అప్పటి వరకూ కొంత బలంగా ఉన్న మొగలాయీ సామ్రాజ్యం, ఉత్తర భారతంలో బలహీన పడటంతో క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్, డచ్చి ఇంకా స్పెయిన్ మొదలైన యూరపు దేశాల వర్తక కంపెనీలు భారతదేశంలో బలం పుంజుకున్నాయి. నిజానికి ఈ వర్తక వ్యాపార గుంపులు క్రీ.శ. 1498 నుండీ భారతదేశానికి వస్తూ ఉన్నా కూడా వ్వాపారావకాశాల కోసం భారతదేశపు రాజుల అనుమతులు పొందటానికి వంగి వంగి దణ్ణాలు పెట్టటంతోనే కాలం గడిచిపోయింది. కాలక్రమంలో క్రీ.శ. 1768 లో ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాం నుండి ఉత్తరకోస్తా జిల్లాలని, 1800AD లో రాయలసీమ జిల్లాలని గుత్తకు దక్కించుకోగలిగింది. ఇక్కడి నుండే ఈస్ట్ ఇండియా కంపెనీకి హఠాత్తుగా ఎంతో మేధస్సు, సామర్ధ్యం గూఢచర్య బలం పెరిగిపోయాయి. పన్నులు వసూలు చేయటానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన నిజాం ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకీ బకాయి పడి 1802 ప్రాంతాల్లో శాశ్వత సెటిల్ మెంట్ చేసుకున్నాడు. [ఎంత విచిత్రం? అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ సరిగ్గా పన్నులు వసూలు చేస్తే మరి నిజాం వారికి ఎందుకు బకాయి పడ్డాడు? ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముందర నిజాం నవాబులూ, ఇతర రాజులూ భారతదేశంలో ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకోలేదా? అది వారికి కొత్తపనా, ఈ యూరపు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడానికి? తమ కొరడా, కత్తుల కంటే వారి తుపాకీలకి భయపడి ప్రజలు పన్నులు కట్టేస్తారని కాంట్రాక్టు ఇచ్చారు కాబోలు. ఏమైనా రాజుగా పన్నులు వసూలు చేసుకోలేక పోవటం, అందుకు ’కంపెనీ’కి కాంట్రాక్టు ఇచ్చి, వారికే బకాయి పడటం, దాంతో కొంతభూమిని ధరాదత్తం చేయటం మాత్రం గొప్ప ట్రాపే.]

సరే! ఇలా హఠాత్తుగా సంక్రమించిన గూఢచర్య ఙ్ఞానంతో మన భారతంలోని ’కణికనీతి’ ని యూరపు వారు కొత్తగా కనుకొన్నారు! ఇంతకు ముందు టపా డిసెంబరు 5 ‘మన పైన జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 1 [కణిక నీతి]’ & 6 వ తేదీ ‘మన మీద జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 2 [ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు]’ లలో ఈ విషయమై విపులంగా చర్చించాను. ఫ్రెంచ్ జనరల్ డూప్లే కనుగొన్నాడని చెప్పబడి, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ చేత భారత రాజుల మీద, పాలెగాళ్ళ మీద ప్రయోగించబడిందని పేర్కొనబడ్డ కణిక నీతికి తాజాగా ‘Divide and Rule’ అని పేరు పెట్టబడింది.

వాస్తవానికి, ఎప్పుడైతే ముస్లింలు భారతదేశంలోకి వచ్చారో [అంటే క్రీ.శ. 1000 లో] , అప్పుడు వాళ్ళు భారత రాజకీయాల్లో కుట్రలు ప్రవేశ పెట్టారు. ఎప్పుడైతే యూరోపియన్లు భారతదేశంలోకి వచ్చారో [అంటే క్రీ.శ. 1498 లో] అప్పుడు వాళ్ళు భారత వ్యాపారాల్లో కుట్రలు ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే కార్పోరేట్ కంపెనీలు భారతదేశంలోకి వచ్చాయో అప్పుడు వాళ్ళు సామాన్యుడి జీవితంలోనూ, [కుటుంబ జీవితాల్లో] కుట్రలు ప్రవేశపెట్టారు. ఆ కుట్రల బాహ్యరూపాలనే టివీ సీరియళ్ళలో కార్పోరేట్ టివీ కంపెనీలు చూపుతుండగా, కార్పోరేట్ నిర్మాణ సంస్థలు నిర్మించగా చూస్తున్నాము. ఆ సీరియళ్ళలో అత్త కోడలి మీద, కోడలు అత్తగారి ఇంట్లోని వారి మీద కుట్రలు పన్నడం లేదా స్నేహితులు ఒకరి పై ఒకరు కుట్రలు పన్నుకోవడం చూస్తున్నాము.

ముస్లిం రాజుల చేతి నుండి ‘భారతదేశం మీద అధికారం, పట్టు’ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి జరిగిన మార్పిడి గురించి చర్చించే ముందు, ఆ మధ్య కాలంలోని సంధి సమయం గురించి తెలుసుకోవాలి. నిజానికి ప్రపంచం ఇప్పుడు అంతర్జాలం మూలంగా ఒక పల్లెగా మారిపోయిందనీ, ప్రపంచం చిన్నదైపోయిందనీ, గ్లోబలైజ్ అయ్యిందనీ చాలామంది మురిసి పోతూ చెబుతుంటారు గానీ, నిజానికి ఈ సంధి సమయం తర్వాతి పర్యవసానంగా, బ్రిటిషు ప్రభుత్వం, రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని అంటే భూగోళాన్నే గ్లోబలైజ్ చేసేసింది, చిన్నది చేసేసింది. మనకు సమాచార పరంగా గ్లోబలైజ్ అయ్యింది ఇప్పుడు. బ్రిటిషు వారికి రాజ్యాన్ని స్థాపించటానికి ఎప్పుడో గ్లోబలైజ్ అయ్యింది.

ఇంతకు ముందు టపాల్లో చర్చించినట్లు ఆ బలం బ్రిటిషు వారిది కాదు. కణిక నీతికి Divide and Rule Policy గా పేరు మార్చి ఉపయోగించగలిగిన గూఢచర్య నైపుణ్యం, తరతరాలుగా కలిగిన వారిది.

ఈ మర్మం మరింత బాగా అర్ధం కావాలంటే మనం మరోసారి గోల్కొండ నవాబుల్నీ, నిజాముల్నీ గుర్తుతెచ్చుకోవాలి. అంతేకాదు. ముస్లిం రాజుల ఏహ్యతనీ, నైచ్యాన్నీ, సుఖభోగ లాలసతో కూడిన వారి పదార్ధ వాదాన్ని, సుఖల కోసం వెంపర్లాడటం అందుకోసం ఎంతకైనా తెగించగలిగిన వారి దృక్పధాన్ని విపులంగా పరిశీలించాలంటే ‘రామదాసు’గా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న జీవితాన్ని పరికించాల్సిందే.

అది గోల్కొండ నవాబ్ తానీషా పరిపాలనా కాలం. తానీషా క్రీ.శ. 1672 లో సింహాసనం ఎక్కాడు. 1687 లో ఔరంగజేబు గోల్కొండ పై దాడిచేసి, ఇతణ్ణి ఓడించి బందీగా ఢిల్లీకి పట్టుకుపోయేంత వరకూ అంటే 15 ఏళ్ళపాటు పాలించాడు. ఆ రోజుల్లో, ఇతడి కొలువులో అక్కన్న మాదన్నలు సైన్యాధిపతిగానూ, ప్రధాన సచివుడుగా ఉండేవాళ్ళు. [ఈ ఇద్దరు కొన్ని గుడులని, రామప్ప గుడి తో సహా కట్టించారని చెబుతారు. ఓరుగల్లు వాసులు ఈ విషయమై మరికొంత నిజమైన సమాచారం ఇవ్వగలరను కుంటాను] వీరి సిఫార్సుతో తానీషా కంచెర్ల గోపన్నని హుస్నాబాద్ కు తహసీల్దారుగా నియమించాడు. గోపన్న వీరికి సమీప బంధువు. ప్రస్తుత భద్రాచలం, నాటి హుస్నాబాద్ పరగణాలోనే ఉండేది. అప్పటికి అక్కడ శ్రీరాముని గుడి లేదు. భద్రాచలం కొండపైన శ్రీరామ, సీతా లక్ష్మణుల విగ్రహాలు బహిరంగ ప్రదేశంలోనే ఉండేవి. గిరిజన స్త్రీ ’దమ్మక్క’ కు కలలో కనిపించి భగవానుడు తన విగ్రహాలు చూపాడని ప్రతీతి. స్థానిక గిరిజనులూ, ఇతరులూ శ్రీరాముడి విగ్రహాలు స్వయంభువులనీ, భద్రుడన్న భక్తుని కోరిక మేరకు ఆ కొండపై వెలిసాడని విశ్వసిస్తారు.

గోపన్నకు ఈ విషయాలన్ని తెలిసాయి. హిందువుగా, శ్రీరామ భక్తుడుగా, కవిగా గోపన్న అక్కడ ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించాడు. ఆ నాటికి ప్రజలు కరువు కాటకాలతో లేదా వరదలతో నానా వెతలూ పడుతున్నారు. పంటలు చేతికి రాక సంతోషమూ లేదు, శాంతీ లేదు. గోపన్న శ్రీరాముని మీద భక్తి పాటలు, భజన పాటలూ వ్రాసి, సంగీతం సమకూర్చి పాడసాగాడు. భద్రాచలంలో శ్రీరామ మందిరం కట్టడానికి ప్రజల నుండి విరాళాలు వసూలు చేశాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ స్వసుఖాలని వదలి వ్రతం పట్టాడు. గోపన్న కవిత్వానికి, సంగీతానికీ, గానానికీ, భక్తికీ అందులోని నిజాయితీకి ప్రజలు ముగ్ధులయ్యారు. దానితో గోపన్నకి ప్రజల నుండి అపూర్వస్పందన లభించింది. ఆయన్ని ప్రజలు ‘రామదాసు’ అని పిలవసాగారు. తమ తాహత్తుని బట్టి, ఒకోసారి తాహత్తుకి మించీ ధనమూ, బంగారమూ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అది ప్రజల భక్తి, స్వచ్ఛందశక్తి. ఆలయ నిర్మాణంలో శారీరక శ్రమని కూడా పంచుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. ప్రజలెంతో ఆనందించారు.

ఇదంతా గోల్కోండ నవాబు తానీషాకి తెలిసింది. అతడికి కోపం వచ్చింది. గోపన్న నవాబుకి పంపించవలసిన పన్నుల సొమ్ము ఖర్చు పెట్టి భద్రాచలంలో దేవాలయం కట్టించాడన్న నిందారోపణ చేయబడింది. ప్రభుత్వం, అంటే నవాబు నుండి ఆలయ నిర్మాణానికి అనుమతి తీసికోలేదన్న నెపంతోనూ విచారణ ప్రారంభమైంది. గోపన్న తన వాదన విన్పించాడు. “నవాబులు తమ కోసం ఎన్నో భవంతులూ, విలాస మందిరాలూ, కోటలూ కట్టించుకున్నప్పుడు, తమ ప్రియురాళ్ల కోసం, వేశ్యలు కోసం ఎన్నో అంతఃపుర మందిరాలు కట్టించుకొన్నప్పుడు, తాము భగవంతుడని నమ్మిన శ్రీరాముని కోసం ఒక చిన్న గుడి కట్టిస్తే తప్పేమిటీ? ఆలయం ప్రభుత్వ సొమ్ముతో కట్టలేదు. ప్రజల విరాళాలతో కట్టించబడింది. శ్రీరాముడు ప్రజలకి ఆదర్శరాజు, హిందువులకి సాక్షాత్తు భగవంతుడు. అలాంటి దేవుడికి ఓ చిన్న గుడి కడితే తప్పేమిటి? పన్నులు సొమ్ము మొత్తం నేను ప్రభుత్వ ఖజానాకు పంపి వేసాను. ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము ఇసుమంతైనా ఆలయానికి ఖర్చుపెట్టలేదు. ప్రజలిచ్చిన విరాళాలతోనే గుడి కట్టించాను."

తానీషాకి ఈ వాదనతో భగ్గుమన్నంత ఆగ్రహం కలిగింది. గోపన్నని తనకి క్షమాపణ చెప్పవలసిందిగా ఆఙ్ఞాపించాడు. తానేమీ తప్పు చేయలేదు గనుక క్షమాపణ చెప్పనని గోపన్న ఖరాఖండిగా చెప్పేశాడు. ఆకోపంలో తానీషా గోపన్నని ‘12’ సంవత్సరాలు జైల్లో పెట్టి ప్రతీరోజూ చిత్రవిచిత్ర హింసలు పెట్టాడు. [ప్రభుత్వ సొమ్ము తిన్న ఇతర నేరస్తులుంటే వారికీ ఇంత సుదీర్ఘకాలం శిక్ష వేసేవాడా? అసలు వాళ్ళ న్యాయశాస్త్రంలో ప్రభుత్వ సొమ్ము లేదా పన్నులు ఎగవేస్తే ఏదో శిక్ష నిర్ధేశింపబడే ఉంటుందిగా. అది ఇంత అంటే 12 ఏళ్ళ సుదీర్ఘమా?] ఎంత కాలమైనా, ఎన్ని హింసలు పెట్టినా గోపన్న అంటే రామదాసు, తానీషా నవాబుని క్షమాపణ కోరలేదు. ఇంత దుర్భర స్థితిలోనూ, జైలు లోనే రామభక్తి పాటలూ, భజన పాటలూ వ్రాయటం, గానం చేయటం మానలేదు. ఆ పాటలు ప్రజల్లోకి ప్రచార మయ్యాయి.

ఇలా పన్నెండేళ్ళు గడిచాక, ఓ రోజు రాత్రి నిద్రలో తానీషాకి ఓ వింత కల వచ్చింది. [కలొచ్చిందని ఆయన చెబితేనే ఎవరికైనా తెలిసేది. ఒకరి కల మరొకరికి నిరూపితం కాదు గదా!] ఆ కలలో నవాబుకి ఇద్దరు యువసైనికులు కనబడ్డారు. వారు తమని తాము రామదాసు సేవకులు గానూ, తమ పేర్లు ’రామోజీ’ మరియు ’లక్ష్మోజీ’ గానూ చెప్పుకున్నారు. హుస్నాబాద్ తహసీలుదారుగా రామదాసు ప్రభుత్వానికి బకాయి పడిన పన్ను సొమ్ము లక్షల మొహిరీలు తానీషాకి దాఖలు చేసి, రసీదు పుచ్చుకున్నారు. [రామదాసు తాను ప్రభుత్వ సొమ్ము ఎగవేయ లేదన్నాడు. భక్తుడు తను చేయలేదన్న తప్పుని – దేవుడు “కాదు, నా భక్తుడు తప్పు చేశాడు. పన్ను సొమ్ముతోనే గుడి కట్టాడు. కాదని అబద్ధం చెప్పాడు” అని ఒప్పుకుంటూ లక్షల మొహరీలు కట్టి రసీదు తీసుకున్నడన్న మాట. గుడి కట్టడం కోసమైనా సరే తప్పు చేసిన, ఇంకా అబద్దం చెప్పిన భక్తుణ్ణి కాపాడటానికి దేవుడు తానీషా కల్లోకి వచ్చి డబ్బు ఇచ్చి రసీదు పుచ్చుకున్నాడు!]

ఇలాంటి కల రావడంతో తానీషా అర్ధరాత్రి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యం! అతడి పడక గదిలో లక్షల బంగారు మొహరీలు రాశిగా పోసి ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగిందో తెలియక ఆశ్చర్యపోయాడు తానీషా! “తన భవనం చుట్టూ గట్టి కాపలా ఉంది. కావలి వాళ్ళ కన్నుగప్పి లోపలి కెవరూ రాలేరు. పోనీ ఇదంతా కలే అందామా అంటే ఎదురుగా మొహరీల కుప్ప కనబడుతోంది. నిశ్చయంగా ఇది రామదాసు అంటే గోపన్న యొక్క రామభక్తి మహత్మ్యమే.”

ఇలా ప్రకటిస్తూ తానీషా గోపన్నని చెరసాల నుండి విడుదల చేసాడు. గోపన్నకి క్షమాపణ చెప్పాడు. గోపన్నకి ధనమూ, విలువైన వస్తువులూ, తహసీలుదారు పదవీ బహుమతిగా ఇస్తానన్నాడు. అయితే గోపన్న అవన్నీ తిరస్కరించి భద్రాచలం వెళ్ళిపోయాడు.

రామదాసు బాధతప్తహృదయంతో “శ్రీరాముడు నాకు దర్శనం ఇవ్వలేదు. తానీషాకి దర్శనమిచ్చాడు. ఎంతైనా రాజూ రాజూ ఒకటీ అన్నట్లు పక్షపాతం చూపాడు. రామదర్శన భాగ్యం నోచుకోని నిర్భాగ్యుణ్ణి నేను.” అనుకున్నాడు. ఈ భావతీవ్రతలో మరింతగా అధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి రామదాసు ముక్తి పొందాడు.

ఇదీ ప్రజా బాహుళ్యంలో క్రీ.శ. 1687 నుండి ఈనాటి వరకూ బహుళ ప్రచారంలో ఉన్న కథ.

కానీ నిజమైన కథ ఇది కాదు. అది వేరే ఉంది. దానికి కావలసినంత తార్కికత, దృష్టాంతాలతో కూడిన సాక్ష్యం ఉంది.

అసలు కథ ఇదీ.......

తానీషా క్రీ.శ. 1672 లో రాజ్యానికొచ్చాడు. కంచెర్ల గోపన్నని నాటి హుస్నాబాద్ నేటి పాల్వంచ ప్రాంతానికి తహసీల్ధారుగా నియమించాడు. భద్రాచలం ఈ ప్రాంతానికి చెందుతుంది. అక్కడ శ్రీరాముని గుడి కట్టించేందుకు గోపన్న ప్రజల నుండి విరాళాలు సేకరించాడు. గోపన్న భక్తి, నిజాయితీ, కవితానురక్తి ప్రజల్ని ఎంతో ముగ్థుల్ని చేశాయి. అది సహజమే కదా! ఎందుకంటే వెలుగుతున్న దీపం మరెన్నో దీపాల్ని వెలిగించినట్లుగా, ఒక హృదయంలోని భక్తీ, నిజాయితీ మరికొన్ని హృదయాల్ని ఉత్తేజపరిచింది. అలా స్ఫూర్తి పొందిన ప్రజలు డబ్బూ, బంగారం విరాళాలుగా ఇవ్వడమే గాక గుడి కట్టడానికి కావలసిన శారీరక శ్రమ కూడా చేశారు. క్రీ.శ. 1674 లో ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. ఆనాటికి ప్రజలు నానా ఈతి బాధలు పడుతున్నారు. అయితే వరదలు, కాకుంటే కరువుతో అల్లాడుతున్నారు. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు సరైన పంటలు లేవు. దానితో ప్రజలు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు సక్రమంగా కట్టలేని స్థితిలో ఉన్నారు.

నిజం చెప్పాలంటే – ఎప్పుడైతే ప్రభుత్వపాలకులు స్వార్ధపూరితులై, భోగలాలసులై, ఎప్పుడూ బావుకోవటంలో ’బిజీ’గా ఉండి పరిపాలనని పట్టించుకోరో, అప్పుడు ఉద్యోగులూ, ప్రభుత్వ అధికారులూ కూడా అలాగే నిర్భాధ్యులుగానూ, లంచగొండులు గానూ ప్రవర్తిస్తారు. ‘యధారాజా తధాప్రజాః’ అన్నట్లు ప్రజలూ అలాగే నిర్భాధ్యులుగా తయారౌతారు. అలాంటి స్థితిలో సహజంగానే చెట్లూ, అడవులూ, నదులూ, చెరువులూ, కాలువలూ అన్నీ సక్రమ నిర్వహణని కోల్పోయి దుర్వినియోగానికి గురౌతాయి. దానితో పర్యావరణం, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. వాటి సహజఫలితం ‘అయితే వరదలూ కాకుంటే కరువులే.’ ప్రస్తుతం ఇదే పరిస్థితి మన కళ్ళముందు నేడు ఉన్నదే కదా!

అందుకేనేమో ప్రాచీన భారతదేశంలో ఓ నమ్మకం ఉండేది. ‘రాజు ధర్మపరుడైతే అతడి రాజ్యంలో నెలకు నాలుగు వానలు కురుస్తాయనీ, కరువు కాటకాలుండవనీ.’ మరో నమ్మకం కూడా ఉండేది. “ఎక్కడైతే ధర్మాత్ములైన ప్రజలు, [వ్యక్తులు] ఉంటారో ఆ ప్రదేశం కరువు కాటకాలు, వరదలు లాంటి ప్రకృతి బీభత్సాలు లేకుండా, సస్యశ్యామలంగా ఉంటుందని”. [భారతంలోని విరాట పర్వంలో పాండవులు ఎక్కడ అఙ్ఞాత వాసం చేస్తున్నారో కనుక్కోవడానికి ఇదే ’సూచిక’ గా చెప్పబడుతుంది. ఇక్కడ ధర్మాత్ముడు అంటే ఆ వ్యక్తి, కర్మ [తన పని] పట్ల నిరంతరం బద్దుడై ఉంటాడు. ప్రజల యోగ క్షేమాలు నిరంతరం విచారిస్తాడు. ఎలా అంటే – తండ్రి తన బిడ్డల గురించి ఎలా నిరంతర అలోచిస్తాడో అలా! కాబట్టి అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు.] ఇలాంటి నమ్మకాలతో అటు రాజూ, ఇటు ప్రజలూ కూడా ధర్మబద్దంగానూ, నీతినియమాల్లాంటి విలువలతోనూ బ్రతికేందుకు ప్రయత్నించేవాళ్ళు. [మేఘమధనం అంటూ కృత్రిమవర్షాలుండవుగా! వళ్ళు దగ్గర బెట్టుకొని వానకోసం ఎదురు చూడాల్సిందే నయ్యె.] నేను ప్రాచీన భారతం అన్నది దాదాపు 1200 సంవత్సరాల క్రితపు భారతదేశాన్ని ఉద్దేశించి. ప్రాచీన భారతం అంటే నా ఉద్దేశం – ముస్లింలు, యూరపు వారు భారతదేశంలోకి రాక ముందున్న భారతదేశం. ఎందుకలా అంటే ముస్లింలు రాకముందు భారతీయులకి రాజకీయ కుట్రలు తెలియవు, యూరపు వారు రాకముందు వ్యాపార కుట్రలు తెలియవు, కార్పోరేట్ కంపెనీలు రాకముందు సామాన్యుడి కుటుంబ జీవితంలో కుట్రలు తెలియవు, తెలిసింది `మంచి’ పట్ల నమ్మకం, చెడు పట్ల భయం మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో కొంత ‘పాపభీతి – పుణ్యప్రీతి’ ఉందన్నమాట.

సరే! 1674 లో రామదాసు భద్రాచలంలో గుడి కట్టిన నాటికి తానీషా తీవ్ర ఆర్ధికావసరాల్లో ఉన్నాడు. [అవసరం అనే కంటే ఆశ అనడం సరి అయిన పదం.] సుఖభోగాలకీ, ప్రభుత్వం నడపడానికి డబ్బు కావాలి. కరువులూ, వరదలతో అతడి రాజ్యమంతటా కూడా ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించడం లేదు. బకాయిలు మొండిదేరాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

************

6 comments:

మీ తదుపరి టపా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాండీ.

ఆదిలక్ష్మి గారు ఏంటీ ఏదో డెటెక్టివ్ ధారావాహిక మాదిరిగా మధ్యలో ఆపారు ఏసారి?

రామప్ప గుడి గురించి ఎలాంటి వాదనలు లేవు, అది 1213ADలో రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఈ విషయం రామప్పలోని గణపతిదేవుని శిలాఫలకంలో పొందుపరచబడింది. ఇక ఎలాగు ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి రేచర్ల రుద్రుడి గురించి క్లుప్తంగా, ఇతడు పద్మనాయకుడు (ప్రస్తుత కాలంలో 'వెలమలు'గా పిలవబడుతున్నారు) గణపతిదేవుని వద్ద సేనాని. గణపతిదేవుడు పన్నెండు వర్షములు దేవగిరి యాదవులకు బందీగా ఉన్న కాలంలో సామంతుల తిరిగుబాటు మరియు రాజవ్యవహారాలన్ని రేచర్ల రుద్రుడే చూసుకొన్నాడు. గణపతిదేవుని రాకతో రాజ్యాన్ని అతనికి అప్పగించాడు(పుష్కర కాలం తర్వాత కూడా రాజ్యాధికారం కోసం గణపతిదేవునిపై ఎలాంటి కుట్రలు చేయకుండా!).
రాజ్యాధికారం అప్పగించిన తర్వాత రామప్ప గుడి కట్టించాడు. ఈ గుడికో విశిష్టత ఉంది, నిజానికి ఈ గుడి ఉన్న గ్రామంపేరు పాలంపేట, గుడి చెక్కిన శిల్పకారుడు రామప్ప ఇతని పేరుమీదుగానే ఈ గుడిని రామలింగేశ్వరాలయంగా పిలవబడుతుంది(ఏ కళాకారుడికైనా ఇంతకంటే ఇంకేం కావాలి). ఆ గుడి పక్కనే ఉన్న చెఱువు కూడా కాకతీయుల ప్రసాదమే, ఇప్పటికీ వేల ఎకరాలకి నీరందిస్తుంది. వరంగల్ జిల్లాలో పెద్దదైన పాఖాల చెఱువు కూడా కాకతీయుల కాలంనాటిదే.
కాకతీయులు సంపూర్ణ ఆంధ్రదేశాన్ని ఏలిన రాజులనప్పటికి నాకు మాత్రం వారి శిల్పకళా వైభవంతో పరిచయం చేయడమే ఇష్టం. వేయిస్తంభాల గుడి మరియు రామప్ప గుడి చూస్తే ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు రెండు దేవాలయాల నిర్మాతల కళాభిరుచి ఒకటే అని.

వ్యాఖ్య కొంచెం పెద్దదైందా! (ఆ పర్లేదులే)...

కన్నాగారూ,

మంచి సమాచారం ఇచ్చారు. కృతఙ్ఞతలు.

కన్నాగారూ,

"వ్యాఖ్య ఎంతన్నది కాదన్నయ్యా!
నిజం చెప్పిందా లేదా!"

పర్లేదే మీరు చతుర్లేస్తారు....

కన్నా గారూ!

మేం ’అమ్మ ఒడి’లో చెప్పే విషయాలే ’సీరియస్’ గానీ మేం సీరియస్ కాదండీ బాబూ! మా టపాల్లాగా మేం ’సీరియస్’ అయి ఉంటే ఈ పాటికి ’హీటెక్కి హీటెక్కి’ పేలిపోయి ఉండే వాళ్ళం. మా ఇంట్లో ఎప్పుడూ నవ్వులూ, జోకులూ మోగుతూనే ఉంటాయి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu