ళ అమ్మ హడావుడిగా వచ్చి పిల్లని కవర్ చేయటానికి ప్రయత్నించింది. ఆమె తరుపు చుట్టాలే ఆ ఆర్.టి.సి.వారి పిల్లలు. ఆమెకి సర్ధిచెప్పి పంపేసాం. స్కూల్లో వాతావరణం అప్పటికే కొంత కలుషితం అయ్యింది. ఇదంతా మాదృష్టికి వచ్చేలోగానే జరిగిన పరిణామం ఇది. పిల్లలందరినీ సరిచేసుకుని, మళ్ళీ చక్కని స్కూలు వాతావరణం తెచ్చుకునేసరికి దాదాపు నెలరోజులు పట్టింది.

అయితే, ఈ కుదుపుతో మేం ఒక్కసారిగా మళ్ళీ జీవితాన్ని పునఃసమీక్షించుకున్నాము. 1992 లో నేను, రామోజీరావు భారత్ కు వ్యతిరేకంగా చేస్తున్నా కుట్రల గురించి, నాటి ప్రధాని పి.వీ.నరసింహారావుకి ఫిర్యాదు చేసాను. అప్పటి నుండి 1995 వరకూ నానా వెతలూ పడ్డాము. 1993 లో వివాహం చేసుకున్నాను. 1995 లో మాకు తారసపడిన మిత్రులంతా ‘అవన్నీ మరచి పొమ్మని’ హితవు చెప్పారు. ఫ్యాక్టరీ పోగొట్టుకోవటంతో మేమూ అదే అభిప్రాయానికి వచ్చాము. అప్పటినుండి దేశ రాజకీయాల గురించిగానీ, రామోజీరావు గురించి గానీ మేము ఆలోచించలేదు, పట్టించుకోలేదు. 1996 లో నంబూరులో మా Co-tenants తో నీటి వేధింపులు, కరెంటు గొడవలు పడినప్పుడు, వాటికి కారణం నాతోటి గృహిణులకి నాపట్ల ఉన్న ఈర్ష్య, అసూయ అనుకున్నాము. అలాగని బలమైన కారణం కూడా లేదు ఈర్ష్య, ఆసూయ అనుకోవాటనికి. 1999 లో సూర్యాపేట బ్రిలియంట్ కాలేజీ వారు డబ్బు ఎగ్గొట్టి, ఉద్యోగం ఊడగొట్టి విసిగించినప్పుడు, డబ్బెగ్గొంటేందుకు పన్నిన ఎత్తుగడ అనుకున్నాము. త్రివేణి కాలేజీ వాళ్ళు వేధించినపుడు, కారణం వృత్తిలో పోటీ, లెక్చరర్ గా నాకు వస్తున్న పేరు పట్ల వాళ్ళకి గల అభద్రత భావం అనుకుని సరిపెట్టుకున్నాం. ఇక సూర్యాపేట లో మా ఇంటి ఓనర్ దగ్గర నుండి పోలీసు అధికారుల దాకా, AP ట్రాన్స్ కో వారు రమారమి 48,300/- రూ. లకు బిల్లు ఇచ్చి, కరెంటు పీకి…… ఇలా వ్యవస్థీకృత వేధింపుకు గురవుతున్నప్పుడు కూడా ఎంసెట్ మీద కంప్లైట్ చేసిన కారణాన్నే చూశాను. హైదరాబాదు నానల్ నగర్ లో ఉంటూ బాధలు పడినప్పుడు ‘విధి వ్రాతేనా’ అని కొంత సందిగ్ధ పడ్డాము. అంతే! నింపాదిగా ఆలోచించేంత వెసులుబాటు కూడా అప్పడంతగా లేకుండింది. మా తమ్ముళ్ళతో చంద్రబాబు కుటుంబం నెరపిన అవ్యాజాను రాగం, స్నేహసంబంధాలు చూసి ఆశ్చర్యపడ్డాము…. సూర్యాపేట దాటి హైదరాబాదు చేరినా, పనిచేసిన నెలకి కూడా జీతం, చెక్కు ఇచ్చిమరీ ఎగ్గొట్టిన సాయి స్టడీ సర్కిల్ ని చూసినప్పుడు కొంత సందేహించినా, ఏరోజు కారోజు, ‘ఈరోజు ఎలా గడపాలి?’ అన్న సమస్య కళ్ళెదుట ఉండటంతో, తరుముకొస్తున్న ఆర్ధిక అవసరాలు ఎలా దాటాలా అన్న ఆలోచనలే ఎక్కువ డామినేట్ చేశాయి. వీటితో ఇంకే విశ్లేషణా చెయ్యగలిగే స్థితి ఉండేది కాదు. ఇక 2002 చివరిలో శ్రీశైలం వచ్చాక పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాయి. కనీసం కూడు, గూడు విషయంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. దాంతో ఇక నిలదొక్కుకునే ప్రయత్నం ముమ్మరం చేశాం. అందుకోసం స్కూలు గురించి నిరంతరం శ్రమించాము.

అదీగాక ‘రామోజీరావు’ అన్న పీడకల గుర్తు తెచ్చుకోవటం కంటే మరిచిపోవటమే అప్పటికి హాయిగా ఉండటంతో మేం ఏ సమస్యకైనా పైకి కనబడే కారణాలనే చూసేవాళ్ళం. అయితే సమస్య అంత లోతుకి చొచ్చుకురావటంతో ఇక ఆలోచించక తప్పలేదు. ఇది వేధింపుకు పరాకాష్ఠగా తోచింది.

ఇంత వేధింఫుచేయగల సామర్ధ్యం సూర్యాపేట త్రివేణి కాలేజీకో, మరొకరికో ఉండదు. ఊరు దాటాక అసలుండదు. పోనీ ఏ కార్పోరేట్ కాలేజీ దిగ్గజాలకైనా ‘ఠాఠ్ మా వ్యవహారాల మీదే ఫిర్యాదు చేస్తావా’ అని ఒళ్ళుమండి మమ్మల్ని వేధించారు అనుకుందామన్నా –

1]. మేం ఎంసెట్ ఒక్కటేకాదు, ఇంటర్, 10th కూడా వదిలేసుకున్నాం.
2]. వాళ్ళ కుంభకోణాలు వాళ్ళకి యధాతధంగా నడిచిపోతున్నాయి.
3]. అయినా ఒళ్ళుమండితే ప్రాణాలు తీయించడమే సులువు. అంతేగాని ఓపిగ్గా సంవత్సరాల పాటు, పకడ్బందీగా వేధించరు.
4]. అసలు కార్పోరేట్ వారి వ్యాపార మనస్తత్త్వమే అది. వారి పనులు వారికి నడిచిపోతుండగా, అనవసరంగా తమ డబ్బూ, సమయం, పగా ప్రతీకారాల్లాంటి భావోద్రేకాల మీద వెచ్చించరు.
5]. అయినా కార్పోరేట్ విద్యాసంస్థలకి ముఖ్యమంత్రిని ఆడించేంత శక్తి ఉండదు.

కాబట్టి దీనివెనుక కార్పోరేట్ సంస్థలు లేవన్నది నిర్ధారించుకున్నాము.

ఎందుకంటే – ఒకవేళ గనుక మా పాప బలహీన మనస్కురాలై లేదా పిరికితనం కొద్దీనో ఏ ఆత్మహత్యో చేసుకుని ఉంటే? ఇక మా జీవితానికి అర్ధం ఉందా? అయినా అంత జాగ్రత్తగా, ఎప్పుడు ఆ చిన్నిపిల్ల నిరాశా నిస్పృహలకీ, తల్లినైన నామీద అసంతృప్తికి గురై ఉంటుందో పరిశీలించి, సరిగ్గా అప్పుడు ఆత్మహత్యకు ప్రేరేపించేటట్లు, అప్పుడే మరొకరు తోడై ప్రోత్సహించేటట్లు, ఎవరు ప్రణాళిక రచించగలరు? అమలు చేయగలరు? మనం సాధారణంగా యండమూరి లేదా ఇర్వింగ్ వాలెస్ వంటి వారి నవలల్లో అంటే గూఢచార ఆధారిత కథలు గల నవలల్లో, సినిమాల్లో చూసినట్లుగా ఇది ఎంతో organized గా ఉంది. ఇందులో ఎంతో ఓర్పు, నేర్పు మిళితమై ఉన్నాయి. ఎంతో సమర్ధంగా, సహనంగా వేచి ఉండి, సమయం చూసి అమలు చేసినట్లుగా ఉంది.

దీంతో మేం బాగా ఆలోచించాము, మళ్ళీ మళ్ళీ ఆలోచించాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

పానకంలో పుడకల్లాగ మధ్యలో రామోజీరావు, చంద్రబాబులు ఎందుకు వచ్చినట్టు? బహుశా నేను మొదటినుండీ చదవాలనుకుంటానండీ ఈ శృంఖలలో వ్యాసాలు.

అవునండి. మొదటి నుండి చదివితే అర్ధం అవుతుంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu