ర్యాంకుల కొనుగొళ్ళు మార్కుల కుంభకోణపు ఆనుపానులు తెలియటంతో ప్రారంభమైన కార్పోరేట్ కాలేజీలు, చిన్న ప్రైవేటు కాలేజీల వ్యాపారపోటీ కొత్తపుంతలు తొక్కింది. మరెన్నో తీరులుగా సాగింది. దాంతో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు, పెరగటంతో సమస్యతీరలేదు. మరింత పెరిగింది. దాంతో మరింత లాబీయింగ్ చేసారు. క్రమంగా చిన చేప ని పెదచేప, పెద్దచేప ని పెనుచేప మింగినట్లుగా చిన్నకాలేజీలని పెద్దకాలేజీలు మింగేయటం అంటే over take చెయ్యటం జరుగుతుంది. ఒక్కప్పుడు నెల్లూరు కోరా సంస్థ మెటీరియల్ ప్రత్యేకంగా మెడిసిన్ ఎంట్రన్స్ కి సిద్దమయ్యే విద్యార్ధులకి చాలా పేరెన్నిక గన్నది. 2001 తర్వాత ఈ కోరా సంస్థ నెల్లూరు రత్నంలో కలిసిపోయింది. గుంటూరులో ఒకప్పుడు కాస్తో కూస్తో పేరు ప్రఖ్యాతులున్న సురేష్ కోచింగ్ సెంటర్, విజ్ డమ్ కాలేజీ [ఎమ్.కె.ఆర్. వికాస్ లో సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్, వికాస్ నుండి బయటికొచ్చి కాలేజీ పెట్టాడు, వికాస్ వారు విఙ్ఞాన్ నుండి బయటికొచ్చి కాలేజీ పెట్టారు], విద్యాన్ [విఙ్ఞాన్ నుండి బయటికొచ్చిన వారే] వంటి ఎన్నో కాలేజీలు ఈరోజు శ్రీచైతన్యలో విలీనమైపోయాయి. Merge అయ్యేరోజున ఒక వాణిజ్యప్రకటన ‘శ్రీచైతన్య బి.ఎస్.రావు సదరు సురేష్ కో, ఎమ్.కె.ఆర్. కో స్వాగతం’ చెబుతూ వస్తుంది. మర్నాటి నుండి సదరు చిన్నకాలేజీల యాజమాన్యాలు శ్రీచైతన్య సిబ్బందిలో ఒకరు మాత్రమే. [శ్రీచైతన్య బి.ఎస్.రావునీ, అతని సతీమణి ఝాన్సీని స్యయంగా చూశాను. బి.ఎస్.రావు, విద్యాసంవత్సరం చివరిరోజున (పోరంకి క్యాంపస్ లో) విద్యార్దినులకి వీడ్కొలు ఇస్తూండగా కలవడానికి వెళ్ళాను. సిగరెట్లు మానేయండి అంకుల్ అంటూ పిల్లలు ఆత్మీయంగా వీడ్కొలు చెప్పారు. అతడూ అలాగేనని ప్రమాణం చేస్తూ వీడ్కొలుఇచ్చాడు. అప్పుడే అతడి ప్రవర్తన ఎంతో Diplomatic గా ఉండటం చూశాను. జాబ్ అడగటానికి వెళ్ళిన నన్ను అతడు డీల్ చేసిన పద్దతిని బట్టి అతడిలోని వ్యాపారవేత్తని నేనుఅంచనా వేసుకున్నాను.] ఇప్పుడు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అధిక క్యాంపస్ లు కలిగినది శ్రీచైతన్యవిద్యాసంస్ధే. గుంటూరు, విజయవాడల్లోని 80% విద్యాసంస్థలు శ్రీచైతన్య గుప్పెటిలోకి వెళ్ళిపోయాయి. దాదాపుగా శ్రీచైతన్యది మోనోపలీ స్థితి. రాష్ట్రవ్యాప్తంగా కూడా వారిదేపట్టు. ఆ విధంగా మోనోపలీ చేయటం కుట్రదారుల విన్యాసమని, అందులో ఉన్న సౌలభ్యాల గురించి కూడా గత టపాల్లో వివరించాను. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నారాయణ, శ్రీచైతన్య, రెండుసంస్థలే పోటాపోటీగా నడుస్తున్నాయి. శశి వేలివెన్ను, నాగభైరవ గుళ్ళపల్లి, ఒంగోలు [ఈ నాగభైరవ కాలేజీ అధినేత నాగభైరవ వీరబాబు సినీ రచయిత నాగభైరవ కోటేశ్వరరావు కుమారుడు. నాగభైరవ కోటేశ్వరరావు ఈనాడు రామోజీరావుకు సమీపవర్గంలోని వాడే. వీరబాబు 1991 కు పూర్వం ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేసేవాడు. అప్పట్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన బైరెటీస్ గనుల వ్యవహారంలో కొన్ని వార్తావ్యాసాలశ్రేణి వీరబాబు వ్రాయగా, అవి వివాదస్పదం అయినాయి. అప్పటికి నేదురమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజులు. ఆ నేపధ్యంలో వివాదం ముదిరి వీరబాబు scap goat అవ్వడం, ఉద్యోగానికి రాజీనామా చేయవలసి రావడం జరిగాయి. దానికి కాంపెన్ సేషన్ గా రామోజీరావు ఒంగోలు దగ్గర గుళ్ళాపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టుకునేందుకు వీరబాబుకి సాయం చేసాడని అప్పట్లో అంటే 1990 – 1991 లోనే నా ఈనాడు మిత్రురాలు ద్వారా నాకు తెలుసు. నాగభైరవ రెసిడెన్షియల్ కాలేజీ వచ్చిన తరువాతనే ఒంగోలు ఎడ్యుకేషన్ సెంటర్ గా డెవలప్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్రర్యాంకులు వచ్చాయి కనుక. ఈ ర్యాంకుల కుంభకోణం నాకు బాగా అర్ధమయ్యాక సహాయం చేయటమంటే ర్యాంకు కుంభకోణాల ఆనుపానులు చెప్పటమన్న మాట అనుకున్నాను.] వంటి విద్యాసంస్థలు ఎప్పుడో ఒకటీ ఆరా ర్యాంకులు పొందీ అలా కాలం నెట్టుకొస్తున్నాయి. ఈ పోటీలో గుంటూరు వికాస్ కూడా గతకొన్ని సంవత్సరాలుగా వెనుకపడింది. ఇక నారాయణ కాలేజీల యాజమాన్యం చేతులు మారనుందనీ, ఏదో కార్పోరేట్ కంపెనీ [విదేశమో, స్వదేశమో] take over చెయ్యబోతుందనీ పుకారులు వచ్చాయట. స్యయంగా సంస్థ అధినేత పేపర్ ప్రకటన ఇచ్చుకుంటూ, అలాంటి పుకార్లు నమ్మవద్దని తల్లితండ్రులకి వివరణ ఇచ్చుకున్నాడు. అదీ పోటీతీవ్రత!

ప్రస్తుతానికి ఇంటర్ మార్కుల వెయిటేజ్ కూడా ఎంసెట్ అర్హతకి కలపగలిగారు. అంటే మళ్ళీ ఇంటర్ కి కార్పోరేట్ కాలేజీలలో తప్పని సరిగా చదవలసిన అవసరం ఉందన్న మాటే. ఇక ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు పెరిగిపోయిన నేపధ్యంలో ఐఐటి కి గిరాకీ పెరిగిపోయింది. అయితే ఐఐటి కోచింగ్ గురించి గానీ, ఇతర విషయాల గురించి గానీ నాకు తెలియదు. అందుచేత దాన్ని గురించి నేనేమీ చెప్పలేను. కానీ శ్రీచైతన్య, నారాయణలు మాత్రం ఒక్కసారిగా రిజల్ట్ లో జాతీయస్థాయిలో ఒక్కసారిగా వెలిగిపోయాయి. అది ఇక్కడ విశేషం. ఇక ఇప్పుడు శ్రీచైతన్య వారు ఎల్.కె.జి. స్థాయి నుండి టెక్నోస్కూల్స్ తెరుస్తామని ఇటీవల ప్రకటించారు. తల్లితండ్రులు ‘ఇక కాస్కో’ అనుకోవచ్చన్నమాట.

ఇంతవరకూ నాకు చేతనైనంతగా, నాకు తెలిసినంత వరకూ ఎంసెట్ ర్యాంకుల, ఇంటర్ మార్కుల కుంభకోణాల గురించి వ్రాసాను. ఇక ఫిర్యాదులు ఇచ్చిన కారణంగా మేము పడిన వేధింపుల తీరుతెన్నులు మరోకథ. ఎంసెట్ 2000 గురించి 2000, మే 28 న ఫిర్యాదు చేశాము. కొద్దినెలలు ప్రశాంతంగా ఉండి ఉంటాము. కొత్త బ్యాచ్ విద్యార్ధులు చేరారు. ఉదయం, సాయంత్రం ఎంసెట్ క్లాసులు, మధ్యాహ్నం స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు, సాయంత్రం ఐఐటి బేసిక్స్ [8,9,10th ] విద్యార్ధులకి క్లాసులతో బాగా బిజీగా ఉండేవాళ్ళం. 2000, మార్చిలో మరోసారి ఇల్లు మారాము. అంతకు ముందు ఉన్న ఇంటి యాజమాని ఇంటి మరమ్మత్తులు చేయించనందున ఇబ్బంది పడలేక ఇల్లు మారాము. ఇల్లు పెద్దగానే ఉండేది. రెండుపడక గదులు, పెద్ద వరండా ఉండేవి. కనీసం 30 మంది పిల్లలకి క్లాసు చెప్పుకోగలిగినంత పెద్ద వరండా. ఇంటిలో దిగేముందు కనీసం సంవత్సరంపాటు ఇల్లు ఖాళీ చేయమనకూడదని అడిగాము. ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి ‘మీరు అద్దె సరిగా చెల్లించినంత కాలం మా ఇల్లు ఖాళీ చెయ్యమని అడగము. మా ఇంట్లో so and so వాళ్ళు 7 ఏళ్ళు ఉన్నారు’ గట్రా చెప్పింది. ఆమె భర్త రత్నం. గతంలో టైలర్ గా పనిచేసేవాడట. ప్రస్తుతం చికెన్ దుకాణం ఉంది. ఇంటి అద్దె 2000/- రూ. నీటి ఛార్జీలు 100/- రూ. అదనం. అప్పటికి సూర్యాపేట పట్టణంలో అది ఎక్కువే. అయితే మార్చిలో ఆ ఇంట్లో దిగితే ఆగస్టులో ఆవిడమమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నది. అంతకు ముందు నెలలోనే గోడ ఏదో చెమ్మతో నాని తడి వస్తుందనీ, వంటగది సింక్ వాడ వద్దనీ అంది. రిపేర్ చేయించే బదులు సింక్ పంపు సీజ్ చేయించింది. మాకప్పటికి చాలా ఫర్నిచర్ ఉండేది. ఫ్యాక్టరీ నుండి వచ్చిన సోఫాలు గట్రా. దాంతో పదేపదే ఇల్లు మారాలంటే ఎంత ఖర్చు, శ్రమ కలిగేవి. అందుచేత సర్ధుకుపోతూ ఉన్నాము. అయినా గాని ఆగస్టులో ఆవిడ ఇల్లు ఖాళీ చేయమనీ, కావాలంటే క్రిందివాటాలోకి రమ్మనీ అంది. క్రింది వాటా చాలా చిన్నది. అప్పటికే ఆవిడ ఏదోసాకులతో ఇబ్బంది పెడుతోంది. ఈ గొడవంతా ఎందుకులే అని “క్రింది వాటా మాకు చాలదు లెండి ఆంటీ! వేరే ఇల్లు చూసుకుంటాము” అని చెప్పాను.

ఇక మళ్ళీ ఇళ్ళవేట మొదలు పెట్టాము. మాకోసం మా విద్యార్ధులు కూడా ఇల్లు వెదకసాగారు. నిజానికి చీటికి మాటికి ఇల్లు మారడం మా ప్రైవేటు ట్యూషన్లకి నష్టం. కొత్త చిరునామా తెలియక కొత్తగా విద్యార్ధులు చేరకపోవచ్చు. ఈ ఇబ్బందుల కంటే ప్రశాంతంగా ఉండటం కూడా ముఖ్యమే కదా అనుకొని ఇల్లు మారటానికీ సిద్ధపడ్డాము. ఎందుకంటే ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఎంసెట్ క్లాసులు జరిగేటప్పుడు క్రింద ఆవిడ ఎవరినో గట్టిగొంతుతో తిడుతూ ఉండేది. ఒక్కోసారి తన పని మనిషిని, ఒకోసారి ఎవరి గురించో తిడుతూ భర్తతో అరుస్తుండేది. మనం ఏమీ అనలేం. అంటే గొడవ ఖాయం అన్నదీ మా వ్యవహారఙ్ఞానానికి తెలుస్తోంది. ఆ స్థితిలో మనం ఏమన్నా మర్నాటి నుండి ఆవిడ మనల్నే తిట్టడం మొదలు పెడుతుంది. అందుచేత కూడా ఇల్లుమారలనే నిర్ణయించుకున్నాము. నిజానికి సంవత్సరంపాటు ఉండనివ్వాలని మేం అడిగాము. ఆవిడ చెప్పిన షరతు ప్రకారమే ఇంటి అద్దె క్రమం తప్పకుండా చెల్లిస్తునే ఉన్నాం. అయినా ఇంట్లో దిగిన 5 నెలలకే ఆవిడ ఇల్లు ఖాళీ చెయ్యమంది. గొడవపడటం కంటే ఇల్లుమారడమే ఉత్తమం అనుకొని వెదకటం మొదలు పెట్టాము. అదేం చిత్రమో ఒక ఇల్లు కుదరలేదు. ఏదైనా ఇల్లు చూసి, సరే అడ్వాన్సు ఇద్దాం అని వెళ్తే ‘సారీ, మా బంధువులే వస్తామన్నారు’ అని ఒకరు, ‘మా వారు వద్దన్నారని’ ఒకరు ……. ఇలా చెప్పారు. మొదట ఇదేమీ మేము అనుమానించలేదు. దాదాపు నెల రోజుల పాటు ఎన్నో ఇళ్ళు వెదికాం. ప్రతీసారి ఈ ఇల్లు కుదరుతుంది అనుకున్నాదల్లా, మళ్ళీసారి వెళ్ళేసరికల్లా కుదరకపోవటం జరిగేది. అంతకు ముందు మా విద్యార్ధులో, వారితల్లితండ్రులో, గత విద్యార్ధులో [ఎవరో ఒకరు తమకి తెలిసిన విద్యార్ధుల్ని మా ట్యూషన్ లో చేర్పించేందుకు ఎంక్వయిరీ కోసం వచ్చేవారు] ఇంటి గురించి అడగటం, మేం ఫలానా చోట చూశామని చెప్పటం జరిగేవి. మరుసారికల్లా ఆ ఇంటి దగ్గర నిరాకరణ వచ్చేది. దాంతో మోటివ్స్ కనుక్కొని అడ్డం గొట్టటం జరుగుతుందని అర్ధమైంది. అప్పటికి, మాకు ఇల్లు దొరకని ప్రతీసారి మా ఇంటి ఓనర్ మేడమెట్లు దగ్గర కూర్చొని, భుజాలెగరెస్తూ, కొంత ఎకసెక్కంగా “ఏమండీ ఇల్లెప్పుడు ఖాళీ చేస్తున్నారు?" అని అడగటం, అదీ సరిగ్గా ఇల్లు కుదరనీ ప్రతీసారి అడగటం మాకు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగించింది.

ఈ నేపధ్యంలో మాకు వీటన్నిటి వెనుకా త్రివేణి కాలేజీ యాజమాన్యం ఉండి ఉండచ్చని అనుమానం కలిగింది. ఎందుకంటే వారి కలాంటి రికార్డు ఆ ఊరిలో ఉంది. వాస్తవానికి త్రివేణి యాజమాన్యంలో కొందరు డైరెక్టర్లు అదే ఊరిలోని సిద్ధార్ధ కాలేజీలో లెక్చరర్లగా పనిచేస్తూ, ఇంటర్ పేపర్ లీక్ టెక్నిక్ వాళ్ళదగ్గరి నుండి కనుక్కొని బయటికొచ్చి కాలేజీ పెట్టుకున్నారు. వారిలో ఒకరు కొత్తగూడెం [Sri Triveni], మరొకరు కాకినాడ [Pragathi] , కొందరు లోకల్ గా కాలేజీ పెట్టుకున్నారు. అయితే సిద్దార్ధ కాలేజీని దెబ్బకొట్టేందుకు వారిని ఆర్ధికంగా ఇబ్బందులు పాలు చేసారని, భార్యభర్తలనీ విడదీసారని అక్కడ చెప్పుకునేవారు. వృత్తిలో పోటీ తీవ్రత అలాంటి రూపం దాల్చడం చూసి మేం విస్తుపోయాము.

ఈ విధంగా త్రివేణి యాజమాన్యం మమ్మల్ని వేధిస్తోంది అన్న అనుమానం రావడంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, నల్గొండ యస్.పి. శివధర రెడ్డి .పి.ఎస్.కీ ఫిర్యాదు చేసాము. ఆ కాపీ Fire Pot లో చూడగలరు. అప్పటికి చంద్రబాబు నాయుడి గురించి ‘ఇతడికి ఇతడి మామ ఎన్.టి.ఆర్. లా ఫేస్ గ్లామర్ లేదు కాబట్టి, పనిచేసి ఇమేజ్ తెచ్చుకోవలసిన స్థితిలో ఉన్నాడు. ఐ.టి.అనీ, జన్మభూమి అనీ ఏదో చేస్తున్నాడు కదా! కాబట్టి మనకి న్యాయం చేస్తాడు’ అనుకునేవాళ్ళం. చంద్రబాబు నాయుడికిచ్చిన ఫిర్యాదు కొరియర్ లో పంపాము. నల్గొండ ఎస్.పి.ని వ్యక్తిగతంగా కలిసి వ్రాతపూర్వక ఫిర్యాదుతో పాటు వివరించి చెప్పాము. అతడు పాజిటివ్ గా స్పందించి, సూర్యాపేట సి.ఐ.కి ఫోన్ చేసి చెప్పి, మా ఫిర్యాదు మీద “Petitioner is being harassed by the The Triveni College Authorities. She is not even allowed to take a house on rent. Take n/a report.” అని వ్రాసి ఇచ్చాడు. సి.ఐ.ని కలవాల్సిందిగా చెప్పాడు. [ n/a report అంటే ఏమిటో మాకు తెలియదు. అది వారి administration భాష కాబోలు అనుకున్నాము] ఆ కాపీ Fire Pot లో చూడగలరు.

సూర్యాపేట సి.ఐ., AM ఖాన్. అతణ్ణి అదేరోజు సాయంత్రం నల్గొండ నుండి నేరుగా వెళ్ళి కలిసాము. ఎంతో సానుకూలంగా స్పందిస్తూ “నేను ఏవిధంగా సాయం చేయగలను? త్రివేణి యాజమాన్యాన్ని పిలిచి వార్నింగ్ ఇవ్వాలా, లేక మీ ఇంటి యజమానిని పిలిచి వార్నింగ్ ఇవ్వమంటారా?" అని అడిగాడు. నేను “సర్! వాళ్ళని పిలిచి నాముందు వార్నింగ్ ఇవ్వమని చెప్పెంత అహంకారిని కాను. నాకు కావల్సింది ప్రశాంతంగా గడపటం” అన్నాను. అతడు తాను రహస్య ఎంక్వయిరీ చేస్తాననీ, నాకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. మరోసారి కలిసినప్పుడు తాజాపరిస్థితి వివరిస్తూ, “ఇంటి యజమాని సంవత్సరంపాటు ఇల్లు ఖాళీ చెయ్యమని అడగననీ, అద్దె సక్రమంగా చెల్లిస్తున్నంత వరకూ అసలు ఖాళీ చెయ్యమని అడగననీ అన్నది. ఇప్పుడు 5 నెలలు, గడిచి గడవక ముందే ఖాళీ చెయ్యమంటోంది. మేము అద్దె బకాయి లేము. పోనీ ఖాళీ చేద్దామన్న వేరే ఇల్లు దొరకనీయకుండా త్రివేణి యాజామాన్యం ఇబ్బంది పెడుతుంది. మొన్నీమధ్య సూర్యాపేట మున్సిపాలిటీ ఉద్యోగి చింతకుంట నారాయణ రెడ్డిగారి ఇల్లు చూశాము. సింగిల్ బెడ్ రూం ఇంటి అద్దె 2600/- రూ. చెప్పారు. అంత అద్దెలు ఈ ఊర్లో లేవు. ఎవరికీ అంత అద్దెలు చెప్పడం లేదు. మాకు ఇల్లు దొరకనీయటం లేదు. ఒకవేళ దొరికితే ఇలా చాలా ఎక్కువ చెబుతున్నారు. ఈవిధంగా ‘Increasing of our expenditure and decreasing of our income sources’ అన్నస్థితికి లాగబడుతున్నాము. ఈమధ్య మా స్పోకెన్ ఇంగ్లీషు బ్యాచ్ విద్యార్ధులు 15 మంది ఉండేవాళ్ళు. కోర్సు కూడా ముగియవచ్చింది. ఇంకో పది రోజులుపాటు క్లాసులు నడవవలసి ఉండగా, హఠాత్తుగా అందరూ ఒకేరోజు మానేసారు. ఏ కారణమూ లేదు. తర్వాత రావలసిన ఉన్న విద్యార్ధులూ మోహం చాటేసారు. ఐఐటి బేసిక్స్ విద్యార్ధులందరు ఒకేసారి రావడం మానేసారు” అని చెప్పాము. అతడు కనుక్కుంటానని అన్నాడు. “ఇంటి ఓనరుకూ మీకూ మధ్య అగ్రిమెంటు ఏమైనా ఉందా?" అని అడిగాడు. అలాంటి సాంప్రదాయం ఆ ఊళ్ళో లేదనీ, అయినా అలా వ్రాతపూర్యకంగా అగ్రిమెంట్లు వ్రాయమంటే ఎవరూ ఇల్లు అద్దెకివ్వరనీ మేము చెప్పాము.

నాదగ్గర చదివే విద్యార్ధులు ఐఐటి ఎంట్రన్స్ కి సిద్దమౌతుండగా హాల్ టిక్కెట్లు తపాలాలో గల్లంతయ్యాయి. అదే చిరునామా పెట్టుకున్నా మరో విద్యార్ధినికి [ఓరియంటేషన్ లేని విద్యార్ధిని] సజావుగానే హాల్ టిక్కెట్ వచ్చింది. దీనితో ఆ విద్యార్ధినీ కూడా ఎంతో వత్తిడి పడింది. మళ్ళీ ప్రయత్నించి ఇంటర్ నెట్ ద్వారా హాల్ టిక్కెట్ నకలు పొందాము.

ఇంతలో ఓరోజు సాయంత్రం హఠాత్తుగా ఓ పోలీస్ కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చాడు. తలుపు తీసిన నాతో “యస్.ఐ. పిలుస్తుండు. ఏడి నీ మొగుడు పిలు బయటకి” అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అయినా అణచుకొని “కంప్లైంట్ పెట్టింది నేను. అదీ యస్.పి.దగ్గర పెట్టాను. సి.ఐ.కి కాపీ ఇచ్చాను. వచ్చి కలుస్తామని చెప్పండి” అన్నాను. ఇప్పుడే రావాలని ఒత్తిడి చేశాడు. అతడి జేబు మీద కనీసం అతడి పేరు బ్యాడ్జీ కూడా లేదు. వెంటనే దుస్తులు మార్చుకుని, సి.ఐ.కి ఫోన్ చేసి [అప్పటికి మాకు ఫోన్ లేదు, బయట నుండి చేశాము.] విషయం చెప్పాను. తాను స్టేషన్ కి వస్తానని, మమ్మల్ని రమ్మని చెప్పాడు. మేం వెళ్ళెసరికి అతడింకా రాలేదు, యస్.ఐ. నన్ను దాదాపు 420 ని డీల్ చేసినట్లు డీల్ చేస్తూ “ఏమిటి ఇల్లు ఖాళీ చెయ్యమంటే కంప్లయింట్, గింప్లయింట్ అంటున్నావట? మంది ఇళ్ళల్లో తేరగా ఉంటావా? అయినా నేను పిలుస్తున్నానంటే తర్వాత వస్తానన్నావట? నువ్వేమైన PM of India వా?” అంటూ అమర్యాదగా మాట్లాడాడు. బూతులు అనలేదు, అదొక్కటే తక్కువ. నేను “సర్! నేను ఎంసెట్ కుంభకోణం మీద కంప్లయింట్ చేసాను. దాని మీద [organaised] వ్యవస్థీకృతంగా వేధిస్తున్నారని కంప్లయింట్ చేశాను. Dispute మీద complaint చేసినందుకు నేను 420 నా? అయినా ఇంటి ఓనర్ విషయంలో కూడా నేను కంప్లెయింట్ యస్.పి.గారికిచ్చాను. సి.ఐ.గారు డీల్ చేస్తున్నారు. మీ కానిస్టేబుల్ వచ్చినప్పుడు అదే చెప్పాను. దుస్తులు మార్చుకొని వస్తానన్నాను. అంతే” అంటూ ఎదురు వాదించాను. అప్పటికీ సి.ఐ.రాలేదు. నా వాదనకి యస్.ఐ. కొంత వెనక్కి తగ్గాడు. [యస్.ఐ. పేరు రాములు నాయక్, ఇప్పుడు సి.ఐ. అయ్యాడు.] మేము మళ్ళీ ప్రయత్నించి సి.ఐ.ని కలిసాము. అతడు “మా యస్.ఐ. కి మీ ఇంటిఓనర్ కంప్లయింట్ ఇచ్చాడట, మీరు ఇల్లు ఖాళీ చేయటం లేదని. అందుచేట్త అతడు మిమ్మల్ని పిలిపించి ఉంటాడు” అన్నాడు. “అంతకంటే ముందు మరి మేము ఫిర్యాదు చేశాము కదా” అని అడిగాము మేము. “అది మేము ఎంక్వయిరీ చేస్తున్నాము?" అన్నాడతడు. [ఆ సమాధానం అప్పటి నుండి ఇప్పటి వరకూ నాతోనే ఉంది. పైఅధికారి తాను ఎంక్వయిరీ చేస్తున్నానంటాడు. క్రింది వాడు వేధింపు కొనసాగిస్తుంటాడు.] ఈ పర్యవసానాల్లో యస్.ఐ., మాఇంటి ఓనరు రత్నంతో వచ్చాడు. ‘అతడు చదువురానివాడు, అమాయకుడనీ, మేం చదువుకున్న వాళ్ళం గనుక అతణ్ణి వేధిస్తున్నారనీ’ అంటూ సి.ఐ., యస్.ఐ.లిద్దరూ కలిసి మమ్మల్ని మూడు నెలల్లో ఖాళీ చేస్తామని కమిట్ మెంట్ వ్రాయాల్సిందిగా ఒత్తిడి చేసారు. ఆ నెల అద్దె ముట్టినట్లుగా రసీదు వ్రాయించుకొని, [అప్పటి వరకు అలాంటి వ్రాతపూర్వక రసీదులు మాదగ్గరలేవు. మామూలుగా మేం అద్దె చెల్లించేవాళ్ళం. నోటి మాటతోనే అన్నీ నడిచిపోయేవి. ఈ గొడవతో ఎందుకైనా మంచిదనిపించి రసీదు ఇమ్మన్నాను.] మూడు నెలల్లో ఇల్లు ఖాళీ చేస్తామని వ్రాసి ఇచ్చాను. మర్నాడు ఉదయమే సి.ఎం.కి విషయాలన్నీ ఫిర్యాదు పంపాము. ఆ కాపీ Fire Pot లో చూడగలరు.

ఇటు ఈ పోలీసు గొడవ నడుస్తుండగా, మరో వైపు కరెంటు గొడవ ఉండేది. ఆ ఇంట్లో మేం దిగి అప్పటికి అయిదారు నెలలయ్యింది. మీటర్ రీడింగ్ 9999 నుండి 10,000 లకు మారేటప్పుడు లైన్ మ్యాన్ పొరపాటున [?] 1000+ గా note చేసాడు. అది గమనించి మేం సరిదిద్దమని అడిగాము. ఎందుకంటే ట్రాన్స్ కో [APSEB గానే ఉండేది] వారి నిబంధనల ప్రకారం, బిల్లులో తప్పులు వచ్చినా, ముందు బిల్లుకట్టి, తర్వాత పరిష్కారం కోసం requisation పెట్టుకోమంటారు. ఈ విషయం నాకు ఫ్యాక్టరీ నడుపుతున్నప్పుడు తెలుసు. అందుచేత ముందుగానే .. ని అడిగాము. అతడు సరే అంటాడు గాని కరెక్ట్ చేయడు. దానితో మరునెలలో యస్.ఇ., నల్గొండకు వ్రాసాము. దాంతో మీటరు బిల్లు సవరించి 815/- రూ. లు అదనంగా కట్టవలసి ఉందని బిల్లు ఇచ్చారు. మేం వెంటనే కట్టేసాము. అయితే వారంరోజుల్లోపల, లైన్ మెన్ తోపాటు 7గురు సభ్యులు వచ్చి 48,300/- రూ.లకు బిల్లు ఇస్తూ స్తంభం మీద కరెంటు కట్ చేసి వెళ్ళిపోయారు. ఆ కాపీ Fire Pot లో చూడగలరు. వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి అడిగితే ‘మీరు యస్.ఇ.కి వ్రాసినట్లు మీదగ్గర ప్రూఫ్ ఉందా?’ అంటూ రెడ్ టేపిజం చూపసాగారు. మరో ప్రక్క మా ఇంటి ఓనర్ “అదంతా నాకు అనవసరం! మీరు మా ఇంట్లో ఉండగా కరెంట్ కట్ అయ్యింది. ఇప్పటికప్పుడు ఆ డబ్బే కడతారో లేక ఏంచేస్తారో. నా ఇంటికి మాత్రం కరెంట్ ఉండి తీరాలి” అంటూ గట్టిగా పోట్లాడటం మొదలెట్టింది. ‘రెండ్రోజుల్లో పరిష్కరిస్తాం’అన్నా వినిపించుకోవటం లేదు. మరోప్రక్క మా విద్యార్ధుల తల్లితండ్రులు చీకట్లో ఎలా క్లాసులు చెబుతారు? అంటూ గొడవమొదలెట్టారు. నిజానికి అప్పటికి నేను ఎంసెట్ సిలబస్ దాదాపు పూర్తి చేసాను. ఇంకా Organic Chemistry వేరే లెక్చరర్ తో చెప్పించవలసి ఉంది. అలాగే ఇంకా సమయమూ ఉంది. అదీగాక మేం అప్పుడు క్లాసులు చెప్పినా వాళ్ళు హాజరుకాగల స్థితిలేదు. ప్రాక్టికల్స్ తాలుకూ హడావుడితో ఉన్నారు. మరో ప్రక్క APSEB వారితో “ఒక ఇంటికి అంత బిల్లు వస్తుందా? అదేమన్నా 50 HP మోటర్లతో నడిచే ఫ్యాక్టరీనా? అదీగాక ఆ ఇంట్లో మేం దిగే సంవత్సరం కూడా కాలేదు. 48,300/-రూ. బిల్లు ఎలా వస్తుంది” అంటూ బాగా వాదించాను. మూడు రోజుల ఎడతెగని గొడవ తర్వాత 93/- రూపాయలకు బిల్లు ఇచ్చి విద్యుత్ సరఫరా పునరుద్దరించారు.

మాపై జరిగిన వేధింపు, గొడవలు వీలయినంత వరకు భరించాం. ఇక సాధ్యం కాదు అనుకున్నవాటినే ఫిర్యాదులలోకి ఎక్కించాం. ఆ ఫిర్యాదులలోని విషయాలని టూకీగా ఇప్పుడు వివరిస్తున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

ఎలా భరించారండి ఇన్ని వేధింపులని మీసహనశక్తికి జోహార్లు

ఇంకా వేధింపు తొలిదశే నండి ఇది.

well written

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu