శ్రీశైలంలో మాకు గతంలో [1993 నుండి 1995 వరకూ] తెలిసిన మిత్రుల దగ్గరికి వెళ్ళాము. అప్పటికి అక్కడి ఉద్యోగులకి వాలెంటరీ రిటైర్ మెంట్ పధకం రద్దవ్వడంతో ‘తమపిల్లలకి చదువు అవసరం’ అనుకునే స్థితికి వచ్చారు. మేం శ్రీశైలం చేరింది డిసెంబర్ 2002 లో. శ్రీశైలంలోని చాలామందికి మేం బాగా గుర్తున్నాము. దాదాపు రెండేళ్ళపాటు పాతాళగంగ మెట్లపైని గుడిసెలో ఉన్నాం గనుకా, అందరితో బాగా మాట్లాడతామనీ, ఇంగ్లీషు బాగా మాట్లాడతాం అనీ పేరుంది గనుకా, మా పాప అక్కడే పుట్టింది గనుకా, వారిలో చాలామంది మమ్మల్ని గుర్తుపట్టి అప్యాయంగా పలకరించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లోని మిత్రుడు[1995 నాటికి కృష్ణాపత్రిక విలేఖరి, తరువాత ఈనాడు విలేఖరి అయ్యాడు] సహాయంతో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా చేరాను. వాళ్ళకి శ్రీశైలంలోనూ బ్రాంచి ఉండటంతో అక్కడే పనిచెయ్యటం మొదలుపెట్టాను. శ్రీశైలంలో ఒక కన్నడ వారి సత్రంలో నెలసరి అద్దెకు ఒక గది తీసుకొని, మళ్ళీ వంటవార్పు అన్నీ మొదలు పెట్టాము.

1993 లో లాగా ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకి మల్లయ్య స్వామి దర్శనం చేసుకునేవాళ్ళం. ఊళ్ళో చాలామంది ‘మీరు అప్పటినుండి ఇక్కడే ఉంటే ఈపాటికి మా పిల్లలు ఎంత బాగుపడేవాళ్ళో’ అనీ, ‘మీరు అప్పడే స్కూలుపెట్టి ఉంటే బాగుండేది’ అనీ అనేవాళ్ళు.

నిజానికి శ్రీశైలం చిన్న ఊరు. మొత్తం ఓ 1500 మంది దాకా దేవస్థానపు ఉద్యోగులు, ఓ మూడునాలుగు వందల మంది వ్యాపారులు, మరికొందరు పనిపాటలు చేసుకునేవారి కుటుంబాలు ఉంటాయి. అయితే కులానికో సత్రం చొప్పన దాదాపు అన్నీ కులాలకీ సత్రాలుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని కులాలున్నాయా అన్పిస్తుంది, వాటన్నింటినీ చూస్తే! అక్కడ జిల్లాపరిషత్ హైస్కూలు ఉంది. అది 1993 నాటికైతే వరుసగా జీరో రిజల్ట్ స్కూలు. 2003 నాటికి కాస్త పరిస్థితి మారింది. ఎందుకంటే రిజల్ట్ చూపించుకోవాటానికి మాస్ కాపీయింగ్, బిట్స్ చెప్పటం అన్న ప్రక్రియ ఉపాధ్యాయులే చేస్తుంటారు గనుక. దాదాపు అన్నిజిల్లాలలో ఇదే నడుస్తుంది. ప్రభుత్వమే ఈ పాలసీ తీసుకుందో, టీచర్స్ యూనియనే తీసుకుందో కానీ అన్నీ చోట్ల ఇదే జరుగుతుంది. అయినా ఆ స్కూలులో చాలామంది పిల్లలు హాజరు పలుకుతారే తప్ప మరేదీ చదవరు. చాలామందికి తెలుగు [మనం బ్లాగులో భాషాభివృద్ధి గురించి మాట్లాడుకునే తెలుగు కాదు, వాళ్ళపేరు వాళ్ళు శుద్దంగా వ్రాసుకునే వ్వవహారిక భాష] సరిగా చదవనూ, వ్రాయను కూడా రాదు. దానికి తగ్గట్లే ఆ పరిషత్ స్కూలు పంతుళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు గనుక, తాము పనిచేసినా చేయకపోయినా, తమ జీతం తమకి వస్తుంది అన్నట్లు ఉండేవారు. దానికి తగ్గట్టుగానే దేవస్థాన ఉద్యోగులు పరిషత్ స్కూలు టీచర్లకు సరైన నివాస గృహాలు[Cottages] కేటాయించకుండా ఏడిపించేవాళ్ళు. అందుకు ప్రతీకారం అన్నట్లు ఆ టీచర్లు అక్కడి పిల్లలకి ఏమీ చెప్పరు. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలదీ ఇదేపరిస్థితి. ఇటువైపు చూస్తే శ్రీశైలంలో అప్పటికి [2002 నాటికి] మరో రెండు మూడు ప్రైవేటు గవర్నమెంటు స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ అని ఎందుకన్నానంటే – వాటికీ వీటికీ పెద్దగా తేడాలేదు గనుక. అక్కడ 11, 12 ఏళ్ళ పిల్లలు కూడా ఇంకా 2,3 లేదా నాలుగో తరగతి చదువుతూ ఉంటారు. పిల్లల తల్లితండ్రులు వెళ్ళి అడిగితే “మీ పిల్లలకు చదువు మీద ఇంట్రస్ట్ లేదు” అనో, లేకపోతే “అంతే. ట్యూషన్ పెట్టించుకొండి” అనో చెబుతారు. పోనీ అలాగని ట్యూషన్ పెట్టించుకున్నా లాభం ఉంటుందా అంటే, అదీ లేదు. పిల్లల్ని ట్యూషన్ అంటూ సాయంత్రం 3 గంటలపాటు కూర్చోబెడతారేగానీ పిల్లల దారి పిల్లలదీ, టీచర్ దారి టీచర్ ది. టీచర్ ఫోన్ మాట్లాడుకుంటూనో, ఇంట్లో పని చూసుకుంటూనో లేదా గుడి కెళ్ళటమో చేస్తుంది. పిల్లలూ అంతే బ్యాగుల్లో చాక్ లెట్లూ, కూల్ డ్రింక్స్, హర్లిక్స్, జొన్నరొట్టెలు తెచ్చుకొని తింటూ, కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది దాకా కూర్చొని వెళ్ళిపోతారు. ఈ స్థితికి కేవలం టీచర్లనే బాధ్యులని అనలేం. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు కూడా నెలకి ౩౦/-రూ. ట్యూషన్ ఫీజు ఇస్తాం అంటారు. అదీ రెండు, మూడు నెలలకి ఒకసారి ఇస్తారు. ఆపాటి దానికి టీచర్లూ ‘ఏం కష్టపడతాంలే’ అనుకుంటారు. పిల్లల తల్లిదండ్రులకి తమ వ్యాపారాలకి, లేదా తమ టీవీ సీరియళ్ళకీ పిల్లలు అడ్డం రాకపోతే చాలు. అందుకే ట్యూషన్ అంటూ ఎక్కువసమయం తమ దగ్గర అట్టిపెట్టుకునే టీచర్లని Prefer చేస్తారు. అంతేగాని, తమ పిల్లలకి చదువొస్తుందా లేదా అని పట్టించుకోరు. ఎప్పుడో యాత్రికుల రద్దీ లేనప్పుడు, వ్యాపారం లేక తీరిగ్గా ఉన్నప్పుడు లేదా అమావాస్య, పౌర్ణమిలకి గుర్తొచ్చినప్పుడు, అప్పుడు మాత్రం తమ పిల్లలు చదువు గురించి ఒక్కసారిగా హైరానా, అందోళనా పడిపోతారు. అప్పుడు హఠాత్తుగా ఆ టీచర్ల మీద ఒత్తిడి తెస్తారు. రెండురోజులు గడిస్తే మళ్ళీ అంతా మామూలే! అక్కడి ఉద్యోగుల్లో కూడా చాలామందికి వ్యాపారాలు, షాపులు బినామీ పేర్లతోనో, బంధువుల పేర్లతోనో ఉన్నాయి. ఇక వడ్డీ వ్యాపారం సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే వారికి చదువుపట్ల, చదివించుకునే వాతావరణం పట్ల అవగాహన గానీ, దృక్పధం గానీ లేదు. అక్కడి వ్యాపారులకి లక్షల ఆదాయం ఉంటుంది. అయినా పిల్లల చదువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టరు. ఒక సంవత్సరం హాస్టల్ లో చదివిస్తే, మరు సంవత్సరం మళ్ళీ లోకల్ స్కూల్ లో చేర్పిస్తారు. ఒకరిద్దరు పూజారుల పిల్లలు తప్పితే ఆవూరి నుండి డాక్టర్లు గానీ, ఇంజనీర్లు గానీ , ఇతర రంగాల్లో పైకొచ్చినవారుగానీ లేరు. 1993 లో నాదగ్గర B.Sc. Physics చదువుకున్న విద్యార్ధి, M.Sc. [Physics] చేసి డి.యస్సీ. ద్వారా టీచర్ అయ్యాడు. అలాగని అక్కడి పిల్లలు తెలివితక్కువ వాళ్ళు కాదు. చాలా తెలివైనపిల్లలు. వాళ్ళకి మనుష్యుల్ని, మూడ్స్ ని, పరిస్థితుల్ని అర్ధం చేసుకోవటం బాగావచ్చు.

‘వృధగా వినోద కాలక్షేపాలతో కాలం గడిపేకంటే ఒక పుస్తకం చదివితే ఎక్కువ ఙ్ఞానం వస్తుంది. పదిపుస్తకాలు చదవటం కంటే ఒక ప్రదేశాన్ని పర్యటించి వస్తే మరింత ఙ్ఞానం కలుగుతుందని’ పెద్దలంటారు. శ్రీశైలంలోని పిల్లలు నిరంతరం యాత్రికులని చూస్తూ ఒకేసారి పది ప్రదేశాలని పర్యటించి వచ్చినంత షార్ప్ గా ఉంటారు. మనుష్యుల్ని, వారి మోటివ్స్ నీ అంచనా వెయ్యటంలో దిట్టలు. తల్లిదండ్రులు యాత్రికులతో బిజీగా ఉన్నప్పుడు విసిగించి తమకు కావలసినవి సాధించుకోవటం వంటి ట్రిక్కులు బాగా పన్నుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే అది ఓ వింత ప్రపంచం, అడవి ప్రపంచం, మరో ప్రపంచం.

ఇంకా ఈస్థితి 1993 కంటే ఎన్నో రెట్లు నయం అన్నమాట. [మేము స్కూల్ పెట్టాకా ఓరోజు మా ట్యూషన్ లో పిల్లల బ్యాగులు వెదికితే [అందరూ పరిషత్ స్కూల్లో చదువుతున్న పిల్లలే. 9,10 తరగతికి చెందిన వాళ్ళు.] దాదాపు ప్రతీవారి బ్యాగుల్లో నుండి డెయిరీ మిల్క్ బారులూ, 5 స్టార్ లూ, పెప్సీ బాటిళ్ళు బయటపడ్డాయి. ఒకమ్మాయి అయితే ఏకంగా ఓచిన్న స్టీలు డబ్బాలో హార్లిక్స్ పోసుకుని ఓ పాస్టిక్ చెంచా వేసుకుని తెచ్చుకుంది. ఆ అమ్మాయి మాప్రక్కింటి అమ్మాయి, వాళ్ళనాన్న పరిషత్ హైస్కూలు ఇన్ ఛార్జి హెడ్ మాస్టర్. ఏమిట్రా ఇందంతా అంటే ‘ఇక్కడ దొరికిపోయాము గానీ మేడమ్, ఈ ఊర్లో అన్నీ ట్యూషన్లో అందరం ఇలాగే తినేవి తీసుకుని పోతాం’ అని చెప్పారు. అదీ పరిస్థితి. ]

ఇంతలో నేను పనిచేస్తున్న స్కూలు వార్షిక దినోత్సవం జరిగింది. ఆస్కూలు ప్రిన్సిపాలు పూర్వాశ్రమంలో రంగస్థల నటి. ఆవిడ ప్రతిభ దాదాపు సురభి కళాకారులతో పోల్చదగినట్టిది. ఆవిడ పిల్లలకి చక్కని నాట్యాలు, నృత్యరూపకాలు నేర్పింది. ఆవిడకి చెన్నైలోని కొందరు సినిమా వాళ్ళుకూడా తెలుసు. నేను స్కూల్లో 6నుండి 10 తరగతులు చదువుకునే రోజులనాటినుండి హాస్య నాటికలు సమకూర్చుకుని, వ్రాసుకుని, డైరెక్షన్ చేసి, నటించేదాన్ని. లెక్చరర్ గా కాలేజీల్లో పనిచేసేటప్పుడు కూడా దాదాపు అన్నీ కాలేజీల్లో [ఎక్సెల్, త్రివేణి తప్ప] సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకి నాటకాలు, ఏకపాత్రాభినయాలు నేర్పేదాన్ని. అలాగే శ్రీశైలంలో నేను పనిచేస్తున్న స్కూల్లో కూడా పిల్లలకి కొన్నినాటకాలు, ఏకపాత్రాభినయాలు నేర్పాను. వాటిల్లో ‘పెళ్లిచూపులు’ నాటకం ఒకటి. ఓ గయ్యాళి సూర్యకాంతమ్మ, తన చెవిటి మొగుడితో అగచాట్లు పడుతూ, లావుపాటి తిండిపోతూ కూతురికి పెళ్ళిచేయలేక తంటాలు పడటం అందులోని ప్రధాన కథ. ఇది చిన్నప్పుడు నేనే వ్రాసుకున్న నాటకం. అందులో నేను చెవిటి కాంతయ్య పాత్ర వేసేదాన్ని. ఈనాటకం దాదాపు నేను పనిచేసిన అన్నీ కాలేజీల్లోనూ పిల్లలచేత వేయించాను. అయితే గుంటూరు ఎక్సెల్ లో 1998 లో డైరెక్టరు ఏసురత్నం పిల్లల నాటకాలు కాన్సిల్ చేసి సినిమా డాన్సులు వేయించాడు. మర్నాడు పిల్లల తల్లిదండ్రులు ‘వీటికీ రికార్డింగు డాన్సులకీ తేడా ఏమిటని’ తెగ తిట్టేసారనుకొండి. నంబూరు కాలేజీలోని నావిద్యార్ధులు ఇంటర్ రెండో సంవత్సరం గుంటూరు వేరే కాలేజీలో చదువుతున్నప్పుడు అదేనాటకాన్ని వాళ్ళ కాలేజీ వార్షికోత్సవంలో వేస్తే వాళ్ళకి మంచి పేరొచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా దాని గురించి వచ్చింది అని ఆ పిల్లలు చాలా సంతోషంగా చెప్పారు. ఇప్పుటికైతే చాలా కాలేజీల్లో, స్కూళ్ళలో సాంస్కృతిక కార్యక్రమాలంటే దాదాపు సినిమా డాన్సులే అనేస్థితి నెలకొని ఉంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో నీతి, హాస్య, దేశభక్తి పూరిత గట్రాగట్రా ఏమీ ఉండవు. ఫ్యాంట్లు, షర్ట్లు, లేదా గాగ్రాలూ వేసుకొని పిల్లలు సినిమా పాటలకు గంతులు వేస్తూ టీవీల్లోని డాన్స్ బేబి డాన్స్ వంటి కార్యక్రమాలే ఉంటున్నాయి.

అయితే శ్రీశైలంలోని ఆ స్కూల్లో అప్పటికి ఆరోతరగతి వరకేఉంది. అందరూ చిన్నపిల్లలు. అంత చిన్నపిల్లలకి నేనెప్పుడూ నాటకాలు, ఏకపాత్రాభినయాలూ నేర్పలేదు. ఇబ్బందిపడతానా అనుకున్నాను. కానీ పిల్లలు ఓరల్ గానే డైలాగులన్నీ బట్టీ వేసి ప్రాక్టీసు చేసేవారు. రెండోతరగతి చదివే ఓ లడ్డు బుడ్డిదాన్ని పెళ్ళికూతురిగా తీసుకున్నాను. నా కూతుర్ని గయ్యాళి సూర్యకాంతమ్మ పాత్రకు ఎంచుకున్నాను. నేనే మేకప్ లవీ వేసాను. మరో ప్రక్క ప్రిన్స్ పాల్ హైదరాబాదు నుండి మేకప్ వాళ్ళని పిలిపించి డ్రామా డ్రెస్సులు తెప్పించింది. మోహీనీ భస్మాసుర వంటి నృత్యరూపకం ప్రదర్శించారు. పిల్లలందరూ అద్భుతంగా చేశారు. ఇక ‘పెళ్ళిచూపులు’ నాటకం అయితే హాస్యపూరితమైనది కాబట్టి బాగా హిట్టయ్యింది. అందరూ చిన్నపిల్లలే. ఆరే పాత్రలతో దాదాపు 50 నిముషాల నాటకం. అందరూ కడుపుబ్బానవ్వారు. మా పాపకి ప్రత్యేక అభినందనలతోపాటు, యస్.ఐ. తన వ్యక్తిగత బహుమతిగా 100/- రూ. సి.ఐ. చేత ఇప్పించారు. మాపాపకి బాగా గుర్తింపు వచ్చింది. కొన్ని రోజులపాటు శ్రీశైలంలో తెలిసినవారందరూ మాపాపని ‘గీత’ అని పిలవటం మానేసి సూర్యకాంతమ్మ అని పిలిచారు. స్కూలు ప్రిన్సిపాలు డ్రామా కంపెనీ డ్రస్సులూ, నగలతో వేయించిన నృత్య రూపకాలతో పోటాపడి నేను వేయించిన నాటకాలు [పెళ్ళి చూపులు, సూపర్ డాక్టర్, డ్రీం బాయ్] పండాయి. ఆ నాటక ప్రదర్శనలోని ఫోటోలు ఇవి. ఈ కాంతమ్మ పాత్ర వేసిందే నాకూతురు గీతాప్రియదర్శిని.







దాంతో సహజంగానే నాకు స్కూల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. నేను అక్కడ చేరిందే దాదాపు డిసెంబరు 2002 లో. స్కూల్ డే జరిగింది మార్చి 2003 లో. ఏప్రియల్ 2003 కల్లా విద్యాసంవత్సరం పూర్తయ్యింది. ‘ఇప్పటికి చెయ్యండి. సంవత్సరం ఆఖర్లో మాట్లాడుకుందాం’ అంటూ నెలకు 2000/- రూ. ఇచ్చిన స్కూలు మేనేజ్ మెంటు ఏం మాట్లాడకుండానే చివరిరోజు ముగించింది. నేను డైరెక్టర్ ని అడిగితే “2500/- రూ. ఇస్తాను. అయితే శ్రీశైలం, సున్నిపెంట [శ్రీశైలం ప్రాజెక్ట్] రెండుచోట్ల క్లాసులు తీసుకోవాలి” అన్నాడు. బస్సు ఛార్జీలు, శ్రమా లెక్కవేసుకుంటే అదీ ఏమాత్రం మంచి డీల్ కాదు. దాంతో ’జీతం ఎక్కువ డిమాండ్ చేసాను. కాదన్నారు. మానేసాను. అంతకంటే ట్యూషన్లు చెప్పుకున్నా నేనూ, నాభర్తా అంతకంటే సౌకర్యంగానే ఉండొచ్చు అనుకున్నాము. మా పూర్వవిద్యార్ధి ఒకరు [ఇతడు 1993 లో మాదగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నాడు.] E.O. కి డ్రైవర్ గా ఉన్నాడు. అతడు మాకు E.O. తో చెప్పి రూమ్ ఎలాట్ చేయించాలని ప్రయత్నిస్తూ, స్కూలు పెట్టమని చెప్పాడు. చాలామంది అదేమాట అనడంతో ఆలోచించసాగాము. ఈ సంఘటనకి ముందు ఉగాది పండుగ వచ్చింది. మేమున్నది కన్నడ వారి సత్రం. ఉగాదికి శ్రీశైలానికి కన్నడ భక్తులు ఎక్కువగా వస్తారు. శివరాత్రికి వేరే మిత్రులింట ఉన్నాము. ఉగాదికి వారం రోజులు పాటు గది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంతలో మా విద్యార్ధి తండ్రి అయిన ఈ.వో. డ్రైవర్ తన పరిచయాన్ని ఉపయోగించుకుని మాకు తాత్కాలికంగా చల్లా వెంకయ్య సత్రంలో [దేవస్థానం వారు ఉద్యోగులకు నివాసాలకి ఇచ్చే ఇళ్ళు(రూములు)] ఓగది ఇప్పించాడు. ఈ గది ఓ పూజారికి ఎలాట్ అయ్యింది. వారి కుటుంబం పెద్దది కావటంతో, ఈ గది చాలదని వారు శ్రీశైలంలోనే ఓ పెద్ద పూరిల్లు/ షెడ్డు వేసుకొని ఉంటున్నారు. వారి గది ఖాళీగా ఉండటంతో, మాకు ‘ఈ.వో. చేత రూమ్ ఎలాట్ చేయించేవరకూ ఉండనిమ్మని’, మా విద్యార్ధి తండ్రి ఆ పూజారికి నచ్చచెప్పి, మాకు ఈ వసతి కల్పించాడు. దాంతో మేం ఆ గదికి మారాము. ఇది చాలా పెద్ద గది. మధ్యలో చిన్న గోడ పార్టీషన్ గా ఉంటుంది. ఆ గోడకు వెనుక చిన్నగది, ఎటాచ్డ్ బాత్ రూమ్ గట్రా ఉంటాయి. గోడకు ముందు కొంచెం పెద్దగదిలాగా ఉంటుంది. ముందు చిన్న వరండా ఉంటుంది. ఇది రూమ్ నెం.18. శ్రీశైలంలో ఎవరికీ స్వంత భూమిగానీ, ఆస్తులు గానీ ఉండవు. నివాస గృహాలు దేవస్థానం ఎలాట్ చేయవలసిందే. 1995 తర్వాత కొద్దిపాటి రెవిన్యూ భూమి పేదలకి పట్టాలుగా ఇచ్చారట. అక్కడ ఆ పేదలనుండి పట్టా భూముల్ని బినామీగా కొని కొందరు వ్యాపారులు, ఉద్యోగులు, పూజారులు చక్కని ఇళ్ళను[భవంతులు] కట్టారు. శ్రీగిరి కాలనీ అని పిలుస్తున్నారు ఆప్రాంతాన్ని. అది శ్రీశైలం మల్లయ్య స్వామి గుడికి ఎగువున ఉంటుంది. అక్కడ ఇళ్ళు కొన్ని అద్దెకు దొరికే అవకాశం ఉంది. అలాంటి ఒక అద్దె ఇంటిలోనే అప్పటి వరకూ నేను పనిచేస్తున్న స్కూలు ఉంది.

ఈ నేపధ్యంలో 2003 జూన్ లో మేము, మేమున్న గదిలోనే మా స్కూలు ప్రారంభించాము. వారం గడిచినా ఒక్క విద్యార్ధీ రాలేదు. ఎవరైనా అడిగితే ‘స్కూలు తెరిచి వారమయ్యింది. ఇంక విద్యార్ధులే రాలేదు’ అంటూ జోకులు వేసాము. అంతలో ఒక్క విద్యార్ధి చేరాడు. ఈ సారి ’ఒక్క విద్యార్ధి, ముగ్గురు టీచర్లం ఉన్నాం’ అంటూ జోకులు వేసాము. ఎందుకంటే అప్పటికి మాపాప కూడా A,B,C,D లు ఓరల్ డ్రిల్ చేయించగలిగేది మరి! స్కూలులో విద్యార్ధులింకా లేరు గానీ ట్యూషన్ లో పిల్లలుండేవాళ్ళు.

మా స్కూలు గురించి ‘విద్యార్ధులకి ABCD లు నేర్పటం, చదవటం, వ్రాయటం నేర్పటం గురించి సమస్య లేదు. అది పిల్లలకి ఎలాగైనా నేర్పవచ్చు. వ్యక్తిత్వం నేర్పటమే మా Concept. పిల్లలు జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కొనేటట్లు వాళ్ళని తయారు చెయ్యటమే మా లక్ష్యం. మాదృష్టిలో అదే అసలైన చదువు. అక్షరాస్యత, అంటే ABCD లు పెద్ద విషయం కాదు. ప్రశ్నలూ, జవాబులూ బట్టీ వేయించటం అసలు చదువే కాదు. తామేం చదువుతున్నామో అది పిల్లలకి అర్ధం కావాలి. వారికి సరైన వ్యక్తిత్వం, దృక్పధం ఏర్పడాలి. వారు సమర్ధులుగా తయారు కావాలి. అప్పుడే, వాళ్ళు తమకి తాము ఉపయోగపడతారు, తమ కుటుంబానికి ఉపయోగ పడతారు, దేశానికి ఉపయోగపడతారు. ఇదే మా Concept. నిజానికి ఇది మొత్తం ‘భగవద్గీత’ నే ఆధారం చేసుకొన్నది. దానిని మించిన వ్యక్తిత్వ పుస్తకం మరోటి ఉండదని మా నమ్మకం’ అని చెప్పేవారం. అప్పటికి, ఊర్లో పిల్లలకి, పది సంవత్సరాలకి కూడా ABCD లు రాని విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అలాంటిది మేము ఏ Concept చెప్పినా, వాళ్ళకు కావలసినది వాళ్ళపిల్లలకి అక్షరాస్యత. అది వస్తే చాలు. పిల్లల ప్రవర్తన గురించి కూడా వాళ్ళకి పట్టదు. అక్కడ సంవత్సరం మొత్తం అడ్మిషన్లే. టి.సి.ల గొడవలేదు. మొదటి సంవత్సరం విద్యార్ధులు భారీ ఎత్తున ఏం రాలేదు. ఎందుకంటే, మాఫీజు ఎక్కువ. మా కండిషన్లు ఎక్కువ. మా ఫీజు ప్రతినెల 5వ తారీఖు లోపల ఖచ్చితంగా ఇవ్వాలి. ‘6వ తారీఖు నుండి 31 వరకు మీపిల్లవాడి గురించి అడిగే హక్కు మీకు ఉంటుంది, 1 తారీఖు నుండి 5వ తారీఖు లోపల మాకు ఫీజు అడిగే హక్కు ఉంటుంది’ అనేవాళ్ళం. ప్రక్క స్కూళ్ళ పద్దతులకి అలవాటుపడి మారటం కష్టం కదా!

స్కూలు ప్రారంభానికి ముందే మేం ట్యూషన్లు మొదలుపెట్టాము. అప్పటికి పరిషత్ స్కూలు పిల్లలు [తెలుగు మీడియం], ఇతర స్కూల్స్ పిల్లలు [ఇంగ్లీషు మీడియం] వచ్చేవారు. తర్వాత కాలేజీ సప్లమెంటరీ విద్యార్ధులు వచ్చారు. శ్రీశైలంలో కాలేజీ లేదు గానీ ప్రక్కనున్న సున్నిపెంట [శ్రీశైలం ప్రాజెక్ట్] లో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నాయి. మా ట్యూషన్ ఫీజు శ్రీశైలంలో మిగిలిన వారికంటే చాలా ఎక్కువ. దాదాపుగా వాళ్ళ స్కూల్ ఫీజు తో సమానం. అలాగే గంటల కొద్దీ పిల్లల్ని కూర్చో బెట్టుకోవటం ఉండదు. అయినా గానీ విద్యార్ధులు పోగయ్యారు.

ఇంగ్లీషు, మాధ్స్, ఫిజిక్స్ చెప్పేదాన్ని. చిన్న క్లాసుల పిల్లల వ్యవహారమంతా మావారు చూసుకునేవారు. అక్కడో పూజారి గారి అమ్మాయి ఇంటర్ జూనియర్, సీనియర్ ఫిజిక్స్ సబ్జెక్టులు మిగిల్చేసుకుంది. ఇంగ్లీషు మిగిలిపోయింది. ఒక సంవత్సరం నష్టపోయి కర్నూలులో గది అద్దెకు తీసుకొని, ట్యూషన్ పెట్టించుకునీ 2003 మార్చిలో సైతం గట్టెక్కలేదు. ఆ పూజారి మాకు 1993 నుండి బాగా పరిచయం. ఆయన అడగటంతో ఆ విద్యార్ధినికి ట్యూషన్ చెప్పటం ప్రారంభించాము. ఆ అమ్మాయితో పాటు మరో నలుగురైదుగురు ఇంటర్ పిల్లలు ఉన్నారు. సప్లిమెంటరీ [ఇన్ స్టంట్] పరీక్షలకి బాగా కష్టపడి తయారు చేశాను. పూజారి గారి అమ్మాయికి ఫిజిక్స్ పాఠాలు వివరించి నోట్సు ఇచ్చాను. ఆ పిల్ల ఎంతో సంతోషంగా “మేడమ్! ఇప్పటికి ఐదు సార్లు ఈ జూనియర్ ఫిజిక్స్ వ్రాసాను. ప్రిపేర్ అయ్యాను. నాకెప్పుడూ ఇలా అర్ధం కాలేదు. ఇప్పుడు వ్రాయమన్నా వ్రాసేస్తాను” అంది. ఆ పిల్లని మరింతగా ప్రోత్సహించాను. పాసయ్యింది. తర్వాత బి.ఎస్సీ. పూర్తిచేసి M.Sc.[Physics] లో చేరింది. అప్పుడు నాదగ్గర ట్యూషన్ చెప్పించుకున్న అందరు విద్యార్ధులు పాసయ్యారు. అయితే తరువాత చేరిన ఒక ఇంటర్ విద్యార్ధి మ్యాధ్స్, ఫిజిక్స్ సప్లిమెంటరీ తన్నేసాయి. మార్చిలో వచ్చిన మార్కులే నయం అన్నట్లు వచ్చాయి. పిల్లవాడు తాను బాగా వ్రాసానంటాడు. నేనయితే బాగా కష్టపడి చెప్పాను. అప్పటికి ఇంటర్ జవాబుపత్రాలు జిరాక్స్ కాపీలు పొందే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అది నా కెరీర్ కి కూడా సంబంధించిన వ్యవహారం అవ్వటంతో విద్యార్ధి తండ్రి సగం డబ్బు, మేం సగం డబ్బు భరించి జిరాక్స్ పత్రాల కోసం అప్లై చేశాము. ఓ నెల తర్వాత జవాబు పత్రాల నకళ్ళు వచ్చాయి. ఈ పిల్లవాడు సరియైన జవాబు వ్రాసాడు. మ్యాధ్స్, ఫిజిక్స్ ల్లో 75 మార్కులకు 13, 35 మార్కులకి 10 మార్కులు వచ్చాయి. పేపర్ దిద్దిన పద్దతిలోనూ లొసుగులే. దానిమీద విద్యార్ధి పేరుతోనే ఫిర్యాదు వ్రాయించాము. ఇక ఆ తర్వాత ఇంటర్ విద్యార్ధులకి ట్యూషన్ చెప్పడం మానుకున్నాం. నిజానికి వాళ్ళు రావటం మానేసారు. మరో మాటలో చెప్పాలంటే లెక్చరర్ అన్న స్థాయినుండి టీచర్ స్థాయికి కుదింపబడ్డాము.

ఈ లోపున మెల్లిగా మా స్కూలు పుంజుకుంది. విద్యార్ధులు పెరిగారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

మొత్తానికి ఒక గాడి లో పడింది మీ జీవితం. సంతోషం..

అప్పుడే ఏమయిందండీ! ఇంకా చాలా మలుపులు ఉన్నాయి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu